
సిరియాలో కాల్పుల విరమణ విషయమై రష్యా అమెరికాల మధ్య జెనీవాలో కుదిరిన ఒప్పందం, ఐదున్నర సంవత్సరాల అంతర్యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు బహుశా అత్యంత మెరుగైన అవకాశం కావచ్చు. ఒప్పందం కింద, అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వం తిరుగుబాటుదారుల ఆధీనం లోని ప్రాంతాలపై బాంబులు వేయకుండా రష్యా నిరోధిస్తుంది. అమెరికా యేమో ఇస్లానిక్ స్టేట్ తో సహా జిహాదిస్టు గ్రూపులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రష్యాతో చేతులు కలుపుతుంది. విశాల చట్రం ప్రాతిపదికన కుదిరిన ఈ ఒప్పందం, పుతిన్ పధకం. సిరియాలో తన జోక్యం ప్రకటిస్తూ సంవత్సరం క్రితం ఈ పధకాన్ని ప్రకటించారు. సిరియా రాజ్యాన్ని పునరుద్ధరించాలని, జిహాదిస్టులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రధాన (ప్రపంచ) శక్తులు అన్ని కలిసి పని చేయాలని పుతిన్ కోరుతున్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ఈ పధకాన్ని రష్యా బహిర్గతం చేసి ప్రతిపాదించినప్పుడు సిరియా విషయంలో మాస్కో, వాషింగ్టన్ లు ఒక చోటికి వస్తాయని ఎవరు ఊహించలేదు. ఆరంభంలో రష్యా జోక్యానికి అమెరికా స్పందన అనుమానంతో కూడుకుని ఉన్నది; ఐఎస్-యేతర తిరుగుబాటు గ్రూపులపై రష్యా దాడి చేయడం పట్ల అభ్యంతరం ప్రకటించింది. (రష్యా జోక్యం వల్ల) సిరియా ఘర్షణ కాస్తా పూర్తి స్ధాయి యుద్ధంగా బద్దలవుతుందని భయాలు వ్యక్తం అయ్యాయి. అందుకు బదులుగా పుతిన్ పధకం, భారీ ప్రాణ నష్టంతో, పని చేసినట్లే కనిపిస్తున్నది. జోక్యం, సిరియా ప్రభుత్వ కోలుకోవడానికి దోహదం చేసి ఘర్షణలో బలాబలాల సమతూకం తిరగబడేట్లు చేసింది. సంవత్సరం క్రితం అస్సాద్ ప్రభుత్వ కూలిపోవడానికి దగ్గరగా వెళ్ళింది; అది ఇప్పుడు కనీసం తాను బలంగా ఉన్న ప్రాంతాల్లో నైనా నిలదొక్కుకున్నది. తిరుగుబాటుదారుల ప్రభావం, వారి నియంత్రణలోని అనేక చిన్న పట్టణాలలో ఓడించలేనిదిగా కనిపిస్తున్నప్పటికీ, కుచించుకుపోయింది. (ఘర్షణలో ఏర్పడిన) స్తంభన, మరింత రక్తపాతం జరిగే అవకాశం… కారణాలు అమెరికా, రష్యాలు తమ విభేదాలను పక్కనబెట్టేలా ప్రోత్సహించి ఉండవచ్చు.
రెండు మిలట్రీ శక్తులు ఎంతో శక్తి యుక్తులను వెచ్చించిన నేపథ్యంలో ఈ సారి శాంతి నెలకొనే అవకాశాలు మెరుగుగా కనిపిస్తున్నాయి. తిరుగుబాటుదారులు, ప్రభుత్వ ఇరువురు ఒప్పందాన్ని స్వాగతించారు. ప్రాంతీయ స్ధాయిలో కూడా సానుకూల పరిణామాలు జరిగాయి. తిరుగుబాటుదారులకు గట్టి మద్దతుదారు అయిన టర్కీ, సిరియాలో అధికార మార్పిడి ప్రక్రియలో అస్సాద్ పరివర్తన పాత్ర పోషించవచ్చని ఇటీవల ప్రకటించింది. రెండు పెద్ద సవాళ్లు మిగిలే ఉన్నాయి. మొదటిది, అస్సాద్ ఫైటర్ జెట్ లను రష్యా ఆపగలదా? డమాస్కస్ పైన మాస్కోకు గట్టి పట్టు ఉన్నప్పటికీ ప్రభుత్వ మొండితనం పట్ల అది గతంలో అసౌకర్యం ప్రకటించింది. యుద్ధ రంగంలో ప్రభుత్వ ఇప్పుడు గెలుపు బాటలో ఉన్నది. బాంబింగ్ ని నిలిపివేయడానికి అస్సాద్ అంగీకరించినప్పటికీ శాంతి చర్చలలో అర్ధవంతమైన రాజీకి రావడానికి ఆయన సిద్ధమేనా అన్నది స్పష్టం కాలేదు. రెండవది, ప్రభుత్వంతో తలపడుతున్న తిరుగుబాటుదారులు ఏకీకృత శక్తిగా లేరు. ఆల్-ఖైదాకు గతంలో అనుబంధంగా ఉన్న ఫతే ఆల్-షామ్ ను ఒంటరిని చేసి దాడి చేయాలని రష్యా కోరుతొంది. అమెరికా ఈ సూచనకు సూత్ర రీత్యా అంగీకరించినప్పటికీ దానిని ఆచరణలోకి తేవటం ఎలాగన్నదే అనిర్దిష్టం. అయితే, ఈ సమస్యలు ఒప్పందం యొక్క ప్రాధాన్యతను వెనక్కి నెట్టరాదు. యుద్ధం ఏర్పరిచిన భయానక పరిస్ధితి దృష్ట్యా, కాల్పుల విరమణ స్పష్టంగా నెలకొన్నట్లయితే, దానికదే గొప్ప విజయం అవుతుంది.
