బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…


img_0321

[ఈ రోజు ద హిందూ ‘The road from Bratislava’ శీర్షికన  ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతథ అనువాదం]

ఒకటి తక్కువ 28 ఈయూ దేశాలు బ్రెగ్జిట్ అనంతర ప్రపంచం గురించి చర్చించడానికి సమావేశమైన బ్రటిస్లావా భవంతిలో ఐక్యత, పొందికల లేమి సుస్పష్టంగా వ్యక్తం అయింది. ఏ ఒక్కరూ ఎలాంటి భ్రమలకూ తావు ఇవ్వటం లేదు. ఈయూ ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ లు అంగీకరించారు. బ్రెగ్జిట్ అన్నది వలసల సంక్షోభం, ఇస్లామోఫోబియా, యూరోజోన్ కష్టాలు మరియు టెర్రరిస్టు దాడుల వల్ల ఖండం అంతటా వ్యాపించిన భయం, అసంతృప్తిలకు సంబంధించిన తాజా లక్షణం మాత్రమే. పరిస్ధితిని కూలంకషంగా పరీక్షించి ముందుకు సాగడానికి తగిన పంథాను నిర్దేశించడానికి వీలుగా, ఈయూకు ఎత్తుగడల దిశా నిర్దేశం చేసే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్ శుక్రవారం నాటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి వివిధ ముఠాలుగా, ప్రధానంగా ఆర్ధిక అంశాలు మరియు వలస సమస్యలపై, విడిపోయి ఉన్నందున ఇది అంత తేలికపాటి కర్తవ్యం ఏమీ కాబోదు.

వలసలు, సరిహద్దు భద్రత, టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం, రక్షణ, ఆర్ధిక మరియు సామాజిక అభివృద్ధి అంశాలపై రానున్న ఆరు నెలలకు గాను రోడ్ మ్యాప్ ను ‘బ్రటిస్లావా డిక్లరేషన్’ నిర్దేశిస్తున్నది; అలాగే బ్రస్సెల్స్ లో ‘స్టేట్ ఆఫ్ ద యూనియన్’ ప్రసంగంలో జంకర్ ప్రకటించిన చర్యలకు రాజకీయ మద్దతును సమకూర్చుతున్నది. ప్రస్తుతం ఐరోపా సరిగ్గా జెంగా బ్లాక్స్ తరహాలోనే ఉన్నది. అంతకంతకూ పలుచనవుతున్న యూనియన్ సమగ్రతను పరిరక్షించాలంటే ప్రతి ఒక్క చర్యా ఖచ్చితత్వంతో, జాగ్రత్తగా తీసుకోవలసిన అవసరం ఉన్నది. చర్యలు తీసుకోవలసిన అంశాలను డిక్లరేషన్ గుర్తిస్తున్నది. వాటిలో కొన్ని, (ఈయూ) ప్రాంతం వ్యాపితంగా వ్యూఊహాత్మక పెట్టుబడులకు నిధులు సమకూర్చడం, ఈయూ వ్యాపితంగా ఉమ్మడి పెట్టుబడి మార్కెట్ స్ధాపించడం, సరిహద్దులలో భద్రతను పెంపొందించడానికి ముందస్తు ప్రయాణదారుల వివరాలను సంపాదించడం లాంటి అంశాలు విస్తృత ఆమోదాన్ని పొందే అవకాశం ఉన్నది. వలసలు లాంటి ఇతర అంశాలు మరింత వివాదాస్పదమైనవి. ప్రతిపాదిత (వలసల) వాటాను ఆమోదించాలా లేదా అన్న అంశాన్ని నిర్ణయించడానికి వచ్చే అక్టోబర్ లో హంగేరియన్లు  ఒక జాతీయ రిఫరెండంలో ఓటు వేయనున్నారు. శరణార్థులను స్వీకరించడానికి ఈయూ సృజనాత్మకమైన, మానవతా పూర్వకమైన, ప్రభావశీలమైన పరిష్కారాన్ని ఈయూ కనుగొనాలి. మరొక వివాదాస్పద ప్రతిపాదన: యూరోపియన్ ఆర్మీ. సభ్య దేశాలు తమ రక్షణ మరియు దౌత్య వనరులను సమీకరించి కేంద్రీకృతం చేసే వైపుగా ముందుకు సాగాలని జంకర్ ప్రతిపాదించాడు. రక్షణ వనరుల సమీకరణ మరియు (యుద్ధ) నిర్వహణా శక్తి సామర్ధ్యాల విషయంలో సానుకూలతలు ఉండడం నిజమే కావచ్చు గానీ, సరిగ్గా, ఒక సమస్యకు ‘మరింత యూరోప్’ తరహా ప్రతిస్పందనను ప్రతిపాదించే ఈ ధోరణే ఈయూ సభ్య రాజ్యాలను మరియు పౌరులను భ్రమలు కోల్పోయేలా చేసి బ్రస్సెల్స్ అతి చొరబాటు పట్ల భయ కంపితులు అయేలా చేస్తున్నది. బ్రెగ్జిట్ అందించిన గుణ పాఠాలను నేర్చుకున్నట్లు  తెలియాలంటే బ్రస్సెల్స్ ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు. అది కనీసం రెండు విధాలుగా చేయవచ్చు. మొదటిగా, స్థూల చిత్రం పైనా మరియు తనకు సాపేక్షిక సానుకూలతలు ఉన్న అంశాలపైనా దృష్టి కేంద్రీకరిస్తూ , ఇతర అంశాలపై జాతీయ ప్రభుత్వాలకు నాయకత్వ పాత్ర తీసుకునేందుకు వదిలిపెట్టడం. రెండవది, ఈయూ అంశాలకు సంబంధించి -విధానాలు మరియు వాటి ఫలితాల గురించి వివరించడం, వారి అభిప్రాయాలు సేకరించడం, వారి నుండి సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడం లాంటివి- సభ్య రాజ్యాలు తమ పౌరులతో మరింత తీవ్రంగా శ్రద్ధంగా ఒడంబడిక చేసుకునేలా ప్రోత్సహించడం. ఈ చర్యలు టస్క్ మాటల్లో చెప్పాలంటే ఈ సంక్షోభాన్ని వృధాగా పోనివ్వకుండా చేయడం దిశలో ఎంతో దూరం ప్రయాణించే వలసి ఉంటుంది.

*********

ఐరోపా ప్రజలను పట్టి పల్లార్చుతున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు ఎక్కడ గాడి తప్పిపోతాయో అన్న ఆందోళనను ద హిందూ ఎడిటోరియల్ చక్కగా, తడబాటు లేకుండా వ్యక్తం చేసింది. బ్రెగ్జిట్ కు అనుకూలంగా బ్రిటిష్ కార్మికవర్గం ఎంతో ఆత్రుతతో, ఎన్నో ఆశలతో ఓటు వేసిన అంశాన్ని ద హిందూ ఆది నుండి విస్మరిస్తూ వచ్చింది. గ్లోబల్ ఫైనాన్స్ పెట్టుబడి, బ్రెగ్జిట్ వల్ల ఎదుర్కోనున్న కష్ట నష్టాలను తనవిగా ద హిందూ స్వీకరించింది. ఈ సంపాదకీయం కూడా ఆ కోవలోనిదే.

బ్రిటన్ లేకుండా జరిగిన బ్రటిస్లావా సమావేశం అధికారికమైనది కాదు. అనధికారికం మాత్రమే. అధికారికం అయితే బ్రిటన్ తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రిటన్ ఇంకా ఈయూ లో అధికారికంగా సభ్య దేశమే. బ్రిటన్ బైటికి వెళ్లిపోయే ప్రక్రియ ఇంకా మొదలే కానందున పూర్తి అయ్యే సమస్యే ఉత్పన్నం కాదు. కానీ బ్రిటన్ లేకుండా సమావేశం కావలసిన అవసరం తరుకుకు వచ్చిన నేపథ్యంలో ‘యూరోపియన్ కమిషన్’ చొరవ పేరు చెప్పి ఈయూ సభ్య దేశాలు అనధికారికంగా సమావేశం అయ్యాయి. అధికారికం అని చెబితే బ్రిటన్ ని పిలవాలి కనుక ఆ సమావేశం అనధికారికం అయింది. ఈయూ ఏ తరహా సంక్షోభంలో ఉన్నది ఈ ఒక్క అంశమే తెలియజేస్తున్నది.

“బ్రెగ్జిట్ అన్నది వలసల సంక్షోభం, ఇస్లామోఫోబియా, యూరోజోన్ కష్టాలు మరియు టెర్రరిస్టు దాడుల వల్ల ఖండం అంతటా వ్యాపించిన భయం,  అసంతృప్తిలకు సంబంధించిన తాజా లక్షణం మాత్రమే” అంటూ సంపాదకీయం పేర్కొనడం అసంపూర్ణ పరిశీలన. ఇది పొందిక లేని పరిశీలన (incoherent  observation). ఒక రోగం ఉంటుంది; దానికి లక్షణాలు ఉంటాయి. రోగ లక్షణాలకు రోగం పునాదిగా ఉంటుంది. కానీ రోగ లక్షణాలలో కొన్నింటిని విడదీసి మిగిలిన లక్షణాలకు విడదీసిన లక్షణాలను పునాదిగా చెప్పడం అర్ధవంతమైన పరిశీలన కాజాలదు.

ఈయూ ఎదుర్కొంటున్న సంక్షోభం ప్రధానంగా పెట్టుబడిదారీ సంక్షోభం. 2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభంగా బద్దలయిన ఈ సంక్షోభం ఇంకా సమసిపోక పోగా ప్రపంచం లోని వివిధ చోట్ల వివిధ రూపాల్లో ఉనికిని కొనసాగిస్తున్నది. అది ఐరోపాలో రుణ సంక్షోభంగా, అమెరికాలో పెట్టుబడి రియలైజేషన్ సంక్షోభంగా, జపాన్ లో దీర్ఘకాలిక ప్రతి-ద్రవ్యోల్బణం సంక్షోభంగా, చైనాలో పడిపోతున్న జీడీపీ సంక్షోభంగా, ఇతర బ్రిక్స్ రాజ్యాలలో ద్రవ్యోల్బణం సంక్షోభం మరియు పెట్టుబడి కొరత సంక్షోభంగా వ్యక్తం అవుతున్నది. ఐరోపాలోని రుణ సంక్షోభం కార్మికులు ఉద్యోగుల వేతనాల కోతకు, ప్రయోజనాల తగ్గింపు లేదా కోతకు, ఉద్యోగాల రద్దుకు, ప్రయివేటీకరణ తీవ్రం అయేందుకు దారి తీసింది. ఫలితంగా విశాల ప్రజా రాశుల కొనుగోలు శక్తి పడిపోయి, కొనుగోళ్లు పడిపోయి, అది కాస్తా పెట్టుబడిగా చెలామణి అయ్యే రుణాల స్వీకరణకు దారులు మూసివేసేందుకు దారి తీసింది. ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ మొత్తంలో పెట్టుబడిని -వివిధ కోశాగారా (ఫిస్కల్) చర్యల ద్వారా- అందుబాటులో తెస్తున్నప్పటికీ దానిని వినియోగించేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. దానితో ఉత్పత్తి పడిపోతుంది. మరోవైపు పాత ఉత్పత్తి షాపుల నుండి కదలడం లేదు. అంతిమంగా ఉత్పత్తి కావలసినంత ఉన్నా కొనుగోలుదారుల వద్ద డబ్బు లేదు. 

ఈ పరిస్ధితి నుండి బైటకు రావాలంటే కొనుగోలుదారుల వద్ద డబ్బు అందుబాటు పెంచడమే ఏకైక మార్గం. అనగా వేతనాలు పెంచాలి; సదుపాయాలూ పెంచాలి; ప్రయివేటీకరణ ఆపివేయాలి; ఉద్యోగాలు పెంచాలి లేదా నిరుద్యోగాన్ని తగ్గించాలి; కోత-రద్దు  విధానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ చర్యలకు కంపెనీలు ససేమిరా ఒప్పుకోవు. ఎందుకంటే ఈ చర్యలు చేపట్టాలంటే కంపెనీల పెట్టుబడిలో, లాభాల్లో వాటా వదులుకోవాలి. మిన్ను విరిగి మీదపడినా ఇది సాధ్యం కాదు. కనీసం కీన్స్ చర్యలను కూడా అంగీకరించే స్ధితిలో కూడా ఫైనాన్స్ పెట్టుబడి లేదు. 

యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలపై కూటమి పట్టు , కేంద్రీకరణ పెరిగే కొలది జాతి రాజ్యాల లేదా జాతీయ ప్రభుత్వాల శక్తి తగ్గిపోతున్నది. అనగా కూటమి సంస్ధలను -ఈయూ, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు- గుప్పెట్లో పెట్టుకున్న బహుళజాతి ద్రవ్య, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు జాతీయ ప్రభుత్వాలను సంక్షోభ నివారణ చర్యలు తీసుకోకుండా నివారించగలుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూటమిలో ఇది ప్రధాన సమస్య. ఆర్ధికంగా వేళ్ళమీద లెక్క పెట్టగల ద్రవ్య (ఫైనాన్స్) కంపెనీల పట్టు, అధికారం పెరుగుతుండడం, రాజకీయంగా జాతీయ ప్రభుత్వాల అధికారాలను ప్రజల చేత ఎన్నుకోబడని యూరోపియన్ కూటమి సంస్ధలు లాక్కోవడం అనే జంట సమస్యలు యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ జంట సమస్యలకు మూలం పైన చెప్పుకున్నట్లు సాధారణ పెట్టుబడిదారీ సంక్షోభం. 

