
“అబ్బే, పాకిస్తాన్ టాప్ టీం అని అన్నది నేను కాదు. నా పైన దేశ ద్రోహం పెట్టకండి దయ చేసి…”
*********
హిందుత్వ కాపలాదారుల మానక స్ధితిని ఈ కార్టూన్ సరిగ్గా వెల్లడి చేస్తున్నది.
హిందుత్వ మూకలు పాల్పడుతున్న విజిలెంటిజం ఆ మూకలతో మొదలై వారితోనే ముగిసేది కాదు. అది నేరుగా సంఘ్ పరివార్ అత్యున్నత నాయకత్వం నుండి కింది స్ధాయి కార్యకర్త వరకు ప్రవహిస్తూ వస్తోంది. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుండి హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్, రక్షణ మంత్రి పారికర్ వరకు అదే తరహా భాష, అలంకారాలు జనానికి కంఠ శోషగా, కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి.
వినిపించడమే కాదు, అమాయక పౌరుల రోజువారీ అలవాట్లను, వ్యవహారాలను, సంబంధాలను భయాందోళనతో ముంచివేస్తున్నాయి.
ఆగస్టు 15 తేదీన రక్షణ మంత్రి పాకిస్తాన్ ను నరకంగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యను ఖండిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ రమ్య “పాకిస్తాన్ నరకం కాదు, అక్కడ మన లాగే జనం నివసిస్తున్నారు” అని వ్యాఖ్యానించింది. హిందుత్వ మూకలకి అదే పెద్ద తప్పైపోయింది. ఆమెని పాక్ వెళ్లిపొమ్మని ఇంటర్నెట్ లో తిట్టి పోస్తున్నారు.
రమ్య పైన సెడిషన్ కేసు పెట్టాలని హిందుత్వ లాయర్ ఒకరు కోర్టుకు వెళ్లగా, పోలీసులు ఆమె పైన కేసు నమోదు చేశారని కొన్ని పత్రికలు చెప్పాయి. అంతకు ముందు అదే కర్ణాటకలో కాశ్మిర్ సమస్యను చర్చించడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా జరిపిన సభలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ హిందుత్వ ఏబీవీపీ ఆరోపించగానే AII పైన పోలీసులు సెడిషన్ కేసు పెట్టారని పత్రికలు నివేదించాయి. కేసు పెట్టలేదని, కేవలం విచారణ మాత్రమే చేశామని ఆ తర్వాత పోలీసులు ప్రకటించారు. ఆమ్నెస్టీ సభలో దేశ వ్యతిరేక నినాదాలు ఏవి చేయలేదని కూడా వారు ప్రకటించారు.
దేశానికి పట్టిన ఈ దయ్యం వదిలేది ఇప్పుడా అని నిస్పృహతో ప్రార్ధించుకోవటమే మిగిలిందా?