విరుద్ధ దృష్టితో ఒకే తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జిలు -1


Singur land and abandoned Tata factory

Singur land and abandoned Tata factory

పశ్చిమ బెంగాల్ లో పాతికేళ్ళ అవిచ్ఛిన్న లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు చరమగీతం పలికేందుకు దారి తీసిన సింగూరు భూములను బలవంతంగా లాక్కున కేసులో నిన్న (ఆగస్టు 31) సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. నానో కారు తయారీ కోసం టాటా మోటార్ కంపెనీకి అప్పగించడానికి వామపక్ష ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం సింగూరు రైతుల నుండి గుంజుకున్న వ్యవసాయ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్ లో బలం కోల్పోయి, బలహీన పడి మళ్ళీ కోలుకుంటుందో లేదో అన్న పరిస్ధితిలోకి జారిపోయిన సి‌పి‌ఎం పార్టీ పై ఈ తీర్పు ‘మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు’గా వెలువడింది.

ఈ తీర్పు తర్వాత కూడా సి‌పి‌ఎం పార్టీ నేతలు తమ ప్రజావ్యతిరేక చర్య పట్ల పశ్చాత్తాపం ప్రకటించడానికి నిరాకరించారు. తాము తప్పు చేయలేదని వక్కాణించారు. ఆనాటికి అమలులో ఉన్న 1894 – బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టం ప్రకారమే తాము రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకున్నామని తమ రైతు వ్యతిరేక నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అక్కడికి బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఎలాంటి తడబాటు లేకుండా రైతులపై ప్రయోగించడంలో ఎలాంటి దోషమూ ఉండనట్లే.

వామపక్షంగా శ్రమ జీవులైన రైతుల జీవనాధారాన్ని లాక్కుని ‘పారిశ్రామికాభివృద్ధి’ పేరుతో ఒక బడా పెట్టుబడిదారుడికి అప్పజెప్పడం సరైనదేనా అన్న ప్రశ్న వారు ఇప్పటికీ వేసుకోకపోవడమే పెద్ద ఘోరం. అది కాక రైతుల భూములు లాక్కోవడం కేవలం చట్టాలను సక్రమంగా అమలు చేసామా లేదా అన్న ప్రశ్నకు మాత్రమే సంబంధించిన వ్యవహారమా? 

విరుద్ధ ప్రయోజనాలు కలిగిన వర్గాలతో నిండిన వర్గ సమాజంలో చట్టాల అమలు లేదా ప్రభుత్వాల నిర్ణయాలు ఏ వర్గానికి ప్రయోజనం కలిగిస్తున్నాయి అన్న ప్రశ్న కమ్యూనిస్టు పార్టీ వేసుకోనవసరం లేదా? రైతులు, కూలీలు, కార్మికులు మొ.న శ్రమజీవులకు వ్యతిరేకంగా పని చేసే రాజ్యంలో చొరబడి అధికారం సంపాదించి, ఆ అధికారాన్ని తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే శ్రమజీవులకు మేలు చేసేందుకు వినియోగిస్తున్నామా లేక కీడు చేసేందుకు వినియోగిస్తున్నామా అన్న ప్రశ్న కమ్యూనిస్టు పార్టీ వేసుకోవద్దా?

అదొక సంగతి అయితే ధర్మాసనం లోని ఇద్దరు జడ్జిలు అంతిమ తీర్పు పైన ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ, ఆ నిర్ణయానికి రావడానికి ఇద్దరు రెండు విరుద్ధమైన దిశల్లోకి వెళ్ళే దారులను ఎంచుకోవడం మరొక ఆసక్తికరమైన సంగతి. సాధారణంగా పరస్పరం విరుద్ధమైన రెండు దారుల్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలవడం అనేది జరగదు. మరీ ముఖ్యంగా ఒకే గమ్యాన్ని చేరుకోవడం అసలే జరగదు. కానీ ఈ తీర్పులో అది జరిగింది. అది ఈ తీర్పు విశిష్టత.

దీనిని విశిష్టత అనాలా లేక మరొకటి అనాలా అన్నది కూడా ఒక చర్చే. ఎందుకంటే జరిగిన సంఘటన / అన్యాయం పైన సరిగ్గా వ్యతిరేక అవగాహనలు వ్యక్తం చేస్తూ అంతిమ తీర్పులో మాత్రం ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం? వ్యతిరేక దిశల్లో ప్రయాణించి కూడా ఒకే తీర్పు ఇవ్వడం సాధ్యమే అయితే తీర్పు నిజంగానే విశిష్టం అవుతుంది. కానీ, ఇద్దరిలో కనీసం ఒక్కరయినా తమ అవగాహనను తీర్పుగా మలచకుండా రాజీపడి ఉంటే తప్ప అలాంటిది సాధ్యం అవుతుందా?

