Pakistan envoy has spilled the beans!
రహస్యాన్ని పాకిస్తాన్ అనుకోకుండా వెళ్ళగక్కింది. ఏమరుపాటున ఉన్నాడో, కావాలనే అన్నాడో తెలియదు గాని పాకిస్తాన్ ప్రధాని ప్రత్యేక కాశ్మిర్ రాయబారి ముషాహిద్ హుస్సేన్ సయీద్ అమెరికా – vis-a-vis దళారీ పాలకుల రహస్యాన్ని వెళ్ళగక్కాడు.
అంతే కాదు, అమెరికా సామ్రాజ్యవాదానికి మూడో ప్రపంచ దేశాల పాలక వర్గాలకు మధ్య ఉన్న యజమాని-దళారి సంబంధాన్ని కూడా పాక్ రాయబారి ప్రపంచానికి తెలియజేశాడు.
“అమెరికా ఇక ఎంత మాత్రం ప్రపంచ శక్తి కాదు. అది క్షీణిస్తున్న శక్తి. దాన్ని గురించి ఇక మర్చిపోండి” అని పాక్ ప్రధాన మంత్రి (ప్రత్యేక కాశ్మిర్) ప్రతినిధి/రాయబారి అన్నాడు. అమెరికన్ మేధో విశ్లేషణ సంస్ధ (థింక్ టాంక్) అట్లాంటిక్ కౌన్సిల్ జరిపిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇంటర్వ్యూ అనేకమంది ప్రేక్షకుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తున్నది. ప్రేక్షకుల ప్రశ్నలకు కూడా పాక్ రాయబారి సమాధానాలు ఇచ్చారు.
థర్డ్ వరల్డ్ దేశాల పాలకులు సామ్రాజ్యవాద దేశాల ఆదేశాలకు బద్ధులే తప్ప స్వతంత్రంగా వ్యవహరించలేరని, అంతగా అయితే ఒక సామ్రాజ్యవాద దేశానికి సేవ చేసే బదులు మరో సామ్రాజ్యవాద దేశాన్ని చూసుకుంటారు తప్ప స్వతంత్రంగా వ్యవహరించే ఆలోచన చేయలేర్లని ఈ బ్లాగ్ చేసే విశ్లేషణ సత్యమని పాక్ రాయబారి ధృవీకరించాడు.
ఒక అగ్ర దేశానికి బదులు మరో అగ్ర దేశాన్ని చూసుకుంటానని బెదిరించడమే ఆయా దేశాల దళారి పాలకుల స్వతంత్రతగా కనిపిస్తుంది తప్ప అది నిజమైన స్వతంత్రత కాదంటూ కమ్యునిస్టు విప్లవకారులు చేసే విశ్లేషణ సరైనదేనని ఆయన రుజువు చేసాడు.
తమ వాదనలను గుర్తించడానికి అమెరికా నిరాకరిస్తున్న నేపథ్యంలో తాము చైనా, రష్యాలకు దగ్గర అవుతామని ఆ మేరకు తాము ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించామని, ముందుకు కూడా వెళ్లామని పాక్ రాయబారి చెప్పడం విశేషం.
యూరి దాడి అనంతరం, LoC ని దాటి వెళ్లి భారత సైనికులు సెప్టెంబర్ 29 తేదీన ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించి పాక్ ప్రోత్సాహంలో ఉన్న టెర్రర్ నెట్ వర్క్ పైన దెబ్బ కొట్టామని టెర్రర్ లాంచ్ పాడ్ లను నాశనం చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉచ్ఛ స్ధాయికి చేరిన నేపథ్యంలో పాక్ రాయబారులు ఇద్దరు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
కాశ్మిర్ ప్రత్యేక రాయబారి హుస్సేన్ సయీద్ తో పాటు మరో పాక్ రాయబారి షాజ్ర మాన్సాబ్ లు తమ దేశ వాదనలను ఇతర ప్రపంచ దేశాలకు వినిపించడానికి అమెరికాలో ఉన్నారు. ఐరాస లోని వివిధ దేశాల రాయబారులను వారు కలుస్తున్నారు. అమెరికాకు కూడా తమ వాదనలను వినిపించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయని ఇంటర్వ్యూలో వారు చెప్పిన మాటలను బట్టి అర్ధం అవుతున్నది.
అమెరికా లోని Think Tanks లోని టాప్ కేటగిరిలో ఒకటిగా అట్లాంటిక్ కొన్సిల్ ని పరిగణిస్తారు. వాల్ స్ట్రీట్ కంపెనీలు లేదా బడా సామ్రాజ్యవాద కంపెనీలు ఇలాంటి మేధో సంస్ధలను పోషిస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ రాజకీయ, ఆర్ధిక, సామాజిక ధోరణులను పసిగట్టి తదనుగుణమైన విధానాలను సూచించడానికి ఈ సంస్ధలను వినియోగిస్తాయి. ఈ సంస్ధల సూచనలే ప్రధానంగా అమెరికన్ సెనేట్ (ఎగువ సభ), ప్రతినిధుల సభ (దిగువ సభ) లలో ప్రవేశించి విధానాలుగా రూపొందుతాయి. కాబట్టి ఈ సంస్ధలు చేసే ఇంటర్వ్యూలు, సమావేశాలు, పరిశీలన, పరిశోధన మరియు అధ్యయన పత్రాలను యధావిధి వ్యవహారంగా కొట్టిపారేయడం కుదరదు.
