సామ్ సంగ్ నోట్ 7: నెత్తురు కక్కుకుంటూ…


మొబైల్ ఫోన్ల మార్కెట్ లో యాపిల్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ వస్తున్న సామ్ సంగ్ కంపెనీ తన తాజా ఫ్లాగ్ షిప్ మోడల్ నోట్ 7 వల్ల ఆర్ధికంగానూ, ప్రతిష్ట పరంగానూ నష్టాల్ని ఎదుర్కొంటోంది. ఎంతో ఆర్భాటంగా, ఎన్నో ఆశలు మరెంతో ఆసక్తి రేపిన సామ్ సంగ్ నోట్ 7 మోడల్ లోని బ్యాటరీ చార్జి చేసేటప్పుడు పేలి పోతుండడంతో ఎప్పుడూ లేనట్లుగా అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకుని డబ్బు ఇచ్చేయవలసిన పరిస్ధితికి నెట్టబడింది.

గత యేడు నోట్ 5 ని విడుదల చేసిన సామ్ సంగ్, నోట్ 6 లేకుండానే ఈ యేడు నోట్ 7 ని విడుదల చేసింది. బహుశా యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్ 7 మోడల్ ని విడుదల చేయనున్నందు వల్లనో ఏమో నోట్ 6 ప్రసక్తి లేకుండానే నోట్ 7 ని విడుదల చేసింది. ఒక దశలో ఐ ఫోన్ 7 కంటే కూడా ‘అత్యంత గొప్ప ఫోన్’ కావచ్చన్న అంచనాలతో మార్కెట్ లో కాక పుట్టించిన సామ్ సంగ్ కంపెనీ ‘పేలుడు బ్యాటరీ’ దెబ్బకి ‘అత్యంత వరస్ట్ ఫోన్’ గా అటు పేరూ పోగుట్టుకుంది, ఇటు మార్కెట్ కూడా నష్టపోయే పరిస్ధితి కొని తెచ్చుకుంది.

సెప్టెంబర్ 1 తేదీన ఐ ఫోన్ 7 లాంచింగ్ కి ముందే విడుదల అయిన నోట్ 7 పేలుడు పుణ్యమా అని ఐ ఫోన్ 7 మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఎప్పటి లాగే భారీ రేటు ప్రకటించిన యాపిల్ కంపెనీ తనకు తగ్గ పోటీ రద్దయిపోయిన నేపధ్యంలో హాయిగా, భయం లేకుండా, చిద్విలాసంగా అక్టోబర్ లో అమ్మకాలు ప్రారంభించనుంది.

నోట్ 7 పేలుడు వ్యవహారం సోషల్ నెట్ వర్క్ సైట్ లలో పలు రకాలుగా (అప)హాస్య ప్రకంపనలు సృష్టించింది. సృజనాత్మకమైన వ్యాఖ్యలు, ఫోటోలతో నోట్ 7 వైఫల్యం వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ హాస్యాల్ని చూస్తే శ్రీ శ్రీ రాసిన “వీరు” కవిత గుర్తుకు రాక మానదు.

నిప్పులు

చిమ్ముకుంటూ

నింగికి

నేనెగిరిపోతే

నిబిడాశ్చర్యంతో

వీరు!

నెత్తురు

కక్కుకుంటూ

నేలకు

నే రాలిపోతే

నిర్ధాక్షిణ్యంగా

వీరే!!

పేలుడు వార్తలు, ఫిర్యాదులు వెల్లువెట్టడంతో డివైజ్ లను వెనక్కి తీసుకుని డబ్బు చెల్లించే కార్యక్రమాన్ని కంపెనీ ప్రకటించక తప్ప లేదు. డబ్బు కావాలంటే డబ్బు లేదంటే కొత్త ఫోన్ ఇచ్చేలా ఆఫర్ ప్రకటించింది. సౌత్ కొరియాలో కొద్ది రోజుల వరకు మాత్రమే -గడువు లోపు- డబ్బు వాపసు ప్రకటించింది. ఆ గడువు దాటితే డబ్బు వెనక్కి ఇవ్వరు, కొత్త డివైజ్ మాత్రమే ఇస్తారు. కానీ కొరియా ప్రభుత్వం ఈ గడువు సరిపోదనీ, పొడిగించాలనీ కంపెనీని ఆదేశించింది. సామ్ సంగ్ కంపెనీ మాటే శాసనమైన చోట, ప్రభుత్వ ఆదేశాన్ని ఎదుర్కోవలసి రావటం?!

ఫోన్ వెనక్కి తీసుకోవడం/మరో కొత్త ఫోన్ ఇవ్వవలసి రావటం/డబ్బు వాపసు ఇవ్వటం వల్ల కంపెనీకి ఇప్పటి వరకు 1 బిలియన్ డాలర్లు (రు 6700 కోట్లు) నష్టం వచ్చిందట. డబ్బు పోతే పోయింది అనుకోవడానికి లేదు. ఈ దెబ్బతో కంపెనీకి ఉన్న ప్రతిష్ట కూడా మసకబారింది. మరో కొత్త మోడల్ ప్రకటించినా వినియోగదారులు అనుమానంతో చూడవలసిన పరిస్ధితి ఏర్పడటం అంటే మామూలు విషయం కాదు. వినియోగ సరుకుల తయారీ కంపెనీలకు బ్రాండ్ విలువ అత్యంత ముఖ్యంగా పరిగణిస్తాయి. ఎన్నో వందల కోట్లు బ్రాండ్ ప్రతిష్ట కోసం (యాడ్ ల పైన) అవి ఖర్చు పెడతాయి. ఆ పేరు పోతే తిరిగి కూడగట్టుకోవడం కష్ట సాధ్యం అవుతుంది. ఒకసారి రిమార్క్/మచ్చ పడ్డాక దానిని వదిలించుకోవటం ఎంత కష్టం, పాపం!

నోట్ 7 పుణ్యమాని, రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకారం సామ్ సంగ్ కంపెనీ మార్కెట్ వాటా 7 బిలియన్ డాలర్ల (7 x 6700/-) మేర కోల్పోయింది. నోట్ 5 వ్యాపారం కంటే నోట్ 7 వ్యాపారం 25% ఎక్కువ జరుగుతుందని కంపెనీ అంచనా వేసుకుంది. ఇప్పుడు దాన్ని -60 శాతానికి తగ్గించుకుంది. అనగా నోట్ 5 కంటే నోట్ 7 వ్యాపారం 60% తక్కువ జరుగుతుందన్నమాట! బ్రాండ్ విలువ పడిపోతే వచ్చే తేడా మామూలుగా ఉండదు మరి! బహుశా, అంతటితో అయిపోతే తేలికలో పోయినట్లే లెక్క!

ఇంతకీ నోట్ 7 బ్యాటరీ ఎందుకు పేలుతున్నట్లు? అమెరికా లోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెటీరీయల్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డా. డొనాల్డ్ ఆర్. సాడోవే ప్రకారం:

లిధియం-అయాన్ బ్యాటరీలో రెండు ఎలక్ట్రోడ్ (విద్యుత్ ప్రవేశ ద్వారం అనవచ్చునేమో) లు ఉంటాయి. అవి గ్రాఫైట్, కోబాల్ట్ ఆక్సైడ్ లతో తయారవుతాయి. ఆ రెండింటినీ ద్రవ రూప లిధియం వేరు చేస్తుంది. ఈ ద్రవం ఎలెక్ట్రోలైట్ కనుక పేలుడు పదార్ధం.

బహుశా బ్యాటరీ తయారీ క్రమంలో అతి చిన్న లోహ రేణువులు ఎలాగో దారి చేసుకుని ఎలక్ట్రోలైట్ ద్రవంలో కలిసిపోయి ఉండాలి (ఉద్దేశపూర్వకంగా -ఇండస్ట్రియల్ సాబోటేజ్- కలిపారా?). అపుడు ద్రవం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఈ లోహ రేణువులు ఒక క్రమ పద్ధతిలోకి వస్తాయి. అనగా అవి వరుసగా అలైన్ అవుతాయి. విద్యుత్ + మరియు – ఎలక్ట్రోడ్ ల మధ్య ప్రవహిస్తుంది గనుక అంతిమంగా లోహ రేణువులు రెండు ఎలక్ట్రోడ్ ల మధ్య గొలుసుగా ఏర్పడతాయి. ఇక అది కరెంటు షార్ట్ అయ్యేందుకు సాధనంగా పని చేస్తుంది. ఫలితంగా బ్యాటరిలోని విద్యుత్ అంతా ఒకే సారి షార్ట్ అయిపోయి వేడి పుట్టించి ఎలక్ట్రోలైట్ ద్రవం వ్యాకోచిస్తుంది (ఉబ్బిపోతుంది). అదే పేలుడుగా సంభవిస్తుంది.

… ఆ విధంగా నోట్ 7 మార్కెట్ ద్వారా ఆర్ధిక శాస్త్రం అధ్యయనం చేస్తూ, శ్రీ శ్రీ కవిత్వం ద్వారా కళారంగం లోకి వెళ్ళిపోయి, అక్కడి నుండి మెటీరీయల్ కెమిస్ట్రీ ద్వారా భౌతిక-రసాయన శాస్త్రం లోకి వచ్చేశాం. దీనినే మన పాత తరం వాళ్ళు ‘కోటి విద్యలు కూటి కొరకే” అని ఇతర మాటల్లో అన్నారు!

అంతే కాకుండా, సర్వ శాస్త్రాలూ ఒకే పదార్ధాన్ని అధ్యయనం చేసేవే అనీ పదార్ధం యొక్క ఒక్కో లక్షణం గురించి పరిశీలించే క్రమంలో, ఆ అధ్యయనాన్ని సులభతరం చేసుకునేందుకు అనేకానేక శాస్త్రాలుగా మనిషే వేరు చేసుకున్నాడనీ కూడా అర్ధం చేసుకోవచ్చు. శాస్త్రాలన్నింటినీ కలగలిపి అధ్యయనం చేసేది తత్వ శాస్త్రం. తత్వ శాస్త్రాల్లో మేలైన, ప్రజా సమ్మతమైనది గతితార్కిక భౌతికవాదం!

One thought on “సామ్ సంగ్ నోట్ 7: నెత్తురు కక్కుకుంటూ…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s