దేశ వ్యాపిత సమ్మె మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి పిప్పర్మెంట్ బిళ్ళలు ఆశ చూపిస్తూ ముందుకు వచ్చింది. అనేక నెలలు ముందే కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ వారి పిలుపుకి స్పందించడానికి ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వానికి తీరిక దొరక లేదు. విదేశీ కంపెనీలు, పరిశ్రమల కోసం కార్మిక చట్టాలను కాలరాసిన మోడి ప్రభుత్వం కార్మికుల కోసం మాత్రం కేవలం రెండంటే రెండు రోజుల ముందు స్పందించి వారిని అపహాస్యం చేసింది.
ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ బిఎంఎస్ (భారత్ మజ్దూర్ సంఘ్) తప్ప ఇతర కార్మిక సంఘాలన్నీ కలిసి సెప్టెంబర్ 2 తేదీ నాడు దేశవ్యాపిత సమ్మెకు పిలుపు ఇచ్చాయి. ఐఎఫ్‌టియూ (భారత కార్మిక సంఘాల సమాఖ్య, సిఐటియూ (భారత కార్మిక సంఘాల కేంద్రం), ఏఐటియూసి (అఖిల భారత కార్మిక సంఘాల మండలి) ఐఎన్‌టియూసి (భారత జాతీయ కార్మిక యూనియన్ కాంగ్రెస్), ఏఐసిటియూ (కార్మిక సంఘాల అఖిల భారత కేంద్రం) మున్నగు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.
గత సం. ఇదే తేదీన సమ్మె చేసిన కార్మిక సంఘాలు అవే డిమాండ్లతో కూడిన 12 పాయింట్ ఛార్టర్ ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. బహుళజాతి కంపెనీల డిమాండ్లను తీర్చేందుకు అనేక చట్టాలను రద్దు చేస్తూ, పోరాడి సాధించుకున్న చట్టాలను సవరిస్తూ, అనేక కొత్త నల్ల చట్టాలను ప్రవేశపెడుతూ యమ బిజీగా గడిపిన మోడి ప్రభుత్వం కార్మికుల సమ్మె విషయానికి వచ్చేసరికి మూడు రోజుల ముందు సమావేశం జరిపి ఏదో చేయబోతున్నట్లు హడావుడి సృష్టించారు. రెండు రోజుల్లో కార్మికుల డిమాండ్లను తీర్చుతామని ప్రకటించి ఖాళీ ప్రకటనతో తుస్సుమనిపించారు.
కార్మిక సంఘాలు కింది 12 డిమాండ్లను రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి.
12 Points Charter of Demands:
-
ఉపాధి సృష్టికై నిర్దిష్ట చర్యలు తీసుకుని నిరుద్యోగాన్ని అరికట్టాలి.
-
ప్రజా పంపిణీ వ్యవస్ధను యూనివర్సలైజ్ చేయడం ద్వారా, కమోడిటీ మార్కెట్ లో సట్టా వాణిజ్యాన్ని (స్పెక్యులేటివ్ ట్రేడ్) నిషేధించడం ద్వారా పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి.
-
ఎటువంటి మినహాయింపు, సడలింపు లేకుండా ప్రాధమిక కార్మిక చట్టాలు అన్నింటినీ దృఢంగా అమలు చేయాలి. కార్మిక చట్టాల ఉల్లంఘనదారులను కఠినంగా శిక్షించాలి.
-
కార్మికులందరికీ విశ్వజనీన సామాజిక భద్రత (Universal Social Security) కల్పించాలి.
-
నైపుణ్య రహిత కార్మికునికి నెలకు రు 18,000 కు తక్కువ కాకుండా కనీస వేతనం చెల్లించాలి. వారి వేతనాలను ధరల సూచీకి అనుబంధం చేయాలి.
-
కార్మికులు అందరికీ, అసంఘటిత రంగంతో సహా, నెలకు రు 3,000 తక్కువ కాకుండా పెన్షన్ చెల్లించాలి.
-
కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వరంగ కంపెనీలలో వాటాల ఉపసంహరణ నిలిపివేయాలి.
