సిరియా: విచక్షణ లేకుండా బాంబులు వెయ్, నింద ప్రత్యర్థి మీదికి నెట్టేయ్!


 

అనుకున్నట్టే జరుగుతోంది. సిరియాలో కిరాయి తిరుగుబాటు ప్రవేశపెట్టిన దగ్గర్నుండి ఎలాంటి కుత్సిత ఎత్తుగడలనైతే అమెరికా శిబిరం అనుసరిస్తూ వస్తున్నదో ఇప్పుడూ అదే ఎత్తుగడ అమలు చేస్తున్నది. వారం రోజుల క్రితం రష్యాతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలులో లేకుండా చేయడానికి చేయవలసిందల్లా చేసి ఆ నెపాన్ని సిగ్గూ ఎగ్గూ  లేకుండా సిరియా-రష్యా శిబిరం మీదికి నెట్టివేస్తున్నది. 

వారం క్రితం సిరియా విషయమై అమెరికా-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని సిరియా వైపు శిబిరం పాటించేలా చూసే బాధ్యత రష్యా చేపట్టగా తిరుగుబాటు గ్రూపులు పాటించేలా చూసే బాధ్యత అమెరికా తీసుకుంది. ఒప్పందం ప్రకారం భారీ యుద్ధ సామాగ్రిని వెనక్కు తీసుకుని మానవతా క్యారిడార్ ఏర్పడేలా సిరియా సేనలు చర్యలు తీసుకున్నాయి. అలెప్పో నగరంలో యుద్ధంలో ఇరుక్కుపోయిన ప్రజలు ఈ క్యారిడార్ గుండా బైటపడాల్సి ఉన్నది. 

కానీ ఒప్పందం అమలు చేసేందుకు అమెరికా శిబిరం ఒక్క చర్యా తీసుకోలేదు. పైగా ఉల్లంఘనకే ప్రయత్నించింది. మొత్తం 302 సార్లు అమెరికా మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడ్డారని రష్యా తరపు పరిశీలక సంస్ధలు పేర్కొన్నాయి. అంతటితో ఆగలేదు. అమెరికాయే స్వయంగా రంగంలోకి  దిగింది. డెర్ ఎజ్-జోర్ రాష్ట్రంలో జబ్బత్ ఆల్-నూస్రా, ఐసిస్ గ్రూఫుల పురోగమనానికి కవర్ ఇస్తూ  సిరియా ప్రభుత్వ సైనికులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 62 మంది సిరియా సైనికులు చనిపోగా 100 మంది సైనికులు, పౌరులు గాయపడ్డారు. 

ఈ దాడిని రష్యా వెంటనే తప్పు పట్టింది. సిరియా ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ప్రశ్నించింది. దానితో అమెరికా వెనక్కి తగ్గి తాము పొరపాటు పడ్డామని, ఐసిస్ పైన దాడి చేస్తున్నామని తాము భావించామని అక్కడ సిరియా సైన్యం ఉన్నట్లు తెలియదని బుకాయించింది. అయితే అమెరికా మాటల్ని ఎవరు నమ్మలేదు. ఐసిస్ కు అమెరికాయే సాయం చేస్తున్న సంగతి ఇప్పటికే పలుమార్లు పశ్చిమ పత్రికలు సైతం వెల్లడి చేశాయి. జబ్బత్ ఆల్-నూస్రా పైన సిరియా సైన్యం దాడి చేయకుండా అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సంగతిని వెల్లడి చేశాయి.

డెర్ ఎజ్-జోర్ రాష్టంలో ఐసిస్ పై సిరియా సైన్యం పై చేయి సాధిస్తున్న క్రమంలో దానికి సమాధానంగానే అమెరికా, సిరియా సైనికులపై వైమానిక దాడులు నిర్వహించిందని అనేకమంది అంతర్జాతీయ యుద్ధ పరిశీలకులు స్పష్టం చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ దాడిలో ఒక్క అమెరికా మాత్రమే కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియా, స్వీడన్ దేశాలు కూడా పాల్గోవడం మరో ముఖ్యాంశం.

ఈ నేపథ్యంలో ఐసిస్ అనుకుని సిరియా సైన్యంపై దాడి చేసామన్న అమెరికా సాకును ఎవరు నమ్మలేదు. అమెరికాకు అనుకున్న మద్దతు రాలేదు. దానితో మరో ఎత్తుగడకు అమెరికా పూనుకుంది. అది పాత ఎత్తుగడే. ఆ ఎత్తుగడలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 20 తేదీన) హ్యుమానిటేరియన్ కాన్వాయ్ పైన వైమానిక దాడి జరిగిందని, పలువురు చనిపోయారని హఠాత్తుగా తిరుగుబాటు గ్రూపులు ప్రకటించాయి. వీడియోలు, ఫోటోలూ విడుదల చేశాయి. 

దానితో పరిస్ధితి ఏమిటో, అమెరికా ఏమి చేయనున్నదో సిరియా యుద్ధాన్ని మొదటి నుండి గమనిస్తున్నవారికి అర్ధం అయిపొయింది. రష్యాకూ అర్ధం అయింది. వెంటనే రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. ఐరాస మానవతా సాయం కాన్వాయ్ మీద దాడి జరిగిందని చెబుతున్న ప్రాంతంలో సిరియా గాని, రష్యా గాని వైమానిక దాడులు చేయలేదని సుస్పష్టంగా ప్రకటించింది. ఆల్-నూస్రా విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు చూశామని అందులో ట్రక్కులు మంటల్లో ఉన్న దృశ్యాలు తప్ప పై నుండి వైమానిక దాడి జరిగిందని చెప్పేందుకు సాక్ష్యం ఏమి కనిపించలేదని, ఫోటోలలో కూడా మంటల దృశ్యాలు, ట్రక్కుల్లో ప్యాకెట్లు చిందర వందర కావటం తప్ప దాడి దృశ్యాలు లేవని చెప్పింది. 

ఈ లోపే అమెరికా నుండి, పశ్చిమ కార్పొరేట్ మీడియా నుండి, ఐరోపా ప్రభుత్వాల నుండి ముప్పేట ప్రచార దాడి షురూ అయింది. నిష్పక్ష నిపుణులు, రష్యా, సిరియాలు అంచనా వేసినట్లుగానే హ్యుమానిటేరియన్ కాన్వాయ్ పై జరిగిన దాడి బాధ్యత పూర్తిగా రష్యాదే అంటూ ప్రకటనలు వెల్లువెత్తాయి. ఈ దాడి పర్యవసానంగా అమెరికా-రష్యాల మధ్య కుదిరిన ‘కాల్పుల విరమణ’ ఒప్పందం భగ్నం అయిందని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. దాడికి సమాధానం చెప్పాలని డిమాండ్లు అవి చేస్తున్నాయి.

కానీ సిరియా సైనికులపై దాడి జరగడం, 62 మంది చనిపోవడం, 100 మంది గాయపడడం మాత్రం పశ్చిమ పత్రికల్లో అసలు వార్తలే కావడం లేదు. మానవతా కాన్వాయ్ పై దాడిలో 20 మంది మరణానికి మాత్రం రష్యా, సిరియాలు బాధ్యత వహించాలని, ఆ దాడి వల్ల శాంతి ఒప్పందం భగ్నం కావటానికీ రష్యా శిబిరానిదే బాధ్యత అని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రచారం లోనే ప్రస్తుతం అమెరికా, ఐరోపా రాజ్యాలు, పశ్చిమ పత్రికలు, అమెరికా చెప్పే తిరుగుబాటు గ్రూపులు, ఐసిస్, ఆల్-నూస్రా గ్రూపులు నిండా నిమగ్నం అయి ఉన్నాయి. 

“మాకు అందిన సమాచారం అంతా అది వైమానిక దాడి అనే స్పష్టం చేస్తున్నది. దాని అర్ధం ఏమిటంటే వైమానిక దాడులు చేయగల రెండే రెండు సంస్ధలు దాడికి బాధ్యత వహించాలి. అవి సిరియా ప్రభుత్వం మరియు రష్యా ప్రభుత్వం మాత్రమే” అని వైట్ హౌస్ ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ ప్రకటించాడు. 

కాగా ఈ లోపు మరో నిజం వెల్లడి అయింది. అమెరికా శిబిరం ‘ఐరాస హ్యుమానిటేరియన్ కాన్వాయ్’ గా చెబుతున్న కాన్వాయ్ అసలు ఐరాస కాన్వాయ్ కాదు. దానికి ఐరాస అనుమతి లేదు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం అలాంటి మానవతా సాయానికి సిరియా ప్రభుత్వం ఆమోద ముద్ర తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ కాన్వాయ్ కి సిరియా ఆమోదం లేదు. ఆమోదం ఉంటే సిరియా, రష్యాలు దాడి చేసే సమస్యే లేదు. అది కాక సో-కాల్డ్ మానవతా సాయం కాన్వాయ్ లో ఐసిస్, జబ్బత్ ఆల్-నుస్రాలకు ఉద్దేశించిన ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు కూడా వెల్లడి అయింది. 

