కావేరి ఎన్నికల యజ్ఞం: బీజేపీ పిల్లి మొగ్గలు!


 

కావేరి జలాల పంపిణి వివాదం చుట్టూ  ప్రస్తుత కర్ణాటక రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. పార్టీలు సహేతుకతను కావేరి నీళ్లలో కలిపేసాయి. వీలయినంత గరిష్టంగా రాజకీయ లబ్ది పొందేందుకు ఎత్తులు పై ఎత్తులు రచించి అమలు చేయడంలో నిమగ్నం అయ్యాయి. ఈ ఎత్తులు పై ఎత్తుల ఆటలో తనకు ఏది లాభమో అర్ధం కాక బీజేపీ పిల్లి మొగ్గలు వేస్తూన్నది 

కావేరి జలాల సంక్షోభంలో తాము కర్ణాటక ప్రయోజనాలకు ఇతర పార్టీల కంటే అధికంగా కట్టుబడి ఉన్నామని చాటుకోవటానికి ప్రతి పార్టీ యోచిస్తున్నది. ఆ యోచనలో ప్రత్యర్థి పార్టీ మీద పై చేయి సాధించడానికి పార్టీలు తపన పడుతున్నాయి. ప్రతిపక్షాన్ని కలుపుకు పోతున్నానని చూపుకునేందుకు అధికార కాంగ్రెస్ భావిస్తుంటే, అధికార పార్టీ అప్రోచ్ లో తప్పులు ఎంచి లబ్ది పొందాలని ప్రతిపక్ష బీజేపీ తపిస్తోంది. 

ఆదిలో అఖిల పక్ష సమావేశాలను బహిష్కరిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా క్రమం తప్ప కుండా సమావేశాలకు హాజరు అవుతున్నది. ఆదిలో అధికార కాంగ్రెస్ ని తప్పు పట్టి లబ్ది పొందడంలో నిమగ్నం అయిన బీజేపీ, అది కుదరక పోవటంతో వివాదంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నానని చాటేందుకు శ్రమిస్తున్నది. 

ఆరంభంలో కర్ణాటక కాంగ్రెస్, జనతా దళ్ (సెక్యులర్) పార్టీలు ఉమ్మడిగా జట్టు కట్టి తమిళనాడుపై పోరాటం చేస్తున్నట్లు కనిపించాయి. మరో పక్క అఖిల పక్ష సమావేశాలను బీజేపీ బాయ్ కాట్ చేసింది. కేవలం సమస్యను పక్కదారి పట్టించేందుకే అఖిల పక్షం అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించింది. కానీ క్రమేపి పరిస్ధితి బీజేపీ యేతర పక్షాల చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యే పరిస్ధితి నెలకొన్నది. దానితో బీజేపీ ఒంటరిగా మిగిలింది.

ఫలితంగా బీజేపీకి దారి మార్చుకోక తప్ప లేదు. 

అఖిల పక్ష సమావేశాల్ని బహిష్కరిస్తూ పార్టీ నాయకుడు యెడుయూరప్ప ఇలా అన్నాడు “సెప్టెంబర్ 21 తేదిన జరిగిన అఖిల పక్ష సమావేశం అర్ధం లేని ప్రక్రియగా మేము భావిస్తున్నాము. అది కేవలం పక్కదారి పట్టించే ఎత్తుగడలో భాగం మాత్రమే. ప్రజలను, ప్రతిపక్షాలను మోసం చేసే లక్ష్యంతో దానిని నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం పైన సరిగ్గానే నమ్మకం కోల్పోయింది. ఈ కారణం తోనే సమావేశానికి బీజేపీ దూరంగా ఉన్నది.”

 

కానీ తమ లెక్క తప్పిందని బీజేపీ కి త్వరలోనే అర్ధం అయింది. కాంగ్రెస్, జనతా దళ్ లు సమావేశాలతో బిజీగా ఉంటూ, ఉమ్మడి ప్రకటనలు చేస్తూ , ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా నిర్వహిస్తూ, కోర్టులో వ్యాజ్యాలు వేస్తూ ఎదో చేసేస్తున్నామన్న అభిప్రాయాన్ని కలిగించడంలో సఫలం అయ్యాయి. దూరంగా బీజేపీ ఏమి చేయడం లేదన్న అభిప్రాయానికి తావిచ్చింది.  

ఫలితంగా ఇప్పుడు బీజేపీ కావేరి చర్చలలో తానూ పాల్గొంటూ, ప్రభుత్వంతో తమకు ఎట్టి విభేదము లేదన్నట్లుగా పని చేస్తున్నది. నదీ జలాల పంపిణి చర్చలలో తలమునకలుగా పాల్గొంటున్నది. ప్రధాన మంత్రితో మాట్లాడి సుప్రీం కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాలని కోరినందుకు “అనవసరంగా కోర్టు విషయంలో ప్రధానిని ఎందుకు లాగుతున్నారు?” అని మండి పడిన వాళ్ళు కాస్తా ఇప్పుడేమో తామే చొరవ తీసుకుని ముఖ్య మంత్రి, కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రికి మధ్య చర్చలు జరిగేందుకు దోహద పడింది. “వివాదం సామరస్య పరిష్కారానికి చొరవ చూపండి” అని సుప్రీం కోర్టే కేంద్రాన్ని కోరడంతో తమ విమర్శను మర్చిపోయి నదీ జలాల మంత్రిని రాష్ట్రానికి రప్పించింది బీజేపీ. 

