ప్రశ్న: డ్రైవర్ల కక్కుర్తి ఉబర్ కక్కుర్తి ఒకటే కదా?


[ముంబై ఆటో సమ్మె గురించి రాసిన గత ఆర్టికల్ పైన విశేషజ్ఞ గారు లేవనెత్తిన ప్రశ్నలను చర్చగా చేస్తూ ఈ ఆర్టికల్ రాస్తున్నాను. పాఠకులు గుర్తించగలరు. -విశేఖర్]

విశేషజ్ఞ గారు:

ఇది నాకు అర్ధం కాలేదు. ఆటోవాళ్ళుకూడా తమ లాభాలు పెంచుకొనే ఉద్దేశ్యంతోనే ప్రతి చిన్నదానికీ, డబల్ ఛార్జీలు, ట్రిపుల్ ఛార్జీలు, లాంగ్‌రూటుకు మాత్రమే ‘సై’ అనడాలు చేస్తున్నారుకదా. వీళ్ళు చేసేది ఓలా, ఊబర్‌లకన్నా ఏవిధంగా ప్రజలకు ప్రయోజనకరం? ఇద్దరి ఉద్దేశ్యమూ, లాభార్జనే ఐనప్పుడు ఓలా, ఊబర్లదిమాత్రమే తప్పెలా అవుతుంది? ఒకరిచేత దోచుకోబడినా, వందమంది చేత దోచుకోబడినా, వినియోగదారుల పరిస్థితి ఎప్పుడూ దోచుకోబడడమేకదా? ఆమాత్రానికి ఏరాయైతేమాత్రమేమి? ఆటో డ్రైవర్లలోమాత్రం ‘లాభాలవేట’లో ఇంకొకరి బేరాలను తన్నుకుపోయే ‘రాకాసి’ ప్రవర్తనను మనం చూస్తాం కదా. ఓలా, ఊబర్లు పెద్ద రాకాసులు. అంతకన్నా తేడా ఏముంది? అసలు కార్మికుల డిమాండ్లేమిటి? క్యాబ్ సర్వీసులని ఎలాంటి నియంత్రణలకు గురిచెయ్యాలని వాళ్ల కోరిక?

సమాధానం:

ఆర్టికల్ చివరి పేరాలో రాసినవే స్ధూలంగా వారి డిమాండ్లు. ఒకటి రెండు నేను మిస్ చేసి ఉండొచ్చు.

మొదట కొన్ని అంశాలు గుర్తించాలి.

ఉబర్ డ్రైవర్ లకూ – ఉబర్ లోని పెట్టుబడికీ వైరుధ్యం ఉంటుంది. అలాగే ఉబర్ డ్రైవర్ – సాధారణ డ్రైవర్ ల మధ్యనా, మొత్తంగా పెట్టుబడికీ – డ్రైవర్లకు మధ్యనా వైరుధ్యాలు ఉంటాయి. అంతిమంగా డ్రైవర్ లకూ – ప్రయాణికులకూ ఎల్లప్పుడూ వైరుధ్యాలు ఉంటాయి (సేవల అమ్మకం దారు, కొనుగోలుదారు మధ్య సహజంగా ఏర్పడే వైరుధ్యం ఇది.) ఈ వైరుధ్యాలు అన్నింటిని ఒకే గాటన కట్ట కూడదు.

వివిధ డ్రైవర్ ల మధ్యన ఉండేవి మిత్ర వైరుధ్యాలు. డ్రైవర్లకు, ప్రయాణికులకూ ఉండేది కూడా మిత్ర వైరుధ్యాలే. కానీ పెట్టుబడి (లాభార్జనే ధ్యేయంగా కలిగిన పెట్టుబడి) కీ, డ్రైవర్లకు (ఉబర్ + సాధారణ) మధ్య ఉండేది శత్రు వైరుధ్యం. 

కాస్త నింపాదిగా ఆలోచించి చూడండి. క్యాబ్, ఆటో డ్రైవర్ల లాభార్జన దృక్పధం, ఉబర్ లోని వాల్ స్ట్రీట్ పెట్టుబడి యొక్క లాభార్జన దృక్పధం ఒకటేనా?

