‘పాకిస్ధాన్ నరకం కాదు’ అన్నా దేశద్రోహమేనా?


 

“అసహనం ఎక్కడుంది?” అని ప్రశ్నిస్తూ  ఢిల్లీలో ఊరేగింపు నిర్వహించిన హాలీ వుడ్ నటుడు ‘అనుపమ్ ఖేర్’ ఓ సారి కర్ణాటక వఛ్చి చూడాలి. హిందుత్వ మూకలు ఏమి చేసినా అది దేశ భక్తే అనో లేదా సహన సహితమే అనో ఆయన తేల్చిపారేస్తే తప్ప, ‘అసహనం’ రుచి ఏమిటో ఆయనకు తెలుస్తుంది. 

“పాకిస్తాన్ నరకం ఏమి కాదు. అది ప్రజలు నివసించే దేశం” అని రాజకీయవేత్తగా మారిన ఒక సినిమా నటి ప్రకటించారు. “పాకిస్ధాన్ అంటే నరకంతో సమానం” అని కొద్దీ రోజుల క్రితం ఓ కేంద్ర మంత్రి చేసిన చేసిన వ్యాఖ్యానాన్ని తిరస్కరిస్తూ ఆమె ఆ మాటలు చెప్పారు. 

‘ఆమె అలా అనడం అంటే దేశ ద్రోహానికి పాల్పడటమే’ అని ఆరోపిస్తూ ఆర్.ఎస్.ఎస్ పరివారానికి చెందిన ఓ దేశ భక్తి పుంగవుడు కేసు పెట్టాడు. ఆమె ప్రకటన ద్వారా ప్రజా సమూహాల మధ్య శత్రుత్వం ప్రేరేపించారని ఆ అపర దేశ భక్తుడు తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఆయన కేసు పెట్టి పెట్టడంతోనే కోర్టు  విచారణకు తీసేసుకుంది. 

ఆ నటి పేరు రమ్య కాగా, కేసు పెట్టింది హిందుత్వ అడ్వకేట్ విట్టల్ గౌడ. మైసూరు లోని సోమవారప్పేట జె.ఎం.ఎఫ్.సి కోర్టులో ఫిర్యాదు చేసిన విట్టల్ గౌడ, “నటి / రాజకీయవేత్త రమ్య దేశాన్ని అవమానించారు” అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

“సాంప్రదాయకంగా భారత దేశానికి శత్రు దేశం అయిన పాకిస్తాన్ ను ప్రశంసించడం ద్వారా ఆమె భారత ప్రజలను తగవులకు రెచ్చగొట్టారు” అని ఆరోపిస్తూ. ఆయన సి.ఆర్.పి.సి సెక్షన్ 200 కింద ఫిర్యాదు స్వీకరించాలని కోరాడు. అలాగే ఐ.పి.సి సెక్షన్ 124A కింద మరో కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేసాడు.

గత ఒకటిన్నర నెలలుగా కాశ్మిర్ రాష్ట్రం అలజడి, ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కాశ్మిర్ ప్రజలు ఎంతగానో ఆరాధించే బుర్హాన్ వాని భారత భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన దగ్గరి నుండి అక్కడి ప్రజలకు శాంతి కరువయింది. వారి ఎడతెగని ఆందోళనల వాళ్ళ జమ్మూ & కాశ్మిర్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా శాంతి లేకుండా పోయింది. 

కాశ్మీర్ ప్రజల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వలెనె తిరిగి క్రూర పద్ధతుల్లో అణచివేయడానికే పూనుకుంది. పెల్లెట్ గన్  లను ప్రయోగిస్తూ  కాశ్మిర్ యువతి, యువకులను కురూపులుగా మార్చుతొంది. పెల్లెట్ గన్ల వల్ల డజన్ల కొద్దీ బాల బాలికలు, యువతీ యువకులు కంటి చూపు పోగొట్టుకున్నారు.

భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆరోపిస్తున్నట్లుగా వారందరూ ఆందోళనల్లో పాల్గొంటున్నవారు ఏమి కాదు. ఇంట్లో, వంట గదుల్లో, తాత్కాలిక స్కూళ్లలో, ఆట స్ధలాల్లో… తమ పనులు తాము చూసుకుంటున్న వాళ్ళే ఎక్కువగా పెలెట్ గన్ ల కాల్పులకు బలైపోయారు. 

పరిస్ధితులు ఈ విధంగా కొనసాగుతున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు  వ్యవహరిస్తోంది. యు.పి.ఏ హయాంలో ఇదే తరహా పరిస్ధితులు నెలకొన్నప్పుడు ఇప్పటి ప్రధాన మంత్రి పలు రకాలుగా కేంద్రాన్ని అపహాస్యం చేశారు. తాము అధికారంలోకి వస్తే చిటికెలో కాశ్మిర్ సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నట్లుగా ప్రకటనలు చేశారు. బీజేపీకి అధికారము వచ్చింది, మోడీ ప్రధాన మంత్రి కూడా అయ్యారు. గొంగళి మాత్రం అక్కడే ఉన్నది. 

ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి, రక్షణ మంత్రి మున్నగు బాధ్యతాయుత నేతలకు నెపాన్ని పాకిస్ధాన్ మీదికి నెట్టివేయడం తేలికగా కనిపించింది. పాకిస్ధాయిన్ ప్రేరణ తోనే కాశ్మిర్ ప్రజల ఆందోళనలు చేస్తున్నారంటూ కుంటి సాకులు చెబుతొంది. బుర్హాన్ వాని మరణాన్ని త్యాగంగా, అమరత్వంగా కాశ్మిర్ ప్రజల భావిస్తున్న విషయం అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నా, దాన్ని చూసేందుకు గుడ్డిగా నిరాకరిస్తున్నారు. 

ఆగస్టు 15 తేదిన హర్యానా లోని రెవారి లో జరిగిన తిరంగా యాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తూ  రక్షణ మంత్రి మనోహర్ పరికర్ మరో అడుగు ముందుకు వేశారు. జనాన్ని రెచ్చగొట్టడానికి, ఎంత అర్ధ రహితంగా, ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఫర్వాలేదన్నది బీజేపీ మంత్రుల నమ్మకం కావచ్చుఁ. 

 

“నిన్న మన సైనికులు 5 గురు టెర్రరిస్టులను వెనక్కి తిప్పి పంపేశారు. పాకిస్ధాన్ కి వెళ్లడం అంటే నరకానికి వెళ్లడంతో సమానం” అని ఆయన ఆ సభలో అన్నారు. టెర్రరిస్టులను వెనక్కి తిప్పి పంపడం అంటే వాళ్ళను చంపేశారు అని మంత్రిగారి అర్ధం. 

ఎటొచ్చి చనిపోయిన టెర్రరిస్టులను వెనక్కి పంపేసాం అనడంలో మంత్రి గారి ఉద్దేశ్యం ఏమిటన్నదే అస్పష్టంగా ఉన్నది. ఆయన చెప్పదలుచుకున్నది సైనికుల కాల్పుల్లో చనిపోయిన టెర్రరిస్టులు నేరుగా నరకానికి వెళ్ళారనా లేక పాకిస్తాన్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు చఛ్చి నరకానికి వెళ్ళడానికే అర్హులు అనా? ఆయన మాటలకు సరైన అర్ధం ఏమిటన్నది తెలియకపోయినా పాకిస్ధాన్ ని నరకంలో పోల్చడం మాత్రం స్పష్టమే. 

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ పరోక్షంగా ఖండించారు. ఆగస్టు 16-18 తేదిల్లో సార్క్ దేశాల యువ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొని తిరిగి వచ్చాక ఆమె “పాకిస్ధాన్ నరకం ఏమి కాదు. సరిహద్దు మన దేశాలను వేరు చేస్తున్నంత మాత్రాన  ఒక దేశాన్ని నరకంగా చెప్పడం సరైనది కాదు” అని ఆమె విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. 

ఆమె వ్యాఖ్యలపై యధా ప్రకారంగా హిందుత్వ గణాలు సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో కారు కూతలు కురిపించారు. వాటిల్లో అత్యంత మర్యాదగా కనిపించిన కూత ఏమిటి అంటే “పాకిస్తాన్ వెళ్లిపో!” అన్నది ఒక్కటే. భారతీయ సంస్కృతీ గురించి ఒకటే గొంతులు చించుకుని ఈ దురహంకారులకి కనీసం తమ తోటి మనిషిని, అందునా స్త్రీని గౌరవించడం మాత్రం తెలియదు. వాళ్ళ అభిప్రాయాలకు ప్రజాస్వామిక పద్ధతుల ప్రకారం సహించడం ఆ తర్వాత సంగతి!

ఫిర్యాదు నమోదు అయ్యాక కూడా రమ్య వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పేది లేదు పొమ్మన్నారు. క్షమాపణ నిరాకరణకు తన అహంకారం కారణం కాదని ఆమె వివరించారు. “నాకు అహంకారం ఉన్నందు వల్లనో లేక మారె కారణం తోనో క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడం కాదిది. ఏమన్నా తప్పు చేసినట్లయితే అపాలజీ చెప్పడానికి నేను సర్వదా సిద్ధం. కానీ నేను అన్నదానిలో ఏమి తప్పు ఉందని క్షమాపణ చెప్పడానికి?”  అని ఆమె ప్రశ్నించారు.  

తన వ్యాఖ్యలపై రేగిన అనవసర రాద్దాంతానికి ఆమె పత్రికలను, రాజకీయ నాయకులను తప్పు పట్టారు. కొన్ని ముఖ్యమైన, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. “రాజకీయ నాయకులు, మీడియా ఇరువురు ఇలాంటి వాతావారణం ఏర్పడడానికి కారకులు. కన్నడ చానెళ్లను ఒకసారి చూడండి. వాళ్ళు ‘పాకిస్తాన్-అనుకూల’, ‘పాకిస్తాన్ కోసం బ్యాటింగ్ చేసిన రమ్య’ అని సంబోధిస్తున్నాయి. వాళ్ళు మంటల్ని మరింత ఎగదోస్తున్నారు” అని రమ్య పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేయడం తగదని ఆమె నిరసించారు. “ఇది స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం కదా! శాంతి, సహాభివృద్ధిలపై మాట్లాడటం మన విధి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను కత్తిరించడమే అసలు తప్పు. రాజకీయ నాయకులు ప్రజల్ని విడ దీసి విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. సరిహద్దులు మనల్ని విడదీస్తున్నంత మాత్రాన ఇతరులను ద్వేషించడం తగదు” అని రమ్య తన నిరసనను, అభిప్రాయాలను విశదీకరించారు.  

కాస్త బుర్ర, అందులో కాసింత బుద్ధి ఉన్న ఎవరికైనా రమ్య చెప్పే మాటలు అర్ధం అవుతాయి. అసలు పొరుగు దేశాన్ని సాంప్రదాయక శత్రు దేశంగా నిర్ధారించడం బట్టే దేశం పట్లా, ప్రజల పట్లా వీరికి ఎంత ఇరుకైన భావనలు ఉన్నాయో తెలుస్తున్నది. కనీసం ఇరుకైన భావనలు ఉన్నాయా అన్నది కూడా అనుమానమే నిజానికి. 

పాకిస్ధాన్ నిన్న మొన్నటి వరకు మన దేశంలో భాగమే అన్నా సంగతి వీళ్లకు తెలియదనా అంటే అదేమీ కాదు. అసలు భారత దేశం అన్నా భూ ఖండమే మన భూగ్రహంపై ఉనికిలో వచ్చింది తెల్లవాళ్ళ వల్లనే అని అంతకు ముందు ‘భారత్’ లేదా ‘ఇండియా’ అన్నా పేరుతొ అవిచ్చిన్న భూ ఖండం లేదని ఈ దేశ భక్తులకు ఎవరు చెప్పాలి? 

పాకిస్తాన్ నిజంగా శత్రు దేశమే అయినట్లయితే బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పా పెట్టకుండా, అధికారులకు తెలియకుండా ఉన్నఫలాన రూటు మార్చుకుని పాకిస్ధాయిన్ లో ఎందుకు దిగినట్లు? అప్పుడు శత్రు దేశం కాని పాకిస్ధాన్, రమ్య వెళ్లి వచ్చ్చాక హఠాత్తుగా శత్రు దేశం ఎలా అయింది? 

“అసహనం ఏది, ఎక్కడ?” అంటూ ఢిల్లీ వీధుల్లో వెతికిన అనుపమ్ ఖేర్ తెలుసుకోవలసింది ఏమిటంటే భారత మాత అంటూ నాలుగు చేతులు, చేతులకు ఆయుధాలు, తల చుట్టూ  మెరుపులు పెట్టి  బొమ్మ గీసి చూసుకున్నట్లుగా కనిపించేది కాదు. అసహనం అన్నది నరేంద్ర దభోల్కర్ – గోవింద్ పన్సారే – ఎం ఎం ఖల్బుర్గి మున్నగు ప్రముఖుల హత్యలతో పాటు మహమ్మద్ అఖ్లక్ లాంటి సామాన్య ముస్లింను భీభత్సంగా హత్య చేయటంలో కనిపిస్తుంది. హత్య చేసాక హతుడి కుటుంబం పైనే ఎదురు కేసులు పెట్టడంలో ఉన్నది. 

సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనానికి ప్రతీకారంగా మొత్తం ముస్లిం ప్రజానీకాన్ని మారణకాండలకు గురి చేయడంలో ఉన్నది. ‘చర్యకు ప్రతి చర్య’ అంటూ శాస్త్ర సూత్రాన్ని సామాజిక అణచివేతలకు అనువదించడంలో ఉన్నది. యూనివర్సిటీలో చదువు కుంటున్న దళిత విద్యార్థులను ఆధునిక సంఘ బహిష్కరణకు గురి చేసి ఆత్మహత్యలకు పురిగొల్పడంలో ఉన్నది. 

దళిత విద్యార్థుల సాంస్కృతిక జీవనాన్ని, చింతనలను భ్రష్ట మనస్తత్వంగా ఛీత్కరించడంలో ఉన్నది. వామ పక్ష సిద్దాంతాలను నమ్మినందుకు JNU యూనివర్సిటీ మొత్తాన్ని ‘జాతీయ వ్యతిరేక శక్తులకు, దేశ ద్రోహులకు నిలయంగా మారిందని ప్రకటించడంలో ఉన్నది. ఇప్పుడు ‘మనలాంటి మనుషులతో నిండి ఉన్న పొరుగు దేశాన్ని’ నరకంగా పోల్చడాన్ని తప్పు పట్టిన రమ్యను ప్రజల మధ్య చిచ్చు పెట్టె వ్యక్తిగా చిత్రీకరించి తప్పుడు కేసులు పెట్టడంలో స్పష్టంగా అగుపిస్తోంది. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s