నిప్పుతో చెలగాటం వద్దు! -జపాన్ తో చైనా


 

దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో చేరి వెర్రి మొర్రి వేషాలు వేయొద్దని చైనా, జపాన్ ను మరోసారి హెచ్చరించింది. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరుతో అమెరికా నిర్వహిస్తున్న మిలట్రీ పెట్రోలింగ్ లకు దూరంగా ఉండాలని కోరింది. ఉమ్మడి విన్యాసాలని చెబుతూ వివాదాస్పద అమెరికా మిలట్రీ విన్యాసాల్లో పాల్గొనటం ద్వారా ప్రాంతీయంగా అస్ధిరతకు ప్రాణం పోయవద్దని కోరింది. 

దక్షిణ చైనా సముద్రంలో జపాన్ కు ఎలాంటి పని లేదని, అది బైటి దేశమేనని, బైటి దేశాలు చైనా సార్వభౌమ ప్రాంతంలోకి వస్తే చొరబాటుగా పరిగణిస్తామని చైనా ప్రకటించింది. 

అమెరికాతో కలిసి నిర్వహించే ఉమ్మడి మిలట్రీ విన్యాసాలతో తమ బలగాల సంఖ్యను పెంచుతామని జపాన్ ఈ నెల (సెప్టెంబర్) లో ప్రకటించింది. దీనితో చైనా ఆగ్రహోదగ్రం అయింది. జపాన్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని ఘాటుగా విమర్శించింది. 

“చైనా అధీనం లోని సముద్ర జలాలలో జపాన్ ఉమ్మడి పెట్రోల్, ఉమ్మడి మిలట్రీ విన్యాసాలు నిర్వహించాలనుకుంటే అది కేవలం నిప్పుతో చెలగాటం ఆడటమే అవుతుంది. చైనా మిలట్రీ దానిని చూస్తూ ఊరుకోదు” అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి యాంగ్ యుజున్ విలేఖరుల సమావేశంలో హెచ్చరించాడు. నెల వారీగా జరిపే విలేఖరుల సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక జారీ చేసాడు. 

చైనా జలాలలో విన్యాసాలు చేయడం ద్వారా చైనా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నాడని యుజున్ ఆరోపించాడు. వివాదాస్పద చైనా దీవుల వ్యవహారంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పనికి పూనుకుంటున్నదని చెబుతూ తనకు మాలిన పనికి దూరంగా ఉండాలని కోరాడు. 

“జపాన్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి బైటి దేశం మాత్రమే. అయినప్పటికీ ఈ ప్రాంతంలోని వివాదాస్పద జలాల వ్యవహారంలో తలదూర్చేందుకు ఎప్పుడూ ఉత్సాహంతో వ్యవహరిస్తున్నది. కల్లోల జలాల నుండి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నది” అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి విమర్శించాడు. 

దక్షిణ చైనా సముద్రంలో మెజారిటీ భాగం తనదేనని చైనా వాదిస్తుండగా ఈ ప్రాంతం లోని ఇతర దేశాలు -ఫిలిప్పైన్స్, థాయిలాండ్, బ్రునే, ఇండోనేషియా, లావోస్- కూడా దచైస లో కొంత కొంత మేర తమకు చెందుతుందని వాదిస్తున్నాయి. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చైనా గతం నుండి చెబుతోంది. మిగిలిన దేశాలు కూడా దచైస గురించి ఇంతగా ఆందోళన చెందిన సందర్భాలు తక్కువ. 

 

కానీ ప్రపంచంలో ఎక్కడ వనరులు ఉంటె అక్కడ సామ్రాజ్యవాద దేశాలు గద్దల్లా వాలిపోతాయి. ఎదో రూపంలో వివాదం రెచ్చగొట్టి సమస్య సామరస్యంగా పరిష్కారం కాకుండా అడ్డుకుంటాయి. ఆనక వివాదం లోకి చొరబడి సమస్యను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాయి. తద్వారా స్ధానిక వనరుల పైన వ్యాపారం చేసే అవకాశాలను తమ కంపెనీలకు కట్టబెడతాయి. 

దచైస కూడా వనరులకు నిలయం. చమురు, సహజ వాయువు, చేపలు మొ.న నిల్వలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం ఇది. అదీ కాక ప్రపంచ వాణిజ్యంలో గణనీయ మొత్తం ఈ సముద్రం గుండా ప్రయాణిస్తుంది. ఒక అంచనా ప్రకారం కనీసం ఏడాదికి 5 ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం ఈ రూట్ లో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అదుపులో ఉంచుకుంటే అటు వనరులపై ఆధిపత్యం వస్తుంది, ఇటు వాణిజ్యం పైన నియంత్రణా చేజిక్కుతుంది. ఇలాంటి వినాశకర ఎత్తుగడను అమలు చేయడం ఐరోపా దేశాలు, అమెరికా అనాదిగా ఆచరిస్తున్న దుర్నీతి. 

కానీ చైనా ఇప్పటి వరకు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ఉన్నది. పైగా దక్షిణ చైనా సముద్ర తీరంలో మెజారిటీ చైనా భూభాగమే. ఈ ప్రాంతాన్ని అమెరికా ఆధిపత్యానికి అప్పజెపితే వనరులు తర్వాత సంగతి, తన సొంత ప్రయోజనాలకే చేటు వస్తుంది. కనుక దేశ ప్రయోజనాలు ముఖ్యం అనుకునే ఏ దేశ పాలికులైనా తమ ప్రయోజనాల పరిరక్షణకు నడుం బిగిస్తారు. వేల మైళ్ళ దూరం నుండి వఛ్చి ఘర్షణలు రేపుతున్న అమెరికా దుర్నీతిని ఎదుర్కొంటారు. అలాంటి దేశాలకు మద్దతు ఇచ్చే స్ధానిక దేశాలను నిరసిస్తాయి. 

చైనా చేస్తున్నది అదే. సముద్రంలో వందలుగా నెలకొన్న చిన్న చిన్న ద్వీపాలను కృత్రిమంగా విస్తరిస్తున్నది. విస్తరించిన చోట నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నది. కొన్ని చోట్ల మిలట్రీ స్ధావరాలు నెలకొల్పుతున్నది. వివాదాల పరిష్కారానికి ప్రాంతీయ దేశాలను ఆహ్వానిస్తూనే రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఇతర ప్రాంతీయ దేశాలు అమెరికాకు లొంగి చైనాతో తగవు పడే బదులు సామరస్యంగా చర్చించుకుని సమస్యను సానుకూలంగా, అందరూ లాభపడేలా పరిష్కారం చేసుకోవడం తగిన చర్య అవుతుంది. అలా కాక అమెరికా మంత్రాంగాలకు లొంగినట్లయితే అన్ని పక్షాలు నష్టపోతాయి.

2 thoughts on “నిప్పుతో చెలగాటం వద్దు! -జపాన్ తో చైనా

  1. విశేఖర్ గారు… చాలా రోజులనుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని అనుకుంటున్నా… మీరు రాసే కొన్ని వ్యాసాలలో చైనా కు మద్దతు కనిపిస్తూ ఉంటుంది. కాని ముఖ్యమైన సందర్భాలలో చైనా ఎప్పుడూ భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు…. “మసూద్‌ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్‌ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది”… మసూద్‌ ఉగ్రవాది, భారత్ లో ఉగ్రవాదకార్యకలాపాలకు అతనే కారణం అని మనం చెప్పినా చైనా పట్టించుకోనట్లు ప్రవర్తిస్తోంది. దీనికి కారణం ఎమై ఉంటుంది….

    “http://www.sakshi.com/news/top-news/china-blocks-india-again-on-jaish-terror-chief-masood-azhar-406387?pfrom=home-top-story”

  2. ఆ వార్త ఇతర పత్రికలో చదివాను, కనుక మీ లింక్ నేను చూడటం లేదు.

    మీకు కనిపిస్తున్న ‘చైనాకు మద్దతు’ అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకత మాత్రమే. చైనా కూడా సామ్రాజ్యవాద దేశమే. కానీ ఇప్పటి వరకు ఆ దేశం ఏ ఇతర దేశాన్ని బలవంతం చేసిన లేదా బెదిరించిన దాఖలా లేదు. అమెరికా, జపాన్ లకు అది చేసే హెచ్చరికలు డిఫెన్స్, అఫెన్స్ కాదు. ప్రపంచం బహుళ ధృవం వైపుగా ఎంత త్వరగా కదిలితే అమెరికా అంత త్వరగా బలహీనపడుతుంది. అమెరికా బలహీనపడితే మూడో ప్రపంచ దేశాల్లో ప్రజా ఉద్యమాలు పెరిగేందుకు మెరుగైన అవకాశం చిక్కుతుంది.

    అలాగే ఒక దేశం, నిజంగా స్వతంత్రంగా ఉన్నట్లయితే ఏమి చేస్తుందో, అమెరికా అదిరింపులకు ఎలా స్పందిసుందో తెలుసుకునేందుకు చైనా ఉదాహరణ. అదే విధంగా మన పాలకులు స్పందించలేకపోతున్నారు. ఎంతసేపటికీ అమెరికాను, ఐరోపాను దేబిరించడమే వారి పని. అమెరికా కుదేలైతే రేపు చైనాను దేబిరిస్తారు. ఆ తేడా చూపడం నా విశ్లేషణల్లో ఒక లక్ష్యం.

    ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దాం, పోరాడుదాం. కానీ దానికి జన్మ ఇచ్చి పెంచి పోషిస్తున్నది ఎవరు? లాడెన్ దగ్గరి నుండి ఇసిస్ వరకు అమెరికాయే కదా పోషకురాలు. తాలిబాన్ కి ఎదుగుదలకు కారణం అమెరికాయే. JeM, LeT లు ఐ‌ఎస్‌ఐ, సి‌ఐ‌ఏ పోషణతో, డైరెక్షన్ తో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ప్రతి యేడూ పాక్ మిలట్రీకి సహాయం చేసేది అమెరికాయే. సి‌ఐ‌ఏ అప్పజెప్పిన పనుల్ని ఐ‌ఎస్‌ఐ చేసి పెడుతుంది. ఇక ఐ‌ఎస్‌ఐ పోషించే ఉగ్రవాద సంస్ధలకు వ్యతిరేకంగా ఇండియా పోరాటం – దానికి అమెరికా మద్దతూనా? ఇందులో ఏమన్నా లాజిక్ కనిపిస్తున్నదా?

    సర్జికల్ స్ట్రైక్స్ అని మనవాళ్లు అంటుంటే ‘క్రాస్ బోర్డర్ ఫైరింగ్’ అని పాక్ అంటున్నది. ఓ వైపు PoK కూడా మనదే కనుక సర్జికల్ స్ట్రైక్స్ కోసం మనం LoC దాటామన్న ప్రసక్తే తలెత్తదు అని మంత్రి రాధోడ్ అంటాడు. అదే నోటితో మన సైనికుడు ఒకరు అనుకోకుండా సరిహద్దు (LoC) దాటాడు అని ప్రకటిస్తారు. ఏది నమ్మాలీ?

