థర్డ్ వరల్డ్ వార్? -అమెరికా, రష్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత


 

సిరియా అంతర్యుద్ధం విషయమై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తత క్రమ క్రమంగా పెరుగుతున్నది. ఇరు దేశాలు తెర వెనుక  పరస్పరం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. అగ్ర దేశాలు రెండు ఏ క్షణంలో ఏ చర్యకు పాల్పడతాయో అన్న ఆందోళనను పరిశీలకులకు కలిగిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికాయే విఫలం చేసిన నేపథ్యంలో చర్చలకు, శాంతికి ఇంకా అవకాశం మిగిలే ఉన్నదని రష్యా ప్రకటిస్తుండగా అమెరికా మాత్రం వరుస ప్రతీకార చర్యలు ప్రకటిస్తున్నది. దానితో రష్యా సైతం మరిన్ని చర్యలు తీసుకుంటున్నది. 

అమెరికా విదేశీ శాఖ ఓ వైపు రష్యాతో చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోగా, అమెరికా రక్షణ శాఖ ఆ ఒప్పందాన్ని విఫలం చేస్తూ సిరియా సైనికులపై వైమానిక దాడులు నిర్వహించి 62 మంది పైగా చంపివేసి 100 మందిని పైగా గాయపరిచింది. దానితో కాల్పుల విరమణ ఒప్పందం పైన అమెరికాలోనే వివిధ పాలక గ్రూపుల మధ్య విభేదాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ విభేదాలు రష్యాను ఏ విధంగా లొంగదీసుకుని, సిరియాలో విజయం సాధించాలన్న అంశం పైనే తప్ప అసలు సిరియాలో కిరాయి తిరుగుబాటుకు ప్రత్యక్ష, పరోక్ష మద్దతు కొనసాగించటమా మానటమా అన్న దానిపై మాత్రం కాదు. 

కాల్పుల విరమణ ఒప్పందం అమెరికాయే విఫలం చేసిన దరిమిలా సిరియా, రష్యాలు అలెప్పో నగరంలోని ఆల్-నుస్రా, దాయిష్ మూకలపై పూర్తి సదాయి యుద్ధానికి తెర తీశాయి. రష్యా వాయుతల దాడులతో బెంబేలెత్తిస్తుండగా, సిరియా-ఇరాన్-పాలస్తీనా-హీజ్బొల్లా బలగాలు భూతల దాడులతో టెర్రరిస్టు బలగాలు వెన్ను విరుస్తున్నాయి. ఫలితంగా అలెప్పో రాష్ట్రం, నగరం క్రమంగా ప్రభుత్వ బలగాల స్వాధీనంలోకి వస్తున్నది. దానితో అలెప్పో యుద్ధంలో చివరికి సిరియా ప్రభుత్వానిదే పై చేయి అవుతొందని అమెరికాకు ఆందోళన పట్టుకుంది. 

ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశీ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ “మాతో సహకరించండి. లేదా మీ సైనికుల శవాలు ఇళ్ళకి వెళ్తాయి. మీ నగరాలలో ఉగ్రవాద దాడులు జరుగుతాయి. మీ జెట్ ఫైటర్లు కూలిపోతాయి” అని మొదటిదారిగా నేరుగా రష్యాకే హెచ్చరిక జారీ చేసాడు. 

ఈ హెచ్చరికను రష్యా ఖాతరు చేయలేదు. వరుసగా విలేఖరుల సమావేశాలు జరిపి అమెరికా ఏ విధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది ప్రపంచానికి చెప్పింది. ఒప్పందాన్ని అమెరికా రహస్యంగా ఉంచగా రష్యా దానిని బహిరంగం చేసింది. అసలు టెర్రరిస్టు ముఖాలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నది అమెరికాయే అని వెల్లడి చేసింది. 

గతంలో ఎన్నడూ రష్యా ఈ విధంగా అమెరికాను ఎండగట్ట లేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర స్ధాయికి చేరుకున్నాయని దీనితో పరిశీలకులకు అనుమానం వచ్చింది. దరిమిలా సిరియా విషయమై అమెరికా, రష్యాలు ప్రత్యక్ష ఘర్షణలకు తలపడవచ్చన్న అనుమానాలు కలుగజేసింది. కనీసం తెర వెనుక అయినా పరస్పర వ్యతిరేక చర్యలు తీవ్రం చేస్తాయని వారు అనుమానించారు. 

వారి అనుమానాలు ధ్రువపరుస్తూ  అమెరికా నుండి ప్రకటన వెలువడింది. సిరియా విషయమై ఇక నుండి రష్యాతో ఎటువంటి చర్చలు జరిపేది లేదని అక్టోబరు 2va తేదీన సదరు ప్రకటనలో అమెరికా తెలియజేసింది. ద్వైపాక్షిక చర్చలను రద్దు చేస్తున్నామని ఒక శాఖ సస్పెండ్ చేస్తున్నామని మరొక శాఖ ప్రకటించాయి. 

దీనికి రష్యగా అంతే దీటుగా ప్రతిస్పందించింది. సిరియాలో మరో కొత్త మిలట్రీ స్ధావరం తెరిచే ఒప్పందాన్ని రష్యా పార్లమెంటు ఆమోదిస్తుందని ప్రకటించింది. ద్వైపాక్షిక చర్చలను సస్పెండ్/రద్దు చేసినందుకు అమెరికాకు ఇది సరైన సమాధానం అవుతుందని చెప్పింది. “సిరియా ఎయిర్ గ్రూప్ ఒప్పందాన్ని ఆమోదించడం ద్వారా రష్యా పార్లమెంటు డ్యూమా, అమెరికా చర్యకు ప్రతిస్పందిస్తుంది. అదే సరైన స్పందన కాగలదు” అని రష్యా అధికారులు చెప్పారని రియా నోవోస్తి పత్రిక ప్రకటించింది. 

 

డమాస్కస్ లో హెమిమీమ్ వైమానిక స్ధావరం నెలకొల్పాలని రష్యా, సిరియాల మధ్య గత సం ఏప్రిల్ 26 తేదీనే ఒప్పందం కుదిరింది. అయితే దీనిని ఆచరణలో పెట్టకుండా రష్యా సంయమనం పాటించింది. తద్వారా అమెరికాతో శాంతి ఒప్పందానికి ప్రోత్సాహం కల్పించాలని భావించింది. కానీ శాంతి ఒప్పందం కుదిరేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అమెరికా ధ్వంసం చేయడంతో వైమానిక స్ధావరం నెలకొల్పడానికి ఇది సరైన సమయం అని రష్యా ఒక అవగాహనకు వచ్చింది. ఆగస్టు 2016 లో ఒప్పందాన్ని డ్యూమాకు సమర్పించామని తాజా పరిణామాల దృష్ట్యా దీనిని ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేస్తామని రష్యా అధికారులు చెప్పారు. 

మరో చర్యగా అమెరికాతో కుదుర్చుకున్న ప్లుటోనియం డిస్పోసల్ అగ్రిమెంట్ నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. ఇది 1980la చివరలో ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం. దీని ప్రకారం ఇరు దేశాలు ప్లుటోనియం అణు వార్ హెడ్ ల నుండి ప్లుటోనియం ఇంధనాన్ని తొలగించాలి. పిమ్మట సదరు ఇంధనాన్ని విద్యుత్ ఉత్పత్తి లాంటి శాంతి ప్రయోజనాలకు వినియోగించాలి. ఇందుకు అవసరమైన నిర్మాణాలను ఇరు దేశాలు సమానాంతరంగా నిర్మించాలి. USSR విఛ్చిన్నం అవ్వబోతున్న కాలంలో జరిగిన ఈ ఒప్పందం మేరకు రష్యా తన వంతుగా నిర్మాణాలు పూర్తి చేసింది. కానీ అమెరికా ఒక్క చర్యా తీసుకోలేదు. 

ఈ నేపథ్యంలోనే తానూ ఒప్పందం నుండి వైదొలగుతున్నానని రష్యా ప్రకటించింది. సిరియా విషయమై అమెరికా ద్వైపాక్షిక చర్చలను రద్దు చేయటానికి దీనికి సంబంధం లేదని చెప్పింది. రష్యా ఏమి చెప్పినప్పటికీ సిరియా ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్న నేపథ్యం నుండే రష్యా చర్యలను పరిశీలకులు చూస్తున్నారు. రష్యా పొరుగునే ఉన్న తూర్పు యూరప్ దేశాలలో అమెరికా సైనిక చర్యలు, ఆయుధాల మోహరింపు తీవ్రం చేస్తున్నందు ప్లుటోనియం ఒప్పందానికి కట్టుబడి ఉండడంలో అర్ధం లేదని తాము భావిస్తున్నట్లు రష్యా చెబుతోంది. ఇది నిజం కూడా. ప్లుటోనియం ఒప్పందం నుండి రష్యా వైదొలగడం పట్ల అమెరికా విచారం ప్రకటించి ఊరుకుంది. అంతే తప్ప అమెరికా తన వైపు నుండి ఏ చర్యా తీసుకోలేదన్న రష్యా ఆరోపణకు మాత్రం బదులు ఇవ్వలేదు.     

మరో పక్క ఐరాస కూడా అమెరికా, ఐరోపా, గల్ఫ్ దేశాల కూటమికి అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నది. అలెప్పోలో పౌరులకు స్ఫారఫారాలు అందించేలా సిరియా సహకరించాలని పదే పదే ప్రకటనలు ఇస్తున్నది. ఐరాస చేస్తున్న ఈ ప్రకటన మోసపూరితం. నిజానికి సిరియా పౌరుల పట్ల సిరియా ప్రభుత్వం గాని, రష్యా గాని మొదటి నుండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నది. ఎటొఛ్చి అమెరికా, టెర్రరిస్టు మూకాలే అలెప్పో ప్రజలను వేధించుకు తింటున్నాయి. ఈ సంగతి తనకు తెలియనట్లే ఐరాస వ్యవహరిస్తున్నది. 

అలెప్పో నగరంలో మెజారిటీ భాగం సిరియా సైన్యం ఆధీనంలో ఉండగా, కొంత భాగం ఆల్-నుస్రా చేతుల్లో ఉన్నది. ఈ భాగాన్ని సిరియా సైనికులు స్వాధీనం చేసుకుంటే అలెప్పో పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. ఇందు కోసం ఆల్-నుస్రా (దీనిని టెర్రరిస్టు సంస్ధగా ఐరాస, అమెరికాలు గుర్తించాయి) ఆధీనంలోని అలెప్పో నగర భాగాన్ని సిరియా సైన్యం చుట్టుముట్టింది. ఈ ముట్టడి వల్ల పౌరులకు సరఫరాలు అందడం లేదని, ఆహార, వైద్య సహాయం అందడం లేదని వారు మానవతా సంక్షోభంలో ఉన్నారని ఐరాస, అమెరికా, ఐరోపాలు ఆరోపిస్తూ  దానికి రష్యా, సిరియాలు బాధ్యుల్ని చేస్తున్నాయి. 

ఈ ఆరోపణలకు బదులిస్తూ సిరియా అనేకమార్లు  హ్యుమానిటేరియన్ కారిడార్ ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ కారిడార్ ద్వారా ముట్టడిలో ఉన్న అలెప్పో భాగం నుండి పౌరుల్ని బైటకు అనుమతించాలని, తాము వారిని క్షేమంగా తరలించి వైద్య, ఆహార సహాయం అందజేస్తామని చెబుతున్నది. ఇందుకోసమే అమెరికా-రష్యాలు అనేకమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. కానీ ప్రతి సారి ఈ ఒప్పందాన్ని అడ్డు పెట్టుకుని అమెరికా, ఐరాసలు ఆల్-నుస్రా బలగాలకు ఆహార, ఆయుధ సరఫరాలు చేశాయి. ఐరాస మానవతా సాయం ముసుగులో ట్రక్కుల్లో ఆయుధాలు పంపించాయి. కొత్తగా బలగాలను పంపించాయి. అదనంగా అధునాతన ఆయుధాలు పంపించాయి. దీనితో పరిస్ధితి మళ్ళీ మొదటికి వస్తున్నది. ఆల్-నుస్రా బలగాలు మళ్ళీ కొత్త శక్తితో పేలుళ్లకు, కాల్పులకు, యుద్ధానికి దిగుతున్నాయి. మానవతా కారిడార్ గుండా పౌరులు ముట్టడి నుండి క్షేమంగా బైటికి రావడానికి మాత్రం ఆల్-నుస్రా బలగాలు నిరాకరిస్తున్నాయి. తమ వద్ద పౌరులు లేనట్లయితే సిరియా బలగాలు పూర్తి స్ధాయిలో దాడి చేసి తమను తుదముట్టిస్తాయని ఆల్-నుస్రా, అమెరికాలు భయపడుతున్నాయి. ఆ కారణంతో అవి పౌరులు ఎవరైనా బయటపడేందుకు ప్రయత్నిస్తే కాల్చిపారేస్తున్నాయి. అనగా అలెప్పో పౌరులను వేధిస్తున్నది, చంపుతున్నది ఆల్-నుస్రా తదితర టెర్రరిస్టు బలగాలు తప్ప సిరియా సైన్యం కాదు. సిరియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అలెప్పో నగరంలో ప్రజలకు సకల సౌకర్యాలు ఉన్నాయి. వైద్య, ఆహార, విద్యా సౌకర్యాలను వారు అనుభవిస్తున్నారు. ఆల్-నుస్రా అధీనం లోని అలెప్పో భాగ ప్రజల్ని కూడా బైటికి అనుమతిస్తే వారిని ఉంచేందుకు అన్ని సౌకర్యాలతో శిబిరాలను సిరియా ప్రభుత్వం సిద్ధం చేసింది. కానీ అలెప్పో యుద్ధంలో విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో సిరియా ప్రజలు ఆల్-నుస్రా ముట్టడిలోనే అమెరికా, ఆల్-నుస్రా లు బలవంతంగా ఉంచుతున్నాయి. వాస్తవం ఇది కాగా అలెప్పో ప్రజలకు సరఫరాలు అందడం లేదని ఐరాస ఆందోళన ప్రకటించడం అమెరికా ప్రయోజనాల కోసమే తప్ప అలెప్పో ప్రజల కోసం కాదు. 

