సిరియా: సహకరించు, లేదా ఇంటికి శవాలు వెళ్తాయి!


 

అమెరికా దృష్టిలో తనకి సహకరించడం అంటే తాను చెప్పిన మాటల్ని / ఇచ్చిన ఆదేశాల్ని పొల్లు పోకుండా అంగీకరించి అమలు చేయడం. 

సిరియా అంతర్యుద్ధంలో తనకు సహకరించాలని లేదంటే రష్యన్ సైనికుల శవాలు బాడీ బ్యాగ్స్ లో ఇంటికి పంపించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఇది నేరుగా రష్యాతో కయ్యానికి కాలు దువ్వడమే. 

“ఇది (అమెరికా సమర్థిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై రష్యా, సిరియాలు వాయు, భూతల దాడులు చేయడం) ఇలాగే కొనసాగితే…, సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. సిరియాలో అందుబాటులో ఉన్న ఖాళీలోకి విస్తరించడానికి తీవ్రవాదులు, తీవ్రవాద గ్రూపులు,  తమ ఆపరేషన్లు కొనసాగిస్తాయి. అవి రష్యా ప్రయోజనాల పైన కూడా దాడి చేస్తాయనడంలో ఎలాంటి అనుమానము అవసరం లేదు. బహుశా రష్యా నగరాలలో కూడా దాడులు జరగొచ్చుఁ. రష్యా సైన్యం ఇక శవాల్ని ఇంటికి పంపించవలసి వస్తుంది. వాళ్ళు ఇక తమ వనరులను కోల్పోవడం కొనసాగుతుంది. బహుశా విమానాల్ని కూడా కోల్పోతారు” అని పెంటగాన్ (అమెరికా మిలట్రీ) మాజీ ప్రెస్ సెక్రటరీ, ప్రస్తుతం విదేశీ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ హెచ్చరించాడు.  

సిరియా యుద్ధం మొదలయ్యాక ఇంత తీవ్ర స్ధాయిలో నేరుగా రష్యాని ఉద్దేశిస్తూ  అమెరికా హెచ్చరిక జాతి చేయడం ఇదే మొదటి సారి. గతంలో రసాయన ఆయుధాల వినియోగం విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ‘ఎర్ర గీత దాటారో’ అంటూ హెచ్చరించాడు. అయితే అది సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను ఉద్దేశించి చేసిన హెచ్చరిక. 

సిరియా సైన్యాలు తిరుగుబాటుదారుల పైన రసాయన ఆయుధాలు ప్రయోగిస్తే ‘ఎర్ర గీత’ దాటినట్లే అని, అప్పుడు అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోదని, సిరియాపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతుందని హెచ్చరించాడు. ఆనాడు పుతిన్ వ్యూహాత్మకంగా అమెరికా ఎత్తుకు పై ఎత్తు వేసాడు. రసాయన ఆయుధాల వంక చూసుకుని అమెరికా సిరియాపై దాడి చేయొచ్చని గ్రహించి తానే చొరవ తీసుకుని రసాయన ఆయుధాలు నాశనం చేసేందుకు సిరియా ప్రభుత్వాన్ని ఒప్పించాడు. అందుకు సిరియా వెంటనే అంగీకరించి ఐరాస పర్యవేక్షణలో రసాయన ఆయుధాలను ధ్వంసం చేసాడు. ఆనక సిరియా వద్ద రసాయన ఆయుధాలు ఇక లేనట్లే అని ఐరాస సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ విధంగా సిరియాపై దాడి చేసేందుకు అమెరికాకి కారణం లేకుండా చేసాడు పుతిన్!

ఇక్కడ ప్రస్తావించుకోవలసిన మరో నిజం ఏమిటంటే గతంలో సిరియాలో ప్రయోగించబడిన రసాయన ఆయుధాల దాడులన్నీ టెర్రరిస్టు గ్రూపు ఆల్-నుస్రా (ఇప్పుడు, అమెరికా సలహా మేరకు  ఆల్-ఫతే షామ్ గా పేరు మార్చుకుంది), ఇతర టెర్రరిస్టు గ్రూపులు ప్రయోగించినవే. విచ్చలవిడిగా పౌరుల పైన దాడి చేసి మూకుమ్మడిగా చంపడం, ఊచకోత కోయడం, ఆ తర్వాత ఫోటోలు తీసి ప్రచురించి నేరాన్ని సిరియా ప్రభుత్వం పైనే మోపి ‘సిరియా ప్రభుత్వం పైన దాడి చేయాలిసిందే అంటూ ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ లో తీర్మానం ప్రతిపాంచడం… ఒకటే పనిగా చేశాయి. ఆ ప్రయత్నాలన్నింటిని రష్యా, చైనాలు స్ధిరంగా అడ్డుకున్నాయి. ఆ రెండు దేశాలను లైన్ లో తెచ్చుకోవడానికి అమెరికా, ఐరోపాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పలు ప్రలోభాలు ఎర చూపాయి. వాటికి ఒప్పుకుంటే నష్టపోయేది చైనా, రష్యా లే. అమెరికాని నమ్మితే తమ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆ దేశాలకు తెలుసు. అందుకే అవి అమెరికా బుట్టలో పడలేదు.  

