పాపం నవ జ్యోత్ సింగ్ సిద్ధూ! పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని ఆశపడి ఏఏపి లో జొరబడబోయారు. కానీ సిఎం పదవి అప్పగించేందుకు ఏఏపి ఒప్పుకోకపోవడంతో ఆవాజ్-ఏ-పంజాబ్ పేరుతో కూటమి పెడుతున్నట్లు ప్రకటించారు.
కానీ తమ ఫ్రంటు ఒక ఫోరంగా మాత్రమే ఉంటుందని ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. తాను పార్టీ పెడితే అకాలీ వ్యతిరేక ఓట్లు చీలి మళ్ళీ అకాలీకే లాభిస్తుందని అందుకని పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ప్రకటించిన కారణం అయితే గొప్పగా, ఉదాత్తంగానే ఉన్నది. కానీ అసలు కారణం ఆదేనా? ఆ మధ్య జరిగిన సర్వేలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితేనే తాము ఏఏపి కి ఓటు వేస్తామని సిద్ధూ సిఎం అయ్యేపనైతే ఓటు వేసేది లేదని అత్యధికులు చెప్పినట్లు తెలిసింది. దాదాపు 15 శాతం వరకు సిద్ధూ ముఖ్యమంత్రిత్వానికి మద్దతు ఇస్తే 70% పైగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వానికి మద్దతు ఇచ్చారు.
బహుశా ఈ నేపధ్యంలోనే ఏమో గ్లోవ్స్, ప్యాడ్ లు, చివరికి బ్యాట్ కూడా వదిలేసి గోదాలోకి దూకేస్తున్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ!