సోవియట్ రష్యాయే మెరుగు -మాజీ సోవియట్ రాజ్యాలు


 

USSR విచ్చిన్నం అయినప్పుడు ఎంతో మంది కమ్యూనిస్టు విద్వేషులు రాక్షసానందాన్ని అనుభవించారు. పెట్టుబడిదారీ పశ్చిమ దేశాల ప్రభుత్వాలు పండగ చేసుకోగా పశ్చిమ దేశాలను గుడ్డిగా ఆరాధించే వాళ్ళు తాము ఎందుకు ఆనందిస్తున్నామో తెలియకుండానే పిచ్చి ఆనందం పొందారు. గట్టిగా అడిగితె సోవియట్ రష్యా అంటే ‘ఇనప తెర’ అని, అక్కడ ‘వ్యక్తి స్వేచ్ఛ’ మృగ్యం అనీ, ‘నియంతృత్వ పాలన’ అనీ… ఇంకా ఇలాంటివి ఏవేవో అక్కడా ఇక్కడా విన్నవి అప్పజెపుతూ తమకే అన్ని తెలిసిపోయాయన్న ఫోజులు పెట్టారు.

ఇన్నేళ్ల అనుభవం తర్వాత సోవియట్ రాజ్యం కూలిపోవడం అంటే ఏమిటో అక్కడి ప్రజలకు ఇప్పుడు తెలిసి వస్తోంది. ఒక్క సోవియట్ రష్యా లోని రష్యా ప్రజలు మాత్రమే కాదు, USSR నుండి విడిపోయిన ఇతర జాతి రాజ్యాల ప్రజలు కూడా మెజారిటీ విచ్చిన్నం అయినందుకు ఇప్పుడు చింతిస్తున్నారు. విడిపోయినప్పటి కంటే కలిసి ఉన్నప్పుడే బాగా బ్రతికాం అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘స్పుత్నిక్ న్యూస్’ పత్రిక ఇటీవల జరిపిన సర్వేలో రష్యాయేతర సోవియట్ రాజ్యాల ప్రజలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

స్పుత్నిక్ న్యూస్ సంస్ధ USSR కి చెందిన 11 రాజ్యాలలో సర్వే నిర్వహించింది. ఈ 11 దేశాల్లోని 9 దేశాల్లో 35 సం. కి పైబడిన వారిలో మెజారిటీ ప్రజలు ఇప్పటికంటే సోవియట్ రష్యా కాలంలోనే జీవితం మెరుగ్గా ఉన్నాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనాటి USSR లో నివసించిన ఇప్పటి రష్యా నివాసుల్లో అనగా కనీసం 35 సం. నిండిన రష్యన్ల లో 64 శాతం మంది ఇప్పటికంటే USSR లో జీవనమే మెరుగ్గా ఉండేదని భావిస్తున్నారు.

ఇలా రష్యాతో కలిసి ఉన్నపుడే జీవనం బాగుందని భావిస్తున్నవారి సమాఖ్య ఆర్మీనియా, అజర్ బైజాన్ లలో ఎక్కువగా ఉన్నది. ఆర్మీనియాలో 71 శాతం మంది అజర్ బైజాన్ లో 69 శాతం మంది అప్పుడే పరిస్ధితులు బాగున్నాయని భావిస్తున్నారు. ఇలాంటి వారి సమాఖ్య కజఖ్ స్తాన్ లో  61 శాతం ఉండగా, కిర్ఘిస్థాన్, ఉక్రెయిన్ లలో 60 శాతంగా  ఉన్నారు. అలాగే బెలారష్యాలో 53%, జార్జియాలో 51% సోవియట్ విచ్చిన్నం తర్వాత పరిస్ధితి క్షిణించిందని భావిస్తున్నారు.

ఒక్క తజకిస్ధాన్, ఉజ్బేకిస్ధాన్ లలో మాత్రమే సోవియట్ రష్యా విఛ్చిన్నం తర్వాత జీవనం మెరుగుపడిందన్న అభిప్రాయం మెజారిటీగా వ్యక్తం అయింది. అయితే USSR విచ్చిన్నానికి కాస్త ముందు, ఆ తర్వాత జనమించిన వారిలో, అనగా 25 సం.లు లోపు వయస్కులలో -మాజీ సోవియట్ రిపబ్లిక్కులు అన్నింటిలోనూ-  మెజారిటీ, విచ్చిన్నం తర్వాత జీవనం మెరుగుపడిందని భావించడం ఒక విచిత్రం.

 

 

Click to enlarge

 

సోవియట్ విచ్చిన్నాన్ని ‘విప్లవాత్మక ప్రజాస్వామ్యం’గా అభివర్ణించి మురిసిపోయే పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ విశ్లేషకులకు ఈ సర్వే ఫలితాలు బహుశా మింగుడు పడక పోవచ్చు.

జీవనం మెరుగు పడడం లేదా  బాగుండడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తడుపు కోవాల్సిన అవసరం, బహుశా, ఎవరికీ ఉండదు. ఉపాధి గ్యారంటీ, ఆరోగ్య సంరక్షణ, ఇతర సామాజిక సౌకర్యాలు కొరత లేకుండా సామాన్యులకు అందుబాటులో ఉండడమే జీవనం మెరుగ్గా ఉండడం! సోవియట్ విచ్చిన్నం అనంతరం రష్యాలో అధికారం లోకి వఛ్చిన యెల్టిసిన్ అమెరికా, పశ్చిమ దేశాల అడుగులకు మడుగులొత్తాడు. వాళ్ళు చెప్పిందల్లా చేసాడు. ఆడమన్నట్లు ఆడాడు. యెల్టిసిన్ పాలన రష్యా చరిత్రలో అక్కడి ప్రజలకు ఒక చీకటి అధ్యాయంగా మిగలగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు మాత్రం బంగారు గుడ్లు పెట్టిన బాతు అయింది.

1990 లో ఇండియా పైన నూతన ఆర్ధిక విధానాలు రుద్దినట్లే రష్యా పైన కూడా IMF ఆధ్వర్యంలో డి-రెగ్యులేషన్, లిబరలైజేషన్ విధానాలను బలవంతంగా రుద్దారు. ప్రభుత్వ నియంత్రణలను బలహీనం కావించారు. ఫలితంగా పశ్చిమ కంపెనీల ప్రాబల్యంలో రష్యా, సోవియట్ రాజ్యాలలో మాఫియా నేర సామ్రాజ్యాలు అవతరించి ప్రజా జీవనాన్ని అతలాకుతలం కావించాయి. ఫలితంగా కొద్ది మంది అధికారులు, నేతలు, మాఫియా డాన్ లు బిలియన్ల కొద్దీ సంపదలు గడించగా కోట్లమంది సామాన్యులు పేదలుగా మారారు. తానూ ప్రతిపాదించి అమలు చేసిన ఆర్ధిక ఔషధాన్ని ‘షాక్ ధెరపీ’ అని IMF ఆనాడు పేరు పెట్టింది. ప్రభుత్వరంగ కంపెనీల ద్వారా స్వయం సమృద్ధి సాధించిన దేశాలలో ప్రభుత్వాలను కూలగొట్టి అక్కడి ఆర్ధిక వ్యవస్ధలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ రోజుల్లో అమెరికా, IMF ఆధ్వర్యంలో ‘షాక్ ధెరపీ’ ని విస్తృతంగా అమలు చేసింది.   

చివరికి ఆ రోజుల్లో “దరిద్రాన్ని సృష్టించకుండా ఎవరు ధనికులు కాలేరు” అన్న నానుడి  పుట్టిందంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. 

సోవియట్ విచ్చిన్నం అనంతరం రష్యాలో, మాజీ సోవియట్ రాజ్యాలలో ‘షాక్ ధెరపీ’లో భాగంగా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధను ప్రవేశ పెట్టారు. ఆ ధెరపీ కింద ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఆహారం, దుస్తులు మొ.న ప్రజాస్వాసరాలకు ప్రభుత్వాలు ఇస్తూ వచ్చిన సబ్సిడీలు రద్దు చేసేసారు. గృహ నిర్మాణం, రవాణా, విద్యుత్ మొ.న సౌకర్యాలకు ప్రభుత్వ మద్దతు ఎత్తివేశారు. ఇలా కోతలు, రద్దులతో కూడబెట్టిన సంపదలను స్ధానిక మాఫియాలు, పశ్చిమ బహుళజాతి కంపెనీలు, NGO లు పంచుకు తిన్నారు.  
 

“నూతనంగా ప్రవేశించిన అసమాన ‘అన్యాయ ఆర్ధిక వ్యవస్ధ’ లేదా ‘నూతన స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ విధానం’ గతం కంటే మరింత సమస్యాత్మక వ్యవస్ధయై ప్రజల్ని పీడించింది. గతంలో ఉన్న కమ్యూనిస్టు  సహకార విధానం అదృశ్యమై వ్యక్తిగత స్వార్ధం ప్రవేశించింది” 

అని ఆర్ధికవేత్త, సోవియట్ రష్యా పరిశీలకుడు మైఖేల్ పరేంటి తన పుస్తకం “Blackshirts and Reds: Rational Fascism and the Overthrow of Communism” లో వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం.

కొన్నేళ్ల అనుభవం తర్వాత సోవియట్ యూనియన్ విచ్చిన్నం పట్ల అక్కడి ప్రజలు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలియడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కొన్ని పశ్చిమ పత్రికల సర్వేలలో కూడా ఈ అభిప్రాయం వ్యక్తం అయింది. ఉదాహరణకి 2004 లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక సర్వే ఫలితం ప్రకటించింది. రష్యా చరిత్ర నిపుణుడు, చరిత్రకారుడు రిచర్డ్ పైప్స్ నిర్వహించిన ఈ సర్వే  ప్రకారం 74 శాతం రష్యన్లు  సోవియట్ రష్యా విచ్చిన్నం పట్ల పశ్చాత్తాపం ప్రకటించారు. సోవియట్ విచ్చిన్నం తమకు ఉపాధి కరువు తెచ్చిందని, ఆరోగ్య సౌకర్యాలు దూరం అయ్యాయని తెలిపారు.

రష్యా అధ్యక్షుడుగా వ్లాదిమిర్ పుతిన్ పగ్గాలు చేపట్టాక పరిస్ధితిలో కొంత మార్పు వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ బహుళజాతి కంపెనీలు నడిపిన మాఫియా రాజ్యాలను అరికట్టడంలో పుతిన్ కృతకృత్యుడు అయ్యాడు. అమెరికా, ఐరోపా కంపెనీలకు విచ్చలవిడి స్వేచ్ఛ కల్పించడం బంద్ అయింది. ప్రయివేటు కంపెనీలు ఇష్టా రాజ్యంగా కొల్లగొట్టడం తగ్గింది. సమాజంలో ఒక ఆర్డర్ ఏర్పడింది. భద్రత పెరిగింది. విస్తారమైన వనరులను పశ్చిమ కంపెనీల దోపిడీకి అప్పజెప్పడం నిలిచిపోయింది.

దానితో అమెరికా, ఐరోపా రాజ్యాలు గగ్గోలు మొదలు పెట్టాయి. తమ దేశాన్ని ఆర్డర్ లో పెట్టుకుంటున్న పుతిన్ వారికి ‘నియంత’ అయ్యాడు. పశ్చిమ కంపెనీల దోపిడీకి పగ్గాలు వేసినందుకు ‘మార్కెట్ వ్యతిరేకి’ అయ్యాడు. రష్యన్ సమాజాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించిన పశ్చిమ NGO లను తన్ని తగలేసినందుకు ‘మానవ హక్కుల అణచివేతదారు’ అయ్యాడు. అమెరికా తరహా లైంగిక  స్వేచ్ఛా విప్లవాన్ని వాటేసుకోబోయిన యువతి, యువకులను కట్టడి చేసినందుకు ‘భావ ప్రకటన స్వేచ్ఛకు శత్రువు’ గా ముద్ర వేయబడ్డాడు.

“ఈ (రష్యన్) నేల, శ్రమ, వనరులు, ఈ దెస మార్కెట్ లను ఈ దేశ అభివృద్ధికి వినియోగించే వైపుగా జరిగే ఏ కృషి అయినా విదేశాలలో (పశ్చిమ దేశాలలో) రాక్షసీకరించబడుతుంది. అందుకే రష్యా నేత (పుతిన్) ను పశ్చిమ దేశాలు తమకు ప్రమాదకరంగా, సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రమాదం తెచ్చేవాడుగా పరిగణిస్తాయి” 

అలాగని పుతిన్ ఏలుబడిలో రష్యా ప్రజలు అందరూ సుఖ శాంతులతో జీవిస్తున్నారని భ్రమ పడనవసరం లేదు. పుతిన్ రష్యన్ జాతీయ బూర్జువా. తన దేశ సంపదలు తమ దేశానికే చెందాలని భావించే పాలకుడు. కనుకనే ఆయన పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. తిరస్కరించడంతో సరిపెట్టుకోకుండా ఎదిరించాడు. దేశంలోని పశ్చిమ తాబేదారులను అణచివేశాడు. రష్యన్ దేశీయ సంస్కృతిని పరిరక్షించుకునే చర్యలు తీసుకున్నాడు. ఏ దేశ పాలకుడు నుండి అయినా ఆ దేశ ప్రజలు ఆశించగల కనీస చర్యలు ఇవి.

భారత పాలకుల నుండి ఇటువంటి చర్యలను ఆశించలేం. భారత బూర్జువాల (పెట్టుబడిదారుల) పుట్టుకే బ్రిటిష్ వలస, సామ్రాజ్యవాద ఆధిపత్య ప్రాపకంలో జరిగింది. దేశ వనరులను దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల కోసం, కనీసం తమ వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించబడాలన్న నిబద్ధత వారికి ఏ కోశానా ఉండదు. అందుకే పెట్టుబడుల కోసం, ఐరాస భద్రతా సమితి శాశ్వత సభ్యత్వం కోసం, NSG సభ్యత్వం కోసం పశ్చిమ దేశాలను దేబిరించేది, అక్కడికి అవన్నీ మన తలరాతల్ని మార్చేసే మంత్రదండాలు అయినట్లు!

2 thoughts on “సోవియట్ రష్యాయే మెరుగు -మాజీ సోవియట్ రాజ్యాలు

  1. క్రీడల్లో కూడా సొవియట్ ప్రజలు తమప్రభావాన్నిచూపారు.
    సమ్మెర్ ఒలింపిక్స్ లో కూడా సొవియట్ రష్యా తన ప్రభావాన్ని చూపింది.
    మెడల్స్ బై సమ్మెర్ గేంస్[ఎడిట్]
    గేంస్ అథ్లెట్స్ గోల్డ్ సిల్వెర్ బ్రాంజ్ టొటల్ రాంక్
    ఫిన్లాండ్ 1952 హెల్సింకి 295 22 30 19 71 2
    ఆస్ట్రేలియా 1956 మెల్బోర్న్ 283 37 29 32 98 1
    ఇటలి 1960 రోం 284 43 29 31 103 1
    జపాన్ 1964 టొక్యొ 319 30 31 35 96 2
    మెక్షికొ 1968 మెక్షికొ సిటి 313 29 32 30 91 2
    వెస్ట్ జెర్మని 1972 మ్యునిచ్ 373 50 27 22 99 1
    కెనడ 1976 మాంట్రియల్ 410 49 41 35 125 1
    సొవియట్ యూనియన్ 1980 మాస్కో 489 80 69 46 195 1
    ఆమెరిక 1984 లాస్ ఏంజెల్స్ డిడ్ నాట్ పార్టిసిపేటెడ్
    సౌత్ కొరియ 1988 సియోల్ 481 55 31 46 132 1
    టొటల్ 395 319 296 1010 2

  2. 2016 రియో ఒలింపిక్స్ లో పాత సొవియత్ దేశాల పతకాల వివరాలుచూడండి-
    గోల్డ్ సిల్వెర్ బ్రాంజ్ టోటల్
    36 49 66 151
    అదీ రష్యా చాలా బలంగా భావించే ట్రాక్ అండ్ ఫీల్ద్ విభాగంలో రష్యా అథ్లెట్ లను బహిస్కరిస్తే సాధించిన పతకాలు.
    ఆమెరికా పతకాల పట్టిక చూడండి-
    గోల్డ్ సిల్వెర్ బ్రాంజ్ టోటల్
    46 37 38 121.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s