
బ్రెక్సిట్ కి ఓటు వేస్తె ప్రపంచం తల కిందులు అయిపోతుంది అన్నంతగా పశ్చిమ ప్రభుత్వాలు, కార్పొరేట్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తల కిందులు కావటం అటుంచి ఉన్న వంకర సరి అవుతున్నట్లుగా కనిపిస్తున్నది. పడిపోతుంది అనుకున్న పారిశ్రామిక ఉత్పత్తి ఊహించని విధంగా పెరుగుదల నమోదు చేయగా మొత్తంగా బ్రిటన్ జీడీపీ కూడా కాస్త దారిలో పడినట్లు కనిపిస్తున్నది.
జూన్ 23 తేదీన జరిగిన బ్రెక్సిట్ ఓటు వలన బ్రిటిష్ సరుకులకు గిరాకీ తగ్గిపోతుందని, యూరోపియన్ యూనియన్ మార్కెట్ ఆ దేశానికి దూరం అవుతుంది కనుక ద్రవ్య సేవల జీడీపీ అమాంతం కుదించుకు పోతుందని ప్రపంచ ఫైనాన్షియల్ సెంటర్ గా లండన్ తన ప్రాభవం కోల్పోతుంది గనక సర్వీస్ సెక్టార్ జీడీపీ కూలిపోతుందని అనేక పెట్టుబడిదారీ రేటింగ్ కంపెనీలు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకుల విశ్లేషకులు, కార్పొరేట్ మార్కెట్ ఎనలిస్టులు ఊదరగొట్టారు.
కానీ జులై, ఆగస్టు నెలలకు గాను విడుదల అయినా జీడీపీ వివరాలు సరిగ్గా అందుకు విరుద్ధ కధనాన్ని వినిపిస్తున్నాయి. ఆ వివరాలను చూసి బ్రెక్సిట్ ఓటు పట్ల ముందు పెదవి విరిచి ఆందోళన చెందినవారే “అబ్బే! బ్రెక్సిట్ ప్రభావం అనుకున్నంతగా ఏమి లేదు” అని అంగీకరిస్తున్నారు.
జులై నెలలో బ్రిటన్ ఫయాక్టరి ఉత్పత్తి కాస్త తగ్గినప్పటికీ మొత్తంగా పారిశ్రామిక ఉత్పత్తి మాత్రం అంచనాలకు విరుద్ధంగా వృద్ధిని నమోదు చేసింది. బ్రెక్సిట్ ప్రభావం ఫ్యాక్టరీ ఉత్పత్తి పైన మాత్రమే పడిందని ఇప్పుడు అంచనాలు ప్రకటిస్తున్నారు. అయితే ఫ్యాక్టరీ ఉత్పత్తి బ్రెక్సిట్ కి ముందు కూడా పతన దిశలోనే ఉన్నది. కాబట్టి ఫ్యాక్టరీ ఉత్పత్తి తగ్గుదల బ్రెక్సిట్ కు ఆపాదించడం సరైనదేనా అన్నది ప్రశ్న.
బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఆఫీస్ ఫార్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) ప్రకారం చమురు, సహజ వాయువు ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందింది. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తి అనూహ్య వృద్ధి నమోదు చేసింది. జులై నెల లో పారిశ్రామిక రంగం 0.1% వృద్ధి నమోదు చేసిందని ONS తెలిపింది. అనగా వార్షిక ప్రాతిపదికన చుస్తే ఇది 1.2% వృద్ధికి సమానం.
పశ్చిమ ఆర్ధిక వ్యవస్ధలు రుణ సంక్షోభం, ఆర్ధిక మాంద్యంలతో సతమతం అవుతున్న ప్రస్తుత పరిస్ధితులలో పారిశ్రామిక జీడీపీ1.2% శాతం నమోదు కావడం మామూలు విషయం కాదు. జూన్ నెలలో ఎదుగు బొదుగూ లేకుండా స్తంభనకు గురైన పరిశ్రమల ఉత్పత్తి బ్రెక్సిట్ వలన పడిపోతుందని, అది కూడా బాగా పడిపోతుందని అంచనా వేశారు. రాయిటర్స్ (మార్కెట్) వార్తా సంస్ధ అయితే 0.2% (2.4% వార్షిక) తగ్గుదల నమోదు అవుతుందని అంచనా వేసింది. అలాంటిది ఏకంగా 1.2% వృద్ధి చెందడంతో బ్రిటిష్ విశ్లేషకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.
ఉత్తర సముద్రంలోని బజ్జర్డ్ చమురు, సహజ వాయువు బావి నుండి ఉత్పత్తి పూర్తి సదాయిలో ఉత్పత్తి అవుతుండడం బ్రిటిష్ పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతొంది. నిజానికి అమెరికా నుండి విపరీతంగా ఉత్పత్తి అవుతున్న చమురు, గ్యాస్ వల్ల ప్రపంచ ఎనర్జీ మార్కెట్ లో గ్లట్ (ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల ఏర్పడే తొక్కిడి) నెలకొని ఉన్నది. కాబట్టి ఇతర చమురు ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్ధితిని కూడా బ్రిటన్ చమురు కంపెనీలు అధిగమించడం గుర్తించదగినది.
బ్రిటన్ జీడీపీ లో అత్యధిక వాటా ఫైనాన్షియల్ రంగానిదే. జీడీపీ లో దాదాపు 80 శాతం వరకు ద్రవ్య సేవల నుండి సమకూరుతుంది. బ్రెక్సిట్ వలన ఇది బాగా నష్ట పోతుందని అంచనా వేయగా ఆగస్టు నెలలో అనూహ్య రీతిలో వృద్ధి నమోదు చేసిందని మార్కెట్ సర్వేలు చెబుతున్నాయి. అధికారిక అంచనాలు ఇంకా వెలువడనప్పటికీ వివిధ మార్కెట్ సంస్ధలు నిర్వహించిన సర్వేలు ఈ సంగతి స్పష్టం చేస్తున్నాయి.
బ్రెక్సిట్ వలన బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ పడిపోవడంతో అది కాస్తా బ్రిటిష్ ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేసింది. ఒక దేశ కరెన్సీ విలువ తగ్గినపుడు ఆ దేశం ఉత్పత్తి చేసే సరుకుల విలువ తగ్గిపోతుంది. అనగా అంతర్జాతీయ మార్కెట్ లో ఆ దేశ సరుకులు చౌక అవుతాయి. ఫలితంగా గిరాకీ పెరిగి ఎగుమతులు పెరుగుతాయి. ఈ కారణంతోనే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువలను కృత్రిమంగా తగ్గించి ఉంచుతాయి. ఈ చర్య ఆ దేశ కంపెనీలకు లాభిస్తుంది కానీ ప్రజలకు చేటు తెస్తుంది. వారు సంపాదించే కాస్త సంపాదనకు కొద్దిపాటి సరుకులు వస్తాయి. అనగా వారి కొనుగోలు శక్తి పడిపోతుంది.
ప్రస్తుతానికి బ్రెక్సిట్ ప్రభావం బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్ధపై పెద్దగా కనిపించడం లేదు. అయితే బ్రెక్సిట్ ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. కేవలం అనధికార చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ భవిష్యత్తులో ఈ చర్చలు ఏ దిశలో వెళ్తాయి అన్న దానిపై ఆధారపడి బ్రిటిష్ జీడీపీ ప్రభావితం అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే అది కేవలం స్వల్ప మరియు మధ్య కాలికంగా మాత్రమే జరుగుతుంది. దీర్ఘ కాలికంగా చూస్తే అమెరికా దృత రాష్ట్ర కౌగిలి నుండి బయటపడిన బ్రిటన్ పాలకవర్గాలు తమదైన స్వతంత్ర ఉనికి కోసం జపాన్ లాగా ప్రపంచ ఆర్ధిక యవనికపై మెరుగైన స్ధానం కోసం పోటీ పడుతుంది. అది బ్రిటిష్ సాధారణ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల సాధారణ ప్రజలు కూడా లాభ పడేందుకు దోహదం చేస్తుంది.