సింగూరు తీర్పు: అభావం అభావం చెందుతుంది -4


Stages in human evolution

ఇపుడు మళ్ళీ వ్యవసాయ సమాజం, పారిశ్రామిక సమాజంగా పరిణామం చెందే విషయానికి వద్దాం. పశ్చిమ దేశాల్లో లేదా పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ సమాజం స్ధానంలోకి పరిశ్రమల సమాజం ఎలా వచ్చింది? ఉన్నట్లుండి హఠాత్తుగా వ్యవసాయం అదృశ్యం అయిపోయి పరిశ్రమలు వచ్చేశాయా? భూస్వాములు, ధనిక రైతులు హఠాత్తుగా పెట్టుబడిదారులుగా మారిపోయి, రైతులు-కూలీలేమో కార్మికులుగా మారిపోయారా?

సమాధానం దొరకని సాధారణ తాత్విక ప్రశ్నలు కొన్ని మనకు అప్పుడప్పుడు ఎదురవుతు ఉంటాయి. కోడి ముందా, గుడ్డు ముందా? చెట్టు ముందా, విత్తు ముందా? …లాంటివి. సాధారణ ఆలోచనల్లో ఈ ప్రశ్నలకు సమాధానం అంతుబట్టదు. కాస్త దృష్టి పెట్టి ఆలోచిస్తే అసలు ఈ ప్రశ్నలు, వేయదగ్గ ప్రశ్నలేనా అన్న అనుమానం వస్తుంది. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం తెలిసినవారికి ఈ ప్రశ్నలు ‘అర్ధ రహితం’ అని స్ఫురిస్తుంది. భూగోళం పైన జీవం ఒక్కనాటితో పుట్టింది కాదని, కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో అది అభివృద్ధి చెందుతూ వచ్చిందని డార్విన్ సిద్ధాంతం చెబుతుంది.

మొదటి జీవ పదార్ధం ఏక కణ జీవిగా పుట్టిందని, అది పరిసరాలతో చర్యలు జరుపుతూ, తాను ప్రభావితం అవుతూ, తానూ ప్రభావితం చేస్తూ బహుకణ జీవిగా మారిందని పరిణామ సిద్ధాంతం చెబుతుంది. ఆ తర్వాత మొక్కలు, చెట్లు, కీటకాలు, పక్షులు, సరీసృపాలు, కోతి, హోమోసెపియన్, ఆదిమ మానవుడు, ఆధునిక మానవుడు… ఇలా అనేక జీవులు దశల వారీగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. మారుతున్న భూవాతావరణంలో నశించేవి నశిస్తూ, తట్టుకోగలిగినవి బతికి సరికొత్త రూపాలలోకి మారుతూ జీవ పదార్ధం అభివృద్ధి చెందుతూ వచ్చిందని ఆ సిద్ధాంతం చెబుతుంది. శాస్త్ర పరిశోధనలు ఆ సిద్ధాంతాన్ని రుజువు చేశాయి కూడా. నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు కూడా ప్రత్యక్ష రుజువులుగా మనకు కనిపిస్తాయి.

Human evolution

ఈ పరిణామంలో మనకు కనిపించేది ఒక జీవం చనిపోయి దాని స్ధానంలో కొత్త జీవం పుట్టడం కాదు; ఒక జీవం మారుతున్న పరిస్ధితులకు తగ్గట్టుగా మనుగడ కొనసాగించడం కోసం తన అలవాట్లను, అవయవాలను మార్చుకుంటూ కొత్త రూపాన్ని సంతరించుకోవడం. అలా మారకపోతే అంతరించి నిర్జీవంగా మారిపోవాలి. కాదు మనుగడ కొనసాగించాలంటే మారి తీరాలి. ఈ అవసరం కోసమే జీవం తనలో తాను సంఘర్శిస్తూ, పరిసరాలతో కూడా ఘర్షణ పడుతూ శాఖోపశాఖలుగా విస్తరించింది. లక్షోప లక్షల జీవ రాశిలో మనగలిగినవి నిలిచాయి, మనలేనివి నశించాయి. (కాబట్టి కోడి ముందా, గుడ్డు ముందా అన్న ప్రశ్న సరైన ప్రశ్న కాదు. కోడి-గుడ్డు రెండు ఒకే జీవ వ్యవస్ధలో అంతర్గత భాగాలు. వాటిని విడదీయడం కుదరదు. అసలు ప్రశ్న ఏమిటి అంటే కోడికి ముందు అది ఏ రూపంలో ఉనికిలో ఉండేది? అన్నదే. ఈ అసలు ప్రశ్నకు పరిణామ సిద్ధాంతం చక్కగా సమాధానం చెబుతుంది.) కోతి నుండి మనిషి పుట్టాడు అంటే ఆడ కోతి మగ కోతి సంగమిస్తే మానవ శిశువు పుట్టాడని అర్ధం కాదు. కోతుల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి. వాటిల్లో హోమో సెపియన్ ఒకటి. హోమో సెపియన్ తరగతికి చెందిన కోతి వేల సం.ల పరిణామ క్రమంలో ఆదిమ మానవుడిగా పరిణామం చెందాడు. ఇది పరిణామమే గాని ఒక దాని స్ధానంలో మరొకటి పుట్టడం కాదు.

జీవ పదార్ధం అమీబా దశ నుండి ఆధునిక మానవుడిగా అభివృద్ధి చెందినట్లే మానవ సమాజం కూడా వివిధ పరిణామ దశలు దాటుకుంటూ నేటి స్థాయికి చేరుకుంది. ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో ఉమ్మడిగా వేటాడి ఉమ్మడిగా తిన్నారు. క్రమంగా ప్రాధమిక ఉత్పత్తి సాధనాలు తయారు చేసుకుని మిగులు ఉత్పత్తి సాధించాడు. మిగులు ఉత్పత్తి, సమాజంలో కొద్దిమందికి మనిషి శ్రమల జ్ఞానాన్ని శాస్త్రాలుగా అభివృద్ధి చేసే సమయం ఇచ్చింది. మరోవైపు ఉత్పత్తి సాధనాలను, వాటి ద్వారా జరిగిన మిగులు ఉత్పత్తిని స్వాయత్తం చేసుకున్నవాడు యజమాని అయ్యాడు; ఆ సాధనాలపై పని చేసేవాడు బానిస అయ్యాడు. ఆ విధంగా యజమాని-బానిస ప్రధాన ఉత్పత్తి సంబంధంగా, ఉత్పత్తి శక్తులుగా బానిస సమాజం ఏర్పడింది. ఎల్లకాలం అణచివేతలో మగ్గలేని బానిసలు తిరుగుబాటు చేశారు. కొందరు స్వయంగా భూములను సాగు చేయడం మొదలు పెట్టారు. మరిన్ని ఉత్పత్తి సాధనాలను కనిపెట్టారు. శ్రమలు విభజన చెందుతూ, అభివృద్ధి చెందుతూన్న క్రమంలో శ్రమల నైపుణ్యం పెరిగింది. నైపుణ్యం తిరిగి శాస్త్రాన్ని (సైన్స్) అభివృద్ధి చేసింది.

సమాజంతో పాటు అభివృద్ధి అవుతూ వచ్చిన రాజ్యం ఉత్పత్తి సాధనాలను ఆధిపత్య వర్గాల తరపున నియంత్రిస్తూ వచ్చింది. శ్రమజీవులు కొద్దిమంది అరిస్టోక్రటిక్/ భూస్వామ్య వర్గాల భూములకు బంధింపబడి అర్ధ బానిసలుగా మగ్గారు. అసమాన వ్యవస్థకు దైవత్వం ఆపాదించిన భావవాద (మత) వ్యవస్ధలు తిరుగుబాట్లను నియంత్రించడంలో రాజ్యానికి దన్నుగా నిలిచాయి. వివిధ రూపాల్లో వ్యక్తం అయిన ఈ సమాజంలో ప్రధాన ఉత్పత్తి సంబంధం మరియు వైరుధ్యం భూస్వామికీ అర్ధ బానిసలైన పేద రైతులకూ మధ్య నెలకొన్నది. ఇదే ఫ్యూడల్ లేదా భ్యూస్వామ్య సమాజం.

