నాతొ వస్తే సిగ్గుకు అర్ధం నేర్పుతా! -అమెరికాతో రష్యా రాయబారి


Maria Zakharova -U.N. envoy for Russia


ఐసిస్ పురోగమనానికి వీలుగా సిరియా సైన్యంపై వైమానిక దాడులు నిర్వహించి 80 మంది వరకు ప్రభుత్వ సైనికులను బలిగొన్నందుకు అమెరికాపై సిరియా కాస్త ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన డెర్ ఎజ్-జోర్ లోనే ఆకాశంలో ఎగురుతున్న అమెరికన్ గూఢచార డ్రోన్ విమానాన్ని సిరియా సైన్యం కూల్చివేసింది. 

అమెరికా-రష్యాల మధ్య కొద్దీ రోజుల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం టెర్రరిస్టు. సంస్ధల వల్ల ఉల్లంఘనకు గురవుతుందని అందరూ భావిస్తుండగా అమెరికాయే ఒప్పందాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ  నేరుగా సిరియా సైనికుల పైననే వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 80 మంది వరకు సిరియా సైనికులు మరణించగా 100 కు పైగా గాయపడ్డారని ప్రెస్ టివి చెప్పగా 62 మంది చనిపోయారని స్పుత్నిక్ న్యూస్ తెలిపింది. 

దాడి పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది. వెంటనే ఐరాస భద్రతా సమితి అత్యవసరంగా సమావేశం కావాలని తాఖీదు పంపింది. సమావేశానికి హాజరై ఒప్పందం ఉల్లంఘించడానికి కారణాలు ఏమిటో వివరణ ఇచ్చుకోవడానికి బదులుగా అమెరికా ఎదురు దాడికి తెగబడింది. ఐరాసలో అమెరికా రాయబారి సమంతా పవర్, అత్యవసర సమావేశానికి రష్యా పిలుపు ఇవ్వడాన్ని ‘స్టంట్’ గాను, ‘గేమ్’ గాను అభివర్ణించింది. కానీ ఒప్పందాన్ని తానె ఉల్లంఘించడానికి కారణాలు ఇవ్వడంలో మాత్రం విఫలం అయింది. 

ఈ నేపథ్యంలో సమంతా పవర్ ప్రకటనను ఐరాసలో రష్యా రాయబారి ప్రతిదాడితో అపహాస్యం చేస్తూ  ప్రకటన విడుదల చేసింది. మరో వైపు అమెరికా దాడి చేసిన చోటనే ఎగురుతున్న అమెరికన్ డ్రోన్ విమానాన్ని సిరియా సైన్యం కూల్చివేసింది. ఈ మేరకు ప్రెస్ టి.వి వార్త ప్రసారం చేసింది. డెర్ ఎజ్-జోర్ రాష్ట్రంలో జబల్ తెర్డెన్ ప్రాంతం లోని కొండలపై ఎగురుతున్న అమెరికన్ యూఏవీ (Unmanned Arial Vehicle) ని సిరియా సైన్యం కూల్చివేసిందని ప్రెస్ టీవీ తెలిపింది.

ఆల్-మస్దర్ న్యూస్ ఏజనేసి ప్రకారం భద్రతా సమితి ఎమర్జెన్సీ సమావేశానికి హాజరైన సమంతా పవర్ కొద్దీ సేపు కూడా ఆ సమావేశంలో ఉండలేదు. సమావేశం ప్రారంభం అయిన వెంటనే బైటికి వెళ్లిపోయిన సమంత పవర్ విలేఖరుల సమావేశం ఏర్పరిచి రష్యా, సిరియాలపై విద్వేషం వెళ్లగక్కింది. విలేఖరుల సమావేశంలో సైతం ఆమె తాము సిరియాపై దాడి చేసి పెద్ద సంఖ్యలో సైనికులను చంపడానికి కారణం ఏమిటో వివరించడానికి పూనుకోలేదు. 

