ఏ‌పిని ప్రత్యేకం చేయడం -ద హిందు ఎడిట్…


ap

‘ప్రత్యేకం’ అయినది ఏ విధంగా ప్రత్యేకం అవుతుంది? విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం నుండి ఆపన్న హస్తం అందించాల్సిన అగత్యం ఏర్పడింది అనడం ఎన్నడూ సందేహం కాలేదు. కానీ రాష్ట్రం ఏ రీతిలో ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నదన్న అంశంలోనే కృషి జరగవలసి వచ్చింది. దానిని ప్రత్యేక తరగతి హోదా కలిగిన రాష్ట్రంగా ప్రకటించవచ్చా లేక ప్రత్యేక తరగతి హోదాకు తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరాలను తీర్చే బాధ్యత లేని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వరకు ఇవ్వడం సరైనదా? ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేందుకు తగిన అర్హతలు ఏ‌పికి లేవు; దానికి అటు కొండల ప్రాంతం లాంటి భౌగోళిక అననుకూలతలు గాని, ఇటు సామాజిక-ఆర్ధిక, మౌలిక నిర్మాణాల పరమైన వెనుకబాటుతనం మరియు జీవనం సాగించలేని ఆర్ధిక పరిస్ధితులు లాంటి చారిత్రక అననుకూలలతలు గానీ లేవు. దరిమిలా, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధికరణ చట్టంలో నిర్దేశించబడిన రోడ్ మ్యాప్, 2014లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నోటి మాటగా ఇచ్చిన హామీ 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక మరియు నీతి ఆయోగ్ సిఫారసుల ప్రాతిపదికన రాష్ట్రానికి సహాయం చేయడం పైనే అధికంగా దృష్టి కేంద్రీకరించారు. 2020 వరకు, అయిదేళ్ళపాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అడిగిన సమస్త అంశాలు లేకపోవచ్చు గాని, విభజన నుండీ, రాజధాని నగరం హైదరాబాద్ ను కోల్పోవడం వలన ఎదురయ్యే నష్ట పరిస్ధితుల నుండీ కోలుకోవడానికి కిందిమీదులు పడుతున్న రాష్ట్రం కోరుతున్న సకారణయుతమైన అంచనాలకు దాదాపు తగినట్లుగానే ఉన్నాయని చెప్పవచ్చు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది; రాష్ట్రంలో ఒక రైల్వే జోన్ ఏర్పాటు కానుంది; ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సి‌బి‌డి‌టి) పన్నుల రాయితీల విషయమై రెండు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ప్రత్యేక తరగతి హోదా కేవలం ఊత కర్రకు సమానం కాగా  ప్యాకేజీ విభజనానంతర పరిస్ధితికి అవసరం అయ్యే ఉద్దీపన కావచ్చు. ఇటువంటి పరిస్ధితులలో ఇది -కేంద్ర ప్యాకేజీ- మంచి ఒప్పందమే అని చెప్పవచ్చు.

అయితే ప్రత్యేక తరగతి హోదా పై సాగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు. కేంద్రానికి నచ్చజెప్ప లేకపోయినందుకు కాంగ్రెస్, వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకత్వం లోని ప్రతిపక్ష పార్టీలు నాయుడుని టార్గెట్ చేశాయి. తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కూటమిలో ఉన్నందున ఏ‌పి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి అమ్మేశారని అవి ఆరోపిస్తున్నాయి. బి‌జే‌పికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బహుశా ప్రతి స్పందనను ఊహించారో ఏమో, కేంద్రం సహాయం నిరంతరంగా కొనసాగే ఒక ప్రక్రియ అని సూచించారు. టి‌డి‌పి ప్రభుత్వం పురోగామి దృక్పధంతో ప్రత్యేక ప్యాకేజీని ఉపయోగపెట్టుకుని వృద్ధిని పెంచుకోవాలి మరియు ఉపాధి ఉత్పత్తికి తగిన పరిస్ధితులను సృష్టించాలి. అమరావతిలో రాజధానిని నిర్మించడానికి వనరులను కేంద్రీకరిస్తూనే ముఖ్యమంత్రి నాయుడు, తక్షణ అభివృద్ధి లక్ష్యం అయిన సాధారణ ప్రజానీకపు జీవన సంబంధ ఆందోళన నుండి దృష్టి మరల్చరాదు. అది ఆయన రాజకీయ వారసత్వ ఆస్తి కాగలదు: ఒక కష్ట దశ గుండా రాష్ట్రాన్ని ప్రయాణింపజేసి పటిష్టమైన ఆర్ధిక వ్యవస్ధగా మారేందుకు పునాదులు నిర్మించిన ఖ్యాతి సొంతం చేసుకోగలరు.

