రాం కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, కాదు… ఆత్మహత్య చేసుకున్నాడని పూళల్ సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నారు.
ప్రాణాధికంగా ప్రేమించిన యువతి తన రూపాన్ని అపహాస్యం చేయడం సహించలేక హంతకుడిగా మారిన భగ్న ప్రేమికుడు రాం కుమార్ తన వాస్తవ ప్రేమ కధ ఏమిటో లోకానికి తెలియకుండానే భూమిపైన నూకలు చెల్లించుకున్నాడు.
జైలులోని డిస్పెన్సరీలో ఉండగా రాం కుమార్ అక్కడి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు నుండి విద్యుత్ ప్రవహిస్తున్న తీగను బైటికి లాగి నోటితో కరిచి పెట్టుకున్నాడని, దానితో షాక్ తగిలి మరణించాడని జైలు అధికారులు చెబుతున్నారు.
కానీ రాం కుమార్ విద్యుత్ తీగను స్విచ్ బోర్డు నుండి బైటికి లాగుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు.
ఏదో పెద్ద శబ్దం కావడంతో పరుగెత్తుకు వెళ్ళి చూడగా రాం కుమార్ కింద పడి కనిపించాడని మాత్రమే చెబుతున్నారు తప్ప రాం కుమార్ విద్యుత్ తీగను నోట్లో పెట్టుకోగా ఫలానా వ్యక్తి చూశాడని చెప్పడం లేదు.
దానితో రాం కుమార్ నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాం కుమార్ హత్యతో అతను హత్య చేశాడని చెబుతున్న స్వాతి మరణం కూడా అధికారికంగా అంతు చిక్కని మిస్టరీగా మిగలనుంది. రాం కుమార్ పైన చార్జి షీటు పూర్తి చేసి కోర్టులో దాఖలు చేయనున్నారని చెబుతుండగా అతను చనిపోవడం అనుమానాల్ని రెట్టింపు అయ్యేలా చేసింది.
రాం కుమార్ కు వ్యతిరేకంగా పక్కా సాక్షాలు సేకరించామని పోలీసులు చెప్పిన మాటలు నిజం కాదా? రాం కుమార్ బంధువులు, కొందరు అడ్వకేట్లు చెబుతున్నట్లు అతను నిర్దోషా? అసలు నేరస్ధులను కాపాడేందుకు పేదవాడైన రాం కుమార్ ని దోషిగా చేశారన్న ఆరోపణలు నిజమేనా?
ఈ అనుమానాలు తీరే దారి రాం కుమార్ ఆత్మహత్య/హత్యతో పూర్తిగా మూసుకుపోయింది.
రాం కుమార్, స్వాతిని హత్య చేశాడని చెప్పిన రోజున అతను ఆకు పచ్చ, తెలుపు గళ్ళ చొక్కా ధరించి ఉన్నాడని పోలీసుల కధనం. స్వాతి రక్తపు మరకలతో ఉన్న గళ్ళ చొక్కాను ఏ ఎస్ మాన్షన్ లో అతను అద్దెకు ఉంటున్న గది నుండి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

Political parties protest in front of Govt Raypetta Hospital in Chennai
గళ్ళ చొక్కాకు అంటిన రక్తపు మరకల నుండి డిఎన్‌ఏ సేకరించి పరీక్షలు జరిపించామని సదరు డిఎన్‌ఏ స్వాతి డిఎన్‌ఏ తో సరిపోలిందని పోలీసులు చెప్పారు. స్వాతి ఫోన్ ను రాం కుమార్ నుండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్వాతి ఫోన్ నుండి ఆమె ఫోటోలను రాం కుమార్ తన ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకున్నాడని చెప్పారు.
స్వాతిని రాం కుమార్ కొడవలితో నరికాడని, ఆ కొడవలిని కూడా స్వాధీనం చేసుకున్నామని కొడవలి పైన వేలి ముద్రలు రాం కుమార్ వేలి ముద్రలతో సరిపోలాయని చెప్పారు.
కానీ ఇవన్నీ చెప్పింది పోలీసులే. పోలీసుల సాక్షాలు కోర్టులో పనికిరావు. కొడవలిపై వేలి ముద్రలు, స్వాతి రక్తపు మరకలు ఉన్న గళ్ళ చొక్కా చొక్కా మెటీరీయల్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి. రాం కుమార్ పాత్రను అవి తిరుగు లేకుండా రుజువు చేస్తాయి.
కానీ ఆరుషి హత్య కేసులో ఇవే రకం వేలి ముద్రలు, ఇదే తరహా రక్తపు మరకలతో ఉన్న దిండు కవరు అన్నీ కలిసి ఆ ఇంట్లోని (మగ) పని మనిషి స్నేహితుల వైపు వేలెత్తి చూపినా సిబిఐ గానీ కోర్టులు గానీ పట్టించుకోలేదు. ఆరుషి కన్న తల్లి దండ్రులనే పూర్తిగా పరిస్ధితుల సాక్షాలపై ఆధారపడి ఆరుషి కన్న తల్లి దండ్రులను దొషులుగా నిర్ధారించి యావజ్జీవ శిక్ష వేశేసాయి కోర్టులు. ఆరుషి తల్లిదండ్రుల నిర్దోషిత్వాన్ని రుజువు చేస్తూ తెహెల్కా లాంటి పత్రికలు కధనాలు ప్రచురించాయి.
