భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల పెట్టిన వ్యూహం -కాంగ్రెస్ ఆరోపించినట్లుగా- ఇండియాకే బెడిసి కొట్టేట్లు కనిపిస్తోంది. 69వ స్వతంత్ర దినం నాడు బలోచిస్తాన్ ప్రజల పోరాటాన్ని మన ప్రధాని ప్రస్తావించినందుకు ప్రతీకారంగానా అన్నట్లుగా కాశ్మీర్ విషయంలో పూర్తి స్ధాయి అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి పాకిస్ధాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. కాశ్మీర్ సమస్య విషయమై తమ వాదన వినిపించడానికి వివిధ దేశాలకు ఆయన దౌత్యవేత్తలను పంపించారు.
కాశ్మీర్ సమస్యను ఇతర దేశాలకు వివరించడం అంటే ఆ సమస్యను అంతర్జాతీయం చేసేందుకు కృషి చేయడం. భారత పాలకుల దృష్టిలో కాశ్మీర్, అంతర్జాతీయ సమస్య కాదు. అది స్ధానిక/అంతర్గత సమస్య. కాదు కూడదు అంటే, మహా అయితే ప్రాంతీయ సమస్య. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో అంతర్గత భాగం కనుక ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి భారత పాలకులు అంగీకరించరు. ఇండియా దేనినైతే గట్టిగా వ్యతిరేకిస్తుందో సరిగ్గా అదే పని చేయడానికి పాక్ పాలకులు సిద్ధం అయ్యారు.
గత ఆగస్టు 15 తేదీన ఎర్ర కోట పై ప్రసంగానికి ప్రజల సూచనలు కోరిన ప్రధాని మోడి ఎన్ని సూచనలు అందుకున్నారో తెలియదు. అసలు ఏమన్నా సూచనలు ఆయనకు అందాయో లేదో కూడా ఎవరూ అనుకోలేదు. ఆయన మాత్రం ఏకాఎకిన బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాట సమస్యను ప్రస్తావించారు. బలూచిస్తాన్ ప్రజల పోరాటాన్ని ఒక భారత ప్రధాన మంత్రి ప్రస్తావించడం ఇదే మొదటిసారి.
పాక్ నుండి స్వతంత్ర కోరుతున్న బలోచిస్తాన్ సమస్యను లేవనెత్తడమే కాకుండా వారి స్వతంత్ర పోరాటానికి మద్దతు సైతం ప్రధాని మోడి ఎర్ర కోట పైన ప్రకటించారు. తన స్వతంత్ర దిన ప్రసంగానికి ముందునుండి తనకు బలోచ్ ప్రజల నుండి శుభాకాంక్షలు అందుతున్నాయని, దేశ విదేశాల నుండి తనకు ప్రశంసలు అందాయని ఆయన ప్రకటించారు. సొంత గడ్డ విముక్తి కోసం జరుగుతున్న బలోచ్ ప్రజల పోరాటానికి ప్రపంచ వ్యాపితంగా మద్దతు సమకూర్చుతానని, ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందడానికి సహాయం చేస్తానని మోడి ప్రకటించారు.
ఇంకేముంది పాకిస్తాన్ కి చురుకు పుట్టింది. కాశ్మీర్ సమస్య గురించి మరింత ధాటిగా మాట్లాడడం మొదలు పెట్టారు. కాశ్మీర్ సమస్య అప్పుడూ ఇప్పుడూ అంతర్జాతీయ సమస్యే అని నొక్కి వక్కాణిస్తున్నారు. బుర్హాన్ వాని హత్యానంతరం కాశ్మీర్ లో నెలకొన్న పోరాట వాతావరణం పాక్ పాలకులకు సరిగ్గా కలిసి వచ్చింది. అసలు కాశ్మీర్ ప్రజల్ని రెచ్చగొడుతున్నది పాకిస్తానే అని భారత ప్రభుత్వ నేతలు -కేంద్ర మంత్రులు/అధికారులు- స్పష్టం చేస్తూ ప్రజల్లోని అలజడి నెపాన్ని పాక్ మీదికి నెడుతున్నారు.
దూతలా, గడ్డిపోచలా!
ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొత్త వ్యూహాన్ని ప్రకటించాడు. కాశ్మీరు సమస్యను, అక్కడి ప్రజలపై భారత సైన్యం సాగిస్తున్న దమనకాండను ప్రపంచం లోని వివిధ దేశాలకు చెప్పనున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు సభ్యులను ప్రత్యేక దౌత్యవేత్తలుగా వివిధ దేశాలకు పంపి కాశ్మీరీ ప్రజల పోరాటానికి అంతర్జాతీయ మద్దతు కూడగడతానని ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, ఆగస్టు 27 తేదీన 22 మంది పార్లమెంటు సభ్యులను దూతలుగా ప్రకటించాడు. సెప్టెంబర్ లో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశం నాటికి ఈ దూతల ద్వారా కాక పుట్టిస్తానని సూచించాడు.
“కాశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చిన స్వయం నిర్ణయాధికార హక్కు అనాదిగా, పదుల యేళ్లుగా నెరవేరలేదన్న సంగతి ఐక్యరాజ్య సమితికి గుర్తు చేస్తాను” అని నవాజ్ షరీఫ్ ప్రకటించాడు. షరీఫ్ ప్రకటనను పాక్ మీడియా ఉచ్చ స్వరంతో ప్రచారం చేస్తోంది. “కాశ్మీర్ ప్రజల లక్ష్యం ఏమిటో ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసేలా దూతలు చర్యలు తీసుకోవానీ, అంతర్జాతీయ స్ధాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ ప్రధాని స్పష్టం చేశారు. తద్వారా వచ్చే సెప్టెంబర్ లో ఐరాసలో చేయనున్న ప్రసంగం అంతర్జాతీయ సమాజం యొక్క సామూహిక అంతరాత్మను ఊపిగొట్టాలి” అని రేడియో పాకిస్తాన్ ప్రకటించింది. (ద హిందు)
కాశ్మీర్ వివాదాన్ని మొదట అంతర్జాతీయ సమస్య చేసిందే ఇండియా అని నవాజ్ షరీఫ్ గుర్తు చేస్తున్నాడు. “ఫ్లెబిసైట్” జరుపుతామని జవహర్ లాల్ నెహ్రూ ఐరాసకు హామీ ఇచ్చిన సంగతినీ, ఆ మేరకు ఐరాస తీర్మానం చేసిన సంగతినీ గుర్తు చేస్తున్నాడు. “అనేక దశాబ్దాల క్రితం ఇండియాయే ఐరాస వద్దకు వెళ్లిందనీ, ఆనాడు ఇచ్చిన హామీని ఇండియా ఉల్లంఘించిందనీ మేము సమావేశంలో స్పష్టం చేస్తాము. ఐరాస స్ధిరంగా క్రమం తప్పకుండా కాశ్మీర్ వివాదం విషయమై విఫలం అవుతోందని చెబుతాను. కాశ్మీర్ ప్రజల కోసం ప్రపంచం లోని వివిధ భాగాల్లో పోరాడటానికి పార్లమెంటు సభ్యులైన ఈ దూతలను పంపుతున్నాము” అని నవాజ్ షరీఫ్ ప్రకటించాడు.
నిరంతరం భారత సైనికుల పహారా మధ్య, ఏఎఫ్‌ఎస్‌పిఏ లాంటి నల్ల చట్టాల అణచివేత మధ్య బ్రతుకులు గడుపుతున్న కాశ్మీరీ ప్రజలకు ఈ మాటలు ఎంత మృదు మధురంగా వినిపిస్తాయో చెప్పనవసరం లేదు. ప్రవాహంలో కొట్టుకు పోతున్నవాడు గడ్డి పోచ దొరికినా ఆబగా పట్టుకుంటాడు, దాని సాయంతో బైట పడవచ్చేమోనన్న ఆశతో. ఇప్పుడు పాక్ ప్రధాని, మంత్రులు, ప్రభుత్వ అధికారులు చేస్తున్న కాశ్మీర్ ప్రజల అనుకూల ప్రకటనలు వారికి మోకులుగా కనిపిస్తున్నాయి. కానీ అవి గడ్డి పోచలు మాత్రమే. ఆశపడి గట్టిగా పట్టుకుంటే పుటుక్కుమని తెగిపోవడానికి క్షణం పట్టదు.
నిప్పు రవ్వ ‘బుర్హాన్ వాని’ మరణం
తాజా అలజడి బుర్హాన్ వాని హత్యతో మొదలయింది. హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వాని జులై 8 తేదీన సైన్యం జరిపిన ఎన్ కౌంటర్ లో మరణించడంతో కాశ్మీర్ లోయలో ప్రజలు ఉగ్రులయ్యారు. బుర్హాన్ వాని అంతిమయాత్ర కోసం లక్షల మంది తరలి వచ్చిన నాటి నుండి అక్కడ శాంతి లేకుండా పోయింది. పాలస్తీనా పిల్లల తరహాలో చిన్న పిల్లలు సైతం ప్రాణాలకు తెగించి భారత భద్రతా బలగాలపైకి లంఘిస్తున్నారు. రాళ్ళు రువ్వుతున్నారు.
నిజానికి బుర్హాన్ వాని హత్య ఒక నిప్పు రవ్వ మాత్రమే. ఎడారిలో నిప్పు రవ్వలు ఎన్ని రగిలినా ఉపయోగం సున్న. అదే దట్టమైన అడవిలో రగిలితే, అది మొత్తం అరణ్యాన్ని దహించివేసే దావానలం అవుతుంది. కాశ్మీరు లోయ అలాంటి దట్టమైన అడవి. ఏ కాస్త వేడి తగిలినా ఉవ్వెత్తున ఎగసిపడేందుకు సిద్ధంగా ఉన్న అరణ్యం. ఆ అరణ్యం అంటుకుని తగలబడటానికి ‘బుర్హాని ఎన్ కౌంటర్’ నిప్పు రవ్వగా మారింది. కాశ్మీరీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు చోటు లేకుండా ఆ అరణ్యాన్ని ఎండబెట్టిందీ, ఎండబెట్టిన అరణ్యం తగలబడేందుకు నిప్పు రవ్వ అందించింది భారత సైన్యమే. లేదా భారత పాలకులే. ఇంకా చెప్పాలంటే బిజేపి, పిడిపి నేతృత్వం లోని భారత, కాశ్మీరీ దళారి పాలకులే.
కాశ్మీర్ రాజా హరిసింగ్ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు కరణ్ సింగ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రులు చేస్తున్న ‘టెర్రరిజం’ వాదనను తప్పు పట్టడం ఒక విశేషం. తాము సైనికులకు ఎదురు వెళ్తున్నామని, ఆధునిక ఆయుధాలు ధరించిన సైనికులతో తలపడుతున్నామని, తమ చేతుల్లో ఉన్నది ఒట్టి రాళ్ళు మాత్రమేననీ, తుపాకి గుండు తగిలితే చస్తామని, పెలెట్ తగిలితే కళ్ళు పోతాయని తెలిసినా, ఒళ్ళంతా జల్లెడ అవుతుందనీ తెలిసినా స్త్రీలు-పిల్లలు, యువతులు-యువకులు అన్న తేడా లేకుండా వీధుల్లోకి ఎందుకు వస్తున్నారో ఆలోచించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరాడు.
కానీ బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగినట్లు చూస్తోంది తప్ప సరైన ఆచరణాత్మక చర్య ఒక్కటంటే ఒక్కటి కూడా చేపట్టలేదు. పార్లమెంటు సమావేశాల్లో చేసిన ఆర్భాటపు హామీలు, భావోద్వేగ ప్రసంగాలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇప్పటికీ రెండు సార్లు కాశ్మీర్ వెళ్ళినా చేసింది ఏమీ లేదు. పార్లమెంటులో పెలెట్ గన్ లకు ప్రత్యామ్నాయంగా మరో ఆయుధం ఉపయోగిస్తామని చెప్పిన హోమ్ మంత్రి మొదటిసారి కాశ్మీర్ వెళ్ళినపుడు “పెలెన్ గన్ లు కాల్చండి గానీ, మోకాళ్ళ కిందకు కాల్చండి” అని సైన్యానికి చెప్పి వచ్చాడు.
జనంతో చర్చిస్తానని చెప్పి రెండో సారి వెళ్ళి రెండు రోజులు కాశ్మీర్ లో గడిపి కూడా ఒట్టి చేతుల్తో అటు ఇటు తిరిగి వచ్చాడు. జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తితో కలిసి సంయుక్త విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశాన్ని పూర్తి చేయకుండానే లేచివెళ్లిపోయాడు. అవతల కాశ్మీర్ జనం మాత్రం తమ అలజడి మానలేదు. సైన్యం చేతుల్లో మరణాలు ఆగలేదు. పోలీసు స్టేషన్ లు తగలబడడమూ ఆగిపోలేదు.
గిల్లనా, గిచ్చనా?
పార్లమెంటులో కాశ్మీర్ పై జరిగిన చర్చ అంతా పెలెట్ గన్ ల చుట్టూ తిప్పి ముగించడమే ఒక పెద్ద ప్రహసనం. అదొక బ్రహ్మాండమైన నాటకం. సో కాల్డ్ ప్రజాస్వామ్య దేవాలయంలో చర్చల పేరుతో ఏదో ఒరగబెట్టబోతున్నట్లు చేసిన షో. ఇలాంటి షో లను కాంగ్రెస్ హయాంలో లెక్కకు మిక్కిలిగా చూసిన కాశ్మీరీలు ఈసారి షో ని మాత్రం నమ్మలేదు. ఈ తరహా షో లు మోడికి కొత్త గానీ కాశ్మీరీలకు కొత్త కాదు. కానీ చర్చలను పెలెట్ గన్ చుట్టూ తిప్పడం మాత్రం నిస్సందేహంగా కొత్తదే.
“పెలెట్ గన్ లకు ప్రత్యామ్నాయం కనిపెడతాం” అని కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీ ప్రజలకు హామీ ఇవ్వడం అంటే ఏమిటో, ఆ హామీ ఇవ్వడం ద్వారా బిజేపి ప్రభుత్వం ఏమి చెప్పదలుచుకుందో భారత జనం తర్కించుకోవాలి. “మేము రాళ్ళు విసురుతాము. మీరు పెలెట్ గన్ లు కాల్ఛోద్దు ఇంకో ఆయుధం ఏదైనా మా మీదికి కాల్చండి” అని కాశ్మీరీలు అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది అదే అన్నట్లుగా ఉన్నది మోడి-రాజ్ నాధ్ ల వ్యవహారం.
ఒక ప్రభుత్వం తమ సొంత పౌరులుగా చెప్పే ప్రజలని “మిమ్మల్ని అణచివేయడానికి సైన్యాన్ని నియోగించాము. మీరు తిరగబడే పనైతే మీ మీదకి పెలెట్ గన్ లు పేల్చమంటారా లేక నిజం గుండ్లు పేల్చి చంపేయమంటారా లేక ఇంకేదన్నా కొత్త ఆయుధం కనిపెట్టమంటారా?” అని అడుగుతుందా? ఇటువంటి వెర్రిమొర్రి చర్చను ప్రధాన చర్చగా లేవదీసే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అవుతుందా?
“ఏదన్నా కొత్త ఆయుధం ప్రతిపాదించి, ఆమోదించి, తయారు చేసి, ప్రయోగించడానికి సిద్ధం చేసే వరకూ ఆందోళనలు ఆపండి. సిద్ధం అయ్యాక ఆందోళనలు చేస్తే అప్పుడు మీ కళ్ళు పోకుండా ఉండేందుకు కనిపెట్టిన కొత్త ఆయుధాలు ప్రయోగిస్తాం. అప్పటిదాకా రాళ్ళు వేయకండి, ఆందోళన చేయకండి” అని చెబుతున్నట్లుగానే ఉన్నాయి రాజ్ నాధ్ సింగ్ జరుపుతున్న రాయబారాలు.
ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం హయాంలో కాశ్మీరీల పోరాటానికి సంపూర్ణ మద్దతు అందజేసిన మహబూబా ముఫ్తి తీరా తాను అధికారం లోకి వచ్చేటప్పటికి అదే మంత్రాన్ని పఠిస్తోంది. అబ్దుల్లాలు ఇన్నాళ్ళు ఆడిన నాటకాలనే ఆడుతోంది. తాము పైకి సైద్ధాంతికంగా చెప్పే ఎలాంటి మాటతోనూ పొసగని బిజేపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే పిడిపి చేసిన మొదటి మోసం. తండ్రి చనిపోయాక రెండు నెలల పాటు కేంద్రంతో బేరసారాలు జరిపి కూడా కాశ్మీరీలకు ఏమి సాధించకుండానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం మహబూబా పాల్పడిన రెండవ మోసం. ప్రజల ఆందోళనలను “దారి తప్పిన యువకుల చర్యలు” గాను, “హింసాత్మక చర్యలు” గాను ప్రకటించడం ద్వారా ఆమె భారత పాలకులకు దగ్గర అయిందేమో గానీ కాశ్మీరీల నుండి మాత్రం మరింత దూరం అయింది.
కాశ్మీరీ ప్రజలు అడుగుతున్నది స్వయం నిర్ణయాధికారం; ఇండియా ఇచ్చిన వాగ్దానం. అదే ఐరాస చేసిన తీర్మానం. ఫ్లెబి సైట్ జరిపితే కాశ్మీర్ విడిపోతుంది అన్న భయం ఉన్నట్లయితే మొదట ఆర్టికల్ 370 ని దాని అసలు రూపంలో, సారంలో అమలు చేయాలి. తద్వారా కాశ్మీరీ ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలి. వారు సమానులే అన్న నమ్మకం కలిగించాలి. బలవంతంగా ఏ జాతినీ కలిపి ఉంచలేరని 69 యేళ్ళ అనుభవం చెబుతున్న నేపధ్యంలో సైనిక పాలన సమస్యను మరింతగా పెంచుతుందే తప్ప చల్లార్చదని గ్రహించాలి.
దేశంలో ఉన్న 130 కోట్లమందిని ఎలాగూ సంతృప్తి పరచలేరు(భారత పాలకులు). కనీసం ఇచ్చిన మాటప్రకారం కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిచూస్తే తెలుస్తుందికదా ఏది సరైన నిర్ణయమో!? లేని దేశభక్తి సెంటిమెంట్ ను రగల్చడందేనికి? ఇంకా సమస్యలలోకి కూరుకుపోవడం తప్ప!
Pakistan cannot bring up plebiscite issue in UN. According the agreement made in UN between India and Pak for plebiscite, Pak has to demilitarize POK. 2 yrs after that, India should demilitarize J&K. Plebiscite will be conducted by UN, 2 years after India demilitarize J&K. How can India demilitarize, before Pakistan leaves POK…?
The way you wrote article, it conveyed, atleast to me, that whatever Indian govt is doing is wrong and Pak is doing tremendous job by sending envoys across the world. I hope you have seen the joint PC of Rajnath and Mufti. Its Mufti that closed the PC, not Rajnath.
First of all, the so called innocent kid killed was a terrorist. How to understand the ppl who are protesting in favor of terrorists..? Do you want army to get beatings from them…? If they dont retart, the same guys will come on streets next day with guns that the same innocent kids stole from police stations and BSF posts after attacking them and aim them at our army.