లోకేశ్వర్:
“వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి? (నాకు కూడా)
సమాధానం:
ఈ అనుమానానికి చాలా పెద్ద సమాధానం, సమాచారం ఇవ్వాలి. విస్తృత విశ్లేషణ చెయ్యాలి. అందుకని కాస్త తీరికగా రాయొచ్చు అనుకున్నాను. మీరు రెండోసారి అడగడంతో క్లుప్తంగా రాస్తున్నాను.
మనకొక ఉత్తరం వచ్చిందనుకుందాం. దాన్ని పక్కింటి వాళ్ళు చించి చదివితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది?
ఆ ఉత్తరంలో పక్కింటి వాళ్ళు చదవ కూడనిది ఏమీ ఉండకపోవచ్చు. వాళ్ళు చదవడం వల్ల మనకు ఏ విధంగానూ నష్టం లేకపోవచ్చు. అయినా మనకి ఏ భావన కలుగుతుంది? మన సొంత వ్యవహారం లోకి పక్కింటి వాడు జోక్యం చేసుకున్నట్లుగా, మన ఇంట్లోకి తొంగి చూసినట్లుగా అనిపించదా? కోపం రాదా?
మన పేరు, మన ఫోన్ నెంబర్, మన ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, మన ఫోన్ వాడకం అలవాట్లు, మనం మొబైల్ నెట్ లో ఏయే సైట్స్ చూసేదీ, ఈ-కామర్స్ సైట్లలో ఏయే వస్తువులు కొనేదీ అన్నింటిని ఇంటర్నెట్ కంపెనీలు తమ సర్వర్లలో రికార్డు చేస్తున్నాయి. మన ఈ మెయిళ్ళు ఎవరెవరికి పంపేదీ నోట్ చేస్తున్నాయి. మన బ్యాంక్ బాలన్స్ (ఖర్చుల ద్వారా) చెక్ చేస్తున్నాయి. ఈ వివరలాన్నింటితో కంపెనీలు ప్రతి ఒక్కరికీ ఒక ప్రొఫైల్ ని తయారు చేసి బద్రపరుస్తున్నాయి. (గూగుల్ అయితే ఆ ప్రొఫైల్ ఐడి ఏమిటో మనకే చెబుతున్నది)
ఈ వివరాలను ఇతర కంపెనీలకి అమ్ముకోవటం ఒక ఎత్తు. తామే ప్రొఫైల్ తయారు చేసి ఒక్కో వినియోగదారుడి జీవనం మొత్తాన్ని ఆ ప్రొఫైల్ లో భద్రం చేయడం మరొక ఎత్తు. మన జీవితం మొత్తం వ్యాపార కంపెనీ చేతిలో ఉంటే మనకి ఇక ఏకాంతం ఉన్నట్లా లేనట్లా?
ఎవరి వ్యక్తిగత వివరాలు వారి వారి సొంతం. అవి వారి ఏకాంతానికి సంబంధించినవి. వాటిని తమ వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఎవరైనా షేర్ చేస్తారు. కానీ మన వివరాలు మనకి చెప్పకుండా -పోనీ ఇంకో కారణం ఏదో చెప్పి- భద్రం చేసి వాటి ద్వారా ఇతర కంపెనీలతో వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తే మనకి నష్టం లేనట్లేనా?
ఇదంతా ఒక కోణం. మనకి కొన్నిసార్లు ప్రభుత్వాల పైన కోపం వస్తుంది. ప్రభుత్వ విధానాలు కొన్నిసార్లు మనకి నచ్చవు. ఆ నచ్చని వాటిని ఈ మెయిల్ ద్వారా ఫ్రెండ్స్ తో షేర్ చేస్తాం. వాట్సప్, ఫేస్ బుక్ ల్లో షేర్ చేస్తాం. ఒక్కోసారి ఆ సమస్య పైన ఆందోళనకి సిద్ధ పడతాం.
దీనిని కూడా కంపెనీలు రికార్డ్ చేస్తాయి. ఆందోళన, అభిప్రాయం తమకు వ్యతిరేకం అనుకుంటే కంపెనీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాయి. అప్పుడు ప్రభుత్వం ఏదో ఒక వంక పెట్టి మనల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తాయి. అంటే మన రాజకీయ-సామాజిక-ఆర్ధిక కదలికలు అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని మనకి భావ ప్రకటన కూడా లేకుండా చేయడంలో ఇలా వ్యక్తిగత వివరాల సేకరణను వినియోగిస్తాయి. ప్రభుత్వాలకి కూడా ఈ సమాచారం కావాలి. కోట్ల డబ్బుతో ఇంటలిజెన్స్ విభాగాన్ని మేపినా సేకరించలేని సమాచారాన్ని మన సహకారం తోనే ప్రభుత్వాలు సేకరిస్తే ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం?
కనుక వ్యక్తిగత వివరాల సేకరణ రాజ్యాంగం పౌరులకి గ్యారంటీ చేసిన ప్రాధమిక హక్కులని హరించే వరకూ వెళుతుంది. అంతా అయ్యాక చింతించి ప్రయోజనం ఉండదు.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేకుండా మనం ఇన్నాళ్ళూ సేవలని పొందలేదా? ఇన్నాళ్ళు సరుకులు కొనుక్కోలేదా? ఎలక్ట్రానిక్ సరుకులు వాడ లేదా? అప్పుడు వ్యాపారాలు జరగలేదా? అప్పుడు మాత్రం కంపెనీలు నడవ లేదా?