మొదటి అర నిమిషం పాటు తాము పొరబాటుగా సిరియా సైన్యంపై దాడి చేశామని, ప్రాణ నష్టం జరగడం పట్ల చింతిస్తున్నామని చెప్పడానికి గడిపిన సమంతా పవర్ ఆ తర్వాత 15 నిమిషాల కాలాన్ని అబద్ధాలు, వక్రీకరణలతో రష్యా, సిరియాలపై ద్వేషం వెళ్లగక్కడానికి ఖర్చు చేసింది. అసలు ఎమర్జెన్సీ సమావేశానికి పిలుపు ఇవ్వడమే తప్పు అన్నట్లుగా మాట్లాడింది. “ఈ రాత్రి ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి? గ్రౌండ్ పైన జరుగుతున్నా దాని నుండి దృష్టి మళ్లించడానికే ఈ సమావేశం. వాస్తవంగా గ్రౌండ్ పైన జరుగుతున్నది మీకు ఇష్టం లేకపోతె మీరు అందరి దృష్టిని దారి మళ్లించేందుకు కృషి చేస్తారు… దానికి బదులు అస్సాద్ ప్రభుత్వంతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి ఒప్పందం అమలు అయ్యేట్లు చూడాలని మేము రష్యన్ ఫెడరేషన్ ని ప్రోత్సహిస్తున్నాము” అని సమంతా పవర్ రష్యాకు సుద్దులు చెప్పింది. 

Samantha Power -UN envoy for the U.S.

 

సమంతా పవర్, రష్యాకు ఏ తప్పులనైతే ఆపాదించిందో సరిగ్గా అవే తప్పులను ఐదేళ్లుగా అమెరికా చేస్తుండడం గమనార్హం. అసలు ఓం ప్రధమం సిరియాలో కృత్రిమ తిరుగుబాటుకు ప్రోత్సాహం ఇచ్చింది అమెరికాయే. దాయెష్ / ఐసిస్ బలగాలను సౌదీ, కతార్ ల ద్వారా సమీకరించి టర్కీలో శిక్షణ ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టింది అమెరికాయే. అయిదేళ్లుగా సిరియాలో 4 లక్షల మందికి పైగా పౌరులు మరణించడానికి 12 లక్షల మందికి పైగా శరణార్థులుగా మారడానికి కారణం అయింది అమెరికాయే. రష్యా, ఇరాన్ ప్రయోజనాలకు అనుగుణంగా మధ్య ప్రాచ్యంలో సరికొత్త పైపు లైన్లు  నిర్మాణం కాకుండా అడ్డుకోవడానికి, తద్వారా పెట్రోలియం వాణిజ్యం లో డాలర్ ప్రభ కూలిపోకుండా కాపాడుకోవడానికి, రష్యా, చైనాలు పై చేయి సాధించకుండా నిరోధించడానికి సిరియా తిరుగుబాటును సృష్టించిన అమెరికా ఇప్పుడు, తన అసలు రంగు బయటపడుతున్న క్షణాలలో తగుదునమ్మా అంటూ నీతులు చెప్పబూనడం అమెరికాకు అలవాటైన పాచ్చ్చి హిపోక్రసి మాత్రమే.     

అమెరికా దాడి అనంతరం రష్యా అదే ప్రాంతంలో ఉధృతంగా వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా వైమానిక దాడుల మద్దతుతో సిరియా ప్రభుత్వ బలగాల నుండి ఐసిస్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను సిరియా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దోహదం చేసింది. డెర్ ఎజ్-జోర్ సరిహద్దు వెంబడి ఐసిస్ ఆధీనంలోని ప్రాంతాలపై విస్తృతంగా దాడులు నిర్వహించింది.  

