ఉబర్ దోపిడీపై ముంబై ఆటోల తిరుగుబాటు -వివరణ



బహుళజాతి ట్యాక్సీ అగ్రిగేటర్ కంపెనీ ‘ఉబర్’ సాగిస్తున్న దోపిడీ పై ముంబై ఆటో రిక్షా కార్మికులు తిరుగుబాటు ప్రకటించారు. ఆటో యజమానులు, కార్మికులు ఉమ్మడిగా బుధవారం పగటి పూట (12 గం) సమ్మె ప్రకటించారు. సమ్మె దిగ్విజయంగా నడుస్తోందని ఆటో కార్మికసంఘాలు ప్రకటించాయి.

సమ్మెలో లక్షకు పైగా అఆటోలూ పాల్గొంటున్నాయని సమ్మెదారులు (ముంబై ఆటో రిక్షా యూనియన్) ప్రకటించారు (-ద హిందూ బిజినెస్ లైన్). ఫలితంగా నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికలూ తెలిపాయి. సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని బస్సులు నడపాలని RTC కి ఆదేశాలు ఇచ్చామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కార్మికుల సమస్యలు చర్చిస్తామని చెప్పినా వినకుండా ఆటో కార్మికులు సమ్మెకు దిగడాన్ని వాళ్ళు విమర్శించారు.

కార్మికులు సమ్మె తలపెట్టే వరకు వారి మొర ఆలకించకుండా, తీరా సమ్మె రోజుకు ముందు ‘ఆలోచిస్తున్నాం, విరమించండి’ అని కోరడం ప్రభుత్వాలకు పరిపాటే. దేశంలోని ప్రధాన నగరాలలో, ముఖ్యంగా కాస్మోపాలిటన్ నగరాలలో మొబైల్ అప్లికేషన్ ఆధారిత కంపెనీలైన ఉబర్, ఓలా ఆటో, ట్యాక్సీ కార్మికుల పొట్ట కొడుతున్నాయని, వారిని అరి కట్టాలని అనేక నెలలుగా కార్మికులతో పాటు ఇతర ప్రజా సంఘాలు, నిపుణులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. వీటి వల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం అవుతుందని, తగిన అధ్యయనం చేసి ఉబర్, ఓలా లను ప్రభుత్వ నియంత్రణ లోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తించాలని వారు హెచ్చరించారు. అయినా వారిని పట్టించుకున్నవారు లేరు.

“ఆప్ ఆధారిత క్యాబ్ సర్వీసులను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. కాల్ సెంటర్ల ద్వారా ప్రయాణికులను బుక్ చేస్తూ మా ఆటో వ్యాపారానికి నష్టం చేస్తున్నారు” అని ముంబై ఆటో రిక్షామెన్ యూనియన్ నాయకుడు శశాంక్ రావు పిటిఐ తో మాట్లాడుతూ వివరించారు.

“అంతే కాదు, వాళ్ళు మా జీవన వనరుని కొల్లగొడుతున్నారు. ఆ క్రమంలో ఎలాంటి రూల్స్ ని వాళ్ళు పాటించడం లేదు. సమ్మె చేయడం తప్ప మరో మార్గాన్ని మాకు మిగల్చలేదు. మా న్యాయమైన డిమాండ్ల పట్ల రవాణా మంత్రిత్వ శాఖ చెవిటివాని లాగా వ్యవహరిస్తోంది” అని శశాంక్ రావు తెలిపారు.

ఉబర్, ఓలా సర్వీసుల ధరల వ్యూహాలపై ఓ కన్ను పెట్టాలని కూడా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆప్ ద్వారా అందుబాటులో ఉండే వేగవంతమైన కమ్యూనికేషన్ సౌకర్యాల ఆధారంగా రేట్లను తీవ్రంగా ప్రభావితం చేయగల స్ధానంలో ఈ కంపెనీలు ఉంటున్నాయి. మరో పక్క సాధారణ డ్రైవర్లకు అలాంటి సౌకర్యాలు మృగ్యం. దానితో ప్రయాణికుల మీదనే ఆధారపడి బ్రతికే కుటుంబాలకు ఆదాయం బాగా పడిపోతున్నది.

ముంబై నగరంలో 1.05 లక్షల ఆటోలు రిజిస్టర్ అయి ఉండగా వాటిలో 90 శాతం తమ యూనియన్ కింద ఉన్నారని శశాంక్ రావు చెప్పారు. “రిజిస్టర్ అయిన ఈ 1.05 ఆటో రిక్షాల్లో 98,000 – 99,000 వరకు ఈ రోజు రోడ్ల మీదికి రాలేదు. దీనిని బట్టి మా యూనియన్ బలాన్ని అంచనా వేయవచ్చు” అని ఆయన చెప్పారు.

యూనియన్ నేత తమ యూనియన్ బలం గురించి వివరించడానికి కారణం ఉన్నది. కాంగ్రెస్, శివసేన, నవ నిర్మాణ సేన తదితర పాలక పార్టీలు, మతతత్వ గ్రూపులు నడిపే యూనియన్లు మొదట సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించి చివరి నిమిషంలో విరమించుకున్నాయి. జై భగవాన్ టాక్సీ రిక్షా సంఘటన, నితీష్ రాణే స్వాభిమాన్ సంఘటన ఈ విధంగా మోసం చేశాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిందని, వారి హామీ అమలు చూసాక నిరవధిక సమ్మె చేస్తామని ఆ సంఘాలు చెప్పాయి. తద్వారా మోసపూరిత ఎత్తుగడతో సమ్మెను విఫలం చేసే ప్రయత్నం చేశాయి. వారి ఎత్తుగడ విఫలం అయిందని శశాంక్ రావు చెప్పిన వివరాలు తెలియ జేస్తున్నాయి.

ఉబర్, ఓలా కంపెనీలు స్వయంగా ట్యాక్సీలు, ఆటోలు నడపవని అవి కేవలం అగ్రిగేట్ మాత్రమే చేస్తాయని వాటి వల్ల భారతీయ డ్రైవర్లకు, యజమానులకు వచ్చిన నష్టం ఏమి లేదని కొందరు మేధావులు, పండితులు, బుద్ధి జీవులు వాదిస్తున్నారు. ఈ సర్వీసుల వల్ల ప్రజలకు సులభంగా అద్దె రవాణా అందుబాటులోకి వస్తున్నదని, ధరలు కూడా తగ్గుతున్నాయని వారు వాదిస్తున్నారు. అయితే ఇది అర్ధ సత్యాలతో కూడిన వాదన మాత్రమే. సామ్రాజ్యవాద పెట్టుబడి ఆరంభంలో కల్పించే భ్రమల్లో మునగడం వల్ల ఈ వాదనలు చేస్తున్నారు.

ఆప్ ఆధారిత కంపెనీలు కేవలం స్మార్ట్ ఫోన్ లలో కనిపించే చిన్న ఐకాన్ లు మాత్రమే అనుకుంటే పొరబాటు. ఈ కంపెనీలు ప్రారంభంలో కొద్దిమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు స్ధాపించినవే కానీ అనతి కాలంలోనే అవి వాల్ స్ట్రీట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అనగా బడా బడా సామ్రాజ్యవాద వాల్ స్ట్రీట్ కంపెనీల పెట్టుబడులు ఈ కంపెనీలలో ఉన్నాయి.

పెట్టుబడులు ఏం చేస్తాయో, ఏం కోరుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెట్టుబడి అన్నది లాభాలను వేటాడే రాకాసి. ఆ వేటలో అది తనకు అడ్డు వచ్చిన దేన్నైనా తన కాళ్ళ కింద తొక్కిపారేస్తూ వెళ్ళిపోతుంది. ఎదురైన దానిని పాతాళానికి అణచివేస్తూ వెళుతుంది. ఎదిరించిన దానిని నాశనం చేస్తూ వెళుతుంది.

ఉబర్, ఓలా లలో ఉన్న సామ్రాజ్యవాద పెట్టుబడి కూడా అదే చేస్తోంది. ఆ పెట్టుబడి భారత నగరాలలోని ప్రయాణికుల సౌకర్యాలు చూడడానికి వచ్చినది కాదు. లాభాల కోసం మాత్రమే వచ్చింది. తన లాభాలను గరిష్టం చేసుకోవడానికి అది ఆరంభంలో కొన్ని ఎత్తులు వేస్తుంది. ఉదారంగా పెట్టుబడి పంచి పెడుతుంది. అవసరమైతే కొంత నష్టం భరిస్తుంది. తనకు మాలిమి చేసుకుంటుంది. క్రమంగా పోటీని తప్పించేస్తుంది. ఆ తర్వాత విశ్వరూపం ప్రదర్శిస్తుంది. తన లాభాల మార్జిన్ మేరకు ధరలు నిర్ణయిస్తుంది. తన అదుపులో సర్వీసులు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తుంది. అప్పుడు విచారించినా చేసేది ఏమి ఉండదు.

ఉబర్, ఓలాలలోని సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రస్తుతం ట్యాక్సీ, ఆటోల మార్కెట్ ధరలను కనీస స్ధాయికి తగ్గిస్తోంది. జనం అంతా అదే కావాలని డిమాండ్ చేసే విధంగా అలవాటు చేస్తోంది. మరో రూపంలో ప్రభుత్వాల వల్ల ఉపాధి పొందని భారతీయ జనం కల్పించుకున్న స్వయం ఉపాధి వనరులను తాను స్వాయత్తం చేసుకుంటోంది. ప్రయాణ ఆదాయాన్ని తన జేబులో వేసుకుంటోంది. అది ఎంత మొత్తంలో తన పెట్టుబడికి వడ్డీలుగా సంపాదిస్తున్నదో అదంతా గతంలో భారతీయ ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు మరియు యజమానులు జేబుల్లోకి వెళ్ళేది అన్న సంగతి గుర్తు చేసుకుంటే ఉబర్, ఓలా లు ఎం చేస్తున్నాయో అర్ధం అవుతుంది.

కాబట్టి ఉబర్, ఓలా లు కేవలం అప్లికేషన్లు కావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రజల సౌకర్యార్ధం తయారు చేసిన ఉచిత సాంకేతిక వనరులు కావు. అవి భారత ప్రజల ఆదాయ వనరును కొల్లగొడుతున్న సామ్రాజ్యవాద పెట్టుబడి. అందుకే వాటిని ప్రభుత్వాలు నియంత్రించాలి. ప్రజలకు సౌకర్యాలు కల్పించే వరకు మాత్రమే వాటిని పరిమితం చేయాలి. ఆదాయ వనరులను కొల్లగొట్టే అవకాశం వారికి లభించకుండా చూడాలి.

కానీ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేస్తాయా అంటే అనుమానమే.

4 thoughts on “ఉబర్ దోపిడీపై ముంబై ఆటోల తిరుగుబాటు -వివరణ

  1. కానీ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేస్తాయా అంటే అనుమానమే.
    మీకా అనుమానం అక్కరలేదు(మీకుతెలిసిందే), ఖచ్చితంగా పైవాటిని నియంత్రించలేవు!
    చేస్తే,గీస్తే ఆ పనిని రవాణా కార్మికులే చేయాలి.

  2. ఇది నాకు అర్ధం కాలేదు.

    ఆటోవాళ్ళుకూడా తమ లాభాలు పెంచుకొనే ఉద్దేశ్యంతోనే ప్రతి చిన్నదానికీ, డబల్ ఛార్జీలు, ట్రిపుల్ ఛార్జీలు, లాంగ్‌రూటుకు మాత్రమే ‘సై’ అనడాలు చేస్తున్నారుకదా. వీళ్ళు చేసేది ఓలా, ఊబర్‌లకన్నా ఏవిధంగా ప్రజలకు ప్రయోజనకరం? ఇద్దరి ఉద్దేశ్యమూ, లాభార్జనే ఐనప్పుడు ఓలా, ఊబర్లదిమాత్రమే తప్పెలా అవుతుంది? ఒకరిచేత దోచుకోబడినా, వందమంది చేత దోచుకోబడినా, వినియోగదారుల పరిస్థితి ఎప్పుడూ దోచుకోబడడమేకదా? ఆమాత్రానికి ఏరాయైతేమాత్రమేమి? ఆటో డ్రైవర్లలోమాత్రం ‘లాభాలవేట’లో ఇంకొకరి బేరాలను తన్నుకుపోయే ‘రాకాసి’ ప్రవర్తనను మనం చూస్తాం కదా. ఓలా, ఊబర్లు పెద్ద రాకాసులు. అంతకన్నా తేడా ఏముంది?

    అసలు కార్మికుల డిమాండ్లేమిటి? క్యాబ్ సర్వీసులని ఎలాంటి నియంత్రణలకు గురిచెయ్యాలని వాళ్ల కోరిక?

  3. విశేషజ్ఞ గారు, ఒక, ఓవర్లు పెద్ద బకాసూరులు అంతకన్న తేడా ఏముంది అంటున్నారు. మీరంటున్నదే పెద్ద కృష్ణ బిలం. దాన్ని చిన్న తేడాగా చూడకూడదు. ఆర్టికల్ చివరి రెండు పేరాలను చూడండి. సామ్రాజ్యవాద ఆర్థిక విధానాల సారం అందులో కనబడుతుంది. ఇది ఊబర్ కు మాత్రమే వర్తించదు. తన ఆర్థిక దోపిడీకి అది అనుసరించే ప్రధాన విదానం ఇదే. మొదట సహాయం పేరుతో వచ్చే వీరు ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రజలను మోసం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s