[సెప్టెంబర్ 26 తేదీన ద హిందు ‘Falling behind schedule’ శీర్షికన ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్]
ఆర్గనైజేషన్ ఫోర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్మెంట్ నివేదిక ప్రకారం ప్రస్తుతం సాధించబడ్డ విద్యా దక్షతలు వ్యక్తిగత శ్రేయస్సు మరియు సామాజిక ప్రగతి పెంపుదలకు సరిపడా అవసరమైన దాని కంటే చాలా దూరంలోనే ఉండిపోయాయి. మిలియన్ల మంది శరణార్ధులలో వలసలు వెళుతున్న ప్రజానీకం మరీ ముఖ్యంగా అత్యంత ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. కాస్తంత నీడ, సహాయం కోసం ఇటీవలి కాలంలో పెనుగులాట పెరిగిన నేపధ్యంలో ఈ అంశం నిర్దిష్టమైన దృష్టి కేంద్రీకరణను ఆశిస్తున్నది. ఉన్నత స్ధాయి విద్యార్హతల ద్వారా వ్యక్తులు మరియు సమాజాలు అనేక ఫలితాలను పొందడం బట్టి చూస్తే, “స్ధూల దృష్టిలో విద్య 2016” (Education at a Glance 2016) నివేదికలోని నిర్ధారణలు, మెలకువతో కూడిన ఆల్-రౌండ్ పరిశీలనను కోరుతున్నాయి. మచ్చుకు, ఓఈసిడి లోని 35 దేశాలలో మాస్టర్ డిగ్రీ ఉన్నవారు సానుకూల వేతనం పొందడానికి 90 శాతం సమీపంలో ఉన్నారు. తత్సమానంగా ఒక గ్రాడ్యుయేట్ పైన పెట్టిన ఖర్చు కంటే వారి ప్రభుత్వాలు వారి జీవిత కాలంలో పన్నుల రూపం లోనూ, సామాజిక తోడ్పాటు రూపం లోనూ 100,000 యూరోలు అధికంగా తిరిగి పొందుతున్నాయి. 2014తో ముగిసిన దశాబ్ద కాలంలో తృతీయ స్ధాయి విద్యా కోర్సులలో (అండర్ గ్రాడ్యుయేట్) చేరుతున్న వారి సంఖ్య 4 శాతం పెరుగుదల నమోదయింది. ఇవి ఉత్సాహభరితమైన వాస్తవాలు; కాబట్టి ఈ రంగంలో మరిన్ని ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలన్నది దీనికి తార్కిక ముగింపు. కానీ మొత్తంగా చూస్తే గనక (ప్రభుత్వాల) ధోరణి ఇందుకు సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నది. 2013 వరకు ముగిసిన 5 సం.ల కాలంలో ఒక్కో పిల్లవాడిపైన సగటున పెడుతున్న ఖర్చు నిజ మొత్తాలలో 8 శాతం పెరుగుదల ఉన్నట్లు నివేదిక చూపుతుండగా, అదే కాలంలో అదే రంగంలో ప్రైవేటు ఖర్చులో 14 శాతం పెరుగుదల ఉన్నట్లు చూపుతోంది. ఒక్క తృతీయ స్ధాయి విద్యలోనే విద్యార్ధులు మరియు కుటుంబాలు పెడుతున్న ప్రైవేటు ఖర్చు 30 శాతంగా ఉన్నదని నివేదిక అంచనా వేసింది. ద్రవ్య సంక్షోభం దరిమిలా ఆర్ధిక పొదుపు విధానాలను విడవకుండా అమలు చేస్తున్న నేపధ్యంలో దీనిని పరికించాల్సి ఉంటుంది. ఈ విధానాలు సమానత్వం మరియు భవిష్యత్తు తరాల విజ్ఞాన ఆర్ధిక వ్యవస్ధల పైన తీవ్ర ప్రభావం కలుగ జేస్తున్నాయి.
ఓఈసిడి సభ్య దేశాలతో పాటుగా ఇండియా లాంటి దాని భాగస్వామ్య దేశాలకు కూడా వర్తించే విశాల అంశం ఏమిటంటే 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘నిలకడ అభివృద్ధి లక్ష్యం’ (Sustainable Development Goal – SPG) ను రాజ్యాలు సాధించలేకపోవడానికే అధిక అవకాశం ఉన్నదని నివేదిక గుర్తించడం. ఇదే ఆందోళన యునెస్కో 2016 నివేదిక కూడా వ్యక్తం చేసింది. సమ్మిళిత మరియు సమానత్వ పూరకమైన నాణ్యమైన విద్య సాధించాలంటే ఎస్‌డిజి 4 లక్ష్యాలను చేరుకోవడం అవసరమని చెబితే అది అత్యుక్తి కాబోదు. ఎందుకంటే ఆ అంశం (ఎస్‌పిజి) ఇరుసు పైననే మౌలికంగా ముఖ్యమైన అనేక ఇతర అభివృద్ధి లక్ష్యాల సాకారం కూడా ఆధారపడి ఉన్నది కనుక. నిజానికి, 2030 అజెండా విజయం మొత్తం కేవలం విద్యా లక్ష్యం పైననే ఆధారపడి ఉన్నది. దారిద్ర్యం తగ్గింపు, ఆకలి ఉపశమనం, ఉపాధి విస్తరణ, మహిళల సాధికారత మరియు లైంగిక సమానత్వం.. ఈ లక్ష్యాలన్నీ స్త్రీలూ, పురుషులు సాధించగల విద్యార్హతలు మరియు నైపుణ్యాల పైననే ఆధారపడి ఉన్నాయి. మరో స్ధాయిలో, విద్య మరియు సాధికారతలు లేని జనాభా లేనిదే చైతన్యయుత, మరింత సహనశీల మరియు శాంతియుత ప్రపంచాన్ని సాధించడం ఎప్పటికీ అందకుండానే ఉండిపోతుంది.
*********
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుంది ఈ సంపాదకీయం. మానవ జాతి అభివృద్ధి అంతా కేవలం గ్రాడ్యుయేషన్, పిజి, పిహెచ్ డి ఇత్యాది విద్యార్హతల పైనే ఆధారపడి ఉన్నదని చెప్పడం ఏమిటో బొత్తిగా అర్ధం కాకుండా ఉంది. ఓఈసిడి అనేది పెట్టుబడిదారీ పులి. దానికి చారలు సహజంగానే ఉంటాయి. అనగా పెట్టుబడిదారీ సమాజం కొద్ది మంది ఉన్నత విద్యావంతులను, తమ అవసరాల రీత్యా తయారు చేసుకుంటుంది. మిగతా వారికి విద్యా సౌకర్యాలు అందకుండా దూరం చేసి వారిని తక్కువ స్ధాయి విద్యార్హతలలోనే ఉంచుతూ తమకు అవసరమైన కింది స్ధాయి శ్రమలకు అందుబాటులో ఉండేట్లు చూసుకుంటుంది. అంతే తప్ప వోల్ మొత్తానికి పెద్ద పెద్ద చదువులు చదివించేసి అందరికీ ఆరంకెల వేతనాలు చెల్లించరు. అలాంటి చారల కోసం వాతలు పెట్టుకోమని ఓఈసిడి సలహా ఇస్తే దానిని ఆచరిద్దాం అని సంపాదకీయం చెబుతోంది.
జనాభా మొత్తానికి పిజి, ఎంబిఏ, ఎంసిఏ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇత్యాది ఉన్నత స్ధాయి విద్యలు అందించి వారందరికీ భారీ వేతనాలు ఇచ్చే ఉద్దేశ్యం, లక్ష్యం పెట్టుబడిదారీ సమాజాలు నిజాయితీగానే కలిగి ఉంటాయని ఈ సంపాదకీయం అమాయకంగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. లేదా చదువురులు అందరు తన లాగే వెర్రి వాజమ్మలే అని నమ్ముతూనైనా ఉండాలి, ఈ సంపాదకీయ కర్తలు!
ఓఈసిడి ఒక పెట్టుబడిదారీ దేశాల గుంపు. దానికి తన ప్రయోజనాలే పడతాయి గానీ ఇతరుల ప్రయోజనాలు పట్టవు. తన ప్రయోజనాలలో కూడా ఉన్నత వర్గాల ప్రయోజనాలే ఉంటాయి గానీ ఆ దేశాలలోని ప్రజలందరి ప్రయోజనాలూ ఇమిడి ఉండవు. ఉంటే ఆ దేశాలు ఇప్పటి లాగా చివరంటూ ఎరగని నిరంతర ద్రవ్యార్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉండవు. పెట్టుబడిదారీ దేశాల గుంపు తనకు బైట ఉన్న వ్యవసాయక, వెనుకబడిన దేశాల ప్రయోజనాలు పట్టవు గాక పట్టవు. పడితే ఇతర దేశాలను ‘భాగస్వామ్య దేశాలు’గా కాకుండా స్వతంత్ర ప్రయోజనాలు కలిగిన దేశాలుగా గుర్తించి వారి నివేదికలు వారిని తయారు చేసుకొమ్మని చెప్పి ఆ నివేదికలను తీసుకుని అధ్యయనం చేస్తాయి గాని వారి తరపున కూడా తామే నివేదికలు తయారు చేసేసి ఆ దేశాల పైన రుద్దవు.
మచ్చుకు ఒక పరిశీలనను చూద్దాం. 1.2 బిలియన్ల భారతీయుల్లో అందరు పిజి లు చదివారనుకుందాం. వారందరూ 90 శాతం సానుకూల వేతనాల ఉద్యోగాలు సంపాదించగలరా? అక్కడిదాకా ఎందుకు? ప్రస్తుతం పిజి, ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, పిహెచ్ డి, ఎం ఫిల్… మొ.న విద్యార్హతలు ఉన్నవారికి అందరికీ అయినా కనీసం వచ్చే పదేళ్ళలో -ఇక నుండి ఆ డిగ్రీలు ఇవ్వడం రద్దు చేసేశారని భావిస్తూ- ప్రభుత్వం ఇవ్వగలదా? ఇంత చిన్న విషయం ద హిందు సంపాదకీయ వర్గానికి ఎందుకు తట్టలేదు చెప్మా?