బ్రెగ్జిట్ చర్చలు 2017 మార్చిలో మొదలు -ప్రధాని


theresa-may

బ్రిటిష్ ప్రజల తీర్పు ‘బ్రెగ్జిట్’ ను అమలు చేసే ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం అవుతుందని బ్రిటిష్ ప్రధాని ధెరెసా మే ప్రకటించారు. కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ధెరెసా చేసిన ప్రకటన బ్రెగ్జిట్ విషయమై కాస్త స్పష్టత ఇచ్చిందని యూరోపియన్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ లోని బ్రెగ్జిట్ వ్యతిరేకులు సణుగుడు కొనసాగించారు.

బ్రెగ్జిట్ ఓటింగ్ ముందు వరకు ‘రిమైన్’ (ఈ‌యూ లో కొనసాగాలి) శిబిరంలో ఉన్న ధెరెసా మే బ్రెగ్జిట్ ఫలితం వెలువడిన తర్వాత ఒక్కసారిగా ఇరు పక్షాలకు ఆమోదనీయ అభ్యర్ధిగా పైకి తేలారు. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండీ బ్రెగ్జిట్ తీర్పుని గౌరవించి తీరాల్సిందేనని స్పష్టం చేస్తూ వచ్చిన ప్రధాని, బ్రెగ్జిట్ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించేది చెప్పకుండా నాన్చారు. దానితో ఆమె ఉద్దేశాలపై బ్రెగ్జిట్ అనుకూలురు అనుమానాలు సైతం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ‌యూ నేతలు కూడా బ్రెగ్జిట్ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి పెంచారు. మొదట అనధికారికంగా (ఇన్ఫార్మల్ గా) చర్చించుకుందాం అని బ్రిటిష్ నేతలు ప్రాతిపాదించగా ఈ‌యూ నేతలు కొట్టిపారేశారు. నేరుగా అధికారిక చర్చలకే వెళ్దాం అని తొందర పెట్టారు. అయినప్పటికీ తెర వెనుక మాత్రం ఇరువురూ అనధికారిక చర్చలు కొనసాగించినట్లు వివిధ వార్తలు తెలిపాయి.

ఈ నేపధ్యంలో తమ పార్టీ కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ లో ఆమె స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. మార్చి 2017 నెలలో ఆర్టికల్ 50 కింద యూ‌కే ప్రభుత్వం ఈ‌యూకి నోటీసు ఇస్తుందని ఆమె ప్రకటించారు. ఈ‌యూ ఏర్పాటుకు దారి తీసిన మాడ్రిడ్ ఒప్పందం ప్రకారం ఈ‌యూ నుండి నిష్క్రమించాలని సభ్య దేశాలు భావిస్తే ఆర్టికల్ 50 కింద నోటీసు ఇవ్వాలి.

సదరు నోటీసుతో ఎగ్జిట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నోటీసుని పురస్కరించుకుని సభ్య దేశానికి, కూటమికి మధ్య చర్చలు ప్రారంభం అవుతాయి. వివిధ రాజకీయ, ఆర్ధిక, సంస్ధాగత ఏర్పాట్లకు సంబంధించి ఇరు పక్షాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేది ఈ చర్చలలో నిర్ణయిస్తారు. చర్చలు పూర్తి కావటానికి కనీసం 2 సం.లు పడుతుందని భావిస్తున్నారు. అంతకు మించి సమయం కూడా పట్టవచ్చు. అనగా ఈ‌యూ నుండి బ్రిటన్/యూ‌కే బైటపడే ప్రక్రియ 2019 మార్చి నాటికి గానీ లేదా ఆ తర్వాత గానీ పూర్తవుతుంది.