-
శాశ్వత/ దీర్ఘ కాళిక పనులలో కాంట్రాక్టీకరణ నిలిపివేయాలి. ఒకే తరహా పనికి రెగ్యులర్ మరియు కాంట్రాక్టు కార్మికులకు ఒకే మొత్తం వేతనం మరియు సదుపాయాలు చెల్లించాలి.
-
బోనస్, పిఎఫ్ చెల్లింపుల అర్హతలపై అన్ని రకాల పరిమితులు ఎత్తివేయాలి. గ్రాట్యుటీ చెల్లింపు మొత్తం పెంచాలి.
-
ఐఎల్‌ఓ సదస్సులు సి-87, సి-98 లలో అంగీకరించిన అంశాలను వెంటనే ఆమోదించాలి; దరఖాస్తు చేసిన 45 రోజుల లోపల కార్మిక సంఘాలను తప్పనిసరిగా గుర్తింపు ఇవ్వాలి.
-
రైల్వే, రక్షణ తదితర వ్యూహాత్మక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించరాదు.
-
కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరించడం ఆపివేయాలి.
–
కార్మిక సంఘాల డిమాండ్ లు ఇలా ఉండగా ఈ రోజు హఠాత్తుగా ఆర్ధిక మంత్రి జైట్లీ పత్రికల సమావేశం ఏర్పాటు చేసి “కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు అన్నీ ఆమోదిస్తున్నాం” అని ప్రకటించేశారు. వాళ్ళు ఆమోదించింది ఏమిటయ్యా అంటే:
-
నైపుణ్య రహిత, వ్యవసాయేతర కార్మికులకు దినసరి వేతనం రు 246/- నుండి రు 350/- కు పెంపుదల
-
సవరించిన నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 2014-15, 2015-16 సం.లకు బోనస్ చెల్లింపు.
-
బోనస్ చెల్లింపుల చట్టంలో సవరణకు హామీ; హై కోర్టు, సుప్రీం కోర్టులలో యూనియన్ల తరపున మద్దతు
-
45 రోజుల లోపల కార్మిక సంఘాల గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా
ఈ నాలుగు చర్యలు ప్రకటించి కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు అన్నీ ఆమోదించేశాం అని మంత్రుల బృందం (ఆర్ధిక మంత్రి జైట్లీ, కార్మిక మంత్రి దత్తాత్రేయ, విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్) ధైర్యంగా ప్రకటించారు. వాటిలో నిర్దిష్టంగా కనిపిస్తున్నది కనీస వేతనం 246/- నుండి 350/- కు పెంచడం ఒక్కటే. అది కూడా ఆదేశాలు ఇస్తున్నట్లు ఏమి చెప్పలేదు. అమలుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పలేదు. మంత్రులు ఇలాంటి ప్రకటనలు గతంలో చాలానే చేశారు. ఏవీ అమలు కాలేదు. కనుకనే ఇప్పుడు అమలు అవుతాయన్న గ్యారంటీ లేదు.
2014-15, 2015-16 సం.లకు గాను సవరించిన నియమాల ప్రకారం బోనస్ చెల్లిస్తామని చెప్పడం ఒట్టి మోసం. ఈ ప్రకటనలో మనకు కనిపిస్తున్న మొదటి అంశం: రెండేళ్లుగా ప్రభుత్వరంగ ఉద్యోగులకు, కార్మికులకు బోనస్ లు చెల్లించలేదని మోడి ప్రభుత్వం అంగీకరించడం. బోనస్ అంటూ ఆర్భాటంగా ప్రకటించే ప్రభుత్వాలు వాస్తవంలో వాటిపైన అనేక నిబంధనలు విధిస్తారు. ‘పంచ పాండవులు – మంచం కోళ్ళు- సామెత లాగా అంతిమంగా కేవలం కొన్ని డజన్ల మందికి మాత్రమే కాస్త మొత్తంలో బోనస్ లు అందుతాయి. తాజా ప్రకటనతో రు 1920/- కోట్లు భారం పడుతుందని చెప్పడం బొత్తిగా నమ్మదగ్గది కాదు. ఆ కోట్లు ఎవరెవరికి ఇస్తారో, సవరించిన నిబంధనలు ఏమిటో వివరణే లేదు.
