
జర్మనీలో రెండవ అతి పెద్ద నగరం (రెండవ అతి చిన్న రాష్ట్రం కూడా) హ్యాంబర్గ్ నగర కమిషనర్ వాట్సప్ నిర్వహిస్తున్న అనైతిక కార్యకలాపాలపై కొరడా ఝళిపించింది. వినియోగదారుల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను పేస్ బుక్ కంపెనీతో షేర్ చేయటాన్ని నిషేదించింది. కంపెనీ ఇచ్చిన హామీని గుర్తు చేసి దాన్ని నిలబెట్టుకోవాలని హెచ్చరించింది.
వాట్సప్ ను అత్యధిక ధర పెట్టి ఫేస్ బుక్ కొనుగోలు చేసినప్పుడు రెండు కంపెనీలు పలు నీతులు చెప్పాయి. హామీలు ఇచ్చాయి. వాట్సప్ కంపెనీని కొనుగోలు చేసినప్పటికీ రెండు కంపెనీలు స్వతంత్ర కంపెనీలు గానే ఉంటాయని, వాట్సప్ వినియోగదారుల డేటా ను ఫేస్ బుక్ కు ఇవ్వడం అన్నది ఎప్పుడు జరగానే జరగదని చెప్పాయి.
కానీ గత ఆగస్టులో వాట్సప్ అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించింది. వినియోగదారుల ఫోన్ నెంబర్ల తో సహా అన్ని వివరాలు ఫేస్ బుక్ తో షేర్ చేస్తున్నానని చెప్పింది. అది వినియోగదారుల ప్రయోజనం కోసమే అని నమ్మబలికింది. వారి రక్షణకు మరింత టెక్నలాజి అభివృద్ధి చేయడానికి అది అవసరం అని చెప్పింది. వైరస్, స్పామ్ తదితర దాడులు జరగకుండా కొత్త టెక్నలాజి అభివృద్ధి చేయడానికి డేటా షేరింగ్ అవసరం అని చెప్పింది.
వాట్సప్ చర్యను ప్రపంచ వ్యాపితంగా పలు సంస్ధలు, వైరస్ నిర్ములన నిపుణులు నిరసించారు. కంపెనీ చెప్పిన కారణాలకు వినియోగదారుల వివరాలు సేకరించాల్సిన అవసరమే లేదని, ‘ఇంకో మాట ఏదన్నా ఉంటే చెప్పాలి’ అని పరిహాసం ఆడారు. వాట్సప్, ఫేస్ బుక్ లు మాత్రం విమర్శలను పట్టించుకోలేదు. తాము చెయ్యదలుచుకున్నది చెయ్యడం మొదలు పెట్టేసారు.
ఈ నేపథ్యంలో హ్యాంబర్గ్ నగర డేటా ప్రొటెక్షన్ కమిషనర్ జోహాన్స్ కాస్పర్ వాట్సప్ కంపెనీకి తద్వారా ఫేస్ బుక్ కంపెనీకి గట్టి ఝలక్ ఇచ్చాడు. ఇరు కంపెనీలు అనైతిక చర్యకు పాల్పడుతున్నాయని తీర్మానించారు. కొనుగోలు సందర్భంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించాయని, వినియోగదారులకు అబద్ధం చెప్పారని విమర్శించాడు. ఇక నుండి హ్యాంబర్గ్ పౌరులలోని వాట్సప్ వినియోగదారుల వివరాలు వీటిని ఫేస్ బుక్ కు ఇవ్వటానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసాడు. అలా ఇవ్వడం జర్మనీ డేటా ప్రొటెక్షన్ చట్టాలకు విరుద్ధం అని స్పష్టం చేశారు. ఇంతవరకు సేకరించిన డేటాను వెంటనే ఫేస్ బుక్ సర్వర్లనుండి తుడిచి వేయాలని ఆదేశించారు.
తమ డేటాను ఫేస్ బుక్ కు ఇవ్వాలో లేదో జర్మనీ వినియోగదారులు జాగ్రత్తగా నిర్ణయించుకోవాలని జోహాన్స్ కాస్పర్ కోరారు. వాస్తవానికి వాట్సప్ నుండి వివరాలు తీసుకునేముందు ఫేస్ బుక్ వినియోగదారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నదని, కానీ అలా జరగలేదని కాస్పర్ ఎత్తి చూపారు. దరిమిలా వాట్సాప్ వినియోగదారుల డేటా తస్కరణపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించి తదనుగుణంగా ఆదేశాలు ఇచ్చారు.
డేటా షేరింగ్ సంగతి గత ఆగష్టులో వాట్సప్ ప్రకటించాక అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ ప్రయివసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ (EPIC ) అధికారులు కంపెనీని విమర్శించారు. ఈ ప్రకటన ద్వారా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆదేశాలను కంపెనీ ఉల్లంఘించిందని స్పష్టం చేసాడు. కానీ చర్య మాత్రం ఏమి తీసుకోలేదు.
కనీసం భారత ప్రభుత్వం అయినా హ్యాంబర్గ్ ను అనుసరించి భారత వాట్సప్ వినియోగదారుల డేటా పరిరక్షణకు నడుం బిగించాలి.