స్కార్పిన్: లీక్ అయింది ఫ్రాన్స్ లోనే -నిర్ధారణఇప్పుడిక ఫ్రాన్స్ సాకులు చెప్పి తప్పించుకునేందుకు వీలు లేదు. “లీకేజి మా పాపం కాదు. మా చేతులు దాటినాకే సమాచారం లీక్ అయింది” అని ప్రకటించి తప్పించుకోజూచిన DCNS కంపెనీ వాదన నిజం కాదని తేలింది. లీకేజికి కారణం అయిన పత్రిక విలేఖరి “ఫ్రాన్స్ లోనే లీక్ అయింది” అని స్పష్టం చేసాడు. తనకు అందిన రహస్య పత్రాలను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అందజేయడానికి ఆ విలేఖరి సంసిద్ధత తెలిపాడు. 

DCNS కంపెనీతో ఆస్ట్రేలియా కూడా 38 బిలియన్ డాలర్ల (50 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) సబ్ మెరైన్ ఒప్పందం చేసుకున్నందున లీకేజిలో వెల్లడి అయిన పత్రాలలోని సమాచారం ఆస్ట్రేలియా కొనుగోలుకు ప్రమాదం కానున్నదా లేదా అన్న సంగతిని ఆ దెస ప్రభుత్వం తెలుసుకోనున్నది. ఆస్ట్రేలియాకు కూడా ప్రమాదమే అని తేలినట్లయితే కాంట్రాక్టు భవిష్యత్తు అనుమానంలో పడిపోతుంది. అదే జరిగితే, -‘ఎకనామిక్ వార్’ లో భాగం గానే సమాచారం లీక్ అయిందని DCNS చెప్పింది నిజమే అయితే- ప్రత్యర్థి కంపెనీ సగం సఫలం అయినట్లే. కాంట్రాక్టు  ప్రత్యర్థి కంపెనీకి దక్కితే మిగిలిన సగం సఫలం పూర్తవుతుంది.

ఇండియాకు సరఫరా చేయదలిచిన స్కార్పిన్ సబ్ మెరైన్ డిజైన్ సాంకేతిక పరిజ్ఞానం DCNS కంపెనీ వద్ద ఉండగానే లీక్ అయిందని ద హిందూ, స్క్రోల్ తదితర పత్రికలు తెలిపాయి. కంపెనీ ఉద్యోగి ఒకరు ఈ సమాచారాన్ని కంపెనీ సర్వర్ల నుండి “తీసుకున్నారని” ద ఆస్ట్రేలియా పత్రిక సిబ్బందిని ఉటంకిస్తూ  ఈ పత్రికలు తెలిపాయి. అయితే ఈ చర్యను “దొంగిలింపు” గా కాకుండా “తొలగింపు” (remove) గానే పత్రికలు పేర్కొంటున్నాయి. 

ఎలా లీక్ అయింది?

ఫ్రెంచి నౌకా దళ ఉద్యోగి ఒకరు ఉద్యోగానికి 1970లలో రాజీనామా చేసి వివిధ డిఫెన్స్ కంపెనీలకు సబ్ కాంట్రాక్టర్ గా పని చేసాడట. 30 ఏళ్ళ పాటు వివిధ కంపెనీలు మారి చివరికి DCNS కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ గా మారాడట. తన వ్యక్తిగత ఉపయోగం కోసం సర్వర్ నుండి సమాచారం కాపీ చేసాడే తప్ప మరో ఉద్దేశం ఆయనకు లేదట. అలాగని ‘వీకెండ్ ఆస్ట్రేలియన్’ చెబుతున్నది. 

స్కార్పిన్ సబ్ మెరైన్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ సమాచారం తీసుకోవడం మాత్రమే అతని ఉద్దేశం అని, తన భవిష్యత్ ఉద్యోగానికి రిఫరెన్స్ గా ఉపయోగించడం అతని లక్ష్యం అని, కానీ అతనికి తెలియకుండానే స్కార్పిన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కాపీ చేసుకున్నాడని పత్రిక చెబుతున్నది. ఈ వాదన బొత్తిగా నమ్మదగ్గదిగా లేదు.

