
పౌర అణు సహకారం నిమిత్తం ఇండియా 11 దేశాలతో -అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియాలతో సహా- ఒప్పందాలు చేసుకుంది. కానీ త్వరలో జపాన్ తో జరగనున్న ఒప్పందం పరిగణించదగినది. అణు దాడికి గురయిన ఏకైక దేశం జపాన్; కనుక అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందం (NPT ) పైన సంతకం చేయని ఇండియాతో అణు ఒప్పందంపై సంతకం చేయాలని ఆ దేశం నిర్ణయించడం తనకు మొదటిది అవుతుంది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత జపాన్ లో అణు శక్తికి వ్యతిరేకంగా అభిప్రాయాలు గట్టిపడ్డాయి. కనుక ఒప్పందానికి టోకియో ఇప్పటి వరకు ఇచ్చిన మద్దతు, ఇండియాతో సంబంధాలకు ఆ దేశం ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తున్నదో తెలియజేస్తున్నది. అణు సరఫరాదారుల సంఘం (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్) లో ఈ ఏడు అయినా తన సభ్యత్వం ఆమోదం పొందాలని కోరుకుంటున్నందున గ్రూఫు సభ్య దేశాలకు ఇండియా నమ్మకమైన దేశంగా సందేశం పంపుతుంది కనుక ఈ ఒప్పందం ఇండియాకు మరింత ముఖ్యమైనది. NSG లో జపాన్ మద్దతు ప్రత్యేకంగా గుర్తింపు పొందినట్టిది. నిజానికి, ఐరాస భద్రతా సమితి సంస్కరణల కోసం తలుపు తడుతున్న జి-4 గ్రూఫులో సభ్యత్వంతో సహా, ఇండియా, జపాన్ లు అనేక బహుళ పక్ష వేదికలను పంచుకుంటున్నాయి. సంకేతాత్మక కారణాలను అలా ఉంచితే, జపాన్ అణు శక్తి సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలు అత్యున్నతమైనవన్న నమ్మిక విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నది; అంతే కాక భారత రియాక్టర్ల కావలసిన అనేక కీలక విడి భాగాలు జపాన్ తయారీదారులు తయారు చేస్తున్నారు. (జపాన్ తో) ఒప్పందం జరిగే వరకు ఇవి ఇండియాకు అందుబాటులోకి రావు. వాటిని స్ధానికంగానే తయారు చేసే విషయాన్ని ఇండియా పరిగణిస్తున్నప్పటికీ, అనేక ఏళ్ళ పాటు జపాన్ కు ప్రత్యామ్నాయాలు ఏమీ ఉండవు. ఆంధ్ర ప్రదేశ్ లో 6 రియాక్టర్లు నిర్మించనున్న వెస్టింగ్ హౌస్ (అమెరికా) కంపెనీ యజమాని జపాన్ కంపెనీ అయినా తోషిబా యే అయినందున, ఇంకా ఆచరణలోకి రావలసి ఉన్న అమెరికా పౌర అణు ఒప్పందం కూడా, జపాన్ తో ఒప్పందంపై ఆధారపడి ఉన్నది.
ఒప్పందంపై చర్చలు ఇంత కాలం పాటు సాగడం పట్ల కలవరపాటు కలగవచ్చు. ప్రధానంగా అడ్డు పడిన అంశం ఏమిటంటే, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఇండియా భావిస్తున్న అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పైన సంతకం చేయడానికి ఇండియా నిరాకరించడమే. ఈ కారణం చేతనే ఒప్పందం కుదుర్చుకునే తొందరలో, అణు పరీక్షలపై స్వయం-ప్రకటిత నిషేధం మినహా వచ్చే చలి కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జపాన్ సందర్శన లోపు ఇతర షరతుల ఒత్తిడికి లొంగరాదని న్యూ ఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఇండియా అణు పరీక్షా జరిపిన వెంటనే ఒప్పదం దానంతట అదే ఉనికిలో లేకుండా పోవాలని నిర్దేశించే “నల్లిఫికేషన్” షరతుని అంగీకరించాలన్న జపాన్ ఒత్తిడిని ఈ సమతూకంతో కూడిన ఆలోచన తోనే జయించాలి. ఫుకుషిమా ప్రమాదం అనంతర కాలంలో, ప్రమాదం జరిగినట్లయితే శుభ్రపరచడం కోసం ఎదురు కానున్న భారీ ఖర్చు ఏ పాటిదో తనకే స్వయంగా అనుభవం ఉన్నందున ప్రమాద పరిహారం (లయబిలిటీ) విషయంలో జపాన్ తయారీదారులు ఉదారంగా ఉంటారని ఆశించవచ్చు. ఎప్పటి లాగే, ఇండియా-అమెరికా ఒప్పందం కంటే మిన్నగా అసలు విషయం అంతిమ ఒప్పందం ప్రతిలోనే ఉంటుంది.
*********
ఈ NSG సభ్యత్వం పట్ల ఉన్న వ్యామోహం ఏమిటో అర్ధం కాకుంది. అమెరికా ఒప్పందం ద్వారా న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో సభ్యత్వం లేకుండానే వివిధ అణు పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, అణు ఇంధనం కొనుగోలు చేసే అవకాశం ఇండియాకు లభించింది. అందు వల్లనే NPT పైన సంతకం చేయకపోయినా 11 గ్రూఫు సభ్య దేశాలు ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా NSG సభ్యత్వం కోసం పాకులాడటం దేనికని?
దానికంటే ముందు అణు విద్యుత్ కోసం భారత పాలకులు పడుతున్న తపన, పెడుతున్న దండాలు తీవ్రంగా వ్యతిరేకించవలసినవి. ఫుకుషిమా ప్రమాదం తర్వాత అక్కడ ఏర్పడిన అణు కాలుష్యాన్ని శుభ్రం చేయడం జపాన్ వల్ల కావటం లేదు. కనీసంగా ప్రమాద రహితంగా చేయడానికి కూడా 30 ఏళ్లకు పైగా పడుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చేశారు. తన వల్ల కాదని అమెరికా ఎప్పుడో చేతులు ఎత్తేసింది. అయినా అణు రియాక్టర్ల కోసం పాకులాడటం ఎవరి ప్రయోజనం కోసం? ప్రకృతి నుండి లభించే అత్యంత శుభ్రమైన సోలార్, గాలి విద్యుత్ లపైనా దృష్టి పెట్టకుండా అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్ వెంట పడతుండటాన్ని ప్రశ్నించవలసింది పోయి పత్రికలూ ప్రోత్సహించడం తగని పని.
ఫుకుషిమా ప్రమాదం బారిన పడిన జపాన్ పౌరులకే జపాన్ అణు కంపెనీ సరైన నష్టపరిహారం చెల్లించలేదు. అనేక అబద్ధాలు, కట్టు కధలు చెప్పి ప్రమాదం పట్ల తన బాధ్యతను తప్పించుకోవాలని శత విధాలా కంపెనీ ప్రయత్నాలు చేసింది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత భద్రతా రేడియేషన్ స్ధాయిని అనేక రెట్లు పెంచి రేడియేషన్ కాలుష్యాన్ని కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలు కంపెనీ చేసింది, ప్రభుత్వమూ చేసింది. అలాంటి జపాన్ కంపెనీలు ఉదారంగా, ఇండియాలో ప్రమాదం జరిగితే, నష్ట పరిహారం చెల్లిస్తాయా? ఎవరు అమాయకులు?