సింగూరు తీర్పు: అభివృద్ధి వైరుధ్యం -3


Workers at Tata - Nano

Workers at Tata – Nano

ముందు ‘అభివృద్ధి వైరుధ్యం’ ఏమిటో స్పష్టంగా పరిశీలించాలి. ఒక జడ్జి దృష్టిలో “అసలు పారిశ్రామికీకరణ యొక్క లక్ష్యమే ప్రజలకు ఉపయోగపడడం.” చారిత్రక దృష్టితో చూసినప్పుడు ఈ అవగాహనలో తప్పు లేదు. కానీ జడ్జిలు చారిత్రక దృష్టి కలిగి ఉండటానికి చట్టాలు ఒప్పుకోవు. వారి ముందు ఉన్న కేసు, సాక్షాలు, చట్టాలు… ఈ అంశాలను మాత్రమే చూస్తూ వాళ్ళు తీర్పు ఇవ్వాలి. కనుక జడ్జి దృష్టిలో ఉన్నట్లు కనిపిస్తున్న చారిత్రకతను పక్కనబెట్టి సింగూరు భూముల స్వాధీనం – రైతుల వ్యతిరేకత (మరియు పోరాటం)’ వరకు మాత్రమే మన పరిశీలనను కేంద్రీకరించవలసి ఉంటుంది.

టాటా ఈ దేశ చట్టం దృష్టిలో ప్రత్యేక వ్యక్తి కాదు. ఆయనొక పౌరుడు; బహుశా ఒక పారిశ్రామికవేత్త కూడా కావచ్చు. జనం దృష్టిలో మాత్రం ఆయన పలుకుబడి కలిగిన ధనికుడు; భారత దేశంలోని మొదటి తరం సంపన్న కుటుంబాలలో ఒకటి టాటా కుటుంబం. ఆ కుటుంబం ఎన్ని పరిశ్రమలు పెట్టి ఎన్ని ఉత్పత్తులు తీసినా, ఎన్ని పెట్టుబడులు ఖర్చు చేసినా అదంతా లాభం కోసమే చేస్తుంది తప్ప సరదాకి చేయదు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి అసలే చేయదు; కాకపోతే తన సంపదల అభివృద్ధికి పడే పాట్లన్నీ దేశాభివృద్ధి కోసం పడుతున్న పాట్లుగా నమ్మించగలదు. అందుకు వారికి కార్పొరేట్ మీడియా మద్దతు వస్తుంది. దేశాభివృద్ధికి కష్టపడేవాడు అయితే సం.కి మూడు పంటలు పండే నాణ్యమైన సింగూరు భూములే కావాలని టాటా పట్టుబట్టడు. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధపడడు. ఫ్యాక్టరీని గుజరాత్ కి తరలించి కూడా సింగూరు భూముల్ని అట్టిపెట్టుకోవడానికి ప్రయత్నించడు. గుజరాత్ ప్రకటించిన అత్యంత సులభతరమైన పన్నులు, చౌక భూములు, తద్వారా వచ్చే మరిన్ని లాభాల కోసం -బెంగాల్ ప్రజల అభివృద్ధిని ఫణంగా పెట్టి- ఆత్రంగా అక్కడికి పరుగెత్తడు. గుజరాత్ లో కూడా మూడు పంటలు పండే భూమిని ప్రభుత్వం చేత వృధా చేయించడు.