విదేశీ కంపెనీల కోసం ఏకంగా మంత్రుల కమిటీలు నెలకొల్పి, 40 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించేసి, తనిఖిల బాదరబందీ తప్పించేసి, లక్షల కోట్ల పన్ను రాయితీలు ప్రకటించి, కార్పొరేట్ టాక్స్ ఏడాదికి 5% చొప్పున తగ్గిస్తూ దేశ వనరులను అప్పనంగా పందేరం పెట్టేస్తున్న మోడి ప్రభుత్వం 45 రోజుల లోపు కార్మిక సంఘాలను గుర్తించమంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ‘సలహా మాత్రమే’ పడేసి ఊరుకున్నారు. బహుళజాతి కంపెనీలు, వాల్ స్ట్రీట్, దలాల్ స్ట్రీట్, ద సిటీ, ఫ్రాంక్ ఫర్ట్, ప్యారిస్ ఇత్యాది కంపెనీల డిమాండ్ల విషయంలో ఇదే తరహాలో పార్లమెంటుకు, రాష్ట్రపతికి ఓ ‘సలహా పడేసి’ ఊరుకోగలరా, ప్రధాన మంత్రి మోడి!?
కేంద్ర ప్రభుత్వం దళసరి చర్మం ధోరణి నేపధ్యంలో కార్మిక ప్రజానీకానికి సమ్మె చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మెతుకులు కూడా రాలని విదిలింఫులను ‘డిమాండ్లు నెరవేర్చడం’ గా చూపిస్తున్న మంత్రులు సంపదల సృష్టికి ఏకైక కారకులైన శ్రమ జీవుల పట్ల ఇంతటి హీన ధోరణి ప్రదర్శించడం అత్యంత ఘోరం.
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఇతర సంపన్న వర్గాలు సంఘాలు పెట్టుకుని ఒక సమావేశం పెట్టుకుంటే మంత్రులు, ప్రధాని ఎగురుకుంటూ వెళ్ళి హామీలు కురిపించడంలో, అమలు చేయడంలో పోటీలు పడతారు. అదే కార్మికులు సంఘం పెట్టుకోవాలంటే మాత్రం సవాలక్షా షరతులు, నిబంధనలు, చట్టాలు విధిస్తూ అసలు సంఘం పెట్టడమే నేరం అన్నట్లుగా వాతావరణం తయారు చేసి పెట్టారు. ఈ ప్రభుత్వాలు సంపన్నుల పక్షమే గానీ, శ్రమ జీవుల పక్షం కాదని వారి చర్యలు, ఆచరణ స్పష్టం చేస్తాయి. అందుకే కార్మికులకు పోరాటం తప్ప మరో మార్గం లేదు.
ట్రేడ్ యూనియన్ బ్యూరోక్రసీ
కాగా అనేక కేంద్ర కార్మిక సంఘాలు క్రమ క్రమంగా బ్యూరోక్రట్ల కంటే దిగజారిపోవడం ఒక బాధాకర పరిణామం. సరళీకరణ – ప్రైవేటీకరణ – ప్రపంచీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటిస్తూనే తమ వ్యతిరేకతకు అనేక కెవియట్లు విధించడం వామపక్ష కార్మిక సంఘాలకు కూడా విధిగా మారింది. వారి సమ్మె పిలుపులు ‘ఈవెంట్లు’ గా మాత్రమే ముగుస్తున్నాయి. ఒక సమ్మెకు పిలుపు ఇవ్వడం, పదిమంది ఆస్ధాన కార్యకర్తలను కూడగట్టడం, ఒక టెంట్ వేసి నలుగురి చేత మాట్లాడించి మధ్యాహ్నానికి ముగించేసి తర్వాత రోజు పత్రికల్లో ఫోటోలు, వార్తలు చూసుకోవడంతో ఆ ఈవెంట్లు ముగిసిపోతున్నాయి. డిమాండ్ల సాధనకు నిర్దిష్ట, నిర్ణయాత్మక కృషి చేసే ధోరణి ఎన్నడో కనుమరుగైపోయింది.
