ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ కూల్చిన సిరియా సైన్యం


సిరియాలో ఐసిస్, ఆల్-నుస్రా టెర్రరిస్టుల తరపున ఇజ్రాయెల్  కూడా యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తేటతెల్లం అయింది. ఇజ్రాయెల్-సిరియా సరిహద్దులో సిరియా బలగాలపై ఫైటర్ జెట్ విమానాలతో బాంబు దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని సిరియా బలగాలు కూల్చివేశాయి. దానితో మధ్య ప్రాచ్యంలో టెర్రరిస్టు సంస్ధలు జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మద్దతు ఉన్నట్లు స్పష్టం అయింది. 

కూల్చివేతను ఇజ్రాయెల్ నిరాకరించింది. కానీ సిరియా బలగాలపై తమ యుద్ధ విమానాలు బాంబు దాడులు చేసిన సంగతిని మాత్రం ఆ దేశం నిరాకరించలేదు. పైగా ధృవీకరించింది. సిరియా బలగాలపై దాడులు చేసాక తమ ఫైటర్ జెట్ విమానాలు క్షేమంగా తిరిగి వచ్చాయని, ఏ క్షణంలో కూడా అవి ప్రమాదకర పరిస్ధితిని ఎదుర్కోలేదని ప్రకటించింది. 

ఐతే ఇజ్రాయెల్ చేసిన ప్రకటన నిజం కాదని సిరియా సైన్యం స్పష్టం చేసింది. తమ భూభాగం మీదికి చొచ్చుకు వచ్చిన ఇజ్రాయెలీ ఫైటర్ జెట్ తో పాటు ఆ దేశానికి చెందిన మానవ రహిత డ్రోన్ విమానాన్ని కూడా తమ బలగాలు కూల్చివేశామని తెలిపింది. ఇజ్రాయెల్ విమానాలు వాయవ్య రాష్ట్రం కునేత్ర పైకి వచ్చాయని, వాటిని పసిగట్టిన వెంటనే తమ రక్షణ క్షిపణి వ్యవస్ధలు ఢీ కొట్టి కూల్చివేశామని సిరియా కమాండ్ సెంటర్ తెలిపింది.

“మా వాయు రక్షణ వ్యవస్ధలు వెంటనే కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో ఇజ్రాయెలీ పోరాట విమానం, మానవ రహిత వాయు వాహనం (Unmanned Aerial Vehicle) రెండు కూలిపోయాయి” అని సిరియా కమాండ్ సెంటర్ తెలిపింది. 

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు ఝాము గం 1. కి ఇజ్రాయెల్ కు చెందిన ఫైటర్ జెట్ కునేత్ర లోని సిరియా సైనిక బలగాలపై దాడులు నిర్వహించిందని సిరియా తెలిపింది. ససా సెటిల్ మెంట్ కు పశ్చిమ దిశలో ఈ దాడి జరిగిందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సిరియా తెలిపింది. 

“ఇజ్రాయెలీ ఫైటర్ జెట్ F -16 దాడికి ఇజ్రాయెల్ వాయు రక్షణ బలగాలు స్పందించాయి. అలాగే డమాస్కస్ మీదికి డ్రోన్ విమానాన్ని కూడా ఇజ్రాయెల్ పంపింది. రెండింటిని సిరియా బలగాలు కూల్చివేశాయి” అని సిరియా కమాండ్ సెంటర్ అధిపతి జనరల్ సమీర్ సులేమాన్ చెప్పారని స్పుత్నిక్ న్యూస్ వార్తా సంస్ధ తెలిపింది. 

syria_israel

ప్రభుత్వ బలగాల చేతుల్లో టెర్రరిస్టు. మూకలు చావు దెబ్బ తింటూ ఓటమి ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి సహాయం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని సిరియా సైన్యాధికారులు చెప్పడం విశేషం. “శత్రువులు, టెర్రరిస్టులకు నైతిక మరియు లాజిస్టికల్ (రవాణా, ప్రయాణ, సరఫరాల సహాయం) సహాయం అందజేస్తున్నారు. గాయపడిన టెర్రరిస్టులకు చికిత్స చేసేందుకు వారు ఇజ్రాయెలీ ఆసుపత్రులను తెరిచి ఉంచారు. వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. కునేత్రలో సిరియా సైన్యం చేతిలో దెబ్బ తిన్న టెర్రరిస్టులకు ఈ కేంద్రాలలో చికిత్స అందజేస్తున్నారు” అని సైన్యాధికారి జనరల్ సులేమాన్ చెప్పారు. 