టాటా-నానో ను గుజరాత్ కు తెప్పించడానికి అప్పటి ముఖ్యమంత్రి మోడి వేల కోట్ల రాయితీలను అప్పనంగా కట్టబెట్టాడు. ఫ్యాక్టరీ ఖరీదు రు 2,000 కోట్లు కాగా దానికోసం రు 30,000 కోట్ల వరకు రాయితీలు, చౌక రుణాలు, భూముల సబ్సిడీ రూపంలో గుజరాత్ నుండి టాటా పొందాడు. లీక్ అయిన గుజరాత్ కేబినెట్ నోట్ ప్రకారం రు 9,570 కోట్ల సొమ్మును నామమాత్ర 0.1% వడ్డీకి రుణం కింద చెల్లించారు. ఇది అప్పటి గుజరాత్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రు 40,000 కోట్లలో నాలుగో వంతు. 20 యేళ్ళ వరకు ఋణ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా రాయితీ ఇచ్చారు. ఫ్యాక్టరీకి అవసరమైన మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఐన ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. విద్యుత్ చౌకగా ఇచ్చింది. విద్యుత్ సుంకం రద్దు చేసింది. రోజుకి 14,000 ఘనపు మీటర్ల నీరు సరఫరా చేస్తోంది. టౌన్ షిప్ కోసం అదనంగా 100 ఎకరాలు ఇచ్చింది. మొత్తం భూమికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేశారు.

సహజ వాయువు సరఫరాకు ఫ్యాక్టరీ వరకు పైపులు నిర్మించి ఇచ్చింది. వృధా పారవేసేందుకు సౌకర్యాలు నిర్మించింది. ట్రాన్స్ పోర్ట్ హబ్ నిర్మించి ఇచ్చింది. సింగూరు నుండి యంత్రాల తరలింపుకు రు 700 కోట్లు ఉదారంగా ఇచ్చేసింది. “ఈ సౌకర్యాల ఖరీదు రు 30,000 కోట్లు. ఇదంతా ప్రజాధనమే” అని కాంగ్రెస్ నేత సిద్ధార్ధ పటేల్ ఆనాడు వెల్లడి చేశాడు. ఫ్యాక్టరీ ఒప్పంద వివరాలు వెల్లడి కాకుండా మోడి కఠినమైన రహస్య ఆదేశాలు అమలు చేశాడు. కానీ ప్రత్యర్థి పారిశ్రామిక గ్రూపుల చొరవతో ఒప్పందం లీక్ అయింది. లీక్ అయిన వివరాలను మోడి/బి‌జే‌పి ఖండించలేదు. పైగా “కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలకు రు 2 లక్షల కోట్లు ఇచ్చి ప్రోత్సహించారు. మేము ఇచ్చింది అంతకు తక్కువే కదా!” అని అప్పటి గుజరాత్ టూరిజం మంత్రి జయనారాయణ్ వ్యాస్ ఎదురు ప్రశ్నించాడు. కాబట్టి టాటాకు రు 30,000 కోట్ల సౌకర్యాలు, రుణం, సబ్సిడీలు మోడి సమకూర్చాడని నిస్సందేహంగా నమ్మవచ్చు.

Nano -Sansad-workers strike

Nano -Sanand- workers on strike in Feb 2016

ఇన్ని వేల కోట్ల అభివృద్ధి ఎవరికి దక్కినట్లు? సింగూరులో భూస్వాధీనం వలన 12,000 కుటుంబాలు నాణ్యమైన భూములు, తద్వారా జీవనాధారం కోల్పోయాయి. సనంద్ (గుజరాత్) ఫ్యాక్టరీలో మొత్తం కార్మికుల సంఖ్య 2,200. వారిలో 500 మంది మాత్రమే పర్మినెంట్ కార్మికులు, మిగిలిన వాళ్ళందరూ క్యాజువల్ లేదా కాంట్రాక్టు కార్మికులే. గుజరాత్ పారిశ్రామిక విధానం ప్రకారం అక్కడ ఫ్యాక్టరీ పెడితే 85% మంది ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి. కానీ సనంద్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లలో కనీసం 60 శాతం ఉత్తర ప్రదేశ్, బీహార్ ల నుండి పొట్టచేత బట్టుకుని వచ్చినవాళ్లే అని స్థానికులు చెప్పేమాట. “వాళ్ళు ఇచ్చిన నష్ట పరిహారం ఎప్పుడో ఖర్చయింది. మేము మాత్రం జీవనాధారం కోల్పోయాం” అని సనంద్ రైతులు ఇప్పుడు వాపోతున్నారు. రైతులకు బ్రహ్మాండమైన పరిహారం చెల్లించారని, వాళ్ళు కోటీశ్వరులు అయ్యారని కార్పొరేట్ మీడియా చెబుతుంటే రైతులు మాత్రం అందుకు విరుద్ధంగా చెబుతున్నారు.