ఆఫ్-పాక్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఓల్సన్ కు పాక్ రాయబారులు కాశ్మిర్ లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘన గురించి వివరిస్తూ పత్రాన్ని సమర్పించారు. పాక్ రాయబారులు ఇద్దరు కాశ్మిర్ లో ఇండియా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఇంటర్వ్యూలో ప్రముఖంగా ఫిర్యాదు చేశారు. వీటిని అమెరికా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము ఎంత చెప్పినా పెడ చెవిన పెడుతున్నదని ఆగ్రహించారు.
“కాశ్మిర్ సమస్య – ఇండియా విషయంలో పాకిస్తాన్ అభిప్రాయాలను అమెరికా పరిగణనలోకి తీసుకోనట్లయితే మేము చైనా, రష్యా లకు దగ్గర కావలసి వస్తుంది” అని కూడా సయ్యద్ బెదిరించాడు. ప్రేక్షకులలో ఒకరు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ సయ్యద్ ఈ విధంగా వ్యాఖ్యానించారని PTI వార్తా సంస్ధను ఉటంకిస్తూ ద హిందూ తెలిపింది. అమెరికా ధోరణి పట్ల తాము విసుగు చెందామని సయ్యద్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆయన చైనా, రష్యా లతో తమ దేశానికి సామీప్యత ఏ విధంగా పెరిగినది వివరించారు. “పాకిస్తాన్ కాశ్మిర్ విధానాన్ని ఎవరూ స్వీకరించని పరిస్ధితుల్లో దక్షిణ ఆసియాలో చైనా ఇప్పుడు ప్రముఖ శక్తిగా, పాత్రధారిగా అవతరించింది. బీజింగ్ ఇప్పుడు గ్రేటర్ దక్షిణాసియాలో భాగస్వామి కూడా” అని సయ్యద్ వివరించాడు. తమకు దగ్గర అయింది కనుక లేదా తాము దగ్గర అయ్యాము కనుక చైనా ఇప్పుడు దక్షిణ ఆసియాలో కూడా భాగం అయిపోయిందన్నమాట!
“మాస్కో, ఇస్లామాబాద్ ల మధ్య మెల్లగానే అయినా స్ధిరంగా సంబంధాలు వృద్ధి చెందుతున్నాయి. రష్యా మొదటి సారి మాకు ఆయుధాలు విక్రయించేందుకు అంగీకరించింది. రష్యా, పాకిస్తాన్ లు ఉమ్మడి మిలట్రీ విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. ప్రాంతీయంగా ఏర్పడుతున్న పునరేకీకరణ పరిస్ధితులను అమెరికా గ్రహించాలి” అని పాక్ రాయబారి సయ్యద్ వివరించారు.
“దురదృష్టవశాత్తూ ఒబామా పాలన కింద మా ప్రాంతం పట్ల అమెరికా విదేశీ విధానంలో ఆఫ్ఘనిస్తాన్ వైపుగా మార్పు వచ్చింది. అయోమయం నెలకొన్నది. అనేక ఎగుడు దిగుడులు సంభవించాయి. ఆఫ్-పాక్ ప్రాంతం గురించి ఏమి చేయాలో ఒబామా ప్రభుత్వానికి తెలియనట్లుగా కనిపిస్తున్నది. ఈ ప్రాంతం ఎదుర్కొన్న పర్యవసానాల పైనా అవగాహన లేనట్లు కనిపిస్తోంది” అని పాక్ రాయబారి అమెరికాను, అధ్యక్షుడు ఒబామాని తప్పు పట్టాడు.
ఇప్పటికైనా అమెరికా తన విధానాన్ని మార్చుకోవాలని, తాము మళ్ళీ అమెరికా వైపు తిరిగే అవకాశం లేకపోలేదని పాక్ రాయబారులు సూచిస్తున్నారన్నది స్పష్టమే. అలా జరగాలంటే అమెరికా, ఇండియా నుండి దూరం జరగాలని వాళ్ళు షరతు విధిస్తున్నారు.
ఒక వేళ అమెరికా మళ్ళీ పాకిస్తాన్ ను చేరదీస్తే భారత పాలకులు చైనా, రష్యాలకు దగ్గర అవుతారని వేరే చెప్పనవసరం లేదు.
భూమండలంపై అత్యధిక ప్రజానీకం పక్షాన పోరాడుతున్న ఏకైక వాదము నిశ్శందేహంగా కమ్యునిస్టువాదమే.అందువలన ఆ కమ్యునిస్టువాదాన్ని ఆసరాగా చేసుకొని సామాన్యప్రజానీకానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఆధిపత్యవర్గాల నిర్లజను తరిమికొట్టే ఆలోచనాధోరణలను ఆ కమ్యునిస్టువాదమే అందించగలుగుతుంది.