డ్రైవర్ లది లాభార్జన కాదు, అది వారి జీవన ఆదాయం. మీరు చెప్పే డబుల్, త్రిబుల్ చార్జి చెయ్యడం, అవసరాన్ని క్యాష్ చేసుకోవడం… ఇవన్నీ అనుబంధ సమస్యలు. ఇవి కేవలం డ్రైవర్లకు మాత్రమే ఉండే లక్షణం కాదు. సరుకులు, సేవలు మారు బేరానికి అమ్ముకునే ప్రతి వ్యక్తీ ఈ రకమైన కక్కుర్తి పడుతుంటారు. ఇది కడుపు కక్కుర్తి తప్ప, లాభాలను పోగేయడమే ధ్యేయంగా పని చేసే కక్కుర్తి కాదు. వీటిని అరికట్టడం ప్రభుత్వాలకు తేలిక. డ్రైవర్ లకి ట్యాక్సీ/ఆటో నడపక పోతే జీవనం గడవదు. వాల్ స్ట్రీట్ విషయం అది కాదు కదా!

ఉబర్ లలో ఎవరైనా డ్రైవర్ గా రిజిస్టర్ చేసుకుని సంపాదించవచ్చు. ఆ సంపాదనలో కొంత భాగం వివిధ రూపాల్లో బడా పెట్టుబడికి వడ్డీగా వెళ్తుంది. ఆ వడ్డీ కోసమే ఉబర్-ఒలా-మేరు లలోకి పెట్టుబడి వస్తుంది.

2008 క్రైసిస్ నుండి పశ్చిమ దేశాలు ఇంకా బైట పడలేదు. ఐరోపాలో అది ఋణ సంక్షోభంగా కొనసాగుతుంటే, జపాన్ లో అధిక ఉత్పత్తి / ప్రతి ద్రవ్యోల్బణం సంక్షోభంగా, అమెరికాలో నిరుద్యోగం – దరిద్రం – హౌసింగ్ సంక్షోభాల రూపాల్లో ఆ క్రైసిస్ కొనసాగుతోంది. చైనాలో జి‌డి‌పి స్లో-డౌన్ గా వ్యక్తం అవుతోంది.

ఈ క్రైసిస్, వాల్ స్ట్రీట్ పెట్టుబడి, పెట్టుబడిగా రియలైజ్ కాకుండా (తగిన మొత్తంలో లాభాలు రాని పరిస్ధితి) నిరోధిస్తోంది. దానితో లాభాలు తేలికగా, అధికంగా సమకూరే ఫీల్డ్స్ కోసం ఆ (సామ్రాజ్యవాద) పెట్టుబడి అన్నీ దేశాల్లోనూ మూల మూలలకు చొచ్చుకు వెళుతోంది. అందు కోసమే సంస్కరణలు డిమాండ్ చేస్తూ బలవంతంగా రుద్దుతోంది.

అది చొరబడినంత మేరకు సాధారణ శ్రామికులు, ఆటో-ట్యాక్సీ డ్రైవర్లు మొ.న వారి పరిమిత ఆదాయ వనరులను కాజేస్తోంది. ఇలా అనేక రంగాల లోని స్వయం ఉపాధి శ్రమల లోని ఆదాయ వనరులను స్వాయత్తం చేసుకుంటూ అసలే పరిమితంగా ఉన్న ఆదాయ వనరుల్ని మరింత పరిమితం చేస్తూ పీల్చేస్తోంది.

వాల్ స్ట్రీట్ పెట్టుబడి అన్నీ రంగాల లోని ఆదాయాలను కొద్ది సంఖ్యలోని ఎం‌ఎన్‌సి ల వద్ద కేంద్రీకరింపజేస్తే, డ్రైవర్ల మొ.న కార్యకలాపాలు, ఆదాయ వనరులని వికేంద్రీకరిస్తాయి. అనగా ఆదాయ పంపిణీ మరింత మందికి జరుగుతుంది. వాల్ స్ట్రీట్ (దీనిని సింబాలిక్ గా వాడుతున్నాను. ద సిటీ, ఫ్రాంక్ ఫర్ట్, ప్యారిస్ ఇత్యాది కేంద్రాల ఫైనాన్స్ కేపిటల్ కూడా ఇందులో కలిపి చూడాలి) వాల్ స్ట్రీట్ కి చేరే లాభాలు (and hence పెట్టుబడి) ఎవరి జీవనం కోసమూ ఉపయోగపడదు. అది మళ్ళీ లాభాలను వేటకు బయలుదేరుతుంది. ఆ క్రమంలో మరింత సంపదను కేంద్రీకరింపజేస్తుంది.

