బేయర్, మాన్ శాంటో విలీనం: మహా రాకాసి అవతరణం


 

రాకాసి, రాకాసి విలీనం అయితే ఏమవుతుంది? మహా రాకాసి పుడుతుంది. 

రెండు రాకాసులు కలిస్తే ఏ పాటి విధ్వంసం జరుగుతుంది? ఆ రాకాసులు విడి విడి గా చేయగల విధ్వంసం కంటే ఇంకా ఎక్కువగా విధ్వంసం జరుగుతుంది. ఇద్దరు పని వాళ్ళు విడి విడిగా పని చేసినప్పటి కంటే సమిష్టిగా పని చేసినప్పటి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రాకాసితనం కూడా అంతే అన్నమాట! నిజానికి బహుళజాతి కంపెనీలు విలీనయం అయేది, స్వాధీనం చేసుకునేది కూడా అలా రాకాసితనం పెంచుకునేందుకే!  

బేయర్ అనే జర్మన్ బహుళజాతి వ్యవసాయ రాక్షస కంపెనీ, మాన్ శాంటో అనే అమెరికన్ బహుళజాతి రాక్షస కంపెనీలు రెండు విలీనం అయినట్లు ప్రకటించడంతో ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా భారత దేశ వ్యవసాయ రంగానికి మరిన్ని గడ్డు రోజులు రానున్నాయి. 

దీనిని విలీనం (మెర్జర్) అనటం కంటే స్వాధీనం (అక్విజిషన్) అనడమే కరెక్ట్. ఎందుకంటే బేయర్ కంపెనీ మాన్ శాంటో కంపెనీకి 66 బిలియన్ డాలర్లు  (రమారమి 4.4 లక్షల కోట్ల రూపాయలకు సమానం) చెల్లించింది. కొన్ని పత్రికలు దీనిని మెర్జర్ అనడం లేదు, అక్విజిషన్ అని కూడా అనడం లేదు. టేకోవర్ అంటున్నాయి. అనగా కంపెనీని ప్రత్యర్థి కంపెనీలో కలిపేయక తప్పని పరిస్ధితి ఏర్పడటం వల్ల కలిపేయడం/అమ్మేయటం. 

ఈ టేకోవర్ ద్వారా గ్లోబల్ మార్కెట్ ని స్ధిరీకరించుకోగల (మార్కెట్ కన్సాలిడేషన్) శక్తి బేయర్ కు వచ్చింది. ఇండియాలో విత్తన మార్కెట్ ప్రధానంగా మాన్ శాంటో కంపెనీ చేతుల్లోనే ఉన్నది. ఇతర పేర్లు వినిపించినప్పటికీ వాటిని కూడా మాన్ శాంటో కంపెనీయే కంట్రోల్ చేస్తోంది. తద్వారా మార్కెట్ లో అనేక వెరైటీలు ఉన్న భ్రమలను కలిగిస్తుంది. 

ఇండియాలోని మహికో కంపెనీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారత్ లో అడుగు పెట్టిన మాన్ శాంటో ఆనతి కాలం లోనే, భారత ప్రభుత్వాలు అమలు చేసిన వ్యవసాయ విధ్వంసక ఆర్ధిక సంస్కరణల విధానాలు ఆలంబనగా, మార్కెట్ ను కైవసం చేసుకుంది. భారతీయ సాంప్రదాయ ఉత్పత్తిదారుల సహజ విత్తన సేకరణ, నిల్వల పద్ధతులను దెబ్బ తీసింది. దానితో రైతులకు విత్తనాలు కావాలంటే మార్కెట్ తప్ప మరో గతి లేకుండా పోయింది.  