సిరియా సైన్యం పై పొరబాటున దాడి చేసినందుకు, ప్రాణ నష్టం జరిగినందుకు అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఓ పక్క  విచారం ప్రకటిస్తూనే మరో పక్క తన దాడికి మళ్ళీ అమెరికాయే కారణం అంటూ నిందించింది. ఫలానా చోట దాడి చేరుస్తున్నట్లు తాము ముందే రష్యాకు సమాచారం ఇచ్చామని అయినా తదనుగుణమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. రష్యా తన చర్యకు తానే సిగ్గుతో తల దించుకోవాలని నిందించింది.  

అయితే ఇది నిజం కాదని రష్యా వెంటనే ప్రకటించింది. తాము కోరినప్పుడు కూడా దాడుల విషయమై సమాచారం ఇవ్వడానికి ఒప్పుకొని అమెరికా ఇప్పుడు హఠాత్తుగా సిరియా సైన్యాన్ని కాపాడేందుకు, డాయిష్ / ఐసిస్ బలగాలను మట్టుబెట్టేందుకు పూనుకున్నదంటే నమ్మశక్యం కానీ విషయమని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి ఛుర్కిన్ దాడి జరిగిన రోజు (శనివారం, 17/09/2016) దుయ్యబట్టారు.

ఆ మరు క్షణమే రష్యా ఐరాస రాయబారి మరియా జఖరోవా అమెరికా రంగును మరింతగా బయటపెట్టారు. సమంతా పవర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన చోటనే విలేఖరుల సమావేశం పెట్టి అమెరికా దుర్నీతిని కడిగివేసారు. అమెరికా ప్రభుత్వం స్వయంగా ఐసిస్ తీవ్రవాదులకు రక్షణగా నిలిచిందని, అందుకోసమే పధకం ప్రకారమే సిరియా సైన్యంపై వైమానిక దాడులు నిర్వహించి ఐసిస్ పురోగమనానికి దోహదం చేసిందని వివరించారు. 

“డియర్ సమంతా పవర్! ‘సిగ్గుతో తలదించుకోవడం’ అంటే ఏమిటో అర్ధం తెలుసుకోవడానికి మిమ్మల్ని సిరియా ప్రయాణించాలని అక్కడి సిరియా ప్రజలతో స్వయంగా మాట్లాడాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. సిరియా ప్రజలు అంటే ఆల్-నూస్రా మిలిటెంట్లు కాదు సుమా! మీరు చెప్పే, మీరు ఎవరి మానవతా సంక్షోభం గురించి తీవ్రంగా అల్లాడిపోతున్నారో ఆ మోడరేట్ ప్రతిపక్షం కూడా కాదు; సిరియాకు న్యాయం పేరుతొ ఆ దేశంలో ఉన్న పశ్చిమ పోరాట వీరులు అసలే కాదు; ఆరేళ్లుగా తమ సొంత గడ్డపై వాషింగ్టన్ ప్రయోగాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ గడ్డను వీడిపోని వాస్తవ సిరియా ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను.  

“రండి మనిద్దరం కలిసే వెళదాం రండి. నా ఆహ్వానానికి ఔను అని చెప్పండి చాలు. భయపడవద్దు! నా సమక్షంలో మీ పైన ఒక్క వేలు కూడా పడకుండా చూసుకుంటాను. ఆఫ్ కోర్స్! మీరు మళ్ళీ ‘పొరబాటున’ తప్పుడు టార్గెట్ పైన బాంబు దాడులు చేస్తే తప్ప! మీరు నాతొ రాగలిగితే మీకు అద్వితీయమైన సరికొత్త జ్ఞాపకాలు మూటగట్టుకుంటారు. ‘సిగ్గుతో తలదించుకోవడం’ అన్న మాటలకు నిజమైన అర్ధం ఏమిటో తెలుసుకుంటారు” అని మరియా జఖరోవా తీవ్ర స్వరంతో అమెరికాను సవాలు చేశారు.

