సింగూరు తీర్పు: వ్యవసాయమా, పరిశ్రమలా? -2


Singur villagers celebrate Court judgement

Singur villagers celebrate Court judgement

రైతులు కలకత్తా హై కోర్టుకు వెళ్ళినప్పటికి టాటా కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగించింది. జనవరి 18, 2008 తేదీన తీర్పు ప్రకటిస్తూ కలకత్తా హై కోర్టు టాటా కంపెనీకి వత్తాసు వచ్చింది. సింగూరు భూముల స్వాధీనం చట్టబద్ధమే అని ప్రకటించింది. దానితో రైతులు, వారి తరపున కొన్ని ఎన్‌జి‌ఓ సంస్థలు హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ మరోసారి కారు ఫ్యాక్టరీ ముందు నిరవధిక ధర్నాకు దిగడంతో ఫ్యాక్టరీ స్థలంలో నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా 2008 చివరికల్లా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కంపెనీ నిలిపివేసింది. గవర్నర్ మధ్యవర్తిత్వంలో బెనర్జీ నేతృత్వం లోని ఉద్యమకారులకు, లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి మధ్య చర్చలు ప్రారంభమై కొద్ది రోజులకే విఫలం అయినాయి. దానితో ఫ్యాక్టరీని గుజరాత్ తరలిస్తున్నట్లు అక్టోబర్ 2008లో టాటా మోటార్స్ ప్రకటించింది.

ప్రజా ప్రయోజనమా కాదా?

జస్టిస్ వి గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సింగూరు భూసేకరణ కేసును విచారించింది. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రైతుల నుండి భూములు సేకరించడం “పూర్తిగా అర్ధం చేసుకోదగినదే” అని 204 పేజీల తీర్పు పేర్కొంది. “కానీ ఆ అభివృద్ధి భారాన్ని సమాజంలో అత్యంత బలహీనులైన ప్రజలపైన మోపడం సరైనది కాదు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భారీ రాజ్య యంత్రం తీసుకునే చర్యల పట్ల గొంతు విప్పలేని, రాజ్యం శక్తిని ఎదుర్కోలేని అత్యంత పేద వ్యవసాయ కూలీలు అభివృద్ధి భారాన్ని మోయవలసి రావడానికి వీలు లేదు” అని తీర్పు పేర్కొంది.

అందువల్ల “రాష్ట్ర ప్రభుత్వం జరిపిన భూసేకరణను రద్దు చేస్తున్నాం. వేలాది కుటుంబాల భూమి యజమానులు, రైతులు, (కౌలు) సాగుదారుల నుండి స్వాధీనం చేసుకున్న భూములను వెనక్కి ఇచ్చేయాలి” అని స్పష్టం చేసింది. తమ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల రైతులు ఒక పక్క వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోపక్క వారి భూములలో ఫ్యాక్టరీ నిర్మాణ సామాగ్రి తెచ్చి నిర్మాణం మొదలు పెట్టడం, యంత్రాలను నెలకొల్పడం, వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం చట్ట విరుద్ధం అని తీర్పు పేర్కొంది. భూ స్వాధీనంపై సాగుదారులు వేసిన పిటిషన్ కోర్టు విచారణలో ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించడాన్ని కోర్టు ప్రశ్నించింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టి, పూర్తి చేసిన 997 ఎకరాల భూసేకరణ చెల్లదని తీర్పు ఇవ్వడంలో ఇరువురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల నుండి సేకరించిన/స్వాధీనం చేసుకున్న భూమిని వెనక్కి ఇచ్చేయాలని ఇద్దరు అంగీకరించారు. ఈ నిర్ణయానికి రావడంలో ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ ఆ నిర్ణయానికి రావడానికి వారు చెప్పిన కారణాలు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.

జస్టిస్ వి గోపాల గౌడ రాసిన తీర్పులోని అంశాలలో కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి:

“ఈ నిర్దిష్ట కేసులో భూస్వాధీన ప్రక్రియ మరి విపరీతంగా ఉండటం ఎందుకంటే, ఒక ఆటో మొబైల్ పరిశ్రమను నెలకొల్పడానికి భూములు అవసరం అయినందుకు కాదు, దానివల్ల ఉపాధి జరగడమే కాకుండా రాష్ట్రంలో సామాజిక-ఆర్ధిక అభివృద్ధిని ప్రోత్సహించినట్లు కూడా అవుతుంది; కానీ భూస్వాధీన చట్టం నిర్దేశించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, చట్టంలో నిర్దేశించబడిన పాలనా ప్రక్రియను అనుసరించనందువలన.

“…భూ స్వాధీన చట్టాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. కంపెనీ కోసం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ‘ప్రజోపయోగం కోసం’ అన్న ముసుగు తొడిగారు. తద్వారా భూ స్వాధీన చట్టంలో నిర్దేశించిన తప్పనిసరి నిబంధనలను అనుసరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు.

“రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన ఈ చర్య చాలా విపరీత ధోరణితో కూడుకుని ఉన్నది. అది చట్ట విరుద్ధం కూడా. మొదటి నుండి ప్రభుత్వ చర్యకు చట్టంలో పునాది లేకుండా పోయింది. భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆధిపత్య, అధికారయుత చర్యలకు పాల్పడటాన్ని ఎటువంటి పరిస్ధితులలోనూ అనుమతించడానికి వీలు లేదు.

జస్టిస్ మిశ్రా వేరుగా తీర్పు ప్రకటిస్తూ ఇలా పేర్కొన్నారు:

“చిన్న కారు తయారు చేసే పరిశ్రమను నెలకొల్పడానికి రాష్ట్రం అనుసరించిన విధానం అంతిమంగా ప్రజలకే ఉపయోగపడి ఉండేది. అసలు పారిశ్రామికీకరణ యొక్క లక్ష్యమే ప్రజలకు ఉపయోగపడడం. ఫ్యాక్టరీ వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి ఉండేవి. ఆ ఫ్యాక్టరీ పెట్టుబడులను ఆకర్షించి ఉండేది. కనుక పరిశ్రమ స్థాపన ‘ప్రజా ప్రయోజనా’ లక్ష్యాన్ని నెరవేర్చి ఉండేది.”

ఇద్దరు జడ్జిల అభిప్రాయాల లోని ప్రధాన తేడా నానో కారు తయారీ పరిశ్రమ నెలకొల్పడం “ప్రజా ప్రయోజన లక్ష్యాన్ని” నెరవేర్చుతుందా లేదా అన్న దాని పైనే. ఫ్యాక్టరీ వల్ల “రైతు ప్రజలు” భూములు, తద్వారా జీవనాధారం కోల్పోతారు కనుక, టాటా మోటార్స్ అనే ప్రైవేటు కంపెనీ ప్రయోజనం మాత్రమే నెరవేర్చుతుంది కనుక అది ‘ప్రజా ప్రయోజనాన్ని’ (public purpose) నెరవేర్చకపోగా అందుకు విరుద్ధంగా పని చేస్తుందని ఒక జడ్జి అభిప్రాయం. ఫ్యాక్టరీ వచ్చినట్లయితే “కార్మిక ప్రజలకు” ఉద్యోగాలు దక్కుతాయి కాబట్టి “ప్రజా ప్రయోజనం” నెరవేరినట్లేనని మరో జడ్జి అభిప్రాయం.

‘అభివృద్ధి’ వైరుధ్యం

ఈ ఇద్దరు జడ్జిల మధ్య వైరుధ్యం ఏదో యథాలాపంగా, అనుకోకుండా తలెత్తినది కాదు. ఈ వైరుధ్యానికి ఉన్న భూమిక వ్యవస్థాగతమైన ఒక మౌలిక సమస్యకు సంబంధించినది. ‘అభివృద్ధి’గా కనిపించే ఒక సమస్యను ప్రజల నెత్తిపైన రుద్దడానికి సంబంధించినది. సమకాలీన నయా ఉదారవాద విధానాల యుగంలో అభివృద్ధి అనే అంశం కేంద్రంగా రెండు విరుద్ధ తత్వాలు, రెండు విరుద్ధ వర్గాలు పరస్పరం తలపడుతున్న నేపధ్యం ఈ వైరుధ్యానికి ఉన్నది. ఇది మౌలికంగా వర్గ వైరుధ్య ఫలితం. ఈ వైరుధ్యానికి ఒక పక్క సామ్రాజ్యవాదం, దేశీయ దళారి పెట్టుబడిదారీ వర్గం, బడా భూస్వామ్య వర్గాలు నిలబడి ఉండగా మరో పక్క అశేష శ్రామిక ప్రజానీకం -రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు- నిలబడి ఉన్నారు.

