గులెన్ ని త్వరగా పంపండి! -అమెరికాతో టర్కీ


GULEN

టర్కీలో సైనికుల తిