మహమ్మద్ షహాబుద్దీన్ బీహార్ లో పేరు మోసిన రౌడీ. కానీ ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కి సన్నిహితుడు. బీహార్ ప్రభుత్వం కూడా లాలూ దయతోనే నడుస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమారే అయినా, ఎంఎల్‌ఏ లు ఎక్కువ మంది లాలూ పార్టీ వాళ్ళే. దాంతో హై కోర్టులో షాబుద్దీన్ బెయిల్ కి వ్యతిరేకంగా వాదించే పనికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోలేదు. 17 నెలల పాటు చార్జి షీటు మోపలేదు. పాట్నా హై కోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వక తప్పలేదు.
చంద్ర శేఖర్ కుమార్ కుమారులు ఇద్దరినీ చంపిన కేసులో షాబుద్దీన్ నిందితుడు. తన ఇద్దరు తమ్ముళ్ళ హత్యని రోషన్ కళ్ళారా చూశాడు. అనగా ప్రత్యక్ష సాక్షి. కోర్టులో సాక్షం ఇవ్వడానికి ముందు రోజు రోషన్ ని కూడా చంపేశారు. కనుక ముగ్గురు సోదరుల హత్య కేసులో షాబుద్దీన్ నిందితుడు. బెయిల్ కి వ్యతిరేకంగా హతుల తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, షాబుద్దీన్ బెయిల్ రద్దు చేసి త్వరగా విచారించాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు.
ఆ విధంగా లాలూ ప్రసాద్ మోపిన భారాన్ని సుప్రీం కోర్టు నితీష్ కుమార్ భుజాల మీది నుండి తప్పించింది.
ప్రధాన మంత్రి పీఠంపై కన్నేసిన నితీష్ కుమార్, బీహార్ లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాడు. ఆ మధ్య మద్యపాన నిషేధ చట్టానికి సవరణలు తెచ్చి మరింత కఠినం చేశాడు. ఎక్కడా లేని విధంగా ఒక ఇంట్లో మద్యం సీసా దొరికితే ఆ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేట్లుగా సవరణ చేశాడు, అది కూడా 10 సం.ల పాటు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మద్య నిషేధ చట్టాన్ని అమలు చేస్తానని శపధం చేశాడాయన. తనలాగే ఇతర రాష్ట్రాలూ మద్య నిషేధం అమలు చేయాలని, కఠిన చట్టం చేయాలని బోధిస్తున్నాడు కూడా.
మద్యాన్ని నిషేధించాల్సిందే. కానీ అదే చేత్తో మద్యం తయారీకి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నట్లు? బీహార్ లో తయారు చెయ్యొచ్చట, కానీ బీహార్ లో అమ్మకూడదట! తయారు చేసి కోట్లు ఆర్జించడానికి పర్మిట్ ఇచ్చి 100 రూ (లేదా, ఎంతైతే అంత) పెట్టి బాటిల్ కొన్నోడికి 10 సం.లు జైలు శిక్ష ఏమిటి, విపరీతం కాకపోతే.
కాకుల్ని కొట్టి గద్దలకి వెయ్యడం అంటే ఇదే. మద్యం నిషేధం అమలు చేసిన పేరు కావాలి. కానీ కోటీశ్వరులైన వ్యాపారులకు నష్టాలు రాకూడదు. పైగా సామాన్య జనానికి నష్టం చేస్తూ, భయాందోళనలకు గురి చేస్తూ విపరీత చట్టాలు చేసి చిన్న చిన్న వాళ్ళని జైల్లో తోసే ఏర్పాటు చేయడం!
ఈ చట్టాన్ని పాట్నా హై కోర్టు రద్దు చేసింది. నితీష్ తెచ్చిన సవరణలు చెల్లవు పొమ్మంది. ఆ విధంగా మద్యం సీసాతో ఎక్కడికో ఎదుగుదాం అనుకున్న నితీష్ కుమార్ పైన పాట్నా హై కోర్టు మద్య నిషేధ చట్టం రద్దు భారాన్ని మోపింది.
నిజమా…. మద్యం తయారుచేసుకోవడానికి అనుమతి ఇచ్చారా అక్కడ…. ఇంక ఆ చట్టం వల్ల గొప్ప లాభం ఏముంటుంది…
ఇవాళ కోర్టు కోర్టు తీర్పును గురించి చదివి.. ఇంత మంచి పథకానికి కోర్టు ఇలా ఎందుకు తీర్పు ఇచ్చింది అని అలోచిస్తున్నాను.
నాగశ్రీనివాస
నా దృష్టిలో మద్యం తాగడం తప్పు కాదు కానీ దాని వల్ల ఆరోగ్యం పాడవ్వకుండా చూసుకోవాలి. ఓసారి నేను ఖాళీ కడుపుతో వోద్కా తాగడం వల్ల కళ్ళు తిరిగి దారిలో పడిపోయాను. మద్యం తాగేవాడు వంద రూపాయలు ఖర్చుబెట్టి వోద్కా కొంటాడా, వెయ్యి రూపాయలు ఖర్చుబెట్టి తకీలా (tequila) కొంటాడా అనేది ఇక్కడ అసందర్భం కానీ కేవలం మద్యం తాగినందుకు పదేళ్ళు జైలులో పెట్టడం హాస్యాస్పదమే.