స్కార్పిన్ లీక్ పరిశోధన -ద హిందూ ఎడిట్…



మజగావ్ డాక్ లిమిటెడ్ లో ఉత్పత్తిలో ఉన్న స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన వేల పేజీల రహస్య పత్రాలు లీక్ అవడం వల్ల ఎంత మేరకు భధ్రత ప్రమాదంలో పడింది అన్న అంశాన్ని తీవ్ర దృష్టితో పరిశోధించాలి. బ్యూరోక్రాటిక్ రాజి పద్ధతుల నుండి, తమ సొంత వ్యవహారాలను సంరక్షించుకునే ధోరణుల నుండి స్వతంత్రంగా ఉండే విధంగా ఈ పరిశోధన జరగాలి. 1,500 టన్నుల సాంప్రదాయక డీజిల్-విద్యుత్ జలాంతర్గామికి చెందిన సాంకేతిక ప్రత్యేకతలు వివరాలను తెలియజెప్పే 22,400 పేజీల పత్రాలు తమ వద్ద ఉన్నాయని ద ఆస్ట్రేలియన్ పత్రిక ప్రకటించడంతో లీక్ సంగతి వెలుగులోకి వచ్చింది. సదరు జలాంతర్గాములు, గూఢచార సమాచారాన్ని ఏ ఫ్రిక్వెన్సీలలో సేకరిస్తాయి, వివిధ వేగాలలో ప్రయాణించేటప్పుడు ఎంతెంత శబ్దాన్ని వెలువరిస్తాయి.. మొ.న ముఖ్యమైన పోరాట మరియు చాటుమాటుగా ఉండగల సామర్ధ్యాల సమాచార వివరాలు లీక్ అయినా పత్రాలలో ఉన్నాయి. జలాంతర్గామి వెళ్లగల సముద్రపు లోతులు, విస్తారం, సముద్ర లోతులలో మనగల ఓరిమి సామర్ధ్యం తదితర వివరాలు కూడా పత్రాలలో ఉన్నాయి. జలాంతర్గాములను డిజైన్ చేసిన / నిర్మిస్తున్న ఫ్రెంచి కంపెనీ DCNS నుండి ఈ వివరాలు దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. ద ఆస్ట్రేలియన్ పత్రిక ప్రకారం అయస్కాంత, విద్యుదయస్కాంత మరియు ఇన్ఫరారెడ్ వివరాలు (డేటా) తో పాటుగా  సబ్మెరైన్ తాలూకు టార్పెడో ప్రయోగ వ్యవస్ధ మరియు పోరాట వ్యవస్ధల సమాచారం కూడా పత్రాలలో ఉన్నాయి. పరిశోధన పూర్తి అయ్యే వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి పూనుకోవడం మూర్ఖ సాహసం అవుతుంది. నిపుణుల విచారణతో పాటు ద్వైపాక్షిక సహకారము మరియు స్ఫూర్తితో కూడిన సంయుక్త పార్లమెంటరీ విచారణ కూడా జరిగినట్లయితే (ప్రజల/ రాజకీయ పార్టీల) ఆత్రుతలను చల్లార్చినట్లు అవుతుంది.
 
2005 లో కుదిరిన ఒప్పందం మేరకు ఫ్రాన్స్ నుండి ఇండియా కొనుగోలు చేసిన 6 జలాంతర్గాములకు సంబంధించినవే లీక్ అయిన వివరాలు. 3.75 బిలియన్ డాలర్ల ఖరీదు చేసిన ఈ కొనుగోలు అప్పట్లో ఇండియాకు శక్తివంతమైన, రహస్య జలాంతర్భాగ సామర్ధ్యం అందజేసిన అతి పెద్ద రక్షణ కొనుగోలు. వచ్చే రెండు దశాబ్దాలలో భారత దేశానికి సాంప్రదాయ జలాంతర్భాగ ఆయుధ దండులో స్కార్పిన్ జలాంతర్గాములే ప్రధాన సంపత్తిగా కొనసాగవలసి ఉన్నది. సబ్ మెరైన్ అంటేనే, సహజ  స్వభావం రీత్యా, ఒక మిలట్రీ స్వాధీనంలో ఉండే ఆయుధ సంపత్తిలో అత్యంత నిశ్శబ్దంతో కూడిన, శక్తివంతమైన అస్త్రం. వాటిలో కూడా మరింత సమర్ధవంతం అయినది SSBN , లేదా బాలిస్టిక్ అణు క్షిపణులను ప్రయోగించగల సబ్ మెరైన్. అటువంటి SSBN లలోనే దేశాలు తమ రెండవ స్ట్రైక్ సామర్ధ్యాన్ని -అణు దాడిలో ఉన్నప్పుడు అణు దాడితో సమాధానం చెప్పడం- కలిగి ఉంటాయి. చొరబాటు గూఢచార సామర్ధ్యాలతో తలపడే యుద్ధ రంగంలో సాంప్రదాయ సబ్ మెరైన్ లు వారాల తరబడి సముద్రాలలో ఉండగలవు; శత్రు దేశాల తీరాల సమీపం వరకు చొచ్చుకు వెళ్ళ గలవు; యుద్ధ నౌకల కదలికలపై శబ్దం లేకుండా కాపలా కాయ గలవు; హఠాత్తుగా దాడులు చేయగలవు. ఒక సబ్ మెరైన్ ను వెతికి గుర్తించాలన్నా, శత్రువో లేక మిత్రువో కనిపెట్టాలన్నా, కంటి దృష్టితో పాటుగా సవాళ్లతో కూడిన ఇతర సంక్లిష్ట వ్యవస్ధల కోసం వెతక వలసి ఉంటుంది. స్కార్పిన్ సబ్ మెరైన్ లకు సంబంధించి ఈ తరహా లక్షణాలు, సామర్ధ్యాలు అన్ని లీక్ అయిన పత్రాలలో ఉన్నట్లు కనిపిస్తోంది. మాములుగా అయితే ఇలాంటి సమాచారం సేకరించడానికి సంవత్సరాల తరబడి కష్ట భూయిష్టమైన, సంక్లిష్టమైన గూఢచార సేకరణ చర్యలకు పాల్పడవలసి ఉంటుంది. రక్షణ మంత్రిత్వ శాఖ, నౌకాదళ కేంద్రం నుండి వెలువడిన ఆరంభ స్పందన మరీ రక్షణాత్మకంగా ఉన్నది. లీక్ ఎక్కడి నుండి జరిగింది, అసలు తయారీదారు కంపెనీ వద్దనే లీక్ సంభవించిందా అన్న సంగతి తేల్చడానికి వారు విచారణను వేగవంతం చేయాలి. అక్కడే లీక్ జరిగితే గనక నష్టపరిహారం (లయబిలిటీ) నిర్ధారించాలి. 
 
*********

Click to enlarge


 
ద ఆస్ట్రేలియన్ పత్రిక లీక్ ఐన పత్రాలను ఇప్పుడు ప్రచురించింది గాని, అసలు లీకేజి 2010 లోనే జరిగిందని అది కూడా ఫ్రెంచ్ కంపెనీ వద్దనే జరిగిందని తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. ఆరేళ్ళ క్రితం లీక్ అయిన పత్రాలు అప్పటి నుండి చేతులు మారుతూ వఛ్చి ఇప్పుడు ద ఆస్ట్రేలియన్ చేతికి వచ్చాక పూర్తిగా వెల్లడి అయ్యాయి. కాబట్టి ఇండియా వద్దనే లీక్ జరిగిందంటూ కంపెనీ చేస్తున్న వాదన నిజం కాదు. కానీ ఆ సంగతి ఎవరు చెప్పాలి? 
 
బహుళజాతి కంపెనీల వ్యవహారాలూ, అందునా ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలు, రాజకీయ స్ధాయిలో / కేంద్ర ప్రభుత్వాల స్ధాయిలోనే జరగాలి. కానీ మన రాజకీయ నాయకులకు ఆ దమ్ములు ఉండవు. ఒక బహుళజాతి కంపెనీ వల్ల దేశానికి నష్టం వచ్చిందన్న సంగతి ఆ కంపెనీకి గాని, ఆ కంపెనీ దేశానికి గాని చెప్పడం అంటే వాణిజ్య సంబంధాలు చెడగొట్టుకోవడమే అని వారు భావిస్తారు. 
 
నిజానికి ‘వాణిజ్య సంబంధాలు చెడిపోవడం’ అన్నది పైకి చేసే వాదన. వాస్తవం ఏమిటి అంటే పశ్చిమ దేశాలు, వారి బహుళజాతి కంపెనీలతో సమాన స్ధాయి సంబంధాలు నెరపగల ధైర్యం మన నేతలకు ఉండదు. సమాన స్ధాయి ఉన్నప్పుడు అవతలి పక్షం వల్ల తప్పు జరిగినా, నష్టం వచ్చినా ఎత్తి చూపి జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరతారు. అలా కాకుండా అసమాన సంబంధంలో (ఎవరు పై చేయి అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను) ఉన్నపుడు నష్టపరిహారం / లయబిలిటీ కోరడం అటుంచి కనీసం వారి తప్పు ఎత్తి చూపడానికి కూడా సంశయిస్తారు; భయపడతారు; గమ్మున భరిస్తారు. 
 
స్కార్పిన్ జలాంతర్గాముల సమాచారం లీక్ విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. భారత నేవి గాని, కేంద్ర ప్రభుత్వం / రక్షణ మంత్రి గాని ‘నష్టం జరగలేదు’ అనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత “ముఖ్యమైన సమాచారం లీక్ కాలేదు” అంటూ నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. “కీలక మైన రహస్యాలను బ్లాక్ అవుట్ చేశారు” అని సంతృప్తి ప్రకటించారు. 
 
కానీ బ్లాక్ అవుట్ చేసింది లీక్ చేసిన వాళ్ళు కాదు. పత్రికే కొన్ని అంశాలను బ్లాక్ చేసి ప్రచురించింది. అనగా పత్రికకు బ్లాక్ అవుట్ చేయని సమాచారంతో కూడిన పత్రాలు అందుబాటులో ఉన్నాయని అర్ధం. పత్రాలు అనేక చేతులు మారుతూ ద ఆస్ట్రేలియన్ కు వచ్చాయి గనక ఈ మధ్యలో ఆ సమాచారం ఎన్నెన్ని దేశాల గూఢచారులు, కంపెనీలకు చేరింది తెలిసే అవకాశం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ పరిస్ధితుల్లో అత్యంత రహస్య ఆయుధంగా ఉండవలసిన సబ్ మెరైన్ ఆయువు పట్లన్నీ ప్రస్తుతం బహిరంగ సమాచారంగా అందుబాటులో ఉన్నది. 
 
భారత ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనతలను గమనించిన ‘ద ఆస్ట్రేలియన్’ పత్రిక మరోసారి పత్రాలను ప్రచురించింది. ఈ సారి బ్లాక్ అవుట్ చేయకుండా తమకు అందినవి అందినట్లుగా ప్రచురించింది. తద్వారా లీకేజిని నిర్లక్ష్యంగా కొట్టిపారేయడానికి వీలు లేదని ముల్లుగర్రతో పొడిచి చెప్పింది. 
 
వార్తా పత్రికలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇండియాకు టెక్నాలజీ అమ్మిన DCNS, వాస్తవ టెండరుదారు కంపెనీ కాదు. కనీసం ఆఫీసు కూడా లేని పేపర్ కంపెనీతో టెండర్ వేయించి డీల్ కొట్టేసింది. ఆ కంపెనీ నుండి సబ్ లీజ్ కు తీసుకున్నట్లుగా రికార్డుల్లో మనకు కనపడుతుంది. తద్వారా, ఏమన్నా తిరుగుడు బడితే జవాబుదారీతనం నుండి తేలికగా తప్పించుకోగల అవకాశాన్ని DCNS కల్పించుకుంది. 
 
ఈ అంశాలను భారత మాజీ నేవి అధికారులే వెల్లడి చేశారు. వారి అంచనా ప్రకారం లీకేజి వల్ల భారత సబ్ మెరైన్ బలగాల సమాచారం భారీ స్ధాయిలో కాంప్రమైజ్ అయిపోయింది. పూడ్చలేని నష్టం జరిగిపోయింది. ఇక భారత ప్రభుత్వానికి మిగిలి ఉన్నదల్లా కేవలం లయబిలిటీ కోరడమే. ఆ దమ్ము మనవాళ్లకు ఎలాగూ లేదని భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు రియాక్టర్ల లయబిలిటీ చట్టం’ ను మన పాలకులే స్వయంగా పూనుకుని నీరు గార్చిన ఉదాహరణ ద్వారా ఇప్పటికే స్పష్టం అయిపోయింది. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s