జఖరోవా విసిరిన సవాలుకు అర్ధం ఏమిటో స్పష్టమే!. సిరియా అధ్యక్షుడు తన ప్రజలపై తానే బాంబులు వేస్తున్నాడని, తన ప్రజల్ని తానే చంపుతున్నాడని, పచ్చి నియంత అని అమెరికా పదే పదే బషర్ ఆల్-అస్సాద్ పైన ఆరోపణలు గుప్పించింది. వాస్తవం ఏమిటి అంటే అమెరికా శిక్షణ ఇఛ్చి ప్రవేశపెట్టిన ఐసిస్, ఆల్-నుస్రా టెర్రరిస్టులను మట్టుబెట్టినప్పుడల్లా ఆ టెర్రరిస్టులనే సిరియా పౌరులుగా చెబుతూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తప్పుడు ప్రకటనలు విడుదల చేయడం. తన తప్పుడు ప్రకటనలకు అమెరికా గాని, ఆ వార్తలను ప్రచారంలో పెట్టిన పశ్చిమ కార్పొరేట్ మీడియా గాని ఎన్నడూ సాక్షాలు చూపలేదు. వారికి ఉన్న ఒకే ఒక సాక్షం లండన్ నుండి నడిచే ఇక వ్యక్తి మీడియా సంస్ధ ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమర్ రైట్స్ (SOHR). సో-కాల్డ్ తిరుగుబాటు గ్రూపులు అందించే ఏకపక్ష తప్పుడు సమాచారాన్ని అభిజ్ఞ వర్గాల సమాచారంగా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ప్రచారంలో పెట్టి సిరియా అధ్యక్షుడిపై కట్టు కధలు వ్యాప్తి చేశాయి. 

ఈ సంగతిని జఖరోవా తన మాటల్లో పరోక్షంగా తెలియజేస్తూ అమెరికాను ఎత్తిపొడిచారు. తనతో వస్తే ఒక్క వేలు కూడా సమంతా పవర్ పై వాలకుండా చూస్తానని చెప్పడం ద్వారా ఆల్-నుస్రా, ఐసిస్ లపై అమెరికాకు పూర్తి నియంత్రణ (కంట్రోల్) లేదన్న సంగతిని ఎత్తిచూపారు. సిరియాలో మానవతా సంక్షోభం నెలకొన్నదని, దానిని పరిష్కరించడానికి సిరియాపై సైనిక దాడులు చేయాలని అమెరికా పదే పదే ఐరాసను కోరడానికి అసలు కారణం సిరియా ప్రభుత్వ బలగాల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న ఆల్-నూస్రా, ఐసిస్ బలగాలను రక్షించడమే అని జఖరోవా తెలియజేసారు. 

రష్యా, సిరియా ప్రభుత్వాలు ముందే ఉహించి చెప్పినట్లుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని సిరియా ప్రతిపక్ష గ్రూఫులే ఉల్లంఘించారు. అయితే ఈసారి ఉల్లంఘన టెర్రరిస్టుల వైపు నుండి కాకుండా నేరుగా అమెరికా నుండి జరగడమే అసలు వార్త! టెర్రరిస్టు బలగాలను ఓటమి నుండి కాపాడేందుకు ఓ వైపు రష్యాతో మోసపూరిత చర్చలు చేస్తూనే మరోవైపు ఆ ఒప్పందాలను బొందలో కలిపెందుకు అమెరికాయే స్వయంగా పూనుకోవడం ప్రపంచ ప్రజలు గుర్తించవలసిన విషయం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న టెర్రరిజానికి అసలు సృష్టికర్త అమెరికాయే అని, అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడమే ఈ టెర్రరిస్టు గ్రూపుల లక్ష్యం అని ప్రజలు గుర్తించిన రోజున అమెరికా మోసాలు ముందుకు సాగలేని పరిస్ధితి ఏర్పడుతుంది. 

One thought on “నాతొ వస్తే సిగ్గుకు అర్ధం నేర్పుతా! -అమెరికాతో రష్యా రాయబారి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s