తీర్పు చర్చలోకి వెళ్ళే ముందు ఏం జరిగిందో చూద్దాం. టాటా మోటార్ కంపెనీ అత్యంత చౌకయిన కారు తయారు చేస్తున్నామని ప్రకటించింది. కారు మీద మోజు ఉండీ, లేదా అవసరం ఉండీ కొనలేని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేట్లుగా కేవలం ఒక లక్ష రూపాయలకే కారు తయారు చేస్తామని కంపెనీ చెప్పింది. అందుకోసం భూమి కావాలంది. మేమిస్తాం రమ్మన్నది లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం. రాష్ట్రంలో వివిధ చోట్ల భూములు ఇవ్వజూపుతూ ఎక్కడ కావాలో కోరుకోమన్నది. ప్రభుత్వం చూపిన ఇతర ప్రదేశాల్లోని భూములు వ్యవసాయ యోగ్యమైనవి కావు. లేదా పెద్దగా పంటలు పండేవి కావు. సింగూరు భూములు సం.కి మూడు పంటలు పండే నాణ్యమైనవి. అవి ఇస్తే రైతులకు చాలా నష్టం. కానీ టాటా కంపెనీ ఆ భూములే కావాలంది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సై అంది.

భూములు రైతుల నుండి లాక్కుని టాటా కంపెనీకి ఇవ్వడానికి నిర్ణయం అయ్యాక లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం రైతుల పైన, వారి భూముల పైన అనేక అబద్ధాలు ప్రచారం చేసింది. ఆ భూములు పనికిరానివి అని చెప్పింది. ఒకటో రెండో పంటలు పండని చవుడు భూములు అన్నది. రైతులకు బ్రహ్మాండమైన పరిహారం ఇస్తున్నాం అని చెప్పింది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తుండగానే, అందరు ఒప్పేసుకున్నారు అని ప్రచారం చేసింది. కొద్ది మంది మాత్రమే మారాం చేస్తున్నారని చెప్పింది. వాళ్ళు అభివృద్ధికి వ్యతిరేకులు అన్నది. రైతులు కోర్టుల్లో కేసులు వేస్తుండగానే ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇచ్చేసింది. రైతుల అనుమతి తీసుకోకుండానే తీసుకున్నామని చెప్పింది.

పోలీసుల్ని దించి విపరీతమైన నిర్బంధం ప్రయోగించింది. క్రూరమైన అణచివేతకు దిగింది. పోలీసులతో పాటు సి‌పి‌ఎం కార్యకర్తలు కూడా లాఠీలు, తుపాకులు చేతబట్టి రైతులపై దాడులు చేశారు. నయానో భయానో అనేకమంది దగ్గర నుండి భూములు లాక్కుంది. దాదాపు సగం భూములకు ప్రకటించిన నష్ట పరిహారం చెల్లించింది. మిగిలినవాళ్లు నష్ట పరిహారం నిరాకరించి పోరాటం కొనసాగించారు. రైతుల పోరాటానికి నక్సలైట్ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. నక్సలైట్ లను సాకుగా చూపిస్తూ మరింత దుష్ప్రచారం చేసి, మరింత నిర్బంధాన్ని ప్రయోగించారు.

సింగూరు భూముల చుట్టూ కంచె నిర్మించి రైతుల్ని అక్కడికి వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. ఇతర రాష్ట్రాల నుండి, బెంగాల్ లోనే ఇతర జిల్లాల నుండి ఇతర ప్రజా సంఘాలు, కార్యకర్తలు మద్దతు ఇవ్వడానికి, సానుభూతి ప్రకటించడానికి, విషయ సేకరణ చేయడానికి సింగూరు గ్రామం వెళ్తుంటే వారిని అక్కడికి వెళ్లకుండా నిరోధించారు. గ్రామస్దులు బైటివారితో మాట్లాడకుండా కట్టడి చేశారు. కాంగ్రెస్ లాంటి బడా భూస్వామ్య, బడా బూర్జువా పార్టీలను తలదన్నుతూ రైతులు, కూలీల భూ పోరాటాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

కానీ రైతులు లొంగలేదు. నక్సలైట్ పార్టీలకు మమతా బెనర్జీ తోడయింది. మమత ప్రవేశంతో పోలీసు అణచివేత వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. టాటా అడ్డగోలు వాదనలు, వామపక్ష ప్రభుత్వం తలపెట్టిన మోసాలు, రైతులపై తప్పుడు ప్రచారం బహిర్గతం అయ్యాయి. ఆ దెబ్బతో లెఫ్ట్ ప్రభుత్వం లొంగలేదు గాని, టాటా కంపెనీ లొంగివచ్చింది. ఇన్ని గొడవల మధ్య కంపెనీ నిర్మాణం పూర్తి కావటం కష్టం అని గమనించి ఫ్యాక్టరీని గుజరాత్ తరలించడానికి నిర్ణయించింది. కానీ భూముల పైన క్లెయిమ్ ని మాత్రం కంపెనీ వదులుకోలేదు. భూములు ఇచ్చేదాకా, కోర్టు గొడవలు పూర్తయ్యేదాకా పెట్టుబడి నష్టపోతుంది గనక ఫ్యాక్టరీని గుజరాత్ కి తరలించడం తప్ప సింగూరు భూములు వదులుకుని మాత్రం కాదు.

………………………….ఇంకా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s