నానో ఫ్యాక్టరీ స్థాపన అనంతరం స్థానికంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కానీ ఆ ధరలు డి‌ఎల్‌ఎఫ్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల బొక్కసాలకు చేరాయి తప్ప స్థానిక ప్రజలకు దక్కలేదు. అప్పటికే సదరు భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, యూనివర్శిటీ భూములు ప్రజలకు బదులు రియల్ ఎస్టేట్, ఇతర బడా సంపన్న కుటుంబాలు దక్కించుకోవడం వల్ల జరిగిన అభివృద్ధి అంతా కొద్ది మంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వ్యవసాయం శాశ్వతంగా మూతబడింది. వరి, గోధుమ, పప్పులు, కూరగాయలు సమృద్ధిగా పండే భూమి వ్యర్ధాల కాలుష్యం వెలువరించే కార్ఖానాగా మారింది. రైతులకు అటు ఫ్యాక్టరీలో పని దక్కలేదు, ఇటు మరో పని చేసే నైపుణ్యమూ వారికి లేదు. నానో వల్ల సింగూరులో 12,000 కుటుంబాలు భూములు కోల్పోగా, సనంద్ లో ఒక విద్య సంస్థ (ఆనంద్ యూనివర్సిటీ)తో పాటు కొన్ని వేలమంది రైతులు భూమి కోల్పోయారు. ప్రభుత్వ భూముల్ని టాటా కు కట్టబెట్టడం ద్వారా రైతుల వ్యతిరేకతను మోడి సగం తగ్గించుకున్నారు. రైతుల నుండి తీసుకున్న భూములకి మార్కెట్ కంటే అధిక మొత్తం చెల్లించినట్లు భ్రమలు కల్పించారు. కానీ పట్టిన చేపలని తమకు ఇచ్చారు తప్ప చేపలు పట్టడం నేర్పలేదని రైతులకు తెలిసేసరికి వారి చేతుల్లోని భూమి మాయం అయింది.

సనంద్ – నానో ఫ్యాక్టరీలో పని చేసే 2,200 కార్మికుల్లో 500 మాత్రమే పర్మినెంట్ కార్మికులని చూశాం. పర్మినెంట్ కార్మికుల నెల వేతనం ప్రస్తుతం రు 11,700/-. సనంద్ లో ఒక వంటగదితో సహా రెండు గదుల ఇంటి అద్దె నెలకు రు 5,000/. మిగిలిన 6,700/- తో ఇల్లు గడవాలి; పిల్లల్ని చదివించుకోవాలి; తల్లి దండ్రులకు డబ్బు పంపాలి; వారి ఆరోగ్యం చూడాలి; పండగలు పబ్బాలు గడుపుకోవాలి. కాంట్రాక్టు కార్మికుల దిన వేతనం రోజుకి రు 246/-. వారి పరిస్ధితి ఇక చెప్పనవసరం లేదు. సెప్టెంబర్ 2 దేశవ్యాపిత సమ్మె నేపధ్యంలో దీనిని రు 350/- కు పెంచుతున్నట్లు మోడి ప్రభుత్వం ప్రకటించింది. కార్మికుల్ని చట్టం ప్రకారం పర్మినెంట్ చేసే అవసరం లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి తాజాగా పనిలో చేరినట్లు రికార్డులు సృష్టిస్తారు. దానితో కార్మికులపైన టాటా కంపెనీ భారీ వేతన దోపిడి అమలు చేయగలుగుతోంది.