ఇటీవల అమెరికా, రష్యాలు కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం -అమెరికా మిలట్రీ సిరియా సైనికులపై దాడి చేసి 62 మందిని చంపి 100 కు పైగా గాయపరిచిన దరిమిలా- విఫలం అయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన అధీనం లోని తిరుగుబాటు గ్రూపుల చేత పాటించేలా చేయడంలో కూడా అమెరికా విఫలం అయింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి 300 కు పైగా కాల్పుల ఘటనలకు తిరుగుబాటు గ్రూఫులు ఒడి గట్టాయి. 

 

నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం లక్ష్యం, అమెరికా ఎత్తుగడలో -నిజంగానే కాల్పుల విరమణ పాటించడం కాదు. రష్యా వాయు తల దాడులకు సిరియా భూతల దాడులకు కకావికలం అవుతున్న తిరుగుబాటు, ఉగ్రవాద గ్రూపులు తిరిగి జవసత్వాలు కూడదీసుకుని, రీగ్రూప్ అయ్యి తిరిగి ఆ విరామంలో ఐరాస మానవతా సాయం మాటున ఆయుధ, ఆహార సరఫరాలు తెప్పించుకోవడం అసలు లక్ష్యం.    

ఈ సంగతి రష్యా, సిరియా, ఇరాన్, హీజ్బొల్లా లకు తెలుసు. అందుకే అమెరికా దాడి దరిమిలా కాల్పుల విరమణ ఒప్పందం ఇక లేదని ప్రకటించి అలెప్పో నగరంలో ఉగ్రవాద గ్రూపులపై దాడులు తీవ్రం చేశాయి. ఉగ్రవాద గ్రూపులను మహోగ్ర దాడులతో చెల్లా చెదురు చేయటం మొదలు పెట్టాయి. ప్రస్తుతం అమెరికాకు కోపం అదే. సిరియా-ఇరాన్-హీజ్బొల్లా లు రష్యా మద్దతుతో చేస్తున్న దాడులతో అలెప్పో నగరం ఆల్-నుస్రా చేజారి పోతున్నదని దానికి ఆందోళన పట్టుకున్నది. అలెప్పో లో టెర్రరిస్టులు ఓటమి ఎదుర్కొంటే ఇక సిరియాలో అమెరికా ప్రేరేపిత అంతర్యుద్ధం దాదాపు ఓటమికి గురయినట్లే. 

తాను ఎన్ని ఎత్తులు వేసినా రష్యా ముందు అవన్నీ విఫలం కావటం అమెరికాకు నిస్సహాయ పరిస్ధితికి నెట్టి వేస్తున్నది. అది ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోతున్నది. ఆ ఫస్ట్రేషనే అమెరికా హెచ్చరికలో వ్యక్తం కావటం గమనించవచ్చు.  

“ఇది ఇలాగే కొనసాగితే సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతుంది… తీవ్రవాదులు, తీవ్రవాద గ్రూపులు తమ ఆపరేషన్లు కొనసాగిస్తాయి” అని టెర్రరిస్టుల తరపున అమెరికా బెదిరిస్తోంది. అంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరిస్తున్నది. టెర్రరిస్టులు తన వాళ్ళే అని అమెరికా పరోక్షంగా ఇందులో చెప్పడం గమనించవచ్చు. 

“అవి రష్యా ప్రయోజనాల పైన కూడా దాడి చేస్తాయనడంలో ఎలాంటి అనుమానము అవసరం లేదు. బహుశా రష్యా నగరాలలో కూడా దాడులు జరగొచ్చు” అనడం అంటే సిరియాలో సిరియా సైన్యాలకు మద్దతుగా రష్యా నెలకొల్పిన వాయు, జల స్ధావరాలపైన తాము/తమ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడి చేస్తాయని, రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికైనా అమెరికా సిద్ధమేనని కిర్బీ హెచ్చరిస్తున్నాడు. అంతే కాదు. రష్యా నగరాలపైనా దాడి చేస్తారట! ప్యారిస్, బ్రస్సెల్స్ లలో ఉగ్రవాద దాడులు జరిగినట్లే రష్యా నగరాలలో కూడా ఐసిస్ ఉగ్రవాదులను పంపి దాడులు చేయిస్తామని చెబుతున్నారు. 

“రష్యా సైన్యం ఇక శవాల్ని ఇంటికి పంపించవలసి వస్తుంది” అంటే సిరియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు సిరియాలో సిరియా సైనికులకు శిక్షణ, సలహాలు ఇస్తున్న రష్యన్ సైనికుల పైన కూడా టెర్రరిస్టులు దాడి చంపేస్తారని, లేదా తామే దాడి చేసి చంపేస్తామని అమెరికా హెచ్చరిస్తున్నది. సిరియాలో చచ్చిన రష్యన్ సైనికుల శవాలను ఇంటికి పంపిస్తారని నేరుగా బెదిరిస్తున్నది. 

“వాళ్ళు ఇక తమ వనరులను కోల్పోవడం కొనసాగుతుంది. బహుశా విమానాల్ని కూడా కోల్పోతారు.” వనరులు అంటే సిరియాలో రష్యా నెలకొల్పిన సైనిక వనరులు అని అర్ధం. సిరియా తీరంలో -మధ్యధరా సముద్రం- రష్యాకు సైనిక స్ధావరం ఉన్నది. రష్యన్ జెట్ విమానాలు కొన్ని ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లి టెర్రరిస్టులపై వైమానిక దాడులు చేస్తున్నాయి. సిరియాలో కూడా కొన్ని తాత్కాలిక వైమానిక స్ధావరాలను రష్యా నిర్వహిస్తున్నది. వాటన్నంటి పైనా దాడులు చేస్తామని అమెరికా ప్రతినిధి హెచ్చరిస్తున్నాడు. 

అలాగే టెర్రరిస్టు గ్రూపులపై వైమానిక దాడులు చేస్తున్న రష్యన్ జెట్ లను కూల్చివేయటానికి అమెరికా తాజాగా శక్తివంతమైన ఆయుధాలను సరఫరా చేయడానికి సిద్ధం అవుతోంది. MANPAD అని పిలిచే ఆయుధాలను టెర్రరిస్టులకు అందజేస్తామని అమెరికా మిలట్రీ ప్రతినిధి ఒకరిని ఉటంకిస్తూ రెండు రోజుల క్రితం రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. వీటిని సైనికుడు తన భుజం పైన పెట్టుకుని గాలిలోకి ప్రయోగించవచ్చుఁ. జెట్ విమానాలను కూల్చివేయగల శక్తి ఈ ఆయుధాలకు ఉంటుంది. ఇవి సిరియాకు బైట -జోర్డాన్ లో- సిద్ధంగా ఉన్నాయని ఇక టెర్రరిస్టులకు సరఫరా చేయడమే తరువాయి అని మిలట్రీ ప్రతినిధి చెప్పినట్లు  రాయిటర్స్ తెలిపింది. దీనినే కిర్బీ సూచిస్తున్నాడు. MANPAD లతో టెర్రరిస్టులు రష్యన్ ఫైటర్ జెట్ లను కూల్చివేయబోతున్నారు, సిద్ధంగా ఉండండి” అని కిర్బీ హెచ్చరిక ద్వారా సూచిస్తున్నాడు. 

 

అయితే వెనకడుగు వేసేందుకు రష్యా సిద్ధంగా లేదు. ఇంత దూరం వచ్చింది వెనక్కి తగ్గడానికి కాదు. అమెరికా ఎత్తుగడలతోనే అమెరికా ఎత్తులను చిత్తూ చేస్తూ  వచ్చిన పుతిన్/రష్యా ప్రత్యక్ష యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు  వార్తలు చెబుతున్నాయి. 

కనుక మూడో ప్రపంచ యుద్ధం ఏంతో దూరంలో లేకపోవచ్చు. “అసలు మూడవ ప్రపంచ యుద్ధం -సిరియాలో- ఇప్పటికే మొదలయింది” అని కూడా పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.” కిర్బీ మాటలను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తున్నది.  

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s