అటూ ఇటూ కాని భారత సమాజం
ఇప్పుడు ఇండియాకి వద్దాం. భారత దేశంలో కూడా సమాజం పైన చెప్పినట్లుగా క్రమానుగత పరిణామం జరిగిందా అన్నది పరిశీలించవలసిన ప్రధానాంశం. అభివృద్ధి చెందిన దేశాలకు మల్లే ఇండియాలో కూడా సమాజం తన సహజ రీతిలో అభివృద్ధి చెందనిస్తే, పరిణామం జరగనిస్తే ఇప్పుడు ఉన్నట్లుగా ఇండియా ఉండేది కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో చోటు చేసుకోని పరిణామం ఇండియా లాంటి అనేక మూడో ప్రపంచ దేశాల్లో చోటు చేసుకుంది. అదే బ్రిటిష్ పాలకుల ‘వలస పాలన’. భారత దేశంతో సహా ఆసియా, ఆఫ్రికా లలోని ఇతర వ్యవసాయక దేశాలలో సామాజిక పరిణామ క్రమం సహజ రీతిలో జరగకుండా బ్రిటిష్ వలస పాలకులు ఆటంకపరిచారు. అనేక చోట్ల బానిస సమాజం, కొన్ని చోట్ల ఫ్యూడల్ సమాజం నెలకొన్న దశలో ఉపఖండం లోకి ప్రవేశించిన వలస పాలన ఇక్కడ అత్యంత అభివృద్ధి నిరోధక పాత్ర నిర్వహించింది. దేశంలోని ఫ్యూడల్ పునాదులను కదిలించకుండా అలాగే నిలిపి ఉంచింది. రాజ సంస్ధానాలను కొనసాగనిచ్చి కప్పం వసూలు చేసింది. గ్రామాల్లో భూస్వాముల పెత్తనం చెక్కు చెదరకుండా కాపాడి వారి దోపిడిలో సింహభాగం వసూలు చేసింది. క్రూరమైన, అన్యామైన చట్టాలతో మెజారిటీ ప్రాంతాన్ని ప్రత్యక్ష పాలనలోకి తెచ్చుకుంది. ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాల్లో తమకు ఆదాయం వస్తుంది అనుకున్న చోట్ల నీటిపారుదల (ఆనకట్టలు, బ్యారేజిలు) సౌకర్యాలు కల్పించింది. ఇంగ్లండ్ నుండి సరుకులు దిగుమతి చేసి చేతి వృత్తులను దెబ్బ తీసింది. మరి ముఖ్యంగా కుల అణచివేతను భద్రంగా కాపాడింది.
సహజంగానే వలస పాలనపై భారత ప్రజలు తిరుగుబాట్లు లేవదీశారు. అనేక చోట్ల రైతాంగ తిరుగుబాట్లు చెలరేగాయి. దానితో భారతీయ ఆధిపత్యవర్గాలను చేరదీయవలసిన అవసరాన్ని వలస పాలకులు గుర్తించారు. సిపాయి తిరుగుబాటు, తెభాగా, మోప్లా, ఖిలాఫత్, ఏకా మొ.న రైతుల తిరుగుబాట్లను అదుపు చేసేందుకు భారత భూస్వామ్య వర్గాలను చేరదీసారు. వారిని కాంగ్రెస్ పార్టీ కింద సమీకరించి స్వతంత్ర పోరాట ముసుగు తొడిగింది. అగ్ర కులాలలో ధనికులను బ్రిటన్ పంపి చదివించి తనకు సివిల్ అధికారులుగా చేసుకుంది. అలా బ్రిటిష్ పాలకులు చేరదీసిన భారత భూస్వాములు, తొలితరం అధికారులే బడా పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందారు. వాళ్ళు బ్రిటిష్ పాలనకు విధేయులుగా అభివృద్ధి అయ్యారు తప్ప స్వతంత్రంగా భారత ప్రజల ప్రయోజనాలు పరిరక్షించే పెట్టుబడిదారులుగా, భారత జాతీయ సెంటిమెంట్లుగల పెట్టుబడి దారులుగా అభివృద్ధి కాలేదు. అందుకే వారు దళారి పెట్టుబడిదారులు అయ్యారు. వారి దృష్టిలో జాతీయ ప్రయోజనాలు అంటు ఏమి ఉండవు. మహా ఉంటే జాతీయ కబుర్లు ఉంటాయంతే.
భారత భూస్వామ్య వర్గాలు, అగ్ర కులాలలోని సంపన్నులు బ్రిటిష్ ఆసరాతో పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందితే మరి మధ్య తరగతి రైతులు, పేద రైతులు భూమిలేని కోట్లాది కూలీలు, చేతి వృత్తుల ప్రజలు… వీళ్ళంతా ఏమైనట్లు? ఇండియాలో స్వాతంత్ర పోరాటం జరిగింది తప్ప సామాజిక అభివృద్ధికి దారితీసే విప్లవాలు జరగలేదు. స్వతంత్ర పోరాటం కూడా ప్రధానంగా బ్రిటిష్ చెప్పుచేతల్లో నడిచిన బడా భూస్వామ్య, బడా పెట్టుబడిదారీ చేతుల్లో ఉండిపోవడంతో స్వతంత్ర పోరాట విజయం కాస్తా అధికార మార్పిడిగానే ముగిసిపోయింది. అనగా ఇండియాలో ప్రజాస్వామిక విప్లవం అన్నదే జరగలేదు. విప్లవం జరగనప్పుడు సమాజం పాత దశ నుండి కొత్త దశకు అభివృద్ధి చెందడం జరగదు. సామాజిక విప్లవం జరిగి ఉంటే, పాత సమాజంలోని రైతులు ధనిక రైతులుగా మారడమో, వర్తక పెట్టుబడి పోగుబడి పెట్టుబడిగా రూపాంతరం చెందడం, పెట్టుబడిదారులు అభివృద్ధి కావడం, చేతివృత్తుల వాళ్ళు ఎంటర్ ప్రేన్యూర్ లు గా మారి పరిశ్రమలు పెట్టడం ఆ తర్వాత జాతీయ ప్రయోజనాలు కలిగిన పెట్టుబడిదారీ వర్గంగా అభివృద్ధి చెందడం… ఇవన్నీ జరిగి ఉండేవి.
ఈ క్రమాభివృద్ధిని బ్రిటిష్ వలస పాలన అడ్డుకుంది. వాడి వల్ల భారత వ్యాపారుల చేతుల్లో వర్తక పెట్టుబడి పోగుబడే (accumulate) అవకాశం అసలుకే శాశ్వతంగా మూసుకుపోయింది. ఇక స్వతంత్ర పెట్టుబడిదారుడిగా ఎదిగే అవకాశం ఎక్కడిది? ప్రజాస్వామిక విప్లవం సాధించి సమాజాన్ని తదుపరి దశకు అభివృద్ధి చేయవలసిన భారత పెట్టుబడిదారీ వర్గం బ్రిటిష్ వలస ప్రయోజనాలకు సేవచేస్తున్న పరిస్ధితుల్లో శ్రామికవర్గాలకు నాయక పాత్ర వహించే వర్గం లేకుండా పోయింది. దానితో ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యం వెనక్కి వెళ్లిపోయింది. విప్లవంలో పాత్ర పోషించడానికి రైతులు, కూలీలు, కార్మికులు ఉత్సాహంతో నవనవ లాడుతున్నప్పటికి నాయకత్వం వహించవలసిన పెట్టుబడిదారీ వర్గం, భూస్వాములతో సహా బ్రిటిష్ వలస పాలన జేబులో ఉండిపోవడంతో భారత సమాజం అటు అభివృద్ధి దశలోకి వెళ్లకా, ఇటు పాత సమాజంలో ఉండలేక మధ్యలో కొట్టుమిట్టాడింది.
ఇప్పటికీ అటు-ఇటు కానీ దశలో ఉండడమే భారత సమాజ లక్షణంగా కొనసాగుతోంది. బ్రిటిష్ వలస పాలన కొనసాగినంత వరకు వలస, అర్ధ-భూస్వామ్య దేశంగా భారత సమాజం ఉన్నది. బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో ఉన్నది కనుకా, వలస పాలకుల పర్యవేక్షణలో భారత పెట్టుబడిదారివర్గం ఉనికిలోకి వచ్చింది కనకా, వలస సమాజం అయింది. భూస్వామ్యం పెట్టుబడిదారీ దశకు వెళ్లలేదు; అలాగని పూర్తి రూపంలో ప్రజలపై దోపిడి సాగించగల పరిస్ధితి కూడా -వలస పెత్తనం వల్ల- దానికి లేదు. అందువలన అర్ధ-భూస్వామ్య సమాజం అయింది. 1947లో భారత దళారి పాలకులకు అధికారం అప్పగించి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోయాక మన సమాజం అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సమాజంగా ఉనికిలోకి వచ్చింది. అర్ధ-వలస అని ఎందుకు అంటున్నామంటే గతంలో లాగా ఒకే దేశం యొక్క ప్రత్యక్ష పాలనలో భారత దేశం లేదు. అలాగని మన ఆదాయ వనరులను -పెట్టుబడి, పరిశ్రమలు, భూములు- భారత పెట్టుబడిదారుల స్వతంత్ర నియంత్రణలో లేదు. వారికి పెట్టుబడి కావాలంటే ఇప్పటికీ వాల్ స్ట్రీట్, ద సిటీ లను దేబిరించాల్సిందే. ప్రజలు శ్రమ చేసి కూడబెడుతున్న సంపదలన్నీ వాల్ స్ట్రీట్ తదితర సామ్రాజ్యవాద పెట్టుబడులకు వడ్డీలుగా వెళ్లిపోతోంది. వార్షిక బడ్జెట్ లో కనీసం 25 శాతం రుణాల చెల్లింపులే ఉంటాయి. లోటు బడ్జెట్ వేసి అప్పు తెచ్చి పూడ్చుతారు.
ఉన్న ఆదాయాన్ని అప్పులకు చెల్లిస్తూ, అవసరాలకు కొత్త అప్పులు తేవడం అంటే అప్పుల ఊబిలో నిలువు లోతులో కూరుకుని ఉండటం. ప్రభుత్వాలు మనవే; మనమే ఓట్లు వేసి గెలిపిస్తాము; కానీ మన ఆదాయ-ఖనిజ-నీటి-ద్రవ్య-శ్రమ వనరులను మన ప్రయోజనాలకు, మన అవసరాలకు, మన అభివృద్ధికి ఖర్చుపెట్టలేని సేవక పరిస్ధితిలో మన పెట్టుబడిదారీ-భూస్వామ్య వర్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా అమలు కాని పరాధీన పరిస్ధితి ఇది. అందుకే ఇది అర్ధ-వలస సమాజం అయింది. అదే సమయంలో భారత సమాజం భూస్వామ్య దశను పూర్తిగా దాటలేదు. భూస్వామ్య స్వభావాన్ని, అంశాలను, శక్తులను నాశనం చేసే ప్రజాస్వామిక విప్లవం ఇక్కడ జరగలేదు కదా, అందుకని భూస్వామ్య పరిస్ధితుల్లో విప్లవాత్మక మార్పులు జరగలేదు. అందుకే భారత దేశ ప్రధాన భూస్వామిక లక్షణమైన కులం చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఈ లక్షణాలు భారత సమాజాన్ని అర్ధ-భూస్వామ్య సమాజంగా కొనసాగిస్తున్నాయి.
అభివృద్ధి అంటే ఏమిటని అనుకున్నాం? సమాజం పాత దశ నుండి కొత్త, తదుపరి దశకు చెరడమే నిజమైన అభివృద్ధి. పాత సమాజంలోని సకల వర్గాలు సమాజ పరిణామంలో/మార్పులో/విప్లవంలో పాత్ర వహించి కొత్త సమాజంలోని సరికొత్త రూపం లోకి మారడమే అభివృద్ధి. ఇది దశాత్మక అభివృద్ధి. వర్గ పరిశీలనలోకి వెళ్ళినపుడు భూస్వామ్య సమాజంలోని భూస్వాములు గాని, వర్తక పెట్టుబడిదారులు గాని పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారీ వర్గంగా పరిణామం చెందడం, ధనిక రైతులు వీలయితే పెట్టుబడిదారులుగా గాని లేదా పారిశ్రామికవేత్తలుగా మారటం, సత్తా లేకపోతే ఆస్తులు కోల్పోయి కార్మికులుగా మారడం జరగాలి. పేద రైతాంగం, కూలీలు వ్యవసాయ పరిశ్రమలో గాని, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో గాని కార్మికులుగా మారాలి. వారిలో కొందరు సంబంధాలు, పలుకుబడి, అధికార సామీప్యత లాంటి సౌకర్యాల ద్వారా చిన్న-మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందనూవచ్చు. కానీ ఎవరూ మార్పులలో భాగం కాకుండా, ఉత్పత్తి క్రమానికి సమాజ పరిణామ క్రమానికి దూరంగా ఆదాయ వనరులు కోల్పోయి ఉండరు.
కానీ భారత దేశంలో అది జరగలేదు. ఆ సంగతి పైన చూశాం. అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య దశలో భారత సమాజం స్తంభించి పోయి ఉన్నది. ఇందులో కదలిక తేవడానికి భారత పెట్టుబడిదారులకు సత్తా లేదు. వారు సామ్రాజ్యవాద పెట్టుబడికి అర్ధ-వలస సేవకులు. ఎవరైనా ఒకరిద్దరు పెట్టుబడిదారులు జాతీయ స్వభావంతో, మన మీద విదేశీ కంపెనీల పెత్తనం ఏమిటన్న తెగువతో కదలిక తెచ్చేందుకు పూనుకుంటే సామ్రాజ్యవాదం చూస్తూ ఊరుకోదు. ఇరాన్, లిబియా, సిరియా, ఇరాక్, క్యూబా, వెనిజులా, ఈక్వడార్, బ్రెజిల్ మొ. దేశాల్లో కుట్రలు, దాడులు, దురాక్రమణలు సాగించినట్లే వీళ్ళ మీదికి కూడా వస్తుంది. విప్లవమే సంభవించలేదు గనక వ్యవసాయంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న రైతులు, భూమిలేని పేద రైతులు, వ్యవసాయ కూలీలకు సరికొత్త ఉత్పత్తి శక్తిగా రూపాంతరం చెందే అవకాశం లేదు. పోనీ స్వయం ఉపాధి చేసుకుంటున్నవారి జోలికైనా రాకుండా ఊరుకుంటున్నారా అంటే అదీ లేదు. పచారీ, బడ్డి కొట్ల వ్యాపారాన్ని వాల్ మార్ట్ లకు అప్పగిస్తున్నారు. ఆటో, ట్యాక్సీ బాడుగలను ఉబర్-ఓలా లకు అప్పగిస్తున్నారు. చిన్న వడ్డీ వ్యాపారుల ఆదాయ వనరులను తీసుకెళ్లి మైక్రో-ఫైనాన్స్ పేరుతో సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి దోపిడీకి అప్పగిస్తున్నారు. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ బ్రోకరేజి, చిన్న పరిశ్రమలు… ఇలా ఏది చూసినా ఎఫ్‌డిఐల దుక్రామణకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ పరిశ్రమలను విదేశీ కంపెనీలకు, ఎఫ్‌డిఐ లకు అమ్మేస్తూ ఉన్న ప్రభుత్వ ఉపాధిని కూడా క్రమంగా రద్దు చేస్తున్నారు. చివరకు మిగిలింది ప్రభుత్వ కార్యాలయాలు. వాటినీ కాంట్రాక్టికరణ కింద పలుచన చేస్తున్నారు. ఇక భారత శ్రామిక ప్రజలకు ఏ ఆదాయ వనరు మిగిలి ఉన్నట్లు? ఏ కొత్త ఉత్పత్తి సంబంధం లోకి వాళ్ళు వెళ్ళినట్లు? ఏ కొత్త ఉత్పాదక శక్తిగా వారు రూపాంతరం చెందినట్లు? -సమాజం అభివృద్ధి చెందింది అనడానికి! అటు దశాత్మక అభివృద్ధి జరగలేదు, ఇటు వర్గాల రూపాంతరీకరణా జరగలేదు. ఇది నడమంత్రపు దశ. సమాజాన్ని లోతుకంటా కుళ్లిపోయేలా చేస్తున్న దశ. సమాజం అభివృద్ధి నిరోధక దశలో స్తంభించి ఉన్నంత కాలం అందులోని అభివృద్ధి నిరోధక శక్తులు పండగ చేసుకుంటాయి. అది కుల హైన్యం కావచ్చు, హిందుత్వ మతోన్మాదం కావచ్చు, పురుషాధిక్య స్వభావం కావచ్చు, మైనారిటీల అణచివేత కావచ్చు.. ఇలాంటి వన్నీ స్తంభన దశలో వెర్రితలలై మొలిచి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అణగారిన, శ్రామిక ప్రజలకు మరింత భారంగా తయారవుతాయి.
గుర్తించవలసిన మరో ముఖ్యమైన అంశం భారత దేశంలో జరుగుతున్నాయి అని చెబుతున్న మార్పులలో శ్రామికవర్గాలకు ఎలాంటి పాత్ర లేదు. బీటీ విత్తనాలు అభివృద్ధి చేసింది బహుళజాతి కంపెనీలే గాని రైతులు కాదు. పోనీ బీటీ విత్తనాల వల్ల లబ్ది పొందుతున్నది కూడా బహుళజాతి కంపెనీలే గాని రైతులు కాదు. భారత వ్యవసాయాన్ని చంపేయడం వల్ల సామ్రాజ్యవాద కంపెనీలకు మార్కెట్ పెరుగుతోంది; కానీ రైతుల ఆదాయ వనరు కోల్పోతున్నారు; వారి వ్యవసాయం దండగ అనే విపత్కర పరిస్ధితికి నెట్టబడుతున్నారు; మన నేతలే ‘వ్యవసాయం దండగ’ అని ప్రభోదిస్తుంటే రైతులు ఎవరి వైపు చూడాలి? రైతులకే ఉపాధి లేకపోతే పదుల కోట్ల సంఖ్యలోని కూలీల పరిస్ధితి ఏమిటి? భూమిలేని రైతుల పరిస్ధితి ఏమిటి? వీరెవరికీ జరుగుతున్న పైనుండి రుద్దబడుతున్న మార్పులలో పాత్ర లేదు. ఆ మార్పుల ఫలితాన్ని మాత్రం అనుభవిస్తున్నారు. వ్యవస్ధ పరిణామ క్రమంలో భాగం వహిస్తూ దాని ఫలితాన్ని అనుభవించడం వేరు; పరిణామాలకు బైట నిలబడి ప్రేక్షక పాత్ర వహిస్తూ పరిణామాల ఫలితాలను అనుభవించడం వేరు. మొదటిదానిలో జీవం ఉంటుంది; ఏదో ఒక భవిష్యత్తు ఉంటుంది. కానీ రెండవ దానిలో జీవమూ ఉండదు; భవిష్యత్తు ఉండదు. శూన్యం మాత్రమే ఉంటుంది. శూన్య పరిస్ధితుల్లో ఏమి చేస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటారు. లేదా తిరుగుబాటులోకైనా వెళ్తారు. తిరుగుబాటు రంగం లోకి వెళ్లాలంటేనేమో చోదక శక్తులు అందుకు సిద్ధంగా లేవు; శక్తివంతంగా లేవు; ఒకటిగా లేవు. భారత శ్రామికులు కఠోరమైన విపత్కర పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.
ఈ నేపధ్యంలో భారత దేశంలో వ్యవసాయ సమాజం పరిశ్రమల సమాజం లోకి మారలేదని స్పష్టం అవుతున్నది. వ్యవసాయ సమాజం పరిశ్రమల సమాజం లోకి మారాలంటే సమాజం లోని వివిధ వర్గాల భాగస్వామ్యం తప్పనిసరి అవసరం. ఆ మార్పు మౌలిక పునాదుల్లో కదలికలు తేవడం ద్వారా మాత్రమే జరగాలి. అప్పుడే మార్పుతో ముడిపడి ఉన్న వర్గాలన్నీ పరిణామంలో పాత్రవహిస్తూ సకారణమైన ఫలితాన్ని పొందుతారు. సమాజం పునాదులను కదల్చకుండా అట్టే పెట్టి ‘నూతన పారిశ్రామిక విధానం’ అంటూ ఆధిపత్య వర్గాల ప్రయోజనాలనే నెరవేర్చే చట్టాలు చేస్తూ సమాజాన్ని విప్లవకరంగా మార్చగలమని మార్క్సిస్టు పార్టీ భావించడం లోనే ప్రధాన దోషం ఉన్నది. కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత తప్పంతా బ్రిటిష్ కాలం నాటి చట్టానిదే అని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదం. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీ అయితే ఇలాంటి హాస్యాస్పద ప్రకటన చేయరు. అందునా కమ్యూనిస్టు సిద్ధాంతాలు చెప్పే పార్టీ ఐతే అసలే చేయరు. బండిని తెచ్చి గుర్రం ముందు పెట్టడం కాకపోతే జరిగిన తప్పుకు కాగితాలలోని చట్టం బాధ్యత వహిస్తుందా లేక ఆ చట్టాన్ని అమలు చేసిన ప్రభుత్వం, పోలీసులు, పార్టీ కార్యకర్తలు బాధ్యత వహించాలా? చట్టం లోని భావనది తప్పు అవుతుందా లేక ఆ భావనను భౌతిక చర్యలలోకి మార్చిన మార్క్సిస్టు ప్రభుత్వానిది తప్పవుతుందా? సమర్ధనకు పరుగెత్తుకు వచ్చేముందు పంచె ఊడిపోకుండా చూసుకోవాలని మార్క్సిస్టు నేతలు గుర్తెరగాలి. లేదంటే నగుబాటు తప్పదు.
చివరిగా, ఒక జడ్జి చెప్పినట్లు “పారిశ్రామికీకరణ లక్ష్యమే ప్రజలకు ఉపయోగపడడం” అన్నది సర్వకాలసర్వావస్ధలయందు నిజం కాదు. వడ్డించేవాడు కూడా రైతు దృక్పధంతో ఉన్నపుడే పారిశ్రామీకరణ రైతులకు అక్కరకు వస్తుంది. కానీ భారత సమాజం పైన ప్రధానంగా పెత్తనం చేస్తున్నది సామ్రాజ్యవాదులు కావడం వలన కార్మికులు, రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు… మున్నగు శ్రామిక ప్రజలు బంతిలో ముందు కూర్చున్నా ఫలితం దక్కడం లేదు; దక్కదు కూడా. వ్యవసాయ సమాజాన్ని పరిశ్రమల సమాజంగా మార్చగల పెట్టుబడిదారుడు భారత దేశంలో విదేశీ పెట్టుబడికి సేవ చేస్తున్నాడు. అందువలన కామ్రేడ్ మావో ప్రబోధించినట్లు విప్లవ నాయకత్వ భారాన్ని కార్మికవర్గమే నెత్తిన వేసుకోవాలి. ప్రజాస్వామిక విప్లవం తేలేని దళారీ పెట్టుబడిదారుడిని తరిమికొట్టి, అశేష రైతాంగాన్ని తోడ్కొని, నూతన ప్రజాస్వామిక విప్లవానికి నడుం బిగించాలి. అప్పుడే భారత సమాజం తదుపరి విప్లవాత్మక దశలోకి అడుగు పెట్టగలుగుతుంది.
………….అయిపోయింది.
రైతుల తిరుగుబాట్లను అదుపు చేసేందుకు భారత భూస్వామ్య వర్గాలను చేరదీసారు. వారిని కాంగ్రెస్ పార్టీ కింద సమీకరించి స్వతంత్ర పోరాట ముసుగు తొడిగింది.
కాంగ్రెస్ పార్టి క్రింద భూస్వాములను సమీకరించ లేదు. ప్రధానిగా నెహ్రు అధికారం చేపట్టిన తరువాత ఆపార్టిలో భూస్వాముల ప్రవేశం మొదలైంది. జస్టిస్ పార్టీ, ద్రవిడోద్యమం వీళ్లందరు భూస్వామ్య,జమీందార్ కుటుంబాలకు చెందిన వారు.నార్త్ లో ఐతే ముస్లీం లీగ్ కింద సమీకరించారు. దక్షిణాదిన బ్రాహ్మణ వ్యతిరేకత తో జస్టిస్ పార్టీ, పెరియార్ రామస్వామి, ఆయన వారసులంతా బ్రిటీష్ వారికి కొమ్ముకాసేవారు, నార్త్ లో స్వాతంత్రం వస్తే హిందూ బనియాల పోటికి ముస్లీం లు తట్టుకోలేరని బ్రిటిష్ వాడు భూస్వాములంతా జిన్నా కు మద్దతు ఇచ్చేటట్లు చేశాడు. మొగల్ పాలనలో ఉన్నత కుటుంబాల వారసులకు, ముస్లీం జమీదారులకు ఇండియాలో ఉంటే కమ్యునిస్ట్ లు తిరుగుబాటు చేసి భూములు లాక్కొంటారనే భయం చాలా ఎక్కువాగా ఉండెది. అందువల్ల పాకిస్థాన్ కోసం వాళ్ళు పూర్తిస్థాయి ప్రయత్నాలు జిన్నాతో కలసి చేశారు. ఇప్పటికు పాకిస్థాన్ లో భూమి మొత్తం 200 కుటుంబాలు వారి బందువులు కుటుంబానికి 1000 మంది ని లెక్కవేసుకొంటే 2,00,000 మంది దగ్గర కేంద్రీకృతమైంది. ఈ లేక్క జావేద్ అక్తర్ ఒక పాకిస్థాన్ టివి కి ఇచ్చిన ఇంటర్వ్యు లో చెప్పాడు. ఇంకొక విషయమేమిటంటే పాకిస్థాన్ ఏర్పడ్డాక ఈ భూస్వాము కొందరు వారి భూమిని పంచటం మత విరుద్దమని మతపెద్దల చేత చెప్పించి భూమిని పంచకపోగా,సిపాయిల తిరుగు బాటులో పాల్గొన్నందుకు ప్రభుత్వం నుంచి మరికొంత భూమిని తీసుకొన్నారు. పాకిస్థాన్ టివి లో దేశం వెనుక పడిపోవటానికి కారణం పై జరిగే చర్చలలో వాళ్ళు ఈ వివరాలు కోట్ చేస్తూంటారు.
ఇంగ్లండ్ నుండి సరుకులు దిగుమతి చేసి చేతి వృత్తులను దెబ్బ తీసింది.
సర్, చేతి వృత్తుల వారు తమ జీవనాధారాన్ని కోల్పోయిన మీదట బిచ్చగాళ్ళగానో లేదా మరో వృత్తులనో స్వీకరించవలసి ఉంటుంది కదా! వారికి సంబంధిచిన వివరాలు ఏమైన దొరుకుతాయా?
శేఖర్ గారు, మీరు రాసిందంతా నూటికి నూరు పాళ్ళూ నిజం.
సమగ్రంగా మీరు రాసింది ముక్కలుగా అస్పష్ట భావాలుగా ప్రజలందరికీ బాగా తెలుసు. కొందరికి జ్ఞానం వల్లా, చాల మందికి అనుభవం వల్లా.
మనలో ఉండే బహుముఖీయ భిన్నత్వం వల్లా, ఏ ఇద్దరూ కలిసి ముందుకుపోలేని ‘ప్రత్యేకత’ వల్లా సంఘటితమవడం అసంభవం. అయినా నిలబడము. నిలబడినా కొనసాగము.
అనుకుంటారు గాని, యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అని.
ఏ మాత్రం భయం అక్కర లేదు.
మన దేశంలో – యునైటెడ్ వి స్టాండ్.(ఎలాగొలా) అండ్ దెన్ వి మేక్ స్యూర్ నోబడీ మూవ్ ఫార్వార్డ్.
మానవులందరూ కలలు కనే సామ్యవాద సామ్రాజ్యానికి మరేదైనా కొత్తపధ్ధతి కనిపెట్టాల్సిదే.
ఇప్పుడున్న ఇజాలేవీ పనికిరావు.
– గడ్డిపాటి శ్రీకాంత్