 

బేయర్ టేకోవర్ తో మాన్ శాంటో మరింత శక్తివంతం అయినట్లే. ప్రపంచ స్ధాయి మార్కెట్ కన్సాలిడేషన్ జరిగినపుడు చిన్న స్ధాయి ఉత్పత్తిదారుల మార్కెట్ మరింతగా కుచించుకుపోతుంది. మాన్ శాంటో కంపెనీని బేయర్ కంపెనీ టేకోవర్ చేయడం వల్ల భారత రైతుల మరింత గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటారు. బహుళజాతి కంపెనీలు పోటీ పడుతున్నపుడే పరస్పర అవగాహన ద్వారా రైతులకు వివిధ రకాలుగా నష్టం జరుగుతుంది. కన్సాలిడేషన్ జరిగి పోటీ లేకుండా పోయాక రైతుల పరిస్ధితి మరింత దిగజారడం ఖాయం.  

టేకోవర్ ద్వారా ఏర్పడిన ఏకీకృత కంపెనీ ఇండియాలో విత్తన మార్కెట్ లో దాదాపు పూర్తిగా గుత్త స్వామ్యం వహిస్తుంది. రెండు కంపెనీలకు ఇండియాలో ఉన్న అనుబంధ కంపెనీలు, ఉమ్మడి కంపెనీల ద్వారా వరి, పత్తి, జొన్న, కూరగాయలు లాంటి పంటల మార్కెట్ లో మెజారిటీ వాటా కైవసం చేసుకుంటుంది.

టేకోవర్ ద్వారా వ్యవసాయ రసాయన మార్కెట్ లో కూడా మరింతగా గుత్తస్వామ్యం పెరుగుతుందని నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది శక్తి ఒకే చోట కేంద్రీకృతం కావటానికి దారి తీస్తుంది. మార్కెట్ మళ్లింపుకు దారి తీస్తుంది. ఇటీవల కాలంలో భారీ విత్తన కంపెనీలు విలీనం కావటం ఇది మూడోసారి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ లో 3 కంపెనీలు మాత్రమే మిగులుతాయి. భారత వ్యవసాయంపై వినాశకర ప్రభావం కలుగజేస్తుంది” అని నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎన్ ప్రభాకరరావు వ్యాఖ్యానించడం గమనార్హం.     

బేయర్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ అని, మాన్ శాంటో కంపెనీ ఏమో విత్తన కంపెనీ అని కాబట్టి విలీనం వల్ల పెద్ద ప్రభావం ఉండబోదని సమర్ధకులు వాదిస్తున్నారు. బేయర్, మాన్ శాంటో కంపెనీ షేర్లు కొని లాభపడేవారికి మాత్రమే ఈ వాదన నచ్చుతుంది. కానీ బలం పెరిగినపుడు కళ్ళు నెత్తి మీదికి వస్తాయన్నది సాధారణ విషయం. బహుళజాతి కంపెనీల బలం పెరిగినపుడు మార్కెట్ ఎలా నడవాలి శాసించడం మొదలు పెడతాయన్నది అందరికి తెలిసిన సత్యం. 

“అవి దోపిడీ మారి వ్యవసాయ-వాణిజ్య కంపెనీలు. వాటి దృష్టి ఎప్పుడు పోటీని రూపుమాపి లాభాలు పెంచుకోవడం పైనే ఉంటుంది. అది కూడా రైతుల జీవనాన్ని, వారి భవిష్యత్తును ఫణంగా పెట్టి దోపిడీ చేస్తాయి” అని ఆల్-ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ విజు కృష్ణన్ చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యం.   

7 thoughts on “బేయర్, మాన్ శాంటో విలీనం: మహా రాకాసి అవతరణం

  1. మాన్ సాంటొ, దాని రాక్షసత్వం భారత వ్యవసాయం మీద పట్టు సాధించి దాన్ని ఎలా దుంపనాశనం చేస్తుందో ఇంకొన్ని వివరాలతో ఇంకో వ్యాసం రాస్తే దాని విస్తరణ కాంక్షను ఇంకొంచెం అర్థం అయ్యేలా చూపిన వారవుతారు.

