
Hadiya Khalaf Abbas -Syria Parliament Speaker
అమెరికా అసలు రంగు అనుమానం లేకుండా రుజువయ్యే వార్త ఇది. ప్రపంచంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్ధలుగా పేరు పొందిన సంస్ధలు అన్నింటికీ మూలం అమెరికాయే అని మరోసారి రుజువు అయిన సందర్భం ఇది.
ప్రస్తుతం అత్యంత కఠిన, పాషాణ, రక్తదాహంతో నిండినదని అమెరికా కూడా చెబుతున్న ఐఎస్/ఇసిస్/ఇసిల్ సృష్టికర్త, మద్దతుదారు, ఆయుధ-ధన-శిక్షణ సరఫరాదారు అమెరికాయే అని తిరుగు లేకుండా రుజువు చేసే ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని సిరియా ప్రభుత్వం ప్రకటించింది.
సిరియా కిరాయి తిరుగుబాటు విషయమై అమెరికా-రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్వంసం చేస్తూ సెప్టెంబర్ 17 తేదీన అమెరికా సైన్యం డెర్ ఎజ్-జోర్ రాష్ట్రంలో సిరియా సైనికులపై పాశవికంగా వైమానిక దాడి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 62 మంది సిరియా సైనికులు చనిపోగా 100 మంది వరకు గాయపడ్డారు.
ఈ దాడి తామే చేశామని, కానీ దాయిష్/ఇసిస్ సేనలపై దాడి చేస్తున్నామని భావిస్తూ పొరబాటున సిరియా ప్రభుత్వ సేనలపై దాడి చేశామని అమెరికా ప్రకటించి అపాలజీ కూడా చెప్పుకుంది. అమెరికా అపాలజీ చెప్పడమే ఆశ్చర్యకరమనీ, దీని వెనుక మతలబు ఉన్నదనీ రష్యా బహిరంగం గానే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలలో వ్యాఖ్యానించింది.
సిరియా శాంతి ఒప్పందం (కాల్పుల విరమణ ఒప్పందం) అమలు చేయడం పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) కు ఇష్టం లేదని, శాంతి ఒప్పందం విషయమై వైట్ హౌస్, రక్షణ శాఖ మధ్య విభేదాలు ఉన్నాయనీ, ఒప్పందాన్ని భగ్నం చేసేందుకే పెంటగాన్ పని గట్టుకుని సిరియా సేనలపై దాడి చేసిందనీ రష్యా ఆరోపించింది కూడా.
అయితే ఇవేవీ పశ్చిమ పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు. అమెరికా పాల్పడిన దారుణ చర్యపై దృష్టి పెట్టడానికి బదులు, తాను చేసిన ఒప్పందాన్ని తానే ఉల్లంఘించడాన్ని అమెరికాను ప్రశ్నించడానికి బదులు ఐరాస కాన్వాయ్ పై సిరియా సేనలు దాడి చేసాయంటూ చేసిన అమెరికా ఆరోపణలపైనే ప్రధాన దృష్టి పెట్టాయి. తద్వారా సిరియా శాంతి ఒప్పందాన్ని రష్యా, సిరియాలే భగ్నం చేశాయన్న ఐరోపా, అమెరికా నేతల తప్పుడు ఆరోపణలను పూర్తి స్ధాయి శక్తియుక్తులతో ప్రచారం చేశాయి.
ఇంత చేసినా ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడంలో అమెరికా, ఐరోపాలు పెద్దగా సఫలం కాలేదు. డెర్ ఎజ్-జోర్ లో దాడి జరగడానికి ముందు ఆ ప్రాంతంలో అమెరికన్ ప్రిడేటర్ డ్రోన్ విమానం (UAV) ఎగురుతోందని రష్యా చెప్పడంతో అమెరికా అపాలజీ పై అనుమానం కమ్ముకుంది.
ఈ లోపు సిరియా ప్రభుత్వం ఈ సంచలన ప్రకటన చేసింది.
“డెర్ ఎజ్-జోర్ పైన వైమానిక దాడి జరగడానికి ముందు అమెరికన్లు, మరియు దాయిష్ (ఇసిస్) లు పరస్పరం మాట్లాడుకున్నాయి. ఆ సంభాషణను సిరియా సైన్యం పసిగట్టి (intercept) రికార్డు చేసింది”
అని సిరియా పీపుల్స్ కౌన్సిల్ (పార్లమెంటు) స్పీకర్ హదీయా ఖలాఫ్ అబ్బాస్ చెప్పారని ఆల్ మయాదీన్ వార్తా చానెల్ ను కోట్ చేస్తూ స్పుత్నిక్ న్యూస్ తెలిపింది.