అప్పుడు కంపెనీలకి వినియోగదారుల కదలికలు ఏమిటో తెలియవు. వాళ్ళ అలవాట్లు ఏమిటో తెలియదు. ఏ సమయంలో ఏమి కొంటారో, ఏ కాలంలో ఏది వినియోగిస్తారో -జనరల్ గా తెలియవచ్చు గానీ- ఒక్కో వినియోగదారుడు లెక్కన తెలియవు. కాబట్టి వ్యాపారాల కంటే వినియోగదారుడిదే పై చేయి. వినియోగదారుల్ని ఆకట్టుకోవడం కోసం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం కోసం కంపెనీలు ప్రత్యేక విభాగాలు నడిపారు. ప్రత్యేక ఉద్యోగుల్నీ నియమించారు. తద్వారా ఉపాధి సౌకర్యాలు ఎక్కువగా లభించేవి.
ఇప్పుడు పరిస్ధితి అది కాదు. నేరుగా వినియోగదారుడి దగ్గరి నుండే వాడికి సంబంధించిన సమస్త వివరాలు తెలుసుకుంటున్నాయి. ఉచితం అంటూ తమకు నామ మాత్రం ఖర్చు అయిన ప్రయోజనం కలిగిస్తూ తమ వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నాయి. ఆ క్రమంలో వినియోగదారుల వ్యక్తిగత జీవనాన్ని -పరిమిత స్ధాయిలో- బహిరంగ మార్కెట్ లో పెడుతున్నాయి. లెక్కకు మించి లాభాలు సంపాదిస్తున్నాయి. ఆ మేరకు ఉపాధి ఇవ్వకుండానే ఇదంతా చేస్తున్నాయి.
ఈ ధోరణి ఒక్క వినియోగదారుడికి మాత్రమే నష్టకరంగా ఉండదు. మొత్తం వ్యవస్ధకే నష్టం. ముఖ్యంగా సామాన్యుడి మనుగడకి నష్టం. వ్యాపార కంపెనీలు, ధనిక వర్గాల వద్ద మరింత డబ్బు పోగుపడుతుంది గానీ ఆ డబ్బులో కొంత భాగం అయినా తిరిగి జనానికి ఉపాధిగా చేరే దారులు మూసుకుపోవడమే కాకుండా సామాన్యుడి రాజకీయ హక్కులు కూడా క్రమంగా మృగ్యం అయిపోతాయి. జనం చేతులతో జనం కళ్ళనే పొడిచే పరిస్ధితి వస్తుంది.
నిజానికి ఆ దిశలో చాలా దూరం వెళ్లిపోయాము కూడా. ఆధార్ ని తప్పనిసరి చేయటానికి ప్రభుత్వాలు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నాయి? సుప్రీం కోర్టు ఆధార్ ని తప్పనిసరి చేయొద్దు, స్వచ్ఛందంగా ఇష్టపడితేనే చేర్చండి అని అనేకసార్లు తీర్పు చెప్పినా మోడి ప్రభుత్వం ఆధార్ కి చట్టబద్ధత కూడా కల్పించడానికి ఎందుకు సిద్ధ పడ్డట్లు?
ఎందుకంటే దేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తిని తేలికగా అదుపులో పెట్టుకునే అవకాశాన్ని ఆధార్ ద్వారా సేకరిస్తున్న బయోమెట్రిక్ సమాచారం ఇస్తుంది. 120 కోట్ల మంది వేలి ముద్రలు, ఐరిస్ ఛాయలు సేకరించగలగడం కంటే మించిన అద్బుత వ్యాపార ఆకర్షణ మరొకటి ఉండదు. ఆధార్ వివరాలను భద్రంగా ఉంచే చట్టం ఏదీ మన ప్రభుత్వాలు చేయలేదు. అందుకు సుముఖంగా కూడా లేవు. కోర్టుకి ఒట్టి హామీలు ఇస్తున్నాయంతే.
శేఖర్ గారికి,
మరిచిపోయిఉంటారేమో అని ప్రశ్నని రెండో సారి అడిగాను. మరే సందర్భంలోనైనా వివరంగానే వ్రాయండి.
ఈ వివరణతో మీ అనుమానం ఎంత వరకు తీరిందో చెప్పలేదు మరి!
డేటాను దుర్వినియోగం చేయకూడదనే విషయం భావనాత్మకంగానే తెలుసు. వివరణాత్మకంగా తెలియదు. మీ సమాధానంతో సందేహం తీరింది. ‘విస్తృత విశ్లేషణ చేయాలి’ అన్నారు. దాని కోసం చూస్తుంటాను.
“ఇప్పటికే వివిధ రకాల గుర్తింపు కార్డులుండగా, ఆధార్ అవసరమేంటి? తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు పదేపదే చెప్తున్నా, అన్ని స్థాయిల్లో ఆధార్ అనుసంధానం జరిగిపోతూనే ఉంది(చివరికి రిలయన్స్ జియోకు కూడా). దీని పైన పాలకపక్షాల పరస్పర విమర్శలు కూడా లేవు. ప్రభుత్వాలు(UPA/NDA) ఏమి ఆశిస్తున్నాయి? ఇందులో అంతర్జాతీయ సంస్థల జోక్యమేమైనా ఉందా?” – తర్వాతి విశ్లేషణల్లో దీన్ని కూడా చేర్చగలరు.