*********

బి‌జే‌పి నేతృత్వం లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న నయా ఉదారవాద నూతన ఆర్ధిక విధానాల సంస్కరణలను బాధ్యతాయుతంగా మోసే కర్తవ్యాన్ని నెత్తిన పెట్టుకున్న ద హిందు, సదరు కర్తవ్య నిర్వహణనే ఈ సంపాదకీయం లోనూ పాటించింది. ఏ‌పి కి హామీ ఇచ్చిన ప్రత్యేక తరగతి హోదాను అమలు చేయాలని కోరుతున్న ప్రజల డిమాండ్ ను ‘ఎంత ప్రత్యేకం అయితే ప్రత్యేకం అయినట్లు?’ అని హాస్యమాడుతోంది. విభజన సమయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బి‌జే‌పిలు పార్లమెంటులో ఇచ్చిన హామీలనే ఈ రోజు ‘ప్రత్యేక ప్యాకేజీ’గా బి‌జే‌పి ప్రభుత్వం మోసపూరితంగా ప్రకటించడంలో ఎలాంటి తప్పూ లేనట్లు సంపాదకీయం వెనకేసుకు వచ్చింది. కేంద్రం లోని టి‌డి‌పి, రాష్ట్రం లోని టి‌డి‌పి పార్టీల పెద్దలు చేస్తున్న మాటల గారడీ విద్యలనే అభివృద్ధి ప్రక్రియగా నమ్మాలని చెబుతోంది. బహుశా ఇంతపాటి విధేయత బి‌జే‌పికి హిందుత్వ అభిమాన పత్రికల నుండి కూడా దక్కుతున్నదో లేదో మరి!

ప్రత్యేక తరగతి హోదాకూ, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి మధ్య హస్తిమశకాంతరం ఉండగా అదేమీ లేదన్నట్లుగా సంపాదకీయం చెప్పబూనుకోవడంలో ద హిందు పెద్దలు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో తెలియకుంది. బహుశా ఆర్ధిక సంస్కరణలను మోడి ప్రభుత్వం తీవ్రంగా, వేగంగా, నిబద్ధతగా అమలు చేయాలని కోరుతున్న పత్రిక ఆశలకు ఏ‌పి ప్రజల ‘ప్రత్యేక’ ఆకాంక్షలు ఆటంకం అవుతాయని భావిస్తున్నదేమో! ఈ రోజు ఏ‌పి ఒత్తిడికి లొంగి ‘ప్రత్యేక తరగతి’ హోదా ఇస్తే రేపు మరిన్ని రాష్ట్రాలు అదే అడుగుతాయి, అప్పుడిక కేంద్రం నిధులలో గణనీయ మొత్తం ప్రత్యేక హోదాలకు వెళ్తుందనీ, అది కాస్తా సంస్కరణల వేగాన్ని మందగింపజేస్తుందని పత్రిక వెనుక ఉన్న పెట్టుబడిదారీ పెద్దలు భావిస్తుండవచ్చు. అదే నిజమైతే ద హిందు త్వరలోనే తన ‘ప్రత్యేకత’ను కోల్పోవడం ఖాయం!