అసలీ వివాదం ఇప్పుడు ఎందుకు రగిలినట్లు? తమకసలు తాగటానికి నీళ్లు లేవని కర్ణాటక చెబుతోంది. తనకు రావలసిన కనీస వాటా నీళ్లు కూడా రానివ్వటం లేదని తమిళనాడు ఆరోపిస్తున్నది. రెండింటిలో ఏ రాష్ట్ర వాదన నిజం? 

కర్ణాటకతో తమిళనాడుకు నదీ జలాల వివాదం తలెత్తడం ఈ రోజు కొత్తది కాదు. గతంలో కృష్ణా జలాలను వదిలే విషయంలో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ తో పేచీ పడిన కర్ణాటక గత కొన్నేళ్లుగా కావేరి విషయంలో తమిళనాడుతో పేచీకి దిగుతున్నది.

పాఠకులు గమనిస్తే సరిగ్గా ఎన్నికలు జరగనున్నప్పుడే కావేరి జలాల వివాదం, వివాదంగా ముదురుతోంది. ఇటు తమిళనాడు మొదట ఆందోళనలో మొదలయినా అటు కర్ణాటకలో మొదలైనా ఆ సమయంలో ఎదో ఒక రాష్ట్రం ఎన్నికలకు వెళ్లే క్రమంలో ఉంటున్నది. ఇప్పుడైతే కర్ణాటక రాష్ట్రం ఎన్నికలను సమీపిస్తున్నది. వచ్ఛే ఏడు మే నెలలో ఎన్నికలు జరగనుండడంతో వానా కాలంలో కప్పల లాగా కావేరి వివాదాన్ని మరోసారి రగిలించి తమాషా చూస్తున్నారు రాజకీయ నాయకులు. 

కావేరి జలాల పైన ఆధార పడిన బెంగుళూరులో 28 నియోజక వర్గాలు ఉండగా వాటిని ఆనుకుని ఉన్న మరో 30, 40 నియోజకవర్గాలు కావేరి జలాల వివాదంతో ప్రభావితం అవుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే సరికొత్త వివాదాన్ని పాలక వర్గాలు రెచ్చగొడుతున్నాయి. ప్రజల దైనందిన సమస్యలను ఏనాడూ పరిష్కరించని పాలక వర్గాలు, అందువల్ల తలెత్తే ప్రజల వ్యతిరేకతను తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు సమస్యలు కానివాటిని సమస్యలుగా చూపి, అసలు సమస్యలను మరుగున పడేలా చేయడం తెలిసిన విషయమే. ఇపుడు జరుగుతున్నది అదే. 

కాంగ్రెస్, జనతా దళ్ లు పొత్తు వైపుగా ప్రయాణిస్తుండగా బీజేపీ మొదట కాంగ్రెస్ ని దోషి గా చెయ్యాలని ప్రయత్నం చేసి, అందులో విఫలమై, కేంద్ర ప్రభుత్వం అండతో సమస్య పరిష్కారం చేసినట్లు  చెప్పుకోవటానికి కృషి చేస్తున్నది. ప్రజలేమో అమాయకంగా ఎన్నికల యజ్ఞంలో సమిధలుగా మిగిలిపోతున్నారు. 

9 thoughts on “కావేరి ఎన్నికల యజ్ఞం: బీజేపీ పిల్లి మొగ్గలు!

 1. ప్రజలేమో అమాయకంగా ఎన్నికల యజ్ఞంలో సమిధలుగా మిగిలిపోతున్నారు.
  ప్రజలను అమాయకత్వంలోన ఉంచడంలోనే ఉన్నది ఆధిపత్యవర్గాల తెలివితేటలు!
  ప్రజలు ఆధిపత్యవర్గాల దోపిడిని అణగదొక్కేరోజుకు బాటలు వేయడంలో ఆ అధిపత్యవర్గాల వారే నాయకత్వం వహించాలేమో!

 2. అన్నింటి కంటే ఇదే వెడల్పు ఎక్కువ. గత ధీమ్ కంటే కూడా. అందుకే ఇది సెలెక్ట్ చేశాను. బహుశా మీ బ్రౌజర్ విండో చిన్నది చేసారేమో చూడండి, టెకీ గారు.

 3. ఇది టెంప్లేట్ రూపకర్త ఇచ్చిన width కావచ్చు. మీరు కావాలనుకుంటే దానిని చేంజ్ చేసుకోవచ్చు…. నా బ్రౌజర్ width నేను తగ్గించలేదు.
  కానీ పెంచితే బాగుంటుంది అనిపించింది అందుకే చెబుతున్నాను ………………

  నాగశ్రీనివాస

 4. నిజానికి తగ్గించడం ఎలాగో నాకు తెలియదు. పోనీ గత టెంప్లేట్ కంటే వెడల్పా కాదా, అది చెప్పండి. మీ వ్యాఖ్యతో నాకు డౌట్ వస్తోంది.

 5. గత టెంప్లేట్ తో పోలిస్తే తక్కువగా అనిపిస్తోంది. కుడి ఎడమల స్పేసు waste ఇపోతోంది అనిపించిది. అందుకే చెప్పాను.

  నాగ శ్రీనివాస

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s