
CIA Director Brennon
రష్యా పైన మరో అత్యున్నత అమెరికా అధికారి వ్యసనం వెళ్లగక్కాడు. అమెరికాకు అన్ని విధాలుగా సవాలుగా పరిణమించిన దేశం ఒక్క రష్యా మాత్రమే అని సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎజన్సీ డైరెక్టర్ బ్రెన్నన్ వ్యాఖ్యానించాడు. ఏ రంగంలో తీసుకున్నా రష్యా దేశం ఈ రోజు గట్టి స్దానంలో నిలవడానికి ముఖ్య కారణం ఆ దేశ అధ్యక్షుడు పుటిన్ అని బ్రెన్నన్ తన అక్కసు వెళ్లబోసుకున్నాడు.
సిబిసి వార్తా సంస్దకు ఇంఠర్వ్యూ ఇస్తూ బ్రెన్నన్ ఈ వ్యాఖ్యలు చేసాడు. “అన్ని రంగాలలోనూ అమెరికాకు సవాళ్లు విసర గల ప్రత్యర్ది దేశం రష్యా మాత్రమే. సైబర్ స్పేస్ లాంటి రంగాల్లో కూడా రష్యా ప్రబల శక్తిగా అవతరించింది” అని బ్రెన్నన్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
“అందువలన అమెరికాకు ప్రయోజనం కలిగే విషయాలలో మాస్కోతో కలిసి పని చేయడం తప్పనిసరి అయింది. ముఖ్యమైన కొన్ని చోట్ల స్దిరత్వం నెలకొనాలంటే, తద్వారా అమెరికా ప్రయోజనాలు నెరవేరాలంటే రష్యాతో కలిసి పని చేయక తప్పని పరిస్దితిలో ఉన్నాము” అని బ్రెన్నన్ అన్యాపదేశంగా వాపోయాడు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై ఉగ్రవాద దాడులు జరిగి ఈ సెప్టెంబరు 11 తో 15 యేళ్లు పూర్తయ్యాయి. సరిగా ఈ సమయం లోనే సిరియా కిరాయి తిరుగుబాటు విషయమై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.
విచిత్రం ఏమిటంటే ఈ ఒప్పందం ప్రకారం రష్యా, సిరియా ప్రభుత్వాల సైన్యాలు ఆల్-ఖైదా కు అనుబందంగా సిరియా యుద్దంలో తలపడుతున్న ఆల్-నూస్రా బలగాల పైన వైమానిక బాంబు దాడులు చేయకూడదు. అనగా ఆల్-ఖైదా తరపున అమెరికాయే చర్చలు జరిపి ఆల్-నుస్రా బలగాలను విమాన దాడుల నుండి కాపాడిందన్నమాట! అదీ 9/11 దాడులు జరిగి 15 సం.లు పూర్తయిన సందర్భంగా!
సి.ఐ.ఎ డైరెక్టర్ బ్రెన్నన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఒప్పందానికి సమర్దనగా చేసినట్లుగా భావించవచ్చు. రష్యాతో ఒప్పందం చేసుకోవడం ద్వారా తాము తప్పు ఏమీ చేయలేదని బ్రెన్నన్ ముందుగానే భుజాలు తడుముకున్నారు.
“రష్యా ఇపుడు ఒక ప్రబల ప్రపంచ శక్తి. దానికి విస్తారమైన మిలట్రీ బలగం ఉన్నది. అంతర్జాతీయంగా రష్యా ముఖ్య పాత్ర పోషిస్తున్నది” అని రష్యాతో ఒప్పందం చేసుకున్నందుకు బ్రెన్నన్ వివరణ ఇచ్చుకున్నాడు.
అమెరికా రష్యాలు పోటీదారులు అయినంత మాత్రాన ఇరు దేశాలు ఒక అంగీకారంతో పని చేయరాదన్న నిబంధన ఏమీ లేదని బ్రెన్నన్ చెప్పడం విశేషం. “ఇరు దేశాలు కలిసి పని చేస్తే అనేక అంతర్జాతియ సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సిరియా ఘర్షణ కూడా ముగియవచ్చు. ఒప్పందానికి కట్టుబడి ఉండాలని రష్యా, సిరియాపై ఒత్తిడి చేసే అవకాశం ఉన్నది” అని బ్రెన్నన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
బ్రెన్నన్ వ్యక్తం చేస్తున్న ఆశాభావం అమెరికాలో అందరూ కలిగి ఉన్నారని అనుకోనవసరం లేదు. విదేశీ మంత్రి జాన్ కెర్రీ నేత్రుత్వం లోని పాలక గ్రూపులు ముఖ్యంగా ఈ ఒప్పందం వెనుక ఉన్నాయి తప్పితే అన్ని గ్రూపులూ లేవు. నిజానికి సిరియాపై పూర్తి స్దాయి యుద్దం లేదా దాడి చేసి సిరియా అద్యక్శుడు అద్యక్షుడు బషర్ అస్సాద్ ను చంపేయాలని పలువురు అదికారులు, కంపెనీలు, పాలక గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. కెర్రీ వారిని పక్కకు నెట్టి సిరియా నుండి గౌరవప్రదంగా బైటపడేందుకు శ్రమిస్తున్నాడు. ఆ సందర్భంగా అమెరికా – ఆల్-ఖైదాల అపవిత్ర పొత్తు బైటికి వెల్లడి అవుతున్నది.
అమెరికా – రష్యాల సిరియా ఒప్పందాన్ని విఫలం చేసేందుకు క్రుషి జరుగుతున్నందున కొద్ది రొజులలోనే పరిస్దితి మొదటికి చేరడం ఖాయం.