కార్మిక సంఘాల సమ్మె డిమాండ్లు ఆర్ధిక దశను దాటి రావడం లేదు. అరకొర ఆర్ధిక డిమాండ్లే నెరవేర్చుకోలేని దీన పరిస్ధితుల్లో ఉన్నపుడు వాటిని రాజకీయ డిమాండ్లుగా అభివృద్ధి చేసుకోగలగడం కలలోని మాటే. కార్మిక సంఘాల నిర్మాణం లోనే అత్యంత ఉన్నతమైన, ఉదాత్తమైన లక్ష్యం, గమ్యం నెలకొని ఉండగా కనీసం సంఘాల గుర్తింపును కూడా సాధించలేని బలహీన స్ధితిలో ట్రేడ్ యూనియన్లు ఉండిపోయాయి.
చివరికి ట్రేడ్ యూనియన్ నాయకులు బ్యూరోక్రాట్ అధికారులుగా తయారయ్యారు. ఒక ఆఫీస్ లో పై అధికారి. ఆయనకు కింద అధికారులు, వారికి మరి కొందరు కింది ఉద్యోగులు… ఇలా దశల వారీగా, మెట్ల వారీగా నిర్ణయాలు నోళ్ళు, చేతులు మారుతూ వచ్చినట్లే కార్మిక సంఘాలలోనూ జరుగుతోంది గాని స్ధిరంగా ఒక సమస్య తీసుకుని, నిర్దిష్ట కృషి చేసి, దశలవారీగా ఉద్యమాలను అభివృద్ధి చేసి కార్మికులలో రాజకీయ చైతన్యం పెంపొందించే కర్తవ్యాన్ని యూనియన్లు మానివేశాయి.
దానితో యూనియన్ నేతలు ప్రభుత్వ అధికారులకు ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలుగా మారిపోయారు. యూనియన్ నేతలు డాన్ లుగా, ముఠా నాయకులుగా, అధికారాల చెలాయింపుదారులుగా… అవతరించారు. ప్రభుత్వాలకు, అధికారులకు కూడా ఈ కొత్తరకం ‘బ్యూరోక్రట్లను మంచి చేసుకుంటే చాలు. సమస్యలు లేకుండా పని గడిచిపోతుంది’ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. వారికా నమ్మకాన్ని కలిగించడానికి యూనియన్ నాయకులు కూడా ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు.
నూతన సంస్ధ MASA
ఈ ట్రేడ్ యూనియన్ బ్యూరోక్రసీని అరికట్టకపోతే ‘బానిస సంకెళ్లు’ కాదు కదా, సాలె గూడు దారాలు కూడా తెగిపడ బోవు. ఈ పరిస్ధితులలో ప్రధాన కేంద్ర ట్రేడ్ యూనియన్ ల ఉమ్మడి సంస్ధకు ప్రత్యామ్నాయంగా కొన్ని ట్రేడ్ యూనియన్ లు కొత్త ఉమ్మడి సంస్ధ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త సంస్ధ పేరు ఎంఏఎస్‌ఏ – మజ్దూర్ అధికార్ సంఘర్ష్ అభియాన్.
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఐఎఫ్‌టియూ), ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియూసిఐ), ఆల్ ఇండియా వర్కర్స్ కౌన్సిల్ (ఏఐడబల్యూసి), ఇండియన్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ యూనియన్స్ (ఐసిటియూ), జాన్ సంఘర్ష్ మంచ్ (జేఎస్‌ఎం), ఇంక్విలాబ్ మజ్దూర్ కేంద్ర (ఐఎంకే), డెమోక్రటిక్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (డిటియూసి) మొ.న యూనియన్ లు MASA లో సభ్య సంఘాలుగా ఉన్నాయని సదరు సంఘాల ప్రతినిధులు మంగళవారం ప్రకటించారు.
ప్రధాన స్రవంతి ట్రేడ్ యూనియన్ లు CTUO (సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్) బ్యానర్ కింద జమకూడగా కొత్తగా ఏర్పడిన MASA దానికి ప్రత్యామ్నాయం కాబోతున్నది.