ఫ్యూడల్ సమాజాల్లో వర్తక పెట్టుబడిదారుల వద్ద పోగుబడిన మిగులు పెట్టుబడి వారిని పెట్టుబడిదారీ వర్గంగా మార్చింది. ఇలా కొత్తగా ఉద్భవించిన పెట్టుబడివర్గాలకు ఫ్యాక్టరీలు పెట్టి లాభాలు సంపాదించాలంటే పని చేసే కార్మికులు స్వేచ్చగా లభ్యం కావాలి. కానీ ఫ్యూడల్ వ్యవస్ధ శ్రామికుడిని స్వేచ్ఛగా వదిలేందుకు నిరాకరించింది. స్వేచ్ఛగా వదిలిస్తే తమ భూముల్లో నిర్బంధ శ్రమ చేసేదేవరు? దానితో భూస్వామికీ పెట్టుబడిదారుడికీ వైరం/వైరుధ్యం తలెత్తింది. రైతులను, ఇతర శ్రామికులను సమీకరించి భూస్వామ్య వర్గాలపై పెట్టుబడిదారీ వర్గం తిరుగుబాటు చేసింది. అదే బూర్జువా ప్రజాస్వామిక విప్లవం. ప్రజాస్వామిక విప్లవం అన్నా అదే. ఆ విధంగా ప్రజాస్వామిక విప్లవం ద్వారా భూస్వాములతో ఏర్పడిన వైరుధ్యాన్ని తమకు అనుకూలంగా పరిష్కరించుకున్న పెట్టుబడిదారీ వర్గం, పెట్టుబడిదారీ సమాజం ఏర్పాటు చేసుకుంది.

ఈ సామాజిక పరిణామ క్రమంలో ఏ వర్గమూ మార్పులలో భాగం కాకుండా ఉండ లేదు. ప్రతి విప్లవం లోనూ, ప్రతి పరిణామ చర్యలోనూ సమాజంలోని వివిధ వర్గాలు భాగస్వామ్యం వహించాయి. కనుక వాళ్ళు పూర్వ సమాజంతో పాటు కొత్త సమాజంలో కూడా ఉత్పత్తి ప్రక్రియలతో, ఉత్పత్తి సాధనాలతో ఏదో ఒక రూపంలో సంబంధం కలిగి ఉన్నారు. అటు ఆధిపత్య స్ధానంలో ఐనా ఉన్నారు లేదా ఇటు అణచివేత స్ధానంలో ఐనా ఉన్నారు, కానీ వ్యవస్ధ నిర్మాణంలో భాగం కలిగి ఉన్నారు. బానిస సమాజంలోని బానిస యజమానులు ఫ్యూడల్ సమాజంలో ఫ్యూడల్ ప్రభువులుగా పరిణామం చెందారు. కొన్ని చోట్ల వాళ్ళు రాజ్యాలు, భూములు కోల్పోయి రైతులు, కూలీలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారి భూములు వశం చేసుకున్నవాళ్లు వారికి బదులు భూస్వాములుగా అయ్యారు తప్పితే భూస్వామ్య వర్గం అసలుకే రద్దు కాలేదు. అలాగే బానిసలలో కొందరు స్వేచ్ఛ కొనగలిగినవారు, వివిధ రూపాల్లో భూములు మిగుల్చుకున్నవారు రైతులుగా, ధైనిక రైతులుగా అభివృద్ధి చెందారు. పలుకుబడి సంపాదిస్తే వర్తకులు అయ్యారు. వర్తక సంపాదనతో భూములు కొన్నారు. అనేకమంది భూమిలేని పేదలుగా మిగిలిపోయి రెక్కల కష్టాన్ని అమ్ముకునే కార్మికులుగా పరిణామం చెందారు.

భూస్వామ్య సమాజం పెట్టుబడిదారీ సమాజంగా పరిణామం చెందిన క్రమంలో కూడా ఇదే జరిగింది. వర్తక పెట్టుబడి కొత్త పెట్టుబడిదారీ వర్గాన్ని సృష్టించడం వారి నాయకత్వంలో ప్రజాస్వామిక విప్లవం సంభవించడం జరిగాక రాజులు, భూస్వాములు, యుద్ధ ప్రభువులు, జమీందారులు మొ.న పాత ఆధిపత్య వర్గాలు ఏమైనట్లు? పాత ఉత్పత్తి సంబంధం రద్దయింది గనక కొత్త సమాజానికి అనుగుణంగా పెట్టుబడిదారుల పాత్రలోకి వెళ్ళాలి లేదా ఆస్తులు కరగదీసుకుని బికార్లు కావాలి. ఎప్పటిలాగా భూస్వామిగానే ఉంటానంటే కుదరదు. విప్లవం వలన సరికొత్తగా ఉద్భవించిన భౌతిక పరిస్ధితులు పాత రూపంలో ఉనికిని కొనసాగించడానికి అంగీకరించవు. నిర్ధాక్షిణ్యంగా తొక్కి పారేస్తాయి.

అలాగే పాత సమాజంలోని రైతులు, ఇతర వ్యవసాయ ఆధారిత శ్రామికులు కొత్త (పెట్టుబడిదారీ) సమాజంలో పైన చెప్పినట్లు కార్మికులుగా “రూపాంతరం” చెందారు. కొద్దో గొప్పో భూమి ఉండి బతక నేర్చిన రైతులు కొందరు అధికార సోపానంలో మెళుకువలు వంటబట్టించుకుని ధనిక రైతులుగా, పెట్టుబడిదారులుగా మారవచ్చు. కానీ ప్రధాన కదలిక మాత్రం: సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలు పెట్టుబడిదారీ పాత్రలోకి గాని కార్మికుల పాత్రలోకి గాని రూపాంతరం చెందడమే. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కొద్దిపాటి భూములు కాలీనవారు పెట్టీ బూర్జువాలుగా ఆధిపత్యవర్గాలకు విధేయులుగా ఉంటారు; కానీ వారు కూడా సమాజ పరిణామంలో ఆ స్ధానానికి చేరుకుని ఉంటారు తప్పితే కొత్తగా ఎక్కడినుండో ఊడిపడరు.

Darwin Tree of Life

Darwin Tree of Life

భారత దేశంలో సమాజ పరిణామం గురించి చర్చించే ముందు మరొకసారి అభివృద్ధి గురించి చెప్పుకోవాలి. ఒక సమాజం లేదా ఒక దేశం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు అని అంగీకరిస్తే సమాజంలోని ప్రజలందరూ, లేదా దేశ పౌరులు అందరు సమాన స్ధాయిలో వనరులు, సాంకేతిక అభివృద్ధి, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించగలగడమే నిజమైన అభివృద్ధి అవుతుంది. కానీ ఇప్పటివరకు చూసిందాన్ని బట్టి ఏ దేశంలో చూసినా, ఏ సమాజంలో చూసినా అసమానతలు లేకుండా ఎప్పుడూ (కాలం) లేదు, ఎక్కడా (స్ధలం) లేదు. కానీ సమాజం అభివృద్ధి చెందడం మాత్రం వాస్తవమే. సమాజం అభివృద్ధి చెందకుండా రాతియుగం మనిషి స్మార్ట్ ఫోన్ వరకు ఎలా వస్తాడు! ఈ రెండు విరుద్ధ అంశాలు ఒకే ఒరలో ఎలా ఇముడుతాయి?

ఎలాగంటే, సామాజిక అభివృద్ధిని, అది ఎలా జరిగిందో అలా ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకోవడం ద్వారా, అర్ధం చేసుకుని చెప్పుకోవడం ద్వారా ఇమిడేలా చేయవచ్చు. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడం అంటే సమాజాన్ని వర్గ సమాజంగా గుర్తించడం. ఉత్పత్తి సాధనాలపైన యాజమాన్యం ప్రాతిపదికన వర్గ సమాజం నిరంతరం రెండు విరుద్ధ వర్గాల కలయికగా ఉనికిని కొనసాగిస్తూ వచ్చింది. ఉత్పత్తి సాధనాలను (భూములు, పరిశ్రమలు) సొంతం చేసుకున్నవారు ఆధిపత్య వర్గంగాను, ఉత్పత్తి సాధనాలపై పని చేసేవారు శ్రామికవర్గం గాను ఏర్పడి పరస్పరం వివిధ రూపాల్లో ఘర్షణ పడుతున్న క్రమంలోనే సమాజం అభివృద్ధి సాధించింది తప్ప మరోలా జరగలేదు. ఇలా జరిగిన అభివృద్ధి ఫలాలు ఎల్లప్పుడూ ఆధిపత్యవర్గాలకే సొంతం అవుతూ వచ్చింది. వారికి సేవ చేసినవారికి అభివృద్ధిలో జూనియర్ భాగస్వామ్యం దక్కింది.

ఏతావాతా తేలేది ఏమిటి అంటే మానవ సమాజం అసమాన అభివృద్ధి సాధించింది తప్పితే సమాన అభివృద్ధిని సాధించలేదు. అభివృద్ధి ఫలాలు కొద్ది మందికి దక్కాయి. అశేష శ్రామిక ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉంచబడ్డారు. వివిధ రూపాలు మారుతూ వచ్చిన రాజ్యం (రాజకీయ, సైనిక, పాలక, న్యాయ వ్యవస్ధలు) ఆధిపత్య వర్గాల సంపదలను, ఆధిపత్యాన్ని కాపాడుతూ వచ్చింది. అభివృద్ధిని, సమానత్వాన్ని కోరిన శ్రామికులను అణచివేసే సాధనంగా ఉపయోగపడింది.

…… ముగింపు ఈసారి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s