ఈ యేడు ఫిబ్రవరిలో వేతనాల పెంపు డిమాండ్ చేసే క్రమంలో యూనియన్ పెట్టుకునే ప్రయత్నం చేశారు కార్మికులు. వెంటనే “తీవ్ర స్థాయి దుష్ప్రవర్తన” సాకుగా చూపి ఇద్దరు కార్మికుల్ని సస్పెండ్ చేసింది టాటా యాజమాన్యం. పని చేసే స్ధలం వద్ద ఒక అరగంట పాటు లేకుండా పోవడమే ‘తీవ్ర దుష్ప్రవర్తన’ (serious misconduct). ఆ అరగంట యూనియన్ పెట్టే విషయం చర్చించడానికి వారిద్దరు పక్క విభాగానికి వెళ్లినందుకు యాజమాన్యం కక్ష కట్టింది. అదేమని ప్రశ్నించినందుకు మరో 28 మందిని సస్పెండ్ చేసింది. దాంతో 400 మందికి పైగా నానో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. గుజరాత్ కార్మిక శాఖ ఇరు వైపులా న్యాయం ఉన్నదని చెబుతూనే ‘సమ్మె చట్ట విరుద్ధం’ అని తీర్మానించింది. ఫలితంగా కార్మికులపై మరిన్ని చర్యలు తీసుకోవడానికి నానో యాజమాన్యానికి హక్కులు సంక్రమించాయి. కార్మిక శాఖ మధ్యవర్తిత్వంలో అనేకమార్లు చర్చలు జరిగాక యూనియన్ పెట్టుకోవడానికి నోటిమాటగా అంగీకరించిన టాటా యజమాన్యం 30 మందిని ఇక పనిలోకి తీసుకునేది లేదని తెగేసి చెప్పింది. తద్వారా యూనియన్ లో చురుకుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక సందేశం పంపింది. అసలు ఉన్న కార్మిక చట్టాలే తక్కువ; అవి కూడా బలహీనం; వాటిని అమలు చేయడానికి కార్మిక శాఖే సిద్ధంగా లేకపోగా యాజమాన్యానికి వత్తాసు వస్తుంటే కార్మికుల జీవనం, అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది?

టాటా కంపెనీ యాజమాన్యానికి రు 30,000 కోట్ల ప్రభుత్వ/ప్రజా ధనంతో సకల సౌకర్యాలు కల్పించి, కార్మికుడికి నెలకు రు 12,500 వేతనం చెల్లిస్తున్నపుడు నానో ఫ్యాక్టరీ వల్ల సాధించబడిన అభివృద్ధి -అది నిజంగా అభివృద్ధి అయితే- ఎవరికి దక్కినట్లు? రైతులకి భూముల జీవనాధారం పోయింది. కొద్దిమందికి దక్కిన ఉపాధి కనీస మాత్రమైన గౌరవప్రద జీవనానికి ఆమడ దూరంలో ఉంచడమే కాకుండా వలస కార్మికులతో దినసరి వేతనానికి పని చేయిస్తున్న టాటా ఫ్యాక్టరీ వల్ల ఎవరు అభివృద్ధి చెందారో తెలియడానికి మరింత వివరణ అవసరమా? తమదైన సొంత భూమిలో ఎవరి దయపైనా ఆధారపడకుండా ఉన్నంతలో స్వయం సమృద్ధంగా జీవనం సాగిస్తున్న రైతుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తే అది అభివృద్ధి అనగలమా? ఎలాంటి హక్కులు లేకుండా అనుక్షణం సూపర్ వైజర్లు, మేనేజర్లు పహారాలో, పాస్ పోసుకోవడానికి కూడా అనుమతి – సమయం దొరకని దుర్భర పరిస్ధితిలో పని చేసే కార్మికుడికి తాను ‘అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నట్లు’ భావించగలడా?