*********
“(ఘర్షణలో ఏర్పడిన) స్తంభన, మరింత రక్తపాతం జరిగే అవకాశం… కారణాలు అమెరికా, రష్యాలు తమ విభేదాలను పక్కనబెట్టేలా ప్రోత్సహించి ఉండవచ్చు” అని సంపాదకీయం వేసిన అంచనా వాస్తవం కాదు. సంపాదకీయమే పేర్కొన్నట్లుగా యుద్ధంలో సిరియా ప్రభుత్వ వరుస విజయాలు సాధిస్తూ టెర్రరిస్టుల నుండి కొత్త ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, దాని ప్రభావం లోని తిరుగుబాటుదారులు సిద్ధం అయ్యారు. ఐసిస్, ఆల్-నూస్రా లు విజయాలు సాధిస్తున్నంత కాలం, అనగా గత ఏడు అక్టోబర్ లో రష్యా జోక్యం చేసుకున్న ముందు వరకు సో-కాల్డ్ తిరుగుబాటుదారులు గాని, అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు గాని, టర్కీ, సౌదీ అరేబియా, కతార్ లాంటి మధ్య ప్రాచ్యం లోని ముస్లిం ఫండమెంటలిస్టు రాజ్యాలు గాని కాల్పుల విరమణకు ససేమిరా ఒప్పుకోలేదు. అస్సాద్ దిగిపోయేవరకు కాల్పుల విరమణకు ఒప్పుకునేది లేదని అవి గొప్పలు పోయాయి. ఒక దశలో అస్సాద్ ను హత్య చేసేందుకు కూడా కృషి చేశాయి. కానీ సిరియా ప్రజల అండతో, కేవలం ప్రజల అండ వలన, బషర్ అస్సాద్ నిలబడగలిగాడు.
రష్యా జోక్యంతో టెర్రరిస్టు సంస్ధలు వరుస ఓటములు ఎదుర్కొనడం వల్లనే పశ్చిమ రాజ్యాలు, ముస్లిం మతతత్వ రాజ్యాలు దారికి వచ్చాయి తప్ప మరింత ప్రాణ నష్టం జరుగుతుందన్న భయం వల్లనే అమెరికా ఒప్పందానికి అంగీకరించిందనడం శుద్ధ అబద్ధం. సిరియాలో 4 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి నిజంగా ఎవరు కారణమో తెలిస్తే అమెరికాకు అంత పెద్ద సర్టిఫికెట్ ఇవ్వలేరు. ఇప్పుడు కూడా అలెప్పో కోసం జరుగుతున్న తీవ్ర స్ధాయి యుద్ధంలో సో-కాల్డ్ తిరుగుబాటుదారులు (ఐసిస్, ఆల్-నూస్రా)లు మరోసారి వాయవ్య అలెప్పోలో ఓటమి పాలు కావడంతో ఒప్పందానికి రాక తప్పని పరిస్ధితిని అమెరికా ఎదుర్కొంటున్నది. అలెప్పో కోసం జరుగుతున్న యుద్ధం సిరియా కిరాయి తిరుగుబాటు భవితవ్యాన్ని తేల్చనున్నది. సిరియాలో అతి పెద్ద నగరం అయిన అలెప్పో నగరం ఆల్-నూస్రా + ఐసిస్ మరియు ప్రభుత్వ బలగాల మధ్య విభజించబడి ఉన్నది. కాగా ఐసిస్ మరియు ఆల్-నూస్రా అధీనం లోని అలెప్పో ప్రాంతాన్ని ప్రభుత్వ బలగాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ ముట్టడిని ఆగస్టులో టెర్రరిస్టులు ఛేదించగలిగినప్పటికీ ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వ సైన్యాలు మళ్ళీ ముట్టడి విధించాయి. ముట్టడి విధించడమే కాకుండా ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నది. అలెప్పో చేజారితే ఇక ఇతర చిన్న చిన్న పట్టణాలను వశం చేసుకోవడం పెద్ద కష్టం కాబోదు. అనగా అమెరికా, ఐరోపా, టర్కీ, సౌదీ, కతార్ లు సిరియా సెక్యులర్ రాజ్యం ఇచ్సిన ప్రతిఘటన చేతిలో దారుణంగా ఓటమి చెందినట్లు చరిత్ర రికార్డు చేస్తోంది. ఇప్పటికే మధ్య ప్రాచ్యం లోని ప్రతిఘటన అక్షం (సిరియా-హీజ్బొల్లా-ఇరాన్-హమాస్) చేతిలో అనేకమార్లు ఓటమి చవి చూసిన ఆధిపత్య రాజ్యాల కూటమి (అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్, సౌదీ నేతృత్వం లోని గల్ఫ్ కూటమి) ఈ దెబ్బతో కోలుకోలేని పరిస్ధితికి నెట్టబడుతుంది. ఘోరమైన అప్రతిష్ట మూటకట్టుకుంటాయి. తలా ఎత్తుకొని పరిస్ధితి వస్తుంది. ఇది భరించలేకనే తాజా ఒప్పందానికి రావటం.
కాల్పుల విరమణ ద్వారా చేజిక్కిన అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని టెర్రరిస్టు సంస్ధలకు మరిన్ని సరఫరాలు చేయడాన్ని ఒక ఎత్తుగడగా అమెరికా ఇన్నాళ్లు అమలు చేస్తూ వచ్చింది. ఈ సరఫరాలు అందిన తర్వాత కాల్పుల విరమణను టెర్రరిస్టులు ఉల్లంఘించడం, యుద్ధం తిరిగి మొదలు కావడం, ఆ నెపాన్ని మళ్ళీ సిరియా ప్రభుత్వ మీదికే నెట్టివేయడం జరుగుతూ వచ్చింది. మళ్ళీ అదే జరగబోదన్న గ్యారంటీ ఏమి లేదు. నూటికి 99 పాళ్ళు అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన మధ్య ప్రాచ్యంలో ఓటమిని ఎదుర్కోవడం, కనీసం రాజి పడటం కూడా పశ్చిమ దేశాలకు ఇష్టం ఉండదు. ఇరాన్ పై చేయి సాధించడం ఇజ్రాయెల్ కు ససేమిరా ఇష్టం ఉండదు. ఈ రాజ్యాలన్నీ కలిసి ఏర్పాటు చేసినవే ఐసిస్, ఆల్-నూస్రా లు తప్ప వేరే సంస్ధలు కావు. అమెరికా చెప్పే మోడరేట్ టెర్రరిస్టు సంస్ధలు, తిరుగుబాటు సంస్ధలకు సిరియాలో ఎన్నడూ బలం లేదు. ప్రభుత్వంతో పోరాడ గల సత్తా వాటికి లేదు. పోరాటం అంతా ఐసిస్, ఆల్-నూస్రా లే చేస్తున్నాయి. టర్కీ, అమెరికా, సౌదీలు శిక్షణ ఇచ్చింది కూడా వాటికే. మోడరేట్ లు ఐసిస్, ఆల్-నూస్రా లతో కలిసి ఉన్నారని, కాబట్టి ఆల్-నూస్రా పై బాంబింగ్ నిలిపివేయాలని రష్యా, సిరియాలను అమెరికా అనేకసార్లు డిమాండ్ చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఓటమి ఎదురైనప్పుడు ఐసిస్, ఆల్-నూస్రా సభ్యులను మోడరేట్ లలో చేర్చడం, సరఫరాలు అందజేసిన తర్వాత మళ్ళీ యధా విధిగా యుద్ధ చర్యలను మొదలు పెట్టడం ఒక ఎత్తుగడగా అమెరికా పాటిస్తున్నది.
నూతన ఆర్ధిక విధానాలకు, నయా ఉదారవాద ఆర్ధిక సంస్కరణలకు షరతులు లేని మద్దతు ప్రకటించిన ద హిందూ సంపాదకీయం, సిరియా కిరాయి తిరుగుబాటులో అమెరికా పక్షం చేరడం బహుశా ఆశ్చర్యకరం కాదేమో. విచిత్రం ఏమిటంటే ద హిందూ సోదర పక్ష పత్రిక ఫ్రాంట్ లైన్ దిన పత్రికకు పూర్తిగా భిన్నమైన అవగాహన కలిగి ఉండటం. ఈ ద్వంద్వ పంథాను కస్తూరి గ్రూపు మీడియా కంపెనీ ఎలా సమర్ధించుకుంటుందో మరి!