ఆరుషి హత్య, పోలీసు విచారణ, సిబిఐ విచారణ, కోర్టులలో విచారణ అన్నీ వివరిస్తూ పుస్తకం కూడా ప్రచురించబడింది. ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్ లు మాత్రం యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ సుప్రీం కోర్టులో తమ అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నారు.
ఆరుషి హత్య కేసులో పనికి రాకుండా పోయిన మెటీరీయల్ ఎవిడెన్స్, పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా అసలే లేని మెటీరీయల్ ఎవిడెన్స్, స్వాతి హత్య కేసులో రామ్ కుమార్ కి వ్యతిరేకంగా పక్కాగా ఉన్నాయని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.
ఎలా నమ్మడం? మెటీరీయల్ ఎవిడెన్స్ ఉన్న చోట దోషులు నిర్ధోషులై, నిర్దోషులు దోషులయ్యారు. మెటీరీయల్ ఎవిడెన్స్ ఒక్కటీ లేకపోయినా పోలీసులు అల్లిన పరిస్ధితుల సాక్ష్యాలే ఒక అమాయకుడిని దోషిని చేసి ఉరికూడా తీసేశాయి. అలాంటప్పుడు రామ్ కుమార్ కు వ్యతిరేకంగా స్వాతి హత్య కేసులో ఉన్నాయని చెబుతున్న మెటీరీయల్ సాక్షాలను ఎలా నమ్మడం?
ఈ ప్రశ్నను రామ్ కుమార్ ఆత్మహత్య మరింతగా బలీయం కావిస్తున్నది. డిస్పెన్సరీలో ఉండగా కరెంటు తీగను నోటితో కరిచి పట్టుకున్నాడని అన్ని పత్రికలూ చెప్పడం లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే డిస్పెన్సరీ అంటూ చెబుతోంది. ఇతర పత్రికలన్నీ రామ్ కుమార్ కరెంటు తీగను నోటితో పట్టుకున్నాడని మాత్రమే చెబుతున్నాయి తప్ప ఎక్కడో చెప్పలేదు.
స్వాతిని హత్య చేసిన వెంటనే రామ్ కుమార్ తన గదికి వెళ్ళి కంటి నిండా నిద్ర పోయాడని, గాఢంగా నిద్ర పోయాడని ఆ తర్వాత తన ఊరికి వెళ్లాడని పోలీసులు ఓ సారి చెప్పారు. హత్య అయ్యాక గదికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెంటనే తన ఊరు వెళ్ళేందుకు తిరునల్వేలి బస్సు ఎక్కాడని మరోసారి చెప్పారు. భిన్న కధనాలు అనుమానాల్ని పెంచుతున్నాయే తప్ప తగ్గించడం లేదు.
చావుకు దారి తీసే విధంగా కరెంటు తీగను పట్టుకున్నపుడు శరీరం కాలిపోతుంది. రామ్ కుమార్ శరీరం కాలినట్లు ఏ పత్రికా చెప్పలేదు. పోలీసులూ చెప్పలేదు. ‘అసాధారణ శబ్దం’ వినగా పరుగెట్టుకు వెళ్ళిన సిబ్బంది రామ్ కుమార్ ని ఏ స్ధితిలో చూశారు? స్పృహ కోల్పోయి ఉన్నాడా లేక మెలకువగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడా? ఎవరూ చెప్పలేదు.
రామ్ కుమార్ ని మొదట జైలు ఆసుపత్రికి తీసుకెళ్లామని, ఆ తర్వాత గవర్నమెంట్ రాయపేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు చెబుతున్నారు. అసలు రామ్ కుమార్ కరెంటు తీగని పట్టుకున్నదే డిస్పెన్సరీలో అయినప్పుడు మళ్ళీ జైలులో ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు? ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది నిజం కాదా?
జైలు ఆసుపత్రిలో రామ్ కుమార్ జీవంతోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. రాయపేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాక అప్పటికే మరణించి ఉన్నట్లు వైద్యులు చెప్పారని ఆ పోలీసులే చెప్పారు. అంటే జైలు ఆసుపత్రి నుండి రాయపేట్ ఆసుపత్రికి వెళ్తుండగా అతను చివరి శ్వాస తీసుకున్నాడు. అయితే జైలు ఆసుపత్రిలో ఎంతసేపు ఉన్నదీ, జైలు ఆసుపత్రి నుండి రాయపేట్ ఆసుపత్రికి వెళ్లడానికి ఎంత సమయం తీసుకున్నదీ, వెంటనే తీసుకెళ్ళారా లేక ఆలస్యం అయిందా అన్నది చెప్పేందుకు పోలీసులు నిరాకరించారని పత్రికలు చెబుతున్నాయి!