  2. బేయర్ ధాన్యం విత్తనాలు కూడా అమ్ముతుంది. బేయర్ ఒక జాదూ కంపెనీ. నేను నా వరి పొలంలో ఆకు పొయ్యడానికి మూడు ప్యాకెట్ల ఆరైజ్ (బేయర్ వారి) & ఒక ప్యాకెట్ అంకుర్ సోనం విత్తనాలు వాడాను. బేయర్ కంపెనీ విత్తనాలని సగం చీమలు తినేసినాయి. అంకుర్ విత్తనాలు మాత్రమే సరిగా మొలకెత్తినాయి. దూరం దూరంగా (లైన్‌గా) నాట్లు చేసి ఆకు సరిపోయేలా చూసుకున్నాం.

  3. బేయర్ ఆరైజ్ విత్తనాలు తక్కువ నీరుతో పెరుగుతాయనే ప్రకటన చూసి అవి కొన్నాను. అవి తక్కువ నీరుతో పెరిగినాయి. విత్తనాలు సగం చీమలు తినేసిన తరువాత మిగితావి మొలకెత్తినాయి. పురుగులు తినకుండా ఉండేందుకు ఆ విత్తనాలకి కంపెనీవాళ్ళు పూసిన విషమే పని చెయ్యలేదు. ప్యాకెట్‌కి 900 చొప్పున మాత్రం ఖర్చయ్యింది.

  4. విశేఖర్ గారు
    మీరు చెప్పింది అక్షరాలా నిజం…
    చిల్లర వర్తకం,ప్రెస్,భీమా,విత్తనాలు,జన్యు ఉత్పత్తులు ఈ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం ఆత్మహత్య సదృశంతో సమానం.
    మన తరం వనరులతో పాటు, భవిష్యత్ తరాల వనరులపై కూడా సర్వభౌమాధికారాన్ని వదులుకోవడమే…

  5. మోన్ శాంటో దురాగతాల గురించి చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. 1961 నుండి 1972 దాకా అమెరికన్ సైన్యానికి వియత్నాం యుద్ధంలో వాడేందుకు ” ఏజెంట్ ఆరంజ్ ” ( chemical – dioxin) అనే herbicide ను సప్లై చేసిన సంస్ధ “మోన్ శాంటో “.
    నాడు ఉత్తర వియత్నాం ప్రజలకు రక్షణగా ఉండిన , అమెరికన్ చొరబాట్లకు అడ్డుగా ఉండిన సుమారు 45లక్షల ఎకరాల అడవిని, పొలాల్ని నాశనం చేసి, ఇప్పటికీ వియత్నాం ప్రజలలో, నవజాత శిశువుల్లో నాడీవ్యవస్ధ లోపాలు, అవయవ లోపాలు, చర్మవ్యాధులు వంటి భయానక అనారోగ్యం సంభవించేందుకు కారణమైన 19మిలియన్ గాలన్ల ‘ ఏజెంట్ ఆరంజ్’ ను 11 సంవత్సరాల పాటు సప్లై చేసిన ఘనత మోన్ శాంటోదే నని మర్చిపోరాదు.
    మనదేశంలో గుడ్డిగా ప్రభుత్వ విధానాల్ని సమర్ధిస్తున్న వాళ్లూ, ప్రజావ్యతిరేక విధానాల్ని ఖండించే వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న వాళ్లూ అయిన మధ్యతరగతి మేధావులందరూ ఇలాంటి ఏజెంట్ ఆరంజ్ తయారీసంస్ధ మార్కెట్ చేస్తున్న GMO (Genetically Modified Organisms ) ఆహారం .. ఉదా.. బి.టి.వంగ లాంటివి తిని తమంతట తాము, తమ సంతానాలు వినాశనానికి గురైతే తప్ప ఈ పరిస్ధితిపై తిరుగుబాటు రాదని నా అభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s