“25 సం.ల సరళీకరణ కాలంలో కార్మికుల ప్రయోజనాలు రక్షించుకోవడానికి వీలుగా శక్తివంతమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో తమకు సామర్ధ్యం లేదని సిటియూఓ సంఘాలు రుజువు చేసుకున్నాయి. గత సం. కూడా అఖిల భారత సమ్మె నిర్వహించాం. దానికి ముందు కూడా అనేక సమ్మెలు చేశాం. అప్పటి నుండి కార్మికుల సమస్యలపై ఏ మాత్రమన్నా ప్రగతి సాధించామా? కార్మికుల ప్రయోజనాలను ఈ సంఘాలు పదే పదే నీరు గార్చుతూ వచ్చాయి. కార్పొరేట్-అనుకూల రాజ్యంతో రాజీ పడిపోయాయి. వారి నాయకత్వంపై కార్మికులు నమ్మకం కోల్పోయారు. అందుకే చొరవ చూపి మేమీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాం” అని MASA కొ-ఆర్డినేటర్ అమితవా భట్టాచార్య ప్రకటించారు.
సెప్టెంబర్ 2 సమ్మెలో తాము పాల్గొంటున్నామని ప్రకటించిన MASA, సంవత్సరం పొడవునా కార్మికుల హక్కుల సాధన కోసం పని చేస్తూనే ఉండాలని చెబుతోంది. “సంవత్సరం పొడవునా కార్మిక హక్కుల సాధనం కోసం కృషి చేస్తూ ఉండాలి. సంవత్సరంలో ఒక్క రోజు చేయడం కాదు. అయితే సెప్టెంబర్ 2 సమ్మెలో మేమూ పూర్తి శక్తితో పాల్గొంటాము” అని ఎంఏఎస్‌ఏ ప్రతినిధి అమితవా చెప్పారు.
20 రాష్ట్రాలలో తమ సంఘాల కార్యకలాపాలు సాగుతున్నాయని చెబుతున్న MASA ఆవిర్భావం ఆహ్వానించవలసిన పరిణామం. కానీ ఈ MASA కూడా మరో CTUO గా మారబోదన్న నమ్మకం ఇప్పటికైతే లేదు. ఎందుకంటే ప్రధాన స్రవంతి వామపక్ష ప్రజా సంఘాలకు ప్రత్యామ్నాయంగా గతం లోనూ కొన్ని సంస్ధలు ఆవిర్భవించి పని చేశాయి. కానీ అవి ఆరంభ శూరత్వంతోనే సరిపెట్టుకున్నాయి.
అసలు మీరు పనిచేసేది ఎప్పుడు బయ్యా. రోజూ చేసేది సమ్మెగాక బొమ్మే? ఉన్న దరిద్రాలకు తోడు మరొక పుట్టగొడుగు పుట్టుకొచ్చిందా? చీటికి మాటికి ఈ దిక్కుమాలిన సమ్మెలేంది?
ఏ దిక్కు లేకే ఈ దిక్కుతోచని సమ్మెలు బయ్యా!
పరాన్న భుక్త దరిద్రాలు తిని కూర్చుంటా, అంతటితో ఆగకుండా పనులు చేస్తున్న వాళ్ళకే పనోపనిషత్తులు, పని పురాణాలు ఉపదేశించటానికి రెడీ కావడమే అతి పెద్ద దరిద్రం అయిపోయింది బయ్యా! ముందు ఈ దరిద్రాలని నిర్మూలిస్తే, పుట్టగొడుగుల అవసరం ఎందుకు ఉంటది బయ్యా?
పనిచేసే వాళ్ళు ‘పని చేస్తున్నామహో’ అని వాపోయింది ఎప్పుడూ లేదు బయ్యా. పనికి తగిన ఫలితం ఇవ్వమనే వారు అడిగేది. ఫలితంతో తింటేనే గదా బయ్యా మళ్లీ పని చేయగలిగేది?! పనికి తగింది ఎట్టాగూ ఇవ్వర్లే గానీ బయ్యా, కనీసం తిండికి, జబ్బుకీ కూడా ఇవ్వకపోతే ఎట్టా బయ్యా? అందుకే కదా బయ్యా సమ్మెలు!
దున్నపోతు చర్మాలు స్పందించకపోతే సమ్మె తప్ప మరో గత్యంతరం లేకండా పోయింది బయ్యా. ఆ దున్నపోతులకి బదులు ఈ నీల్గుడు దరిద్రం కొత్తగా పుట్టుకొచ్చినట్లుంది బయ్యా! ముందు ఈ పుట్టగొడుగు సంగతి ఏందో కాస్త చూడు బయ్యా!