ద హిందూ చెప్పిన సమస్యలన్నీ -వలసల సంక్షోభం, ఇస్లామోఫోబియా, యూరోజోన్ కష్టాలు మరియు టెర్రరిస్టు దాడుల వల్ల ఖండం అంతటా వ్యాపించిన భయం,  అసంతృప్తి- బ్రెగ్జిట్ తో పాటుగా వ్యక్తం అవుతున్న జంట సమస్యల రోగ లక్షణాలు. జంట సమస్యల రోగ లక్షణంలో ఒకటిగా బ్రెగ్జిట్ ను ఐరోపా పౌరులు వ్యక్తం చేశారు. ఈ జంట సమస్యల రోగం నయం అయితే తప్ప బ్రెగ్జిట్ తో పాటు ఇతర లక్షణాలు రూపుమాసిపోవు. జంట సమస్యల రోగాన్ని గుర్తించడం అంటే అది పెట్టుబడిదారీ మౌలిక సంక్షోభాన్ని గుర్తించడమే. ఇది ఎలాగూ ఫైనాన్స్ పెట్టుబడి గుప్పిట ఉన్న ఐరోపా రాజ్యాల ప్రభుత్వాలు గానీ, ఐరోపా కూటమి సంస్ధలు గానీ చేపట్టవు. కనుక ప్రజలే రోగాన్ని నయం చేయడానికి పూనుకోవాలి. కానీ ఇది అత్యంత కష్ట సాధ్యం; కంటక ప్రాయం; కఠినమైన త్యాగాలు చేయాలి. అయినా గాని అదే సరైన, స్థిరమైన, ఖచ్చితమైన, నిఖార్సయిన మార్గం. తేలికగా ఉంది కదాని మారే మార్గం వెతుక్కున్నా మళ్ళీ బయలుదేరిన చోటనే తేలక తప్పదు. 

కనుక బ్రటిస్లావా నుండి వచ్ఛే రోడ్డు  నిరాటంకంగా లక్షిత గమ్యం వైపు సాగిపోవాలని ద హిందూ కోరుతోంది. అనగా ఫ్రాంక్ ఫర్ట్, ద సిటీ, ప్యారిస్ లాంటి ద్రవ్య కేంద్రాల సంక్షోభం ప్రజలకు వ్యతిరేకంగా, జాతీయ ప్రభుత్వాల అధికారాలు నానాటికి కుచించుకుపోయే దిశలో పరిష్కారం కావాలని ద హిందూ కోరుతోంది. అందుకోసం మానవ ముసుగు తొడుక్కుని, రాక్షస మొఖం దాచుకుని, ముందుకు వెళ్లాలని సలహా ఇస్తోంది. ఇది ప్రజలను మోసగించాలని చెప్పడమే. 

3 thoughts on “బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…

  1. అర్ధమవ్వడం కష్టంగా ఉందండీ, back ground ఇన్ఫర్మేషన్ కోసం, దీనికి ముందు మీరు రాసిన మరే post లైనా చదవాలేమో, అలా ఏవైనా ఉంటే సూచించండి.

  2. కళ్యాణి గారు, ఈ ఆర్టికల్ ట్యాగ్స్ సైడ్ బార్ లో పైన ఉన్నాయి చూసారా! వాటిలో ఋణ సంక్షోభం, పొదుపు విధానాలు అన్న ట్యాగ్ ల పైన క్లిక్ చేస్తే కొన్ని పాత పోస్టులు కనిపిస్తాయి. వాటిని చదివితే కొంత అవగాహన వస్తుంది.

    అలాగే ‘ఐరోపా ఋణ సంక్షోభం’ అని గానీ, ‘యూరప్ ఋణ సంక్షోభం’ అని గానీ సర్చ్ బాక్స్ లో టైప్ చేసి వెతకండి మరి కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. తెలుగు టైప్ లేకపోతే ఈ వ్యాఖ్యలోనే కాపీ చేసి సర్చ్ బాక్స్ లో పేస్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ మీరు తెలుగులోనే టైప్ చేస్తున్నారు గనక ఆ అవసరం లేకపోవచ్చు. ఉన్నా కాపీ పేస్ట్ తేలిక కదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s