
నరేంద్ర మోడీ ప్రభుత్వం తాము పాక్ భూభాగం మీదికి చొచ్చుకుని వెళ్లి ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించామని, పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పామని ఆర్భాటంగా ప్రకటించారు. “సరిహద్దులో అలాంటి ఘటన ఏది జరగలేదు. ఎప్పటి లాగా క్రాస్ బోర్డర్ ఫైరింగ్’ జరిగింది, అంతే. అంతకు మించి ఏమి జరగలేదు” అని పాక్ ప్రధాని ప్రకటించారు.
ఒక్క పాక్ ప్రధాని మాత్రమే కాదు. అంతర్జాతీయ మీడియా కూడా “అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా, లేదా?” అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘భారత సైన్యం సరిహద్దు దాటి దాడి చేసిన దాఖలాలు ఏవి లేవు’ అని అవి ప్రకటించాయి. వాషింగ్టన్ పోస్ట్, CNN , న్యూ యార్క్ టైమ్స్, ద టెలిగ్రాఫ్, తదితర వార్తా సంస్ధలు ఇలా అనుమానాలు వ్యక్తం చేసిన వాటిలో ఉన్నాయి.
చివరికి ఐరాస జనరల్ సెక్రటరీ బాన్ కి మూన్ కూడా ఇండియా/భారత ప్రధాని & సైన్యం చెప్పిన మాటలను పరోక్షంగా అనుమానించారు. “దాడి చేసాము ఇండియా / మోడీ అని చెప్పిన సమయంలో భారత్-పాక్ సరిహద్దులో సాయుధ ఘర్షణ లేదా దాడి లాంటి ఘటన ఏది జరగలేదు” అని ప్రకటించాడు.
సరిహద్దుకు సమీపంలో ఐరాస కార్యాలయం ఒకటుంది. దాని పేరు UNMOGIP (యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్). ఐరాస తీర్మానం 91 (1951) ప్రకారం ఏర్పడిన ఈ సంస్ధ పని ఇండియా, పాక్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవుతుందా లేదా అని పరిశీలించడం. సరిహద్దు వెంబడి జరిగే ఘటనలను ఎప్పటికప్పుడు ఐరాసకు నివేదించడం. ఇప్పుడు విలువడిన బాన్ కి మూన్ ప్రకటన సదరు UNMOGIP సంస్ధ ఇఛ్చిన సమాచారం మేరకు చేసినదే.
కాబట్టి మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ చేసిన ప్రకటనను ఎవరైనా అనుమానిస్తే అవి సకారణమే.
ఈ నేపథ్యంలో జమ్మూ & కాశ్మిర్, పంజాబ్ రాష్ట్రాలు సరిహద్దు వెంబడి గ్రామాల ప్రజలను ఎందుకు ఖాళి చేయిస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. BSF గాని ఇండియన్ ఆర్మీ గాని జనాన్ని ఖాళి చేయించాలని సూచనలు ఇచ్చారా అంటే అదేమీ లేదు. తామేమి సూచనలు ఇవ్వలేదని, అసలు జమ్మూ & కాశ్మిర్ రాష్ట్రానికే సూచనలు ఇవ్వనప్పుడు పంజాబ్ రాష్ట్రానికి అలాంటి సూచనలు ఇచ్చే సమస్యే లేదని వాళ్ళు ఎందుకు ఖాళి చేస్తున్నారో తమకైతే తెలియదని BSF చెబుతోంది. ఎవరు చెప్పకుండా జనం ఎందుకు ఖాళి చేస్తున్నట్లు? తమంతట తామే వాళ్ళు ఇళ్ళు వదిలి ఎందుకు వెళ్తున్నట్లు?
నిజానికి జనం తమంతట తామే గ్రామాలు వదిలి వెళ్లడం లేదు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే వారిని ఖాళి చేయిస్తున్నాయి. ఓ పక్క ఉద్రిక్తత కొనసాగకుండా చూస్తామని ప్రధాని మోడీ ప్రకటిస్తుంటే జనాన్ని అనవసరంగా వారి ఇళ్ల నుండి పంపిస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారాని సరిహద్దు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కూడా.
పంజాబ్ లో ఐతే ఈ విధంగా భారీ ఎత్తున ప్రజల్ని గ్రామాల నుండి ఖాళి చేయించిన ఉదాహరణ గతంలో ఎప్పుడు లేదట. ఎప్పుడన్నా ఉద్రిక్తతలు ఏర్పడితే కాశ్మిర్ సరిహద్దులోని కొన్ని గ్రామాలను మాత్రమే ఖాళి చేయమని తాము కోరుతాము తప్ప సరిహద్దు అంతా ఖాళి చేయాల్సిన అవసరం ఎప్పుడు రాదనీ BSF , ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేదని అవి స్పష్టం చేస్తున్నాయి.
పంజాబ్ లో సరిహద్దుకు 10 కి.మీ దూరం లోపు ఉన్న 800 గ్రామాల నుండి ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాళి చేయించింది. ఈ అంశం ఆ రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ సమస్య అయింది. “2001 నుండి, పంజాబ్ సరిహద్దు వెంబడి 3 అంచెల భద్రతా కంచె నిర్మించిన తర్వాత, సరిహద్దుకు ఆవలి నుండి ఎన్నడూ కాల్పులు జరగలేదు. అలాంటప్పుడు జనాన్ని ఎందుకు ఖాళి చేయిస్తున్నారు?” అని ప్రతిపక్షాలు -కాంగ్రెస్, AAP పార్టీలు అడుగుతున్నాయి.