కానీ డ్రైవర్లు మొ.న వారికి చేరే ఆదాయం పిల్లలని చదివిస్తుంది; వైద్యం చేయిస్తుంది; వృద్ధ తల్లి/తండ్రి సౌకర్యం చూస్తుంది; చిన్న చిన్న సదుపాయాలు కల్పించి పెడుతుంది; ఉన్నంతలో కాసిని నవుల్ని, సంతోషాల్ని పూయిస్తుంది.

కాబట్టి వాల్ స్ట్రీట్ పెట్టుబడికీ డ్రైవర్లు + ప్రయాణికులకి మధ్య శత్రు వైరుధ్యం ఉంటుంది. డ్రైవర్లు Vs డ్రైవర్లు, డ్రైవర్లు Vs ప్రయాణికులు వైరుధ్యాలు, పైన చెప్పినట్లు పరిష్కరించలేనివి కావు. వాటిని అదుపు చేయడం ప్రభుత్వాల చేతుల్లో పని. కానీ వాల్ స్ట్రీట్ పెట్టుబడి Vs డ్రైవర్లు + ప్రయాణికుల వైరుధ్యాన్ని ప్రభుత్వాలు పరిష్కరించవు. పరిష్కరించాలన్న ఆలోచనే వారికి ఉండదు. ప్రభుత్వాల దృష్టిలో అసలది వైరుధ్యమే కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు పని చేస్తున్నదే ఆ పెట్టుబడి ప్రయోజనాల కోసం గనుక. ప్రభుత్వాలు నడిపే వర్గాలు వాల్ స్ట్రీట్ పెట్టుబడితో మిలాఖత్ అయ్యి జూనియర్ భాగస్వామి ప్రయోజనాలు పొందుతూ వాల్ స్ట్రీట్ పెట్టుబడి కోసం చట్టాలు చేస్తున్నాయి. ఆ విధంగా డ్రైవర్లకు, ప్రయాణీకులకు వాళ్ళు కూడా శత్రువులుగా మారారు.

ఈ చిక్కురు బిక్కురు అల్లికలో డ్రైవర్లు Vs డ్రైవర్లు, డ్రైవర్లు Vs ప్రయాణికుల వైరుధ్యాలను పెద్దవి చేసి చూపెట్టి తాము చేసే బడా దోపిడి నుండి దృష్టి మళ్ళేలా ప్రభుత్వాలు వాల్ స్ట్రీట్ పెట్టుబడి చూస్తాయి. మీడియా వారి చేతుల్లోనే ఉన్నది కనుక అదేమంత కష్టం కాదు. వారి వలలో మనం పడితే అసలు సమస్యను వదిలి కొసరు సమస్యను పట్టుకున్న వాళ్ళం అవుతాము.

వీలయితే ఈ చర్చ ఇంకా కొనసాగిద్దాం.

One thought on “ప్రశ్న: డ్రైవర్ల కక్కుర్తి ఉబర్ కక్కుర్తి ఒకటే కదా?

  1. నేను కేవలం వినియోగదారుల పక్షం నుంచి ఆలోచిస్తూ అలా అన్నానులెండి. మొత్తానికి ఆటొడ్రైవర్లైనా, క్యాబ్ సర్వీసులైనా వినియోగదారులకి ఒరిగేది ఏమీ ఉండదని అర్ధమయ్యింది. అలా వినియోగదారుల వైపునుంచి ఆలోచిస్తే క్యాబ్ సర్వీసులే కొంచెం నయమేమో (అలా అన్నానేగానీ ఒలావాడుమాత్రం మూడింతలు ‘అధికారిక బాదుడు’ బాదట్లేదూ? కాకుంటే ఒక్కటి ‘బుక్’ చేశాక “అక్కడికైతే రాను” అనిమాత్రం చెప్పరు ఓలావాళ్ళు).

    “డబ్బెవరికి చేదు?” అని ఒకమాటంటారు. ఆటోవాలాలూ లాభాలకోసమే చేస్తారు. All those drive autos are not saints. అలా వాళ్ళు సంపాదించిన లాభాలతో వాళ్ళ కుటుంబాలు లబ్దిపొందుతాయి. అది కాదనను). క్యాబ్ సర్వీసుల వాళ్ళూ లాభాలను తమకుటుంబాలకోసమే వాడుతారు 🙂 (మీరుచెబుతున్న సమస్య లాభాలన్నీ ఒక్కరిదగ్గరే పోగుపడడం గురించనుకుంటాను). అది అర్ధమయ్యింది. Thanks.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s