‘ప్రత్యేక తరగతి’ హోదా అన్నది రాజ్యాంగపరంగా సంక్రమించే హక్కు. ‘ప్రత్యేక ప్యాకేజీ’ కేంద్ర ప్రభుత్వం దయతలచి ఇచ్చే నిధులు. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం అంటు జరిగాక నిధులు రాకుండా ఇంకెవరు ఆపలేరు. ప్రత్యేక ప్యాకేజీని ఏ సంవత్సరంలోనైనా నిధుల లేమి సాకుతో కత్తిరించవచ్చు లేదా సవరణలు చేయవచ్చు. ఆవేశకావేశాల మధ్య, ఆందోళనల మధ్య, భావోద్వేగాల మధ్య పార్లమెంటులో ఇచ్చిన హామీలకే ఈ రోజు గతి లేకుండా పోయినప్పుడు రాజ్యాంగ హోదా లేకుండా ఈ రోజు ఇచ్చే హామీలు రేపు నిలుస్తాయన్న గ్యారంటీ ఎక్కడి నుండి వస్తుంది?

ఈ సమస్యకు ప్రధాన మూలం బి‌జే‌పి ప్రభుత్వం తొక్కిడితో అమలు చేస్తున్న సంస్కరణల విధానాలలోనే ఉన్నది. ‘కనిష్ట ప్రభుత్వం; గరిష్ట పాలన’ (మినిమమ్ గవర్నమెంట్; మాక్జిమం గవర్నెన్స్) నినాదం కింద ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతలను క్రమేపీ తగ్గించే -ప్రపంచ బ్యాంకు వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం నిర్దేశించిన- కర్తవ్యాన్ని మోడి నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఎలాంటి అధికారాలు లేని నీతి ఆయోగ్ ని సృష్టించారు. తద్వారా రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను పూర్తిగా అదృశ్యం చేసేశారు. ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం వద్ద బోలెడు నిధులు అందుబాటులో ఉంచుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని పెంచుకున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి శాశ్వత విఘాతం ఖాయం చేశారు. ఈ పరిస్ధితి నుండే ఆంధ్ర ప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వడానికి కేంద్రం ససేమిరా మొరాయిస్తోంది.

‘ఏ‌పి కి ఇస్తే ఇతర రాష్ట్రాలూ అడుగుతాయి’ అనీ, ‘వచ్చే యేడు నుండి ఇప్పుడు ఉన్న రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఉండదు’ అనీ కేంద్ర మంత్రులు చెబుతున్నది ఈ నేపధ్యం లోనే. భారత ప్రజల/ ప్రభుత్వ ఆదాయాన్ని కేంద్రం వద్దనే కేంద్రీకరింపజేసుకునే ప్రక్రియలో భాగంగా జి‌ఎస్‌టి ని ఆమోదింపజేసుకున్న బి‌జే‌పి అదే ఒరవడిలో ఏ‌పి కి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ తాను ఇచ్చిన హామీని తానే తుంగలో తొక్కుతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు దిగ్విజయంగా ఆమలు చేసిన ‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన’ విధానమే. కాంగ్రెస్ కు తానేమీ భిన్నం కాదనీ అయితే గియితే తాను అంతకంటే ఘోరమనీ మోడి ప్రభుత్వం చాటి చెబుతోంది.

కాంగ్రెస్, వై‌సి‌పి పార్టీలు తమ ఓట్ల ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నంత మాత్రాన ఆ డిమాండ్ కి ఉన్న ‘ప్రజానుకూలత’ వట్టిపోదు.   రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయడం ‘ఒక నిరంతర ప్రక్రియ’ అని వెకయ్య నాయుడు అనడం లోనే అసలు మర్మం దాగి ఉన్నది. కేంద్రం ప్రకటించిన ‘ప్రత్యేక ప్యాకేజీ’ నిజానికి ప్రత్యేకం ఏమి కాదని, వాస్తవంగా, మామూలుగా కేంద్రం నుండి వచ్చే నిధులలో భాగంగానే ప్యాకేజీ నిధులు వస్తాయి తప్ప ప్రత్యేకంగా వచ్చేది ఏమి ఉండదని ఆయన చెప్పకనే చెబుతున్నారు. కనుక బి‌జే‌పి/మోడి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలువునా పాతర వేయడానికే కట్టుబడి ఉన్నారు తప్ప నెరవేర్చే ఉద్దేశంలో లేరు.

