టర్కీ: ఇసిస్ టెర్రరిస్టుల కార్ఖానా! -కార్టూన్


daesh-for-dummies

సిరియాలో టెర్రరిస్టులను ప్రవేశపెట్టిన అమెరికా మిత్ర దేశాలలో టర్కీ ఒకటి. సౌదీ, కతార్, యూ‌ఏ‌ఈ లాంటి అరబ్ షేక్ ప్రభుత్వాలు డబ్బు గుమ్మరిస్తే, పశ్చిమ దేశాలతో సహా ప్రపంచం నలు మూలల నుండి ఇస్లామిక్ యువతను సమీకరించే పనిని అమెరికా, సౌదీ, ఐరోపా దేశాల ఇంటలిజెన్స్ సంస్ధలు చేపట్టగా, వారికి శిక్షణ ఇచ్చి సిరియా-టర్కీ సరిహద్దు గుండా సిరియాలో ప్రవేశపెట్టే బాధ్యత టర్కీ తీసుకుంది.

ఇసిస్ మూకలు సిరియా నుండి దొంగిలించిన చమురు సరఫరా చేస్తుంటే దానిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని టర్కీ లాభ పడింది. కానీ రష్యా రంగ ప్రవేశంతో అంతా తారుమారయింది. చమురు సరఫరా జరగకుండా రష్యా వైమానిక దాడులు చేయడంతో అది ఆగిపోయింది. ఆ కోపంతో టర్కీ ఒక రష్యా జెట్ ను కూల్చి పికల మీదికి తెచ్చుకుంది. రష్యా, టర్కీతో వాణిజ్యం బంద్ చేసి రష్యన్ టూరిస్టులు టర్కీ వెళ్లకుండా చేసింది. దానితో టర్కీ టూరిజం దెబ్బ తిన్నది. చివరికి సిరియా యుద్ధం లాభకరం కాదని గ్రహించి రష్యాను మంచి చేసుకునే పనిలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పడ్డాడు.

ఇది అమెరికాకు నచ్చలేదు. అప్పటి దాకా చేదోడు వాదోడుగా ఉన్న వాడు ఒక్కసారిగా దూరం అయ్యే పరిస్ధితి వచ్చింది. టర్కీ నాటో సభ్య దేశం. ఆ దేశంలో అమెరికా 50 వరకు అణు బాంబులు నిల్వ చేసింది. అతి పెద్ద అమెరికా సైనిక స్ధావరం అక్కడ ఉన్నది. దానితో టర్కీలో నమ్మకస్ధుడిని తెచ్చుకోవలసిన అవసరం అర్జెంటుగా వచ్చి పడింది. సైనిక కుట్రకి పూనుకుంది. ఈ సమాచారం పసిగట్టిన రష్యా ఎర్డోగన్ కి చేరవేయడంతో సైనిక కుట్ర నుండి తృటిలో తప్పించుకున్నాడు ఎర్డోగన్!

ఆ విధంగా టర్కీ అకస్మాత్తుగా అమెరికా నుండి దూరం జరిగి రష్యాకు దగ్గరయింది.

మరో పక్క సిరియాలో, రష్యన్ వైమానిక దాడుల అండతో సిరియా ప్రభుత్వ బలగాలు పురోగమించాయి. లటాకియా రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాన్ని ఇసిస్ మూకల నుండీ, ఆల్-నూస్రా టెర్రరిస్టుల నుండి కైవసం చేసుకుంది. అనేక గ్రామాలను విముక్తి చేసింది. దానితో సిరియా ప్రజలకు నమ్మకం కుదిరి శరణార్ధి శిబిరాల నుండి తమ స్వస్ధలాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో సిరియా సైనికులు అప్పటి వరకు ఇసిస్, ఆల్-నూస్రా ల ఆధీనంలో ఉన్న గ్రామాలను తనిఖీ చేస్తూ శుభ్రం చేశారు.

అలా లటాకియాలో గ్రామాలను టెర్రరిస్టుల నుండి విముక్తి చేసి క్లియర్ చేస్తున్న సందర్భంలో ఓ సిరియా సైనికుడికి ఇసిస్ సాహిత్యం లభించింది. ఆ సాహిత్యాన్ని టర్కీ తయారు చేసిందని గ్రహించడానికి ఎంతో సేపు పట్టలేదు. సిరియా ఆర్మీ చెప్పిందాని ప్రకారం టర్కీ తయారు చేసిన సాహిత్యం నిండా జిహాదిస్టు బోధనలే. ఒట్టి బోధనలే కాదు, జిహాదిస్టులు కానీ వారిని ఎంత తీవ్రంగా ద్వేషించాలో టర్కీ పాఠాలు నిర్దేశించాయి. జిహాదిజాన్ని వ్యతిరేకించే వారిని శత్రువులుగా చూడాలని నిర్దేశిస్తు వారిని ఏమి చేయాలో, వారి ఆస్తులను ఎలా నాశనం చేయాలో వివరంగా చెప్పబడి ఉన్నది. శత్రువులపై యుద్ధం చేసే తీరాలని చెబుతూ యుద్ధంలో అనుసరించే హింసాత్మక చర్యల గురించిన సూచనలు ఇవ్వబడ్డాయి. అణు బాంబులను ఎలా ఉపయోగించాలో కూడా టెర్రరిస్టులకు సూచనలు ఉన్నాయని సిరియా సైనికులు చెప్పారు.

“జిహాది ఫైటర్లు తాము ఆక్రమించిన నగరాలను సరిగ్గా, ఒక క్రమ పద్ధతిలో ఎలా తగలబెట్టాలో పుస్తకంలో వివరించారు. చెట్లు అన్నింటినీ ఎలా నరికివేయాలో, ప్రజల జీవనాన్ని ఎలా ధ్వంసం చేయాలో వివరించారు. ఖైదీలను సరైన పద్ధతిలో ఖచ్చితంగా ఎలా చంపాలో నిర్దేశించబడి ఉన్నది. తమ మహిళా ఖైదీలను పెళ్లి చేసుకునే హక్కు జిహాదిస్టులకు ఉన్నదని పుస్తకంలో చెప్పారు” సిరియా సైనికులు చెప్పారు. పుస్తకం పేరు జాద్ ఆల్-ముజాహిద్ అని స్పుత్నిక్ ఇంటర్నేషనల్ తెలిపింది.

ఇవే తరహా సాహిత్యాన్ని అమెరికా ముద్రించి ఆఫ్ఘనిస్తాన్ లో బిన్ లాడేన్ సంస్ధలకు (ఇప్పటి ఆల్ ఖైదా, అప్పటి ఆఫ్ఘన్ ముజాహిదీన్) పంచి పెట్టింది. ఆఫ్ఘన్ స్కూల్ పిల్లలు జిహాది బోధనలతో పెరగడానికి వీలుగా మిలియన్ల కొద్దీ జిహాది కోర్సుల పుస్తకాలు ప్రచురించి సరఫరా చేసింది అమెరికా. ఈ సంగతి ఎవరో పరిశోధనాత్మక జర్నలిస్టు కనుగొన్నవి కాదు. అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు పత్రికే 2002లో ప్రత్యేక కధనం ద్వారా వెల్లడి చేసింది. ఆనాటి అమెరికా తయారు చేసిన స్కూల్ కోర్సులు ఆఫ్ఘన్ ను తానే ఆక్రమించాక అమెరికాకు ప్రాణాంతకం అయ్యాయని పోస్టు వాపోయింది కూడా. జిహాది సాహిత్యం ప్రచురణ ఇప్పటికీ అమెరికాలో నిరాఘాటంగా కొనసాగుతున్నదని వినికిడి.

(సూచన: టర్కీ జెండా ఎరుపు రంగులో ఉంటుంది. ఆ జెండా పై నెలవంక, నక్షత్రం ఉంటాయి)

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s