మన పత్రికలు చెప్పవు గానీ మన పాలకులు ఇక్కడ ఎంత చేస్తున్నారో, పాక్ పాలకులు అక్కడ అంతా చేస్తున్నారు. మన వాళ్ళు హిస్టీరియా రెచ్చగొడుతున్నట్లే వాళ్ళూ రెచ్చగొడుతున్నారు. మన వాళ్ళు గుండెలు బాదుకుంటున్నట్లే వాళ్ళూ బాదుకుంటున్నారు. మన వాళ్ళు విదేశాల్ని దేబిరిస్తున్నట్లే వాళ్ళూ దేబిరిస్తున్నారు. ఇక్కడ పాక్ అన్న వాసన పైనే ఆంక్షలు విధిస్తున్నట్లే అక్కడ ఇండియా అన్న వాస్తన పైన ఆంక్షలు విధిస్తున్నారు.
పాకిస్తాన్ మీడియా నియంత్రణ సంస్ధ తాజాగా తన నియంత్రణ సూత్రాల దుమ్ము దులిపి ఒక్కొక్కటీ అమలు చేయడానికి ఉద్యుక్తమ్ అవుతున్నది. ఇన్నాళ్లూ పాటించకపోయినా చూసీ చూడనట్లు వదిలేసిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నది. గడువు పెట్టి ఆ లోపు పాటించకపోతే చానెళ్లను రద్దు చేస్తాం అని హుకుం జారీ చేసింది. భారత టి.వి చానెళ్ల వార్తలను గానీ, ఇతర కంటెంట్ ని గాని ప్రసారం చేయడానికి వీలు లేదని ఆంక్షలు జారీ చేసింది.
“ఇటీవల ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు రేగిన దృష్ట్యా భారతీయ ఛానెళ్లను, సిట్కామ్ లను పూర్తిగా నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు” అని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ ఆధారిటీ (PEMRA) ప్రతినిధి చెప్పాడని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
ప్రజలే కోరుతుంటే వాళ్ళు ఆ కార్యక్రమాలని/ఛానెళ్లని చూడనే చూడరు. జనం చూడని ఛానెళ్లను కంపెనీలు ప్రసారం చేయనే చేయవు. కాబట్టి కొత్తగా ఆంక్షలు అమలు చేయవలసిన అవసరమే రాదు. ఆ అవసరం వచ్చిందంటే అర్ధం జనం చూస్తున్నారనే. కనుక జనం డిమాండ్ చేస్తున్నారని చెప్పడం ఒట్టి మాట!
భారతీయ అంశాలు (content) ఉన్న కార్యక్రమాలను ఒక్కో ఛానెల్ రోజుకి 86 నిమిషాలు మాత్రమే ప్రసారం చేయాలని పాకిస్తాన్ చట్టం చెబుతోందిట. కానీ ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు, కేబుల్ ఆపరేటర్లు రొటీన్ గా ఈ నిబంధనని అతిక్రమిస్తుంటారు. భారతీయ సినిమాలకి, సోప్ ఒపేరాలకి అక్కడ జనంలో బాగా ఆదరణ ఉండటం వల్ల దానిని పాక్ ఛానెళ్లు పోగొట్టుకోలేవు. ఆదాయాన్ని ఎవరు పోగొట్టుకుంటారు మరి!
డిష్, టాటా స్కై లాంటి భారతీయ డైరెక్ట్ టు హోమ్, డిష్ నెట్ వర్క్ సేవలు కూడా పాక్ లో నిషేధమే. అయినా సరే, ఆ నిషేధాన్ని కేబుల్ ఆపరేటర్లూ, కంపెనీలు, అమ్మకం దారులు ఉల్లంఘించడం సర్వ సాధారణం. ఇప్పుడు ఈ నిబంధనలు, నిషేధాలు, సూత్రాలను పెమ్రా వెలికి తీస్తున్నది. వాటిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలే డిమాండ్ చేస్తున్నారని దానికి సాకులు చెబుతున్నది.
రెగ్యులేటరీ ఆధారిటీ రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం అక్రమ భారతీయ ఛానెళ్లను ప్రసారం చేసే కంపెనీల లైసెన్స్ లను, భారతీయ అంశాలు ఉన్న కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెళ్ల లైసెన్స్ లూ వారికి చెప్పకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా లేకుండా రద్దు చేసేసే అధికారాన్ని అధారిటీ (పెమ్రా) ఛైర్మన్ కి కట్టబెట్టారు.
“అక్టోబర్ 15 తేదీ లోపు నియంత్రణలను, నిషేధాలను అమలులోకి తేవాలి. లేనట్లయితే ఉల్లంఘనదారుల పైన, ఎలాంటి తేడా లేకుండా చర్యలు తీసుకుంటాము” అని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
ఇరు దేశాల పాలకుల ప్రయోజనాలు ఒకటే రకం. అవి ప్రజలకు వ్యతిరేకం. తమ ప్రజా వ్యతిరేక విధానాలను కవర్ చేసుకోవాలంటే సరికొత్త సమస్యలని వాళ్ళ పైన రుద్దాలి. తమ అసలు సమస్యల్ని వదిలేసి రుద్దబడిన సమస్యల చుట్టూనే వాళ్ళు తిరుగుతూ ఉండాలి. భారత్, పాక్ పాలకులు ఇరువురూ ఈ ఎత్తుగడని పాటిస్తున్నారు. మధ్యలో జనమే ఆవేశాలు పెంచుకుని, తమలో తాము తగవు పడుతున్నారు; పోట్లాడుకుంటున్నారు; కొండొకచో కొట్టుకుంటున్నారు.
ఇది తగదు!
దేశభక్తి(ప్రజాభక్తికాదు) ఎంతటి గుడ్డిదో,దానిని పాలకులు,ఆధిపత్య వర్గాలవాళ్ళూ తమ అవసరాలకు,ప్రజావ్యతిరేక చర్యలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతసమర్ధవంతంగా వాడుకొంటున్నారో ఇరువైపుల జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి!
వారి ఆధీనంలో ఉండే సైనిక,మీడియా వర్గాలవాళ్ళు దానిని ప్రజాబాహుల్యానికి మత్తులాగా ఎక్కిస్తున్నారు.
రాజుతలచుకొంటే దెబ్బలకు కరువా? ఆ దెబ్బలను తినడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నది మరి!