ఇక పవన్ కళ్యాణ్ లాంటి సీజనల్ ఉద్యమకారులు కమ్ రాజకీయ నాయకుల నుండి జనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వారికి సొంత ప్రయోజనాలకు రాజకీయాలు కావాలి గాని ప్రజల కోసం రాజకీయాలు చేయాలన్న దృష్టి ఉండదు. మరీ ముఖ్యమైన సంగతి ఏమిటి అంటే రాజకీయ నాయకులు తమ పాత మోసపూరిత-వాగ్దాన ఉల్లంఘన-కొత్తగా కబుర్లు చెప్పి నమ్మించలేని మొఖాలను జనానికి చూపించలేనప్పుడు కొత్త మొఖాల కోసం వెతుక్కుంటారు. జనంలో కాస్త పలుకుబడి ఉన్నట్లు ఎవరైనా కనబడితే వారి మొఖాన్ని తెచ్చి తమకు తగిలించుకుంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు తగిలించుకున్న కొత్త మొఖమే పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో విభజన వల్ల, అనంతర పరిస్ధితి వల్ల పేరుకు పోయిన అసంతృప్తిని సమీకరించడం. తాను సమీకరించిన అసంతృప్తిని ప్రజల డిమాండ్ అయిన ‘ప్రత్యేక హోదా’ సాధించడానికే వినియోగిస్తానని ఆయన చెబుతున్నారు గానీ, అందులో నిజం కనిపించడం లేదు. నిజం అయితే, ఆయనలో నిజాయితీ ఉన్నట్లయితే ప్రతిపక్షాలు బందు చేసినప్పుడే, లేదా గొడవ చేస్తున్నప్పుడే సభలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వరు. అందుకోసం ఒక స్ధిరమైన కార్యక్రమాన్ని నిర్దేశించుకుని దానిని అమలు చేసే పనిలోకి దిగుతారు. లక్ష్య సాధన కోసం ఉద్యమ నిర్మాణానికి పూనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నది అది కాదు. ప్రజల అసంతృప్తిని ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రంగం లోకి దిగుతున్నారు. దానితో టి‌డి‌పి, బి‌జే‌పి లు ఆయన్ను రంగం లోకి దించుతున్నారన్న అనుమానానికి ఊతం ఇస్తున్నారు. ఆయనేమో ఒక సభ జరిపి ఆవేశంగా ఉపన్యాసం దంచేసి, చప్పట్లు కొట్టించుకుని ఆనక కెమెరా ముందుకు గాని లేకపోతే ఇంకేదన్నా కలుగులోకి గాని వెళ్లిపోతున్నారు. ఆ విధంగా ప్రజల అసంతృప్తిని పాలక టి‌డి‌పి-బి‌జే‌పి ల కింద మంటగా మారకుండా సహాయం చేస్తున్నారు. కనుక సినిమా అభిమానులు పవన్ కళ్యాణ్ వెనుక పని చేస్తున్న ప్రజా వ్యతిరేక రాజకీయాలను గ్రహించి దూరంగా ఉండడం శ్రేయస్కరం.

2 thoughts on “ఏ‌పిని ప్రత్యేకం చేయడం -ద హిందు ఎడిట్…

  1. 2014 వరకూ ప్రత్యేక తెలంగాణా అంటూ నాటకాలాడిన పార్టీలు,ఇప్పుడు ప్రత్యేక హోదా(ప్రత్యేక ప్యాకేజీ) అంటూ కొత్తనాటకానికి తెరలేపాయన్నమాట.ప్రజలకు ప్రత్యామ్నాయ,ప్రగతిశీల రాజకీయవేదిక దొరకడం కల్ల!

  2. 2014 వరకూ ప్రత్యేక తెలంగాణా అంటూ నాటకాలాడిన పార్టీలు,ఇప్పుడు ప్రత్యేక హోదా(ప్రత్యేక ప్యాకేజీ) అంటూ కొత్తనాటకానికి తెరలేపాయన్నమాట.ప్రజలకు ప్రత్యామ్నాయ,ప్రగతిశీల రాజకీయవేదిక దొరకడం కల్ల!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s