సం.కి 2.5 లక్షల కార్ల తయారీ సామర్ధ్యంతో నిర్మించిన ఫ్యాక్టరీ క్రమంగా 5 లక్షల తయారీ సామర్ధ్యానికి పెంచుతామని టాటా మోటార్స్ కంపెనీ మొదట చెప్పింది. కానీ ప్రకటిత సామర్ధ్యానికి అది ఎప్పుడు చేరలేదు. 2009-12 కాలంలో 1.75 కార్లు ఉత్పత్తి చేయగా 2012-13లో 54,000 (28%) యూనిట్లకు పడిపోయింది. 2013-14లో 21,000 కు, 2014-15 లో 17,000 కు ఉత్పత్తి పడిపోయింది. అనగా రు 30,000 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తే అది జి‌డి‌పి వృద్ధికి కూడా తోడ్పడలేదు. జి‌డి‌పి అంకెలు చూపి రంకెలు వేసే మోడి ప్రభుత్వం సాధిస్తున్న గుజరాత్ అభివృద్ధి నమూనా అసలు రంగు ఇదీ!

ఇప్పుడు నష్టాలు వచ్చి నానో ఫ్యాక్టరీని మూసివేయదలిస్తే టాటాను అడ్డుకునే చట్టం లేదు. కార్మికుల్ని ఆదుకునే ప్రభుత్వాలు అసలే లేవు. కానీ టాటాకు మాత్రం 1100 ఎకరాల భూమి మిగులుతుంది. ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగల ప్రక్రియలు చట్టాల్లో లేవు. ప్రభుత్వం నిర్మించిన మౌలిక సౌకర్యాల వల్ల ఆ భూమి ఖరీదు ఎన్ని రెట్లు పెరిగి ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గుజరాత్ తరహా నయా ఉదారవాద అభివృద్ధి నమూనా బడా దళారి పెట్టుబడిదారుల సంపదలను అనేక రెట్లు పెంచడానికీ, రైతుల జీవనాధారాన్ని లాగివేయడానికీ దోహదపడుతోంది తప్ప మొత్తంగా దేశానికి ఒనగూరుతున్న అభివృద్ధి వీసమెత్తు కూడా లేదు.

అసలు పరిశ్రమల స్థాపనకు వృధా భూములకు బదులుగా సంవత్సరానికి 2-3 నుండి 4-5 పంటల వరకు పండే భూములనే పారిశ్రామికవేత్తలు ఎందుకు కోరుతున్నారు? నానో ఫ్యాక్టరీ ఒక్క ఉదాహరణ చూసినా, సింగూరులో అదే జరిగింది; సనంద్ లోనూ అదే జరిగింది. పనికి రాని వ్యవసాయ యోగ్యం కానీ భూముల్లో ఫ్యాక్టరీ పెడితే అటు వృధా భూమిని వినియోగంలోకి తెచ్చినట్లూ ఉంటుంది, ఇటు సారవంతమైన భూమిని వ్యవసాయ ప్రయోజనం కోసం, దేశ ఆహార అవసరాల కోసం, ఆహార భద్రత కోసం, రైతుల జీవనాధారాన్ని నిలపడం కోసం కాపాడుకున్నట్లు కూడా ఉంటుంది కదా? ఈ ప్రశ్నను సింగూరు రైతులు అడిగారు; సనంద్ రైతులు అడిగారు, శ్రీకాకుళం బీల భూముల ప్రజలు, కాకరాపల్లి రైతులు, నియమగిరి గిరిజనులు, పోస్కో- తమలపాకు తోటల రైతులు… ఇంకా అనేక చోట్ల రైతులు అడిగారు, అడుగుతున్నారు. కానీ సంతృప్తికరమైన సమాధానాన్ని పారిశ్రామికవేత్తలు ఇవ్వలేదు, ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు.