ఆల్-నుస్రా అంటే ఆల్-ఖైదా సంస్ధయే. సిరియాలో అది పాల్పడుతున్న క్రూర చర్యలు ప్రపంచానికి తెలియడం, ఆల్-నుస్రా సంస్ధ పేరును ఐరాస తీవ్రవాదుల జాబితాలో చేర్చడంతో అమెరికా సలహా మేరకు ఇప్పుడు జమాత్ ఆల్-షామ్ గా పేరు మార్చుకున్నది. పేరు మార్చడం ద్వారా దానిని మోడరేట్ (మంచి టెర్రరిస్టు) సంస్ధగా లోకాని చెప్పాలని అమెరికా ప్రయత్నం. ఇతర చిన్నా, చితకా సంస్ధలు అనేకం ఉన్నప్పటికీ అవన్నీ ఆల్-నుస్రా చెప్పు చేతుల్లోనే ఉంటాయి. 

అలాగే దాయిష్ (ఐసిస్) కూడా తాము ఏర్పాటు చేసినదేనని ఆల్-నుస్రా కమాండర్ ఒకరు ఇటీవల ఒక నార్వే వార్తా సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ  చెప్పాడు. అమెరికా తమకు నేరుగానే ఆయుధాలు సరఫరా చేస్తున్నదని, శిక్షణ ఇస్తున్నదని ఆ కమాండర్ చెప్పాడు. శక్తివంతమైన Tow క్షిపణులు కూడా అమెరికా ఇచ్చినవేనని, ఆ క్షిపణుల వల్లనే తాము ఆరంభంలో సిరియా సైన్యం పై పైచేయి సాధించామని ఆయన చెప్పాడు. కనుక సిరియాలో పని చేస్తున్న సంస్ధలు అన్ని ఆల్-ఖైదా సంస్ధలు. ట్విన్ టవర్స్ దాడిలో పాల్గొన్న ఆల్-ఖైదా యే ఇప్పుడు సిరియాలో అమెరికా తరపున, అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం, కిరాయికి తిరుగుబాటులో పాల్గొంటున్నది. 

కాబట్టి సిరియా కిరాయి తిరుగుబాటు అమెరికా, ఐరోపా, పశ్చిమ కార్పొరేట్ మీడియా చెబుతున్నట్లు ప్రజల తిరుగుబాటు కానీ కాదు. తన ఆర్ధిక-రాజకీయ-సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, సిరియాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్ధాప్పించడానికి అమెరికా నిర్వహిస్తున్న యుద్ధమే సిరియా అంతర్యుద్ధం. దానిని అణచివేయడం ఏ పాలకులైన చేయవల్సిన పని. ఆ పనినే సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్, సిరియా ప్రజల మద్దతుతో ఐదేళ్లుగా చేస్తున్నాడు. రష్యా, ఇరాన్, హీజ్బొల్లా, పాలస్తీనాలు అందుకు సహకరిస్తున్నాయి.   

తన ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధంలో ఓటమి ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతుకుతున్నది. ఏమి దొరకనట్లయితే నేరుగా రష్యాతో ఘర్షణకు అది తలపడవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయినట్లే. అమెరికా ఎన్నికలు జరిగే వరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగి హిల్లరీ క్లింటన్ కొత్త అధ్యక్షులుగా పదవి చేపడితే గనుక మూడవ ప్రపంచ యుద్ధం గ్యారంటీ చేసుకోవచ్చునేమో.       