అంతే కాదు, భారతదేశ సామాజికార్ధిక వ్యవస్ధ పరిణామ క్రమంలోని ఒక ముఖ్యమైన సమస్య కూడా ఈ వైరుధ్యంలో ఇమిడి ఉన్నది. అత్యంత ముఖ్యమైన భూమి సమస్య అందులో ఇమిడి ఉన్నది. ఎలాగంటే: దేశంలోని మెజారిటీ ప్రజలు -తక్కువలో తక్కువ 65 శాతం మంది- భూములపై / వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్ధితుల్లో పారిశ్రామికీకరణను ఎలా చేపట్టాలి? పరిశ్రమలను ఎలా అభివృద్ధి చేయాలి? భూముల నుండి రైతులను ఎకాఎకిన తొలగించి, వారికి ఎంతో కొంత నష్ట పరిహారం చెల్లించి, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగించి పరిశ్రమలను స్థాపించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించాలా లేక రైతులకు, వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఇతర అనుబంధ శ్రమల-వృత్తుల ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆ తర్వాతనే పారిశ్రామికాభివృద్ధి సాధించాలా?

సమాజం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక అభివృద్ధి తప్పనిసరి అవసరమే, అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. మానవ సమాజం నాగరికత సాధించడంలో ఉపకరించిన ప్రధాన ఉత్పత్తి సాధనం భూమి. భూమికి కొనసాగింపుగా ప్రకృతిని పరిగణించవచ్చు. ప్రకృతి వనరులను శ్రమ పరికరాలుగాను, శ్రమ సాధనాలుగాను మలుచుకున్న మనిషి వాటిని భూమిపై ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని తీశాడు. ఆ క్రమంలో సాంకేతిక అభివృద్ధి సాధించాడు; వినియోగ సరుకుల ఉత్పత్తికి మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేశాడు; ఉత్పాదక శక్తిని (తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి తీయగలగడం) అభివృద్ధి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉత్పత్తి సాధనాలైన భూమి, పరిశ్రమలను కొద్ది మంది స్వాయత్తం చేసుకోగా విస్తారమైన ప్రజలు వారి ఉత్పత్తి సాధనాలపై పని చేసే రైతులుగా, కార్మికులుగా, కూలీలుగా, ఉద్యోగులుగా, మేనేజర్లుగా, అనుబంధ ఉత్పత్తిదారులుగా మిగిలిపోయారు. ఈ రెండు సమూహాల మధ్య అనాదిగా వైరుధ్యం తలెత్తడం, అది ఒక్కో దశలో ఒక్కో రూపంలో పరిష్కరించబడి మరో కొత్త రూపాన్ని సంతరించుకోవడం… అది వేరే కధ.

పరిశ్రమలు ప్రధాన ఉత్పత్తి సాధనాలుగా కలిగిన దేశం పారిశ్రామిక దేశం అయింది. మరి ఆ దేశాల్లో వ్యవసాయం లేదా? అక్కడ వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు, కూలీలు లేరా? ఉన్నారు, కానీ వారి రూపాలు మారిపోయాయి. ఈ దేశాలు వ్యవసాయాన్ని కూడా పరిశ్రమ స్థాయికి అభివృద్ధి చేసుకున్నాయి; ఆ విధంగా పూర్తిగా పారిశ్రామిక దేశాలు అయ్యాయి. అనగా వ్యవసాయం కూడా అక్కడ పరిశ్రమ తరహాలో నడవడం వల్ల ఆ పరిశ్రమకు యజమానులు, అందులో పని చేసే కార్మికులు ఉంటారు తప్ప రైతులు, కూలీలు ఉండరు. కానీ వ్యవసాయ ప్రధాన సమాజాలు పరిశ్రమల ప్రధాన సమాజాలుగా ఎలా మార్పు చెందాయి? వ్యవసాయరంగాన్ని కూడా పరిశ్రమగా ఎలా అభివృద్ధి చేసుకున్నాయి? ప్రస్తుత సందర్భంలో ఇదే ముఖ్యమైన ప్రశ్న. ఇద్దరు జడ్జిల తీర్పుల లోని అవగానాల మధ్య ఉన్న వైరుధ్యానికి ఈ ప్రశ్నకు సంబంధం ఉన్నది.