ఈ‌యూ నుండి బైటపడ్డాక బ్రిటన్ ఎప్పటి లాగా సర్వ స్వతంత్ర దేశంగా అవతరిస్తుందనీ, బ్రిటన్ పోగొట్టుకున్న సార్వభౌమాధికారం తిరిగి చేతికి వస్తుందనీ ప్రధాని ధెరెసా మే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ‌యూలో కొనసాగడం వల్ల సభ్య దేశాలు స్వతంత్రాన్ని కోల్పోయారని ఆమె తన ప్రకటన ద్వారా అంగీకరించారు. ‘రిమైన్’ శిబిరంలో ఉన్న ధెరెసా మే, ప్రధాని పదవి చేపట్టాక ప్రజాభిప్రాయానికి తగినట్లుగా మాట్లాడవలసిన అవసరం ఆమెను తరుముతున్నట్లు కనిపిస్తోంది.

టోరీ కాన్ఫరెన్స్ లో ఆమె చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి:

“ఇక స్వతంత్ర, సార్వభౌమ దేశంగా యూ‌కే ఈ‌యూతో ఒప్పందాలు చేసుకుంటుంది. ఓటర్లు దృఢమైన స్పష్టతతో తమ తీర్పు ఇచ్చారు. మంత్రులు ఇక ఆ పనిలో నిమగ్నం కావలసిందే. రిఫరెండం ఫలితాన్ని ఆమోదించలేని వాళ్ళు కూడా ప్రజల తీర్పుని శిరసావహించక తప్పదు.

“ప్రజల తీర్పుని ప్రశ్నించడం గానీ, సందిగ్ధ మనస్కులై వెనకడుగు వేయడం గానీ కుదరదు. మనకు అప్పజెప్పిన పనిని నిర్వర్తించడమే తప్ప మరో మాటకు తావు లేదు.

“మనం ఇక నుండి పూర్తిగా స్వతంత్రులం కానున్నాము. పూర్తి సార్వభౌమాధికార దేశంగా అవతరించనున్నాము. ఇక మనం ఎంత మాత్రం రాజకీయ యూనియన్ లో భాగం కాము. మన మీద జాతీయాతీత (సుప్రా నేషనల్) సంస్ధలు పెత్తనం చేయబోవు. మన జాతీయ పార్లమెంటు, కోర్టుల నిర్ణయాలను తోసిరాజనే వారు ఎవరు ఉండరు.

“దానర్ధం ఏమిటంటే మరోసారి, అనేకానేక అంశాల పైన మన నిర్ణయాలు మనమే చేసుకునే స్వాతంత్రం మనకు లభిస్తుంది. మన ఆహారం పైన లేబుళ్లు ఎలా వేసుకోవాలన్న అంశం దగ్గరి నుండి దేశం లోకి వచ్చే వలసలను ఎలా నియంత్రించాలన్న అంశం వరకూ… మనమే నిర్ణయించుకోవచ్చు.

“ఈ‌యూ ని వదిలి పెట్టాలని జూన్ లో బ్రిటిష్ ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారు. యూ‌కే లోకి వచ్చే (వలస) ప్రజలపై నియంత్రణ విధించాలని వారు తమ సందేశంలో స్పష్టం చేశారు”

యూరోపియన్ కమిషన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ పార్లమెంట్ తదితర ఈ‌యూ సంస్ధలు సభ్య దేశాలపై ఎలా పెత్తనం చేస్తున్నదీ, జాతీయ ప్రభుత్వాలను, వివిధ జాతీయ సంస్ధలను ఉప సంస్ధలుగా ఏ విధంగా మార్చివేసింది ధెరెసా మాటలు స్పష్టం చేస్తున్నాయి. బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం జాతి రాజ్యాల ప్రభుత్వాల నిర్ణయాలను సైతం పక్కన పెట్టేసే సుప్రా నేషనల్ ప్రభుత్వంగా ఈ‌యూ ఎలా మారింది ఆమె మాటలు చెబుతున్నాయి.

ఈ‌యూ నుండి మరిన్ని దేశాలు బైటకు వచ్చేందుకు ధెరెసా ప్రసంగం స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s