
Protests against Supreme Court orders in Karnataka
కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -CWDT), కావేరీ నిర్వాహక బోర్డు (కావేరీ మేనేజ్మెంట్ బోర్డు -సిఎంబి) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడు అది చాలా మంచి కారణాలతోనే అలా చేసింది. ఋతుపవనాల లోటు సంవత్సరాలలో వివిధ ఉప-బేసిన్ లలోని నీటి ప్రవాహాల నమూనా, సాధారణ సంవత్సరాలలోని ప్రవాహాల ఆధారంగా రూపొందించిన నీటి విడుదల సూచి (షెడ్యూలు) తో సరిపోలదు. కావేరీ బేసిన్ లోని నిల్వల స్ధాయి, వర్షాల ధోరణిలను పర్యవేక్షిస్తూ వివిధ రాష్ట్రాల మధ్య పంపకం చేయవలసిన ప్రవాహ చేరికలను (inflows) మదింపు వేసే లక్ష్యంతో సిఎంబి ఆలోచన చేశారు. ట్రిబ్యునల్ తన అంతిమ అవార్డులో ఇలా నొక్కి చెప్పింది: వ్యవసాయ నీటిపారుదల నిమిత్తం నీటిని కిందికి వదలవలసిన షెడ్యూలు విషయమై తమిళనాడు – కర్ణాటకల మధ్యా, తమిళనాడు – పుదుచ్చేరిల మధ్యా అలాగే తమిళనాడు – కేరళల మధ్యా కూడా తలెత్తే వివాదాల పరిష్కారంలో సిఎంబి సమగ్ర భాగంగా ఉంటుంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 262 మరియు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 -అంతర్రాష్ట్ర నీటి వివాదాలలో సుప్రీం కోర్టు జోక్యాన్ని ఇది నిషేధిస్తుంది- లను అడ్డం పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిఎంబి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముందుకు రావడం తర్కాన్ని మెలితిప్పడం కంటే కాస్త ఎక్కువే. నిజానికి 1956 చట్టం ప్రభుత్వాలచే నియమించబడిన ట్రిబ్యునల్స్ ఆదేశాలకు, సుప్రీం కోర్టు ఆదేశాలతో సమానమైన శక్తిని ఇస్తుంది; కాగా ఆ చట్టాన్ని ఇప్పుడు కావేరీ ట్రిబ్యునల్ ఆదేశాలను శక్తివంతం చేయడానికి కాకుండా అది చేసిన కీలకమైన సిఫారసులలో ఒక దానిని పాడు చేయడానికే తలకెత్తుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సుప్రీం కోర్టు సిఎంబి ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది తప్ప -ప్రభుత్వం చూపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా- దానికి వ్యతిరేకంగా మాత్రం కాదు.
సుప్రీం కోర్టులో తన వాదన వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వం అంత హడావుడిగా U-టర్న్ తీసుకోవడం బట్టి రాజకీయ కారణాలు రంగంలోకి దిగి ఉండవచ్చని అర్ధం అవుతోంది. బిజేపి బాగా ఆశలు పెట్టుకున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రెండు సంవత్సరాల లోపే జరగనున్నాయి. దానికి విరుద్ధంగా, బిజేపి కి ఎలాంటి వాస్తవ పునాది లేని తమిళనాడులో ఇటీవలే ఎన్నికలు పూర్తయ్యాయి. సిఎంబి ఏర్పాటుకు వ్యతిరేకంగా నిజంగా మెరుగైన న్యాయ వాదన ఉన్నట్లయితే, ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జి సభ్యుల పెద్ద ధర్మాసనం దానిని ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నది. సిఎంబి ని ఏర్పాటు చేయాలన్న తమిళనాడు అభ్యర్ధనను, CWDT ఇచ్చిన 2007 నాటి అంతిమ అవార్డును సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రధాన అభ్యర్ధనతో ధర్మాసనం జత చేసింది. స్వల్ప కాలికంగా (సమీప కాలంలో), సాంకేతిక బృందం కావేరీ బేసిన్ నుసందర్శించి క్షేత్ర స్ధాయిలో నెలకొన్న వాస్తవాలను తనకు నివేదించాలన్న సూచనకు సుప్రీం కోర్టు తెలిపిన ఆమోదం మాత్రమే వివాదాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ, దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం అత్యవసరంగా, CWDT బాగా ఆలోచించి చేసిన సిఫారసుల పైననే ఆధారపడి ఉండాలి; లోటు వర్షపాతం నెలకొన్న సంవత్సరాలలో జలాల పంపకం CWDT అందజేసిన ప్రక్రియల పైననే ఆధారపడి ఉండాలి.
*********
అదండీ సంగతి! కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తన పాత నిర్ణయాన్ని తిరగదోడి సిఎంబి ని ఏర్పాటు చేయాలన్న సూచనకు తానే ఎదురు తిరగడం ఎందుకో సంపాదకీయం స్పష్టంగా చెప్పింది. అసలు కావేరీ జలాల వివాదం సరి కొత్తగా రగలడం లోనే ఎన్నికల ప్రయోజనాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. CWDT అవార్డు ని, సూచనలను త్రోసిరాజంటూ కర్ణాటక అడ్డం తిరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఇరువురుకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించడానికి దోహదం చేయాలి. దానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకే సై అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలను తిరస్కరించడమే కాకుండా దానికి 1956 చట్టాన్ని అడ్డం తెచ్చుకోవడం అత్యంత ఘోరమైన సంగతి. సరిహద్దు ఘర్షణలు కేంద్రంగా హిస్టీరియా సృష్టించి సైనికుల విధి నిర్వహణను కూడా రాజకీయ లబ్ది కోసం వినియోగించే పార్టీకి, దాని నేతలకు ఎంతటి ఘోరమైనా చెల్లిపోతుంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ల ఆటలో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం ద్వారా బిజేపి కీ, తనకూ తేడాలు లేవని చాటుకుంది.