“పంజాబ్ లో సరిహద్దుకు అవతలి నుండి ప్రతీకార కాల్పులు జరుగుతాయని మేము ఎలాంటి గూఢచార సమాచారమూ ఇవ్వలేదు. జమ్మూ & కాశ్మిర్ సరిహద్దులో కొన్ని ప్రాంతాల్లో కొంత చర్య జరగవచ్చని మాత్రమే అంచనా వేసాం” అని ఇంటలిజెన్స్ అధికారులు చెప్పారని ద హిందూ చెప్పింది. రాష్ట్ర అధికారులేమో “హోమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే మేము సరిహద్దు గ్రామాలను ఖాళి చేయించాము” అని చెబుతున్నారు. అనగా కేంద్ర ప్రభుత్వమూ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమూ కూడబలుక్కుని ఈ మూకుమ్మడి తరలింపులు చేపట్టారని అర్ధం అవుతోంది.
BSF ప్రకారం గుజరాత్, రాజస్ధాన్, పంజాబ్, జమ్మూ & కాశ్మిర్ రాష్ట్రాల వెంబడి 2,308 కి.మీ మేర పాక్-ఇండియా సరిహద్దు ఉన్నది. జమ్మూలో 192 కి.మీ సరిహద్దుని BSF కాపలా కాస్తుంది. ఇది అంతర్జాతీయ సరిహద్దు. మిగిలిన 8 కి.మీ ఆర్మీ కాపలా కాస్తుంది. కాశ్మిర్ వెంబడి ఉన్న 740 కి.మీ నియంత్రణ రేఖ (LoC ) మొత్తం ఆర్మీయే కాపలా కాస్తుంది. ఇది అంతర్జాతీయ సరిహద్దు కాదు; కాల్పుల విరమణ రేఖ మాత్రమే. ఇరు దేశాలు సరిహద్దుగా గుర్తిస్తూ ఒప్పందం కుదుర్చుకుంటేనే అంతర్జాతీయ సరిహద్దు అవుతుంది. అది ఇంకా జరగలేదు కాబట్టి అది సరిహద్దు కాదు; అందుకే UN కూడా కాపలా ఉండడం.
“పంజాబ్ లో సరిహద్దు గ్రామాలను ఇంట పెద్ద మొత్తంలో జనాన్ని ఖాళి చేయడం ఎప్పుడు జరగలేదు” అని ఒక BSF అధికారి చెప్పగా, “పంజాబ్ లో ఇరు వైపు ప్రాంతాలు జన సాంద్రత ఎక్కువ. రెండు వైపులా ఎక్కువగా వ్యవసాయ జనం నివసిస్తున్నారు. అందువలన ఇక్కడ కాల్పులు జరిగే అవకాశం లేదు” అని మరో BSF అధికారి చెప్పాడు.
“జమ్మూలో కూడా జన సాంద్రత ఎక్కువే. కానీ ఈ సరిహద్దును పాక్ గుర్తించలేదు. అందువల్ల ఇక్కడ గతంలో అప్పుడప్పుడు షెల్ దాడి, కాల్పులు జరుగుతాయి. పంజాబ్, రాజస్ధాన్, గుజరాత్ లు పూర్తిగా వేరు. ఇక్కడ సరిహద్దు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. కాల్పుల విరమణ ఒప్పందం లాంటిది ఏమి ఈ సరిహద్దులో జరగలేదు. దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా ఇరు వైపులా గుర్తించారు” అని ఆర్మీ అధికారి చెప్పారు.
కాబట్టి ఇంటలిజెన్స్, ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తదితర బలగాల నుండి ఎలాంటి హెచ్చరిక లేకుండానే ప్రజలను ఖాళి చేయించడం ఇతరేతర కారణాలు ఉన్నాయని స్పష్టం అవుతున్నది. ఆ కారణాలు రాజకీయం అని వేరే చెప్పనవసరం లేదు. పంజాబ్ లో త్వరలో ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ పాలక అకాలి – బీజేపీ కూటమి ఓటమి పాలవడం తధ్యం అని దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఓటమి నుండి తప్పించుకోవడానికి ప్రజల్లో భయాందోళనలు రేపి, వారి దృష్టి మళ్లించడానికి సరిహద్దులో పెద్ద ఎత్తున గ్రామాలను ఖాళి చేయిస్తున్నారని AAP , కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిరస్కరించడానికి కారణం ఏమి కనపడటం లేదు.
హోమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే ఖాళి చేయిస్తున్నామని స్ధానిక సంస్ధలు -పంచాయితీ, మునిసిపాలిటీ, పోలీసులు- చెబుతున్నారు. రాష్ట్ర హోమ్ శాఖా లేక కేంద్ర హోమ్ శాఖా అన్నది తెలియలేదు. అయితే అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా లేదా అన్న అంశం పైనే అనుమానాలు తలెత్తినందున ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నా ఆశ్చర్యం లేదు. మోడీ చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్ బూటకం (ఫేక్) అని మహా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ ఆరోపిస్తూ రుజువులు చూపాలని డిమాండ్ చేయడం ఈ సందర్భంగా గమనార్హం. అటు పాకిస్తాన్ కూడా అంతర్జాతీయ విలేఖరులను సరిహద్దు వద్దకు తెఛ్చి చూపిస్తూ దాడులు జరిగిన దాఖలాలు లేవు అనడానికి రుజువులు చూపిస్తున్నది.
One thought on “సర్జికల్ స్ట్రైక్స్: సరిహద్దు గ్రామాల్ని ఎందుకు ఖాళి చేస్తున్నట్లు?”