
అమెరికా తన మాట నిలబెట్టుకుంది. “మీ ఇళ్లకు మీ వాళ్ళ శవాలు వెళ్తాయి” అని అమెరికా విదేశాంగ శాఖ చేసిన హెచ్చరిక ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
సిరియా రాజధాని డమాస్కస్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పైన సోమవారం ఆల్-నుస్రా టెర్రరిస్టులు దాడి చేశారు. దాడిలో రష్యన్ ఎంబసీ సిబ్బంది ఎవరు గాయపడలేదని రష్యా తెలిపింది. ఎంబసీ భవనం మాత్రం దెబ్బ తిన్నదని చెప్పింది.
“అక్టోబర్ 3 తేదీన రష్యన్ రాయబార కార్యాలయం మోర్టార్ క్షిపణుల దాడికి గురయింది. మైన్ లలో ఒకటి ఎంబసీ ప్రాంతంలో నివాస విభఙ్గాగం వద్ద పేలింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఎంబసీ భవనం మాత్రం దెబ్బ తిన్నది. మరో రెండు మైన్లు ఎంబసీ పక్కనే పేలిపోయాయి” అని రష్యా విదేశాంగ శాఖ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది.
ఆల్-నుస్రా ఫ్రంటు నియంత్రణలో ఉన్న జోబర్ మునిసిపాలిటీ ఏరియా నుండి మోర్టార్ లో ప్రయోగించబడ్డాయని ఆల్-నుస్రా కింద పని చేసే ఫేలాక్ ఆల్-రహమాన్ టెర్రరిస్టులు దాడిలో పాల్గొన్నారని ఎంబసీ తెలిపింది.
“అమెరికా మరియు దాని మిత్ర దేశాల లాంటి దేశాలు సిరియాలో హింసాత్మక ఘర్షణలను రెచ్చగొట్టిన ఫలితంగా, మిలిటెంట్లు, వివిధ రకాల ఉగ్రవాద సంస్ధలతో సరస సంబంధాలు నెలకొల్పడం ఫలితంగా ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాము” అని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలకు అమెరికా ఏ విధంగా స్పందించింది ఇంకా తెలియలేదు.
కొద్దీ రోజుల క్రితం అమెరికా వేసి శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ రష్యాను ఉద్దేశించి చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
“ఇది (అమెరికా సమర్థిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై రష్యా, సిరియాలు వాయు, భూతల దాడులు చేయడం) ఇలాగే కొనసాగితే…, సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. సిరియాలో అందుబాటులో ఉన్న ఖాళీలోకి విస్తరించడానికి తీవ్రవాదులు, తీవ్రవాద గ్రూపులు, తమ ఆపరేషన్లు కొనసాగిస్తాయి. అవి రష్యా ప్రయోజనాల పైన కూడా దాడి చేస్తాయనడంలో ఎలాంటి అనుమానము అవసరం లేదు. బహుశా రష్యా నగరాలలో కూడా దాడులు జరగొచ్చుఁ. రష్యా సైన్యం ఇక శవాల్ని ఇంటికి పంపించవలసి వస్తుంది. వాళ్ళు ఇక తమ వనరులను కోల్పోవడం కొనసాగుతుంది. బహుశా విమానాల్ని కూడా కోల్పోతారు”
“అవి -టెర్రరిస్టు సంస్ధలు- రష్యా ప్రయోజనాల పైన కూడా దాడి చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు” అని చెప్పడం ద్వారా సిరియాలోని టెర్రరిస్టు సంస్ధలు ఎవరి నియంత్రణలో ఉన్నాయో జాన్ కిర్బీ స్పష్టంగానే చెప్పాడు. డమాస్కస్ లో రష్యన్ ఎంబసీ రష్యా ప్రయోజనమే. ఇది జాన్ కిర్బీ చేసిన హెచ్చరిక పర్యవసానంగా జరిగిన దాడి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మునుముందు మరిన్ని దాడులు రష్యన్ ప్రయోజనాల పైన దాడులు తధ్యంగా కనిపిస్తున్నది. దాడులకు బదులు ఇవ్వకుండా రష్యా మౌనంగా ఉండలేదు. దాని ప్రతిస్పందన ఏ విధంగా, ఏ రూపంలో ఉంటుందన్నదే అసలు విషయం.