“సిరియా సైనిక బలగాలపై క్షిపణి కాల్పులు మరియు వైమానిక దాడులు చేయడం ద్వారా టెర్రరిస్టులకు ఇజ్రాయెలీ సాయుధ బలగాలు స్ధిరంగా సహాయం చేస్తున్నారు” అని ఆయన తెలిపారు.  

సిరియా సైన్యం సమాచారాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది. సిరియా బలగాలు ఉపరితలం నుండి గాలిలోకి పేల్చే క్షిపణులను ప్రయోగించడం నిజమే గాని దాని వల్ల తమకు ఎలాంటి నష్టము జరగలేదని ఇజ్రాయెల్ సైన్యాధికారి చెప్పారు. 

“మా బలగాలు సిరియా క్షిపణి పొజిషన్ లపై దాడి చేసిన తర్వాత ఈ రోజు రాత్రి ఉపరితలం-నుండి-గాలిలోకి పేల్చే రెండు క్షిపణులను సిరియా ప్రయోగించింది. ఈ ఆపరేషన్ లో ఏ దశలోనూ ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల భద్రతకు ప్రమాదం ఏర్పడలేదు” అని ఇజ్రాయెల్ సైన్యాధికారి ఆర్యే షాలికర్ చెప్పారని రష్యన్ వార్తా సంస్ధ RIA నోవోస్తి తెలిపింది.  

ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని సిరియా సైన్యం కూల్చివేయడంలో నిజం ఏది అయినప్పటికీ సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐసిస్, ఆల్-నుస్రా లాంటి టెర్రరిస్టు సంస్ధలు చేస్తున్న కిరాయి యుద్ధానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు ఇస్తున్న సంగతి మాత్రం స్పష్టం అయింది. 

ఇస్లామిక్ టెర్రరిజాన్ని వ్యతిరేకంగా తాము తీవ్రంగా పోరాడుతున్నామని, అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్పుకునే పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ లు వాస్తవంలో టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నాయి తప్ప పోరాడటం లేదని గతంలో అనేక స్వచంద మీడియా సంస్ధలు వెల్లడి చేసినప్పుడు వాటిని ‘కుట్ర సిద్దాంతం’గా పశ్చిమ దేశాలు, పశ్చిమ మీడియా కొట్టివేసింది. 

ఇటీవల కాలంలో సిరియా-రష్యా-ఇరాన్-హీజ్బొల్లా (లెబనాన్) బలగాల చేతుల్లో టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ ఓటమి ఎదుర్కొంటుండడంతో వారిని బైట పడవేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ లు హడావుడి పడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని రష్యా పై ఒత్తిడి తెస్తున్నాయి. 

ISIS, Al-Nusra టెర్రరిస్టును సిరియా బలగాలు చుట్టుముట్టినప్పుడు కాల్పుల ఒప్పందానికి ఒత్తిడి తెస్తూ, చుట్టివేత నుండి బయటపడిన వెంటనే మళ్ళీ టెర్రరిస్టుల చేత దాడులు తీవ్రం చేయిస్తున్నాయి. అమెరికా చెబుతున్న మోడరేట్ టెర్రరిస్టు. సంస్ధలను కాపాడేందుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. ఈ చర్యల ద్వారా అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ దేశాలు వాస్తవంలో టెర్రరిస్టు సంస్ధల పోషకులే తప్ప వ్యతిరేకులు కాదని రుజువు చేసుకుంటున్నాయి. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s