
ముఖేష్ అంబానీ
ముంబై మునిసిపాలిటీకి ఐదేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ చెల్లించవలసిన బాకీని చెల్లించని ఉదంతం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్మెంట్ ఆధారిటీ (ఎంఎంఆర్‌డిఏ) కి చెందిన రెండు స్ధలాలను లీజుకు తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, లీజు ద్వారా తలెత్తిన చెల్లింపులను ఎగవేసినట్లు లేదా ఇంతవరకు చెల్లించనట్లుగా ఒక ఆర్‌టిఐ కార్యకర్త వెల్లడి చేశాడు.
అక్రమ కట్టడం పేరుతో, ఆక్రమణ పేరుతో పేదల గుడిసెలను పెద్ద ఎత్తున తొలగించి నిరాశ్రయులను చేసే ముంబై మునిసిపాలిటీ, చట్టబద్ధత ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న బడా పారిశ్రామికవేత్తల పట్ల మాత్రం అవ్యాజానురాగమైన ప్రేమను ప్రదర్శిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. పోలికకు చెప్పాలంటే, రిలయన్స్ కంపెనీ చెల్లించవలసిన ఫీజుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న వార్షిక లోటులో మూడో వంతు చెల్లిపోతుంది.
ఎంఎంఆర్‌డిఏ కు రావలసిన బాకీల వివరాలు తెలపాలని కోరుతూ అనిల్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు దాఖలు చేశాడు. సదరు దరఖాస్తు మేరకు చెల్లింపుల బాకీ వివరాల జాబితాను ఎంఎంఆర్‌డిఏ అనిల్ కు అందజేసింది. అందులో పలువురు ప్రైవేటు లీజుదారులు, ప్రభుత్వ బాకీదారులు, ప్రభుత్వరంగ కంపెనీ బాకీదారులు ఉన్నారని వారిలో అత్యధిక మొత్తం బాకీ పడి ఉన్నది ముఖేష్ అంబానికి చెందిన ఆర్‌ఐఎల్ కంపెనీయే అని అనిల్ తెలిపాడు.
రిలయన్స్ నుండి రావలసిన మొత్తాన్ని నెల రోజుల లోపల వడ్డితో సహా వసూలు చేయాలని ఆర్‌టిఐ కార్యకర్త అనిల్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు లేఖ రాశాడు. “అప్పటికీ డబ్బు వసూలు కాకపోతే, ప్రభుత్వం ఆ స్ధలాలను స్వాధీనం చేసుకోవాలి. తిరిగి వేలం నిర్వహించి అత్యధిక మొత్తం ఇవ్వజూపే వారికి లీజుకు ఇవ్వాలి. దాని వల్ల ఎంఎంఆర్‌డిఏ కు రెవిన్యూ ఆదాయం రావడంతో పాటు ప్రజాభివృద్ధి కార్యక్రమాలకు బోలెడు ధనం సమకూరుతుంది” అని అనిల్ కోరాడు.
రిలయన్స్ కంపెనీ లీజుకు తీసుకున్న భూమి ప్రైమ్ ల్యాండ్ కావటాన, షరతు ప్రకారం ఎలాంటి నిర్మాణం చేయనందునా, అదనపు ప్రీమియం మొత్తం కంపెనీ చెల్లించవలసి ఉన్నది. ఆది నుండి ఈ మొత్తాన్ని కంపెనీ చెల్లించకుండా ఎగవేస్తూ వచ్చింది. దానితో ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. కంపెనీ లీజుకు తీసుకున్న 3 ఫ్లాట్లలో అత్యల్ప మొత్తం లీజు -రు 4.94 లక్షలు- చెల్లించవలసి ఉన్న ప్లాటుకు మాత్రమే పూర్తి లీజు మొత్తాన్ని కంపెనీ చెల్లించింది. మిగతా రెండు ప్లాట్లలో ఒక దానికి రు 1187.59 కోట్లు, మరొక ప్లాటుకు రు 389.31 కోట్లు చెల్లించాల్సి ఉండగా అది ఇంతవరకు చెల్లింపు కాలేదు.
లీజు షరతుల ప్రకారం 4 యేళ్ళ లోపల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఈ షరతు ఉల్లంఘిస్తే ప్రైమ్ ల్యాండ్ కు చెల్లించాల్సిన ప్రీమియం రేటు చెల్లించాలి. “తమ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించడానికి లీజుదారులకు కు సమయాన్ని పొడిగించారు. దానితో చెల్లింపు మొత్తం 2,055.67 కోట్లకు పెరిగింది. అందులో కంపెనీల నుండి 426.98 కోట్లు మాత్రమే అందాయి. మిగిలిన రు 1628.69 కోట్లలో ఒక్క రిలయన్స్ కంపెనీ చెల్లించవలసిన మొత్తమే రు 1576.90 కోట్లుగా తేలింది” అని అనిల్ చెప్పారని ద హిందు తెలిపింది.
PREMIUM DUE
RIL: Rs 1, 576.90 crore
Naman Hotels : Rs 23.68 crore
Indian News Paper Society : Rs 28.12 crore
Commissioner of Income Tax : Rs 5.30 crore
Maharashtra Maritime Board : Rs 7.21 crore
TOTAL : Rs 1,632.23 crore
చెల్లింపు మొత్తం ఎగవేయడానికి రిలయన్స్ కంపెనీ కోర్టు స్టే ఉత్తర్వులను అడ్డం పెట్టుకుంటున్నట్లు తెలుస్తున్నది. కంపెనీ ప్రయత్నాలకు ఎంఎంఆర్‌డిఏ బోర్డు సభ్యులు సైతం మద్దతు ఇస్తూ, కంపెనీ వాదనకు సై అంటున్నారు. 4 సం.ల 5 నెలల పాటు స్ధలం పైన కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నాయని ఈ కాలం తొలగిస్తే ప్రీమియం కింద చెల్లించవలసింది రు 883 కోట్లు మాత్రమే అనీ అందులోనూ రిలయన్స్ వాటా రు 53 కోట్లు మాత్రమే అవుతుందనీ ఎంఎంఆర్‌డిఏ కమిషనర్ గారే స్వయంగా వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో న్యాయ సలహా కోరాలని ముఖ్యమంత్రి ఫద్నవిస్ ఆదేశించారు.
“రిలయన్స్ కంపెనీ గతంలో కూడా కోర్టు వివాదాల పేరుతో చెల్లింపులు వాయిదా వేసి, నిర్మాణాలు చేయకుండా నిలిపివేసింది. అంబానీ సోదరుల మధ్య వివాదాన్ని వాడుకుని చెల్లింపులు చేయలేదు; నిర్మాణమూ మొదలు పెట్టలేదు. ముంబై లీజు కేసులో నేను గతంలో చూసినప్పుడు రిలయన్స్ బాకీ రు 400 కోట్లకు తక్కువే ఉన్నది. ఇప్పుడు అది రు దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ప్రజా ప్రయోజనం రీత్యా ప్రభుత్వాలు ఈ అంశాలపై దృష్టి పెట్టి ఏదో ఒకటి చేయాలి” అని ఆర్‌టిఐ కార్యకర్త కోరాడు.
చట్టం ధనవంతులకు చుట్టంగా పని చేయడం అందరికి తెలిసిన విషయమే. పేదలను తొలగించాలి అనుకున్నప్పుడు ఏదో ఒక చట్టాన్ని తెచ్చి ప్రయోగిస్తారు. ధనికులకు మేలు చేయాలి అనుకుంటే ఎన్ని చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోవు. అటువంటి చట్టాలలో అనేక లొసుగులు వారికి దొరుకుతాయి. లొసుగులను ఉపయోగించి పెద్ద చేపలను ఇట్టే బైటపడేస్తారు. కనుక రు 1577 కోట్లు చెల్లించకుండా తప్పించుకోవటం రిలయన్స్ కంపెనీకి పెద్ద కష్టం ఏమీ కాదు.
శేఖర్ గారికి,
ప్రైమ్ ల్యాండ్ అంటే ఏమిటి?
లోకేశ్వర్ గారు, టౌన్ లో సెంటర్ లో ఉన్న భూములు, వాణిజ్య పరంగా లాభదాయకమైన భూములు ప్రైమ్ ల్యాండ్ కిందకి వస్తాయి. అదేమీ స్ధిరంగా ఒక చోటుని సూచించేది కాదు. ఒకప్పుడు పనికిరాని భూములు టౌన్ విస్తరిస్తే ప్రైమ్ ల్యాండ్ కింద మారొచ్చు.
“ఒకప్పుడు ఇదంతా అడివి. మానవ మాత్రుడు కనిపించేవాడు కాదు. ఇప్పుడేమో కోట్లు పలుకుతోంది” అన్న మాటలు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.
ప్రిమిటివ్ లాండుకు పీపులు, పిదప పిచ్చిగా పాపులు పరంబగునపుడు ప్రైమ్‍లాండగు అని చిన్నపుడు చిన్నయసూరి గారు చెప్పినట్లు…