
f-16-fighter-jets
ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకుంటున్న అమెరికా వాస్తవంలో దానికి మద్దతు ఇస్తున్నదని మరోసారి రుజువు అయింది. ఇస్లామిక్ స్టేట్ బలగాలపై పోరాడుతున్న సిరియా ప్రభుత్వ సైన్యాలపై అమెరికన్ ఫైటర్ జెట్ విమానాలు బాంబులు కురిపించి 60 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయి. దానితో అమెరికా వాస్తవానికి ఇసిస్ తరపున సిరియా ప్రభుత్వ బలగాలతో తలపడుతున్నదని స్పష్టం అయిపోయింది.
శనివారం సాయంత్రం సమయంలో అమెరికా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. దాడి జరిగిన వెంటనే రష్యా ఆగ్రహోదగ్రం అయింది. అమెరికా సైనిక చర్యలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. వెంటనే భద్రతా సమితి సమావేశం ఏర్పాటు చేయాలని ఐరాసను డిమాండ్ చేసింది. కాగా తమ బలగాలు ఉద్దేశ్యపూర్వకంగా సిరియా సైన్యంపై దాడి చేయలేదని, జరిగిన ప్రాణ నష్టానికి గాను క్షమాపణ చెబుతున్నామని అమెరికా అధికారులు ప్రకటించారు.
కానీ సైనిక దాడుల విషయంలో పొరపాటు పడే విధంగా అమెరికా సైన్యం వెనుకబడి లేదు. సిరియాలో డేర్-ఏజ్-జోర్ ప్రాంతంలో ఏ సైన్యం ఎక్కడ కొలువు తీరి ఉన్నదీ అమెరికా, రష్యా, టెర్రరిస్టు బలగాలకు కొట్టిన పిండి. వారు పొరపాటున వైమానిక దాడులు జరిపే అవకాశం లేనే లేదు. ఏ మాత్రం పొరబాటు పడినా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ప్రపంచ పరిణామాల పైన తీవ్ర ప్రభావం పడవేస్తాయని తెలిసినప్పటికీ అనుకోకుండా పొరబాటు జరిగినట్లు చెప్పడం బొత్తిగా అర్ధం కాని విషయం.
ఈశాన్య సిరియాలో ఇస్లామిక్ స్టేట్ బలగాలపై దాడులు చేశామని తాము భావించామని కాని పొరబాటున సిరియా సైనిక బలగాలపై దాడి చేశామని అమెరికా ప్రకటించింది. జరిగిన పొరబాటుకు చింతిస్తున్నామని తెలిపింది. కాని అమెరికా-రష్యాల మధ్య రెండు రోజుల క్రితం కుదిరిన శాంతి ఒప్పందాన్ని నీరు గార్చే ఎత్తుగడతో అమెరికా బలగాలు తామే ఒప్పందానికి గండి కొట్టేందుకు సిద్ధపడ్డాయని రష్యా ఆరోపించింది.
“మేము నిజంగా సిరియా మిలట్రీ బలగాలపై దాడులు చేసినట్లయితే అది మా ఉద్దేశం కాదని తెలియజేస్తున్నాము. ప్రాణ నష్టం జరిగినందుకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము” అని ఐరాసలో అమెరికా రాయబారి సమంతా పవర్ ప్రకటించింది.
సిరియా బలగాలపై అమెరికా దాడులు జరిగిన వెంటనే ఇస్లామిక్ స్టేట్ బలగాలు సిరియా బలగాలపై భూతల దాడులు తీవ్రం చేశాయని రాయిటర్స్ తెలిపింది. ఐఎస్ బలగాలకు సాయం చేసే ఉద్దేశంతోనే అమెరికా, సిరియా బలగాలపై వైమానిక దాడులు నిర్వహించిందని, అనగా శ్వేత భావనమే నేరుగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు సహాయం చేస్తున్నదని స్పష్టం అవుతున్నదని రష్యా రాయబారి విటలీ చుర్కిన్ తెలిపాడు.
“ప్రపంచం మొత్తానికి భయానకమైన నిర్ధారణకు మనం రావలసి వచ్చింది: వైట్ హౌస్, ఇస్లామిక్ స్టేట్ ను రక్షిస్తోంది. ఇప్పుడిక ఆ విషయంలో అనుమానాలు ఏమీ ఉండనక్కర లేదు” అని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారని రాయిటర్స్ తెలిపింది. స్ధానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు దాడి జరిగిందని, అమెరికా ఇస్లామిక్ స్టేట్ కు మద్దతుగానే రంగంలోకి దిగిందని చెప్పడానికి ఈ దాడి అంతిమ రుజువని సిరియా మిలట్రీ అధికారులు కూడా చెప్పారని రాయిటర్స్ తెలిపింది.
అమెరికా సైన్యం మాత్రం ‘సిరియా ఒక సంక్లిష్టమైన యుద్ధ రంగం’ అని అభివర్ణిస్తూ తన దాడిని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. నిజానికి సిరియా ఎవరికైనా సంక్లిష్టం కావచ్చు గాని అమెరికాకు మాత్రం కాదు. 5 సం.లుగా సో కాల్డ్ ‘మోడరేట్ టెర్రరిస్టులకు’ శిక్షణ ఇస్తున్న అమెరికా విమానాలకు ఇప్పటికీ సిరియా యుద్ధరంగం సంక్లిష్టంగా కనిపించడం ఒట్టిమాట!