ఈ కేసులో రామ్ కుమార్ తరపున అతని తల్లి దండ్రులు ఏం చెప్పారో ఏ పత్రికా ఇంతవరకు చెప్పలేదు. తమిళ పత్రికలు ఏమన్నా చెప్పాయో లేదో తెలియదు. బైటికి వచ్చిన సమాచారం అంతా పోలీసులు చెప్పిందే.
రైల్వే స్టేషన్ పక్కన రోడ్డు పైన బ్యాక్ పాక్ తో నడిచి వెళ్తున్న గళ్ళ చొక్కా యువకుడి సిసిటివి వీడియోను విడుదల చేసి అతనే హంతకుడు అని పోలీసులు లోకానికి మొదట చెప్పారు. కానీ అతనే హంతకుడు అని ఎందుకు, ఎలా చెప్పారో వివరం లేదు. చివరికి ఆ గళ్ళ చొక్కా వ్యక్తి దొరికాడు గానీ అతనే హంతకుడని ఎందుకు భావించారో చెప్పలేదు. ఆ తర్వాత గళ్ళ చొక్కా దొరికిందని దానికి స్వాతి రక్తం మరకలు ఉన్నాయని చెప్పారు.
అనుమానాలు తొలగడానికి మిగిలి ఉన్న అవకాశం కోర్టు విచారణ. రామ్ కుమార్ హత్య/ఆత్మహత్యతో ఆ అవకాశం మూసుకుపోయింది. పోలీసు, న్యాయ వ్యవస్ధను నీతిగా, నిజాయితీగా విచారణ జరిపి అసలు దొషులకు శిక్ష విధిస్తాయన్న నమ్మకం ఉన్నట్లయితే ఈ అనుమానాలు ఉండవు. కానీ దొంగలతో, నేరస్ధులతో, దోపిడీ శక్తులతో పోలీసు, న్యాయ వ్యవస్ధలు చెట్టాపట్టాలు వేసుకుని నడుస్తున్నాయని జనానికి తెలియడం వల్లనే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఒకరిద్దరు నిజాయితీపరులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు తమ పని తాము చేయనివ్వకుండా ఎన్నో అడ్డంకులను వ్యవస్ధ సృష్టిస్తోంది.
అందుకే ఈ అనుమానాలు!
అనుమానాలు నిజమేనా అన్నట్లుగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రామ్ కుమార్ మరణంపై సుమోటుగా విచారణ కు ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటుగా విచారణకు ఆదేశించడం చూసి ‘ఆహా వ్యవస్ధ బాగానే పని చేస్తున్నది సుమీ!’ అనిపించక మానదు. అదిగో అలా అనిపించడానికే ఎస్‌హెచ్‌ఆర్‌సి సుమోటు విచారణ!
రామ్ కుమార్ ఆత్మహత్య అనంతరం తమిళనాడులో వివిధ పార్టీలు ఆందోళన చేపట్టాయి. రాస్తా రోకో నిర్వహించాయి. చెన్నైలో రాయపేట్ ఆసుపత్రి వద్ద నిరసన ప్రదర్శన చేశాయి. రామ్ కుమార్ ను హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఆందోళనలను సంతృప్తిపరిచేందుకే ఎస్‌హెచ్‌ఆర్‌సి సుమోటు యాక్షన్! సుమోటో అంటారు గాని ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా జడ్జిలు సుమోటో చర్యలకు సాధారణంగా దిగరు!
ఎన్‌హెచ్‌ఆర్‌సి/ఎస్‌హెచ్‌ఆర్‌సి విచారణలు ఎందుకూ కొరగావు. అదొక పేపర్ టైగర్. కోరలు లేని తాచుపాము. ఎంత విచారించినా, ఎంత బుస్సుమన్నా ప్రభుత్వానికి సిఫారసులు మాత్రమే ఎన్‌హెచ్‌ఆర్‌సి చేయగలదు.
ఎన్‌హెచ్‌ఆర్‌సి/ఎస్‌హెచ్‌ఆర్‌సి స్ధాపన ద్వారా పాలకులు సాధిచదలచిన ఏకైక ప్రయోజనం ఆందోళనలను పక్కకు మళ్లించడం, ఏదో చేయబోతున్నారన్న ఆశలు కల్పించి ఆందోళనలను చల్లార్చడం. నాలుగు రోజులు ఆందోళన చేశాక జనం మళ్ళీ తమ బతుకు పోరాటం లోకి వెళ్ళక తప్పదని రాజ్యానికి బాగానే తెలుసు. జనం ఆందోళనకు స్పందించామని చెప్పేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సి రంగం లోకి దిగుతుంది. జనం ఇళ్లకు వెళ్తారు. ఆ తర్వాత కధ కంచికి వెళ్లిపోతుంది.