వారు ఇవ్వరు కూడా. ఎందుకంటే నిజమైన సమాధానం ప్రజలకు రుచించదు గనక! అదీకాక భారత పాలకులు పాల్పడుతున్న దారుణమైన మోసం వారికి తెలియడం ఏ పాలకుడు ఇష్టపడతాడు? వ్యవసాయ యోగ్యమైన, సారవంతమైన భూములను, బహుళ పంటలు పండుతున్న భూములను పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సూపర్ ధనిక వర్గాలకు, బడా దళారి పెట్టుబడిదారులకు వారి వెనుక ఉన్న సామ్రాజ్యవాద పెట్టుబడికీ అప్పగించడం వెనుక అంతర్జాతీయ స్ధాయిలో సాగుతున్న కుట్ర దాగి ఉన్నది.

ఈ పద్ధతి ద్వారా భారత దేశంలో వ్యవసాయరంగాన్ని నాశనం చేసి చంపేయడం సామ్రాజ్యవాదుల ప్రధాన లక్ష్యం. వ్యవసాయానికి ఇస్తున్న సబ్సిడీల మద్దతును క్రమంగా తగ్గించివేయటం, బీటీ విత్తనాల సాగు ద్వారా దేశీయ విత్తన అభివృద్ధి వ్యవస్థను నాశనం చేసి, విత్తన కొరత సృష్టించడం, సబ్సిడీలను రద్దు చేసి వ్యవసాయాన్ని దండగ చేయడం, అంతిమంగా రైతులను వ్యవసాయం నుండి తన్ని తగలేయడం లక్ష్యంగా వ్యవసాయ విధానాన్ని సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ఒత్తిడితో భారత దళారి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ విధానం ద్వారా సామ్రాజ్యవాద వ్యవసాయ కంపెనీలకు స్థిరమైన మార్కెట్ ను సృష్టిస్తున్నారు. అందుకు భారత రైతుల ఆదాయాన్ని, భారత దేశ రైతుల జీవన వ్యవస్థను ఫణంగా ఒడ్డుతున్నారు. బహుళజాతి కంపెనీలకు ముడి సరుకులు ఉత్పత్తి చేసే దేశంగా పశ్చిమ దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ గాను భారత దేశాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వాలే ప్రధాన పరికరాలుగా పని చేస్తున్నాయి. ఎందుకంటే జడ్జి గారి వ్యాఖ్యలో ధ్వనించిన ‘చారిత్రకత’ను నిజంగా వాస్తవ అర్ధంలో ధ్వనింపజేసే అవకాశం ఇప్పుడు లేదు.

 

(………..ఇంకా ఉంది.)

4 thoughts on “సింగూరు తీర్పు: అభివృద్ధి వైరుధ్యం -3

  1. భూసేకరణకు ప్రభుత్వాలు ఎందుకు ఉత్సాహం చూపుతాయో చక్కగా వివరించారు. ప్రజాపక్షంగా సాగుతున్న విలువైన విశ్లేషణ!

  2. పనికిరాని భూములంటే అవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి. కొండల్ని డైనమైట్లతో పేల్చి, ప్రొక్లెయినర్లతో రాళ్ళని తొలిగించి, అంత కష్టంతో ఆ భూమిని ఫాక్టరీ నిర్మాణానికి అనువుగా మార్చడానికి పెట్టుబడిదారుడు ఉత్సాహం చూపుతాడా? చిన్న పరిశ్రమలు పెట్టొచ్చు. 1985లో NTR శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఒక industrial estate ఏర్పాటు చేసి సిమెంట్ గొట్టాల పరిశ్రమలూ, జనుప మిల్లులూ పెట్టించాడు. 1994 తరువాత చంద్రబాబు పెంచిన కరెంట్ చార్జిల వల్ల అవి చాలా వరకు మూతపడ్డాయి. రాష్ట్రం మొత్తం మీద వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. గ్లోబలైజేషన్, హైదరాబాద్ IT అభివృద్ధి చూపించి ఈ మూతపడ్డ పరిశ్రమల విషయం మరుగున పడేలా చేసాయి మన పత్రికలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s