సమాచారం లీక్ అవడానికి ఓం ప్రధమం కారణం అయిన ఫ్రెంచి పౌరుడిని/మాజీ ఫ్రెంచి నౌకాదళ ఉద్యోగిని కాపాడేందుకు లేదా సమాచారాన్ని భద్రపరచలేకపోయిన కంపెనీని దోషం నుండి బైటపడవేసేందుకు ఈ వివరణ ఉద్దేశించినట్లుగా కనిపిస్తోంది. లేకపోతె ‘రిఫరెన్స్’ సమాచారం కోసం చట్ట విరుద్ధ చర్యకు ఎవరు పాల్పడతారు? 

“ఇది విద్రోహం అవడం కంటే (రహస్య సమాచారం భద్రం చేయడంలో) సామర్ధ్య రాహిత్యం గానే చూడాలి. ‘జేమ్స్ బాండ్’ తరహా పని కంటే ‘ఆస్టిన్ పవర్స్’ తరహా పనే ఇది” అని ‘వీకెండ్ ఆస్ట్రేలియన్’ పత్రిక (ద ఆస్ట్రేలియన్ పత్రిక అనుబంధం) పేర్కొనడం బట్టి ఈ అనుమానం కలుగుతున్నది. ఆ పత్రిక ప్రకారం మొదటిసారిగా 2011 లో ప్యారిస్ లోని DCNS ఆఫీసు నుండి సమాచారం “తొలగించబడింది.” తన కొలీగ్ తో కలిసి సమాచారాన్ని “తొలగించిన” మాజీ ఫ్రెంచి నౌకాదళ అధికారి దానిని ఒక ఆగ్నేసియా దేశానికి పట్టుకెళ్ళాడు. 

ఈ కధనం చూడండి ఎంత ఆసక్తికరంగా ఉన్నదో?!

ఆగ్నేయ-ఆసియా దేశంలో ఈ మిత్రులు ఇద్దరు ఒక పశ్చిమ దేశ కంపెనీలో చేరారు. తాము తెచ్చిన సమాచారాన్ని ఆ కంపెనీ కంప్యూటర్ లో భద్రం చేశారు. కానీ ఆ తర్వాత మిత్రులు ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఇద్దరు విడిపోయారు. ఇద్దరినీ కంపెనీ గెంటివేసింది. ఆ ఇద్దరినీ మళ్ళీ కంపెనీ లోపలి అనుమతించలేదు. ‘సరే మమ్మల్ని లోపలికి రానివ్వకపోతే పోయారు. మేము ఒక ఫైలు కంపెనీ కంప్యూటర్ లో ఉంచాము. అది అక్కడి నుండి తీసేసి మాకు ఇచ్చేయండి’ అని అడిగారు/డు. దానికి కూడా కంపెనీ ఒప్పుకోలేదు. ఇక ఆ ఫైలు (స్కార్పిన్ సబ్ మెరైన్ పూర్తి సమాచారం) అక్కడే ఉండిపోయింది. 

ఆ తర్వాత ఆ ఫైలుని సింగపూర్ లోని తమ హెడ్ ఆఫీస్ కి ఆ కంపెనీ పంపించేసింది. హెడ్ ఆఫీసులో కంపెనీకి చెందిన ఐటి చీఫ్ సదరు ఫైల్ ని, సిడ్నీ లోని ఒక వ్యక్తి కోసం ఒక ఇంటర్నెట్ సర్వర్ లో అప్ లోడ్ చేయడానికి ప్రయత్నం చేసాడు. ఆయన ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆ ఫైల్ లో రహస్య సమాచారం ఉన్నదనీ, అది చాలా ముఖ్యమైనదని తెలియని తెలియదట. తెలియకుండానే సిడ్నీ వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేసాడు. 

అసలు లోపల ఏముందో తెలియని ఫైల్ ని సిడ్నీ వ్యక్తికి ఇవ్వడం ఎందుకు అన్న ప్రశ్న ఇక్కడ రావాలి. ఆ ప్రశ్నను ముందే ఉహించారేమో సమాధానం సిద్ధం చేశారు. ఆ సమాధానం: “ఆ సిడ్నీ ఉద్యోగి తొలగించిన ఇద్దరు ఫ్రెంచి ఉద్యోగుల స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు.” 