(……….. ఇంకా ఉంది)

5 thoughts on “సింగూరు తీర్పు: వ్యవసాయమా, పరిశ్రమలా? -2

  1. అయ్యా…

    ఎప్పటికేసు? తీర్మానమెప్పుడొచ్చింది? నేనుద్యోగంలో చేరిన మొదట్లోని కేసిది (2006) ఇప్పుడు నా అనుభవం పదేళ్ళు, నా వేతనం అప్పటితోపోలిస్త్గే పదింతలైంది. మరివాళ్ళకేం ఒరిగింది? No wonder more people regard guns are a better-way to hold dialogue with the govt.

  2. ద్రవ్యోల్బణం (అవసరానికి మించి కరెన్సీ కట్టలు ముద్రించడం) వల్ల కూడా జీతాలు పెరగొచ్చు. లైసెన్స్ లేని కమ్మరివాడు తయారు చేసే muzzle loader gun పదేళ్ళ క్రితం ఐదు వేలకి దొరికేది. ఇప్పుడు అది పదిహేనువేలకి దొరుకుతుంది. తుక్కు ఇనుముని కొలిమిలో కాల్చి తయారు చేసిన నాటు తుపాకీకి అంత ధర అవసరమా అనే అనుమానం రావచ్చు. కానీ అప్పుడు ఐదు వేలతో బతకగలిగినవాడు ఇప్పుడు పదిహేనువేలు లేకపోతే బతకలేడు. ఒక సినిమా డైరెక్టర్ ఫేస్‌బుక్‌లో వ్రాసాడు “1983లో తాను వైజాగ్ యూకో బ్యాంక్‌లో గుమాస్తా పని చేసేటప్పుడు అతని జీతం వెయ్యి రూపాయలేననీ, ఇంటి అద్దెలు పోగా మిగిలిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక తాను ఆ డబ్బుతో బంగారం కొనుక్కున్నాడనీ”. ఇప్పుడు బ్యాంక్ గుమాస్తా జీతం పదిహేనువేలు కానీ వైజాగ్ లాంటి నగరాలలో ఇంటి అద్దే పదివేలు. అది బ్యాంక్ గుమాస్తా బతకడానికి సరిపోదు.

  3. నేను చేసేది కూడా వ్యవసాయమే. నా భూమిని ఎవరికో ఇవ్వమంటే నేను కూడా ఇవ్వను. వైట్ కాలర్ ఉద్యోగులకి పెరిగిన జీతాలు చూసి వాళ్ళు మాత్రం బాగుపడ్డారనుకోలేము. వాళ్ళ జీతాలు ఎంత పెరిగినా, వాళ్ళు గడించిందంతా శ్రీచైతన్య, నారాయణ లాంటి కార్పరేట్ స్కూల్‌లలో పిల్లల్ని చదివించడానికే ఖర్చైపోతుంది. ఒక sphereలోనే పని చెయ్యాలనుకునేవాళ్ళు దాని యొక్క పరిణామాలకి వాళ్ళే బాధ్యులు కనుక ఆ వైట్ కాలర్ ఉద్యోగుల పిల్లల చదువుల ఖర్చులూ, ఇంటి అద్దెల గురించి నేను చర్చించను. మన పాలకులు ఏమీ పారిశ్రామీకరణ చెయ్యగల మొనగాళ్ళు కారు. భూమి పోగొట్టుకునేవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారో, లేదో చెప్పకపోతే వాళ్ళు భూమి ఎలా ఇచ్చేస్తారు? ఒరిస్సాలోని లంజిగఢ్ దగ్గర వేదాంత కంపెనీ పెట్టిన కర్మాగారంలో ఒక్క స్థానికునికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఈ విషయం తెలిస్తే ఎవరు మాత్రం పారిశ్రామికవేత్తలకి భూములు ఇస్తారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s