అత్యంత దారుణమైన, కుటిల ఎత్తుగడ ఇది. 

“ప్రత్యర్థులతో ముందు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకో. దానిని నమ్మి ఎలాగూ ఆ ప్రత్యర్ధులు కాల్పుల విరమణ పాటిస్తాయి. ఆ సందు చూసుకుని ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్ధల చేత మానవతా సాయం కాన్వాయ్ నడిపించు. వరుస ఓటములు ఎదుర్కొంటున్న సో-కాల్డ్ మోడరేట్ గ్రూపులకు, వారి మధ్యలో ఉన్న టెర్రరిస్టు గ్రూపులకు అందులో ఆయుధ సరఫరాలు అయ్యేలా చూసుకో. ఆనక ఆ కాన్వాయ్ పైన నువ్వే దాడి చెయ్యి, లేదా మీ వాళ్ళ చేత దాడి చేయించు. ఆ దాడి నెపాన్ని మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిజాయితీగా పాటిస్తున్న ప్రత్యర్థి మీదికే నెట్టేయ్!” 

ఇదే అమెరికా సిరియా తిరుగుబాటులో మొదటి నుండి అనుసరిస్తున్న ఎత్తుగడ. 

ఈ కుటిల, నీచమైన, అత్యంత హేయమైన ఎత్తుగడతోనే వేలాదిమంది సిరియా అమాయక పౌరులపైన టెర్రరిస్టు గ్రూపులతో దాడులు చేయించి, చంపించారు. ఆ చావులను చంపిన వాళ్ళ చేతనే ఫోటోలు తీయించారు. ఆ ఫోటోలు సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ చేయించిన క్రూర హత్యలు అని పశ్చిమ మీడియా చేత ఒకటే పనిగా ప్రచారం చేయించారు. ‘తన ప్రజలను తానే చంపుకుంటున్న క్రూర నియంత బషర్ ఆల్-అస్సాద్’ అని పదే పదే పదే పదే పదే పదే ప్రచారం చేయించారు. 

కానీ ఈ ప్రచారానికి సాక్ష్యాలు ఒక్కటి కూడా ఇంతవరకు అమెరికా చూపలేదు. అంతే కాదు; ఆ ప్రచారం ఎందుకు నిజం కాదో చెబుతూ అనేక స్వచంద మీడియా సంస్ధలు, పరిశోధన చేసి వెల్లడి చేశాయి. ఐరాస కూడా అమెరికా, పశ్చిమ దేశాలు ప్రచారాన్ని అధికారికంగా ప్రచారం చేస్తున్న సంగతిని వెల్లడి చేసాయి. ఈ సాక్షాలు అధికారికంగా ఐరాసకు చేరకుండా తన ఆధిపత్యాన్ని, పలుకుబడిని అన్నింటినీ అమెరికా ప్రయోగించింది.

మధ్య ప్రాచ్యంలో చమురు వాణిజ్యంపై పెత్తనం చేజారిపోతున్న నేపథ్యంలో, రష్యా-చైనా-ఇరాన్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆధిపత్యం నిలబెట్టుకునే ఏకైక లక్ష్యంతో సిరియాలో కిరాయి తిరుగుబాటును అమెరికా ప్రవేశపెట్టిందని ఇప్పటికీ గ్రహించలేకపోతే అది అమాయకత్వం అయినా కావాలి. అమెరికా ఏమీ చెప్పినా నమ్మేసే గుడ్డితనం అయినా కావాలి. లేదా పచ్చి అమెరికా పక్షపాతులు అయినా కావాలి. 

అప్ డేట్: అలెప్పో సమీపంలో సెప్టెంబర్ 19 తేదీన దాడికి గురయిన హ్యుమానిటేరియన్ కాన్వాయ్ ఐరాసకు సంబంధించినదే అని ఐరాస నిర్ధారించింది. దాడి జరిగిన మాట కూడా నిజమే అని తెలిపింది. అయితే దాడి ఎవరు చేశారన్న విషయమై ఐరాస ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తమ కాన్వాయ్ లో తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా కావడం నిజం కాదని చెప్పింది. కాన్వాయ్ కి సిరియా ప్రభుత్వ అనుమతి ఉన్నది లేనిది ఐరాస నిర్ధారించి చెప్పలేదు. ప్రస్తుతం కాన్వాయ్ పై దాడి ఎవరు చేశారన్న అంశంపై వివాదం కొనసాగుతున్నది.

One thought on “సిరియా: విచక్షణ లేకుండా బాంబులు వెయ్, నింద ప్రత్యర్థి మీదికి నెట్టేయ్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s