    సరిహద్దు గ్రామాల ప్రజల్ని తరలిస్తున్నాం, అంటున్నారు గానీ వారిలో చాలా మంది నిరాకరించారు. “అసలు మీ గొడవ ఏంటీ మధ్యన? మీ ఇద్దరు కొట్టుకుంటూ మా జీవితాల్ని ధ్వంసం చేస్తున్నారు” అని ఆగ్రహిస్తున్నారు. ఇండియా టుడే చానెల్ వారి ఇంటర్వ్యూలని ప్రసారం చేసింది. సరిహద్దు ఉద్రిక్తంగా ఉన్నది అని కేంద్ర మంత్రులు, పత్రికలు చెబుతుంటే ‘ఇక్కడ అలాంటిదేమీ లేదు. మా పనులు మేము చేసుకుంటున్నాం” అని కొన్ని గ్రామాల్లో చెప్పారు. ‘మీరు యుద్ధం చేసుకుంటే మాత్రం మాకు నష్టం’ అని తెగేసి చెబుతున్నారు. అక్కడి ప్రజలకు లేని ఉద్రిక్తత దేశం అంతా కనిపించేలా చేస్తున్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి?

    JeM, LeT లాంటి సంస్ధలకి మూలం కాశ్మీర్ సమస్య. ఆ సమస్య పరిష్కారం చేయకుండా ఉగ్రవాదం అంటూ ఎన్ని గావు కేకలు వేసినా అదంతా వృధా. కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న స్టేట్ టెర్రరిజం సంగతి ఏమిటి? AFSPA ని కనీసం కొన్ని ప్రాంతాల్లోనైనా ఎత్తివేయడానికి ఒప్పుకోని కేంద్రం కాశ్మీరీల ఉగ్రవాదం అంటూ గోల చేయడం ఎలా అర్ధం చేసుకోగలం?

    అమెరికా, ఇండియా, పాక్ లకు కాశ్మీర్ సమస్య ఎప్పుడూ రగలడమే కావాలి. అది పరిష్కారం కాకూడదు. పరిష్కారం చేసేస్తే భౌగోళిక రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అస్త్రాన్ని కోల్పోతారు. అందువల్ల ఏదో ఒక కారణం చెప్పి, సంఘటనలు జరిపించి అడపా దడపా ఇలా ఉద్రిక్తతలను రెచ్చగొడుతుంటారు. ఇండియాలో చైనా వ్యతిరేకత పెంచడానికి కూడా కాశ్మీర్ సమస్య ఒక అస్త్రం. చైనా-రష్యాలకు వ్యతిరేకంగా అమెరికాతో అంట కాగడానికి బి‌జే‌పి ప్రభుత్వం సిద్ధం అయింది. దానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. అన్నీ పార్టీలు ఇస్తున్నాయి ప్రజల నుండి కూడా అమెరికా అనుకూల విధానానికి మద్దతు సంపాదించాలి. మరోవైపు దేశంలో సమస్యలని పక్కదారి పట్టించడానికి మన వాళ్ళకి, పాక్ ప్రభుత్వానికి కాశ్మీర్ సమస్య అక్కరకు వస్తుంది. ఈ ప్రయోజనాలు అన్నింటినీ ప్రస్తుతం రేగిన ఉత్తుత్తి ఉద్రిక్తత బాగా ఉపయోగపడుతున్నది.

    ఇందులో చైనా అనుకూలత, వ్యతిరేకత అని లెక్కలు వేసుకుని లాభం లేదు. ప్రపంచ రాజకీయాల్ని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది.

    భౌగోళిక రాజకీయాల్లో చైనా, అమెరికాకి వ్యతిరేకంగా ఎన్ని దేశాలు కలిసి వస్తే అన్నింటిని కలుపుకుపోతుంది. ఇండియాని అమెరికా మచ్చిక చేసుకుంది. ఇండియా సై అంది. కనుక చైనాకు పాక్ కావాలి. చైనా వ్యాపారాభివృద్ధికి (వన్ బెల్ట్ వన్ రోడ్) పాక్ చాలా అవసరం. కనుక పాక్ కి కావలసింది చైనా చేసి పెడుతుంది. మనం నిజంగా స్వతంత్రులమ్ అయితే బ్రిక్స్ లాభాల్ని వదులుకుని అమెరికా దృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s