ఇరాన్ సందర్శన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడి చేసిన సిరియా పార్లమెంటు అధ్యక్షురాలు ఇంకా తెలిపారు:
“సిరియా ప్రభుత్వ బలగాలపై అమెరికా కూటమి వైమానిక దాడులు జరిపిన తర్వాత అమెరికా మిలటరీ టెర్రరిస్టులను తమ దాడులు అక్కడి సిరియా సైన్యంపై ఎక్కుపెట్టవలసినదిగా ఆదేశించింది.”
సరిగ్గా అమెరికా దాడులు చేయడం సిరియా సైన్యం చనిపోవడం, అనేకమంది గాయపడటం జరిగిన తోడనే ఆ ప్రాంతంలో ఇసిస్ బలగాలు సిరియా సైన్యంపై యుద్ధ చర్యలు ప్రారంభించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఇదే అంశాన్ని (అమెరికా దాడుల అనంతరం ఇసిస్ దాడి మొదలు కావడాన్ని) రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలలో చెప్పడం గమనార్హం.
రష్యా, అమెరికా విదేశాంగ మంత్రుల మధ్య జరిగే సమావేశాలలో అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ కేవలం దాయిష్ కి వ్యతిరేకంగానే మాట్లాడటం ఆనవాయితీ, ఇతర టెర్రరిస్టు సంస్ధలు అసలు టెర్రరిస్టు సంస్ధలే కానట్లుగా ఆయన మాట్లాడుతుంటారని రష్యా విదేశీ మంత్రి లావరోవ్ అనేకసార్లు చెప్పారు.
ముఖ్యంగా అమెరికాయే టెర్రరిస్టు సంస్ధగా ప్రకటించిన ఆల్-నూస్రా పేరే ఆయన ఎత్తరని లావరోవ్ చెప్పారు. ఈ అంశాన్ని నిర్దిష్టంగా ఎత్తి చూపితే దాయిష్ ఎంతో ఆల్-నూస్రా కూడా అంతే అని అనడమే తప్ప వాస్తవ చర్చలలో ఆల్-నూస్రా వ్యతిరేకంగా కూడా పోరాడాలన్న సంగతిని సాధ్యమైనంతగా ఆయన విస్మరిస్తారని లావరోవ్ చెప్పారు.
The Syrian army survivors of the U.S. coalition air attacks
సిరియా ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టి దాయిష్ వ్యతిరేకత కూడా అమెరికాకు లేదని, దాయిష్ కి వ్యతిరేకంగా అమెరికా చెప్పేవన్నీ ఒట్టి కబుర్లు మాత్రమేననీ స్పష్టం అవుతున్నది. దాయిష్ అమెరికా సృష్టి అన్న సంగతి రష్యా, సిరియా, ఇరాన్ లతో పాటు అనేకమంది ప్రపంచ నిస్పాక్షిక పరిశీలకులకు తెలిసిన విషయమే. కానీ అమెరికా-దాయిష్ ల మధ్య సంబంధం ప్రత్యక్షంగా వెల్లడి కావడం ఇదే మొదటిసారి.
ఈ వార్తను కూడా పశ్చిమ కార్పొరేట్ మీడియా సంస్ధలు, అమెరికా, ఐరోపాలు తమకు తెలియనట్లే నటిస్తాయి. అమెరికా జరిపియా దాడిలో బ్రిటన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ లు కూడా పాల్గొన్న సంగతి గుర్తుంచుకుంటే దాయిష్ కు ఐరోపా దేశాల మద్దతు కూడా ఉన్న సంగతి అర్ధం అవుతుంది.
ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా తదితర దేశాలలో లోన్ వొల్ఫ్ అటాక్స్ పేరుతో దాయిష్ తీవ్రవాదులు దాడులు చేస్తున్నారని చెబుతూ అమెరికా, ఐరోపా రాజ్యాలు పెడుతున్న ‘బాధిత ఫోజులు’ కూడా ఒట్టిదే అనీ, దాడుల ద్వారా ప్రజల దృష్టి నుండి ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం దృష్టిని మళ్లించడానికే మాన్యుఫాక్చర్డ్ దాడులు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవచ్చు.
ఆడియో టేపు వివరాలను వచ్చే రోజుల్లో బైటపెడతామని సిరియా మిలటరీ ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్న నేపధ్యంలో రానున్న రోజుల్లో అమెరికా రంగు మరింతగా బైటపడే అవకాశం ఎదురు చూస్తున్నట్లే.