ఇలా ఫైల్ ని కొత్త ఉద్యోగికి ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ కంపెనీకి “ఒక ముఖ్యమైన రహస్య సమాచారాన్ని” చేరవేస్తున్నామన్న సంగతి తెలియదట. ఆ విధంగా ఏప్రిల్ 18, 2013 తేదీన స్కార్పిన్ ఫైల్ ఆ కంపెనీ సర్వర్ కి అప్ లోడ్ ఇక అక్కడ అది హ్యాకింగ్ కి అనువుగా మారింది. విదేశీ గూఢచార కంపెనీల తస్కరణకు అనుకూలంగా అందుబాటులోకి వచ్చింది. (అక్కడి నుండి తస్కరణకు గురయితే దానికి DCNS జవాబుదారీ కాదన్నమాట!) అయితే సర్వర్ లో ఉన్న ఫైల్ పెద్దది కావటం వలన ఇంటర్నెట్ లో సిడ్నీ ఉద్యోగికి పంపలేకపోయారు. ఇంటర్నెట్ కు బదులు ఒక ‘డేటా డిస్క్’ లో పెట్టి పంపారు. (‘డేటా డిస్క్’ అంటే ఏమిటో తెలియలేదు. CD లేదా DVD లేదా HDD లేదా పెన్ డ్రైవ్ అయి ఉండొచ్చు.) 

ఈ డిస్క్ ని తీసుకున్న ఉద్యోగి మామూలు వ్యక్తి కాదు. రక్షణ వ్యవహారాల్లో తల పండిన వాడు. ఆయన డిస్క్ లో ఏముందో తెలుసుకోవడానికి ఇంటికి తీసుకెళ్లి తన సొంత ఇంటి కంప్యూటర్ లో ఓపెన్ చేసాడు. తెరిచి చుస్తే ఇంకేం ఉంది! అత్యంత రహస్యమైన సమాచారం కుప్పలు తెప్పలుగా, పదుల వేల పేజీల్లో పోగుపడి దర్శనం ఇచ్చింది. తక్కువ స్ధాయి నావల్-ప్రోగ్రామింగ్ విషయంలో నోట్సు ఉంటుందని చూస్తే రహస్య సమాచారం ఆయనకు కనపడింది. “దానితో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు” అని పత్రికలు చెబుతున్నాయి. అప్పుడాయన ఆ ఫైల్ ని కట్టుదిట్టంగా ఎన్ క్రిప్ట్ చేసిన డిస్క్ మీదికి కాపీ చేసి పాత డిస్క్ ని సుత్తితో నాశనం చేసాడు. ఎన్ క్రిప్ట్ చేసిన డిస్క్ ని లాక్ & కీ లో భద్రం చేసాడు. 

అప్పటి నుండి ఆ ఫైల్, ద ఆస్ట్రేలియన్ పత్రికకు ఇచ్చేవరకు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత DCNS తో ఫ్రాన్స్ 38 బిలియన్ డాలర్ల కొనుగోళ్ళకు ఒప్పందం చేసుకోవడంతో ఆ సబ్ మెరైన్ లు తన దేశానికి క్షేమకరం కాదని ఆయన చెప్పదలిచాడు. తన వద్ద ఉన్న ఫైల్ ని పత్రికకు ఇచ్చేసాడు. ఎంత మాత్రం రహస్యం కానీ సబ్ మెరైన్ కొనుగోలు నుండి దేశాన్ని కాపాడేందుకు పూనుకున్నాడు. 

కాబట్టి లీక్ అన్నది ఫ్రాన్స్ నుండే, DCNS నుండే జరిగింది. లీక్ కు ఫ్రాన్స్ కంపెనీయే బాధ్యత వహించాలి. భారత ప్రభుత్వం లయబిలిటీ రైజ్ చేయాలి. ఆ పని ప్రభుత్వం చేయదు. కాబట్టి లయబిలిటీ డిమాండ్ చేయాలని మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేయాలి. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s