3 thoughts on “థర్డ్ వరల్డ్ వార్? -అమెరికా, రష్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

 1. “కాల్పుల విరమణ ఒప్పందం పైన అమెరికాలోనే వివిధ పాలక గ్రూపుల మధ్య విభేదాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ విభేదాలు రష్యాను ఏ విధంగా లొంగదీసుకుని, సిరియాలో విజయం సాధించాలన్న అంశం పైనే తప్ప అసలు సిరియాలో కిరాయి తిరుగుబాటుకు ప్రత్యక్ష, పరోక్ష మద్దతు కొనసాగించటమా మానటమా అన్న దానిపై మాత్రం కాదు”
  వాళ్ళ ధైర్యం ఏమిటండీ ? ప్రజలూ, పత్రికలూ – ప్రశ్నించరా (మన దేశం లో లాగే వాళ్ళూనా, ఏమీ తేడా లేదా?)
  ఏం జవాబు చెప్పుకుంటారు? ఇక తీవ్రవాదమన్న ‘నెపం’ పెట్టలేకుండా రష్యా రంగంలోకి దిగింది కదా,

 2. ప్రజలూ, పత్రికలూ – ప్రశ్నించరా?

  అమెరికన్ మీడియా అంతా వాల్ స్ట్రీట్ కంట్రోల్ లో ఉంటుంది. ఆల్టర్నేటివ్ మీడియా వాయిస్ వినపడకుండా ఒక అబద్ధాన్ని పది సార్లు కాదు, వంద సార్లు, వేయిసార్లు విసుగు లేకుండా చెబుతాయవి. చదివీ చదివీ అదే నిజం అనుకునే స్ధాయికి జనం వెళ్లిపోతారు. అదొక పి‌ఆర్ కళ. గోబెల్స్ చాలా నయం అనవచ్చు.

  ఇరానియన్ ప్రెస్ టి.వి, రష్యన్ న్యూస్ చానెల్ రష్యా టుడే లాంటివి నిజాలు చెప్పినా ఎవరూ నమ్మరు. రష్యాకు వ్యతిరేకంగా, పుతిన్ కి వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకతను అమెరికన్ పెంచడం వల్ల వాటిని నమ్మరు. ఐరోపాలో అయితే కొన్ని దేశాలు -జర్మనీ తో సహా- ప్రెస్ టి.వి ని బ్యాన్ చేశారు. వాళ్ళ మీడియా స్వేచ్చ అలా తగలడింది.

  మన దేశం లో లాగే వాళ్ళూనా, ఏమీ తేడా లేదా?

  ఏమీ లేదు. కొన్ని సార్లు మనమే నయం. ఇక్కడ బర్త్ కంట్రోల్ ని (ఫ్యామిలీ ప్లానింగ్) అందరూ అంగీకరిస్తారు. అమెరికాలో అబార్షన్ ఒక పెద్ద ఎన్నికల సమస్య. రిపబ్లికన్ పార్టీ అబార్షన్ కి వ్యతిరేకం అని చెబితే ఆశ్చర్యం వేస్తుంది. ఒక రాజకీయ పార్టీ స్త్రీలకు అబార్షన్ హక్కు ఉండకూడదు అని వాదిస్తే మనకి ఆశ్చర్యం కాదా మరి!

  మొన్నీ మధ్య హిందువులు స్వేచ్చగా పిల్లల్ని కనండి అని పిలుపు ఇస్తే ‘తిండి ఎవరు పెడతారు? నువ్వు పెడతావా?’ అని కొందరు బి‌జే‌పి మిత్ర పార్టీల నేతలు కూడా అడిగారు. ఆయన్ని వెనకేసుకు రాలేక బి‌జే‌పి నేతలు నీళ్ళు నమిలారు. అందుకే మనమే నయం అనడం.

  ఇక తీవ్రవాదమన్న ‘నెపం’ పెట్టలేకుండా రష్యా రంగంలోకి దిగింది కదా?

  తీవ్రవాదం అని అమెరికా ఆడుతున్న ఆటనే ఆడుతూ రంగం లోకి దిగింది రష్యా. టెర్రరిస్టుల్ని ప్రవేశపెట్టి, వాళ్లపై యుద్ధం పేరుతో దేశాల్లో చొరపడడం అది చేసే పని. సిరియా ప్రభుత్వ ఆహ్వానంతో అదే తీవ్రవాదాన్ని చూపిస్తూ దాన్ని ఓడించాలని చెప్పి రంగం లోకి దిగింది. అమెరికాకి సిరియా ఆహ్వానం లేదు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేయించి జొరబడదాం అంటేనేమో రష్యా, చైనాలు వీటోతో అడ్డం పడుతూ వచ్చాయి. అందువల్ల సొంతగా దిగలేక ఇసిస్, ఆల్-నుస్రా లకే మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తున్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s