
జాన్ కిర్బీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎర్ర కోట ప్రసంగం నాడు సృష్టించిన దుమారాన్ని అమెరికా చప్పున చల్లార్చింది. బలూచిస్తాన్ ప్రజల పోరాటాలకు ప్రధాని మోడి మద్దతు ఇస్తున్నట్లుగా భారత పత్రికలు తీసిన అర్ధం నిజం కాదని అమెరికా ఇచ్చిన వివరణ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతకు అమెరికా కట్టుబడి ఉన్నదనీ, బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి తాము మద్దతు ఇచ్చేది లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. “మా ప్రభుత్వ విధానం ఏమిటంటే పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతకు మేము మద్దతు ఇస్తున్నాము. బలూచిస్తాన్ స్వతంత్రానికి మేము మద్దతు ఇవ్వడం లేదు” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ విలేఖరులకు తెలిపాడు.
ఆగస్టు 15 తేదీన మోడి చేసిన ప్రసంగం దరిమిలా అనేక ఊహలు, పుకార్లు అటు దౌత్య వర్గాలలోనూ ఇటు పత్రికలు, జనాల లోనూ పలు విధాలుగా షికార్లు చేశాయి. పాకిస్తాన్ ను మరోసారి రెండుగా విడదీసేందుకు మోడి ఉద్యుక్తం అవుతున్నారని హిందుత్వ గణాలు ఆసక్తిగా, ఉత్సాహంగా ప్రచారం చేశాయి.
బంగ్లాదేశ్ ను విడదీసి ఇందిరా గాంధీ ఖ్యాతి సంపాదించినట్లే తమ నాయకుడు కూడా బలూచిస్తాన్ ను విడదీసి చరిత్రలో ఆచంద్ర తారార్కం నిలిచిపోతారని నమ్మాయి. తాము నమ్మి ఇతరులనూ నమ్మించాలని చూశాయి. అమెరికా ప్రకటన వారి ఉత్సాహంపై నీళ్ళు జల్లింది.
పత్రికలు, జనాల పుకార్లు తక్కువైనట్లుగా కులదీప్ నయ్యర్ లాంటి తల పండిన జర్నలిస్టులు కూడా హిందుత్వ గణాల ఊహలకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లుగా విశ్లేషణలు చేశారు. మోడి మద్దతుతో బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి ఊపు వచ్చిందని, దక్షిణాసియా రాజకీయాలను ఆయన మలుపు తిప్పనున్నారని విశ్లేషించారు. ఈ రాతలను పలువురు మేధావులు కూడా నమ్మి ఉత్సాహపడిపోయారు.
కానీ అగ్ర దేశాల మాట లేకుండా దక్షిణాసియాలో ఒక్క పూచిక పుల్ల కూడా కదలదు. అమెరికాతో అంతకంతకూ ఎక్కువగా అంటకాగుతున్న మోడి ఆ దేశ అనుజ్ఞ లేకుండా బలూచిస్తాన్ జోలికి వెళ్లబోరు. రష్యా ఆమోదం, అమెరికా సైగ లేకుండా బంగ్లాదేశ్ జోలికి ఇందిరా గాంధీ వెళ్లలేదు. భారత దేశాన్ని మరింతగా అమెరికాకు బందీ చేస్తున్న మోడి అలాంటి చర్యకు పాల్పడే ప్రశ్నే లేదు.
ఆ విషయాన్నే అమెరికా విదేశీ శాఖ ప్రతినిధి పరోక్షంగా స్పష్టం చేశారు. “బలూచిస్తాన్ విషయంలో అమెరికా నిర్ణయం ఏమిటి? భారత ప్రధాని ఈ అంశాన్ని లేవనెత్తారు కదా?” అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు.
“పాకిస్తాన్ ఐక్యతను అమెరికా ప్రభుత్వం గౌరవిస్తుంది. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇచ్చి కాపాడుతుంది. బలూచిస్తాన్ స్వతంత్రానికి మేము మద్దతు ఇవ్వబోము” అని కిర్బీ వారికి సమాధానం ఇచ్చాడు.
బలూచిస్తాన్ అంశాన్ని మోడి లేవనెత్తడంలో ప్రధాన లక్ష్యం పాకిస్తాన్ ను ఇరకాటంలో పెట్టడమే. ‘టిట్ ఫర్ టాట్’ ఎత్తుగడలో భాగంగా కాశ్మీర్ ను పదే పదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్నందుకు ప్రతీకారంగా బలూచిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనను మోడి ప్రస్తావించారు తప్పితే బలూచిస్తాన్ ను పాక్ నుండి విడదీసే ఆలోచన గాని, అంత శక్తి గాని మోడీకి లేవు.
అమెరికాకు పూర్తి స్ధాయి అనుచరుడుగా భారత దేశాన్ని మార్చే కృషిలో నిమగ్నం అయిన మోడి అమెరికాతో పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ భారత దేశం కదలికలను మరింతగా నిర్బంధిస్తాయి. కానీ అమెరికాతో జరుగుతున్న ఒప్పందాలను పాక్ ను బెదిరించడానికి మోడి ఉపయోగిస్తున్నారు.
ఇన్నాళ్ళు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్ ను అమెరికాతో పెరిగిన కొత్త మిత్రత్వం ద్వారా మరింత దూకుడు గల ప్రధాన మంత్రిగా తనను చూపుకునేందుకు మోడి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ‘చేతల’ ప్రధానిగా ముద్ర పొంది మరిన్ని ఓట్లు పోగేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. మోడి బలూచిస్తాన్ వ్యూహంలో ‘పెద్దన్న పాత్ర’, ‘విస్తరణవాద కాంక్ష’ మాత్రమే ఉన్నాయి. బలూచిస్తాన్ ను విడదీయాలంటే ఇరాన్, చైనా లాంటి బలమైన రాజ్యాలను ఇండియా దూరం చేసుకోవలసి ఉంటుంది. అలాంటి ధైర్యానికి భారత పాలకులు తెగించరు.