
సెప్టెంబర్ 19 తేదీన అలెప్పో ప్రాంతంలో ఐరాస హ్యుమానిటేరియన్ కాన్వాయ్ పై జరిగిన దాడి విషయమై సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన సమయంలో, ఆ సమయానికి ముందూ వెనకా, అలెప్పో ప్రాంతంలో రికార్డ్ అయిన ఫ్లయిట్ డేటా వివరాలను పరిశీలించిన రష్యన్ ప్రభుత్వం ఈ కొత్త వివరాలను వెల్లడి చేసింది.
అలెప్పో ప్రాంతం లోని ఉరుమ్ ఆల్-కుబ్రా ప్రాంతంలో ఐరాస కాన్వాయ్ ప్రయాణిస్తూ ఉండగా ఎయిర్ అటాక్ జరిగిందని ఐరాస తెలిపింది. ఆ సమయానికి కొన్ని నిమిషాల ముందు ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన ‘ప్రిడేటర్’ మానవ రహిత డ్రోన్ విమానం ఎగురుతోందని రష్యా రక్షణ శాఖ వెల్లడి చేసింది. భూమికి 3,600 మీటర్ల ఎత్తులో అమెరికన్ కూటమికి చెందిన యూఏవీ (Unmanned Arial Vehicle ) ఎగిరిందనీ దాడి జరిగిన అర గంట తర్వాత ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిందని రష్యా తెలిపింది.
“సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం సరిగ్గా కాన్వాయ్ ఉన్న ప్రాంతంలో 3,600 మీటర్ల ఎత్తున అమెరికా నేతృత్వం లోని కూటమికి చెందిన UAV గంటకు 200 కి.మీ వేగంతో ఎగురుతోంది” అని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనసెంకోవ్ ప్రకటించాడు.
“ఈ ప్రిడేటర్ డ్రోన్ విమానం టర్కీ లోని ఇన్సిర్లిక్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరి వెళ్ళింది. ఐరాస కాన్వాయ్ (పై దాడి) ఘటన జరిగిన అర గంట తర్వాత ఆ ఏరియాను వదిలి వెళ్ళింది. రష్యాకు చెందిన వాయు గూఢచార వ్యవస్ధ విమానం దానిని ప్రిడేటర్ తరహా UAV గా గుర్తించింది” అని ఇగోర్ తెలిపాడు.
ఇగోర్ ఇంకా ఇలా తెలిపాడు. “ఐరాస కాన్వాయ్ పైన దాడి ఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఉరుమ్ ఆల్-కుబ్రా ప్రాంతంలో ప్రిడేటర్ UAV కనపడింది. ఘటన జరిగిన 30 నిమిషాల తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది.”
రష్యా ప్రకటనను అమెరికా నిరాకరించింది. తమ విమానం ఏదీ ఆ సమయంలో అలెప్పో పైన ఎగర లేదని ప్రకటించింది. రష్యా ప్రకటనను ఖండించింది.
అమెరికా నిజం చెబుతుందని భ్రమలు పెట్టుకొనవసరం లేదు. అది తన రహస్య దుర్మార్గాలను ఎప్పుడు ఒప్పుకున్నది లేదు. బహిరంగ దుర్మార్గాలను అహంకారంతో సమర్ధించుకున్నది తప్ప తప్పని ఎన్నడూ అంగీకరించింది లేదు. తప్పు అని అంగీకరించక తప్పని పరిస్ధితి వఛ్చినపుడు అది “అవసరం అయిన, చేయక తప్పని తప్పు’ అని తనను తానూ వెనకేసుకురావడమే దానికి తెలుసు.
అలాగే అమెరికా చేసిన తప్పును వెల్లడి చేసే రికార్డులు ఇతర దేశం వద్ద ఉంటే వాటిని వెల్లడి చేయకుండా ఒత్తిడి తెఛ్చి, బెదిరించి సాధించడం ఆ దేశం విధానం. ఉదాహరణకి ఉక్రెయిన్ పైన ఎరుగుతుండగా కూలిపోయిన మలేషియా విమానానికి సంబంధించిన ఫ్లయిట్ డేటా రికార్డులు పక్క దేశాల విమానాశ్రయాల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వద్ద ఉన్నప్పటికీ వాటిని వెల్లడి చేయకుండా అమెరికా అడ్డు పడింది.
ఆ రికార్డులు వెల్లడి అయి ఉంటే విమానం కూలిపోక ముందు కాక్ పిట్ లో నమోదయిన సంభాషణలు తెలిసి ఉండేవి. క్షిపణి చేత ఢీకొట్టబడి కూలిందీ లేనిదీ తెలిసి ఉండేది. క్షిపణి పైనుండి విమానాన్ని ఢీ కొట్టిందా లేక కింది నుండి ఢీ కొట్టిందా అన్నది తెలిసి ఉండేది. క్షిపణి, ఉక్రెయిన్ ప్రభుత్వ నియంత్రణలోని భూభాగం నుండి వచ్చిందా లేక తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల స్వాధీనం లోని భూభాగం నుండి వచ్చిందా అన్నది తెలిసి ఉండేది.
నిజానికి ఈ సమాచారం నేరుగా అమెరికా గూఢచార విమానాలు కూడా రికార్డు చేశాయి. రష్యాయే మలేషియా విమానాన్ని కూల్చిందని ఆరోపించిన అమెరికా, తన రికార్డులను చూపి తన ఆరోపణలను రుజువు చేయాలని రష్యా సవాలు విసిరింది. కానీ అమెరికా చూపలేకపోయింది. ఆరోపణలను మాత్రం ఇప్పటికి కొనసాగిస్తున్నది.
ఇది అమెరికా అనుసరించే ఆధిపత్య, బెదిరింపు విధానాలలో భాగం. దాని దృష్టిలో తన వ్యాపార, ఆధిపత్య ప్రయోజనాల కోసం ఎలాంటి హీన, నాగరికతా విరుద్ధ చర్యకు పాల్పడినా తప్పు లేదు. హిరోషిమా, నాగసాకి పైన అణుబాంబు దాడిలో అది రుజువయింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అనేక నియంతృత్వ ప్రభుత్వాలకు దన్నుగా నిలబడడంలో రుజువయింది. మాట వినని అనేక చిన్న దేశాలపై దాడులు చేసిన చరిత్ర ద్వారా రుజువయింది. ఆఫ్ఘన్ దురాక్రమణ దాడి, ఇరాక్ దురాక్రమణ దాడి, లిబియా వినాశనం, సిరియా కిరాయి తిరుగుబాటుల ద్వారా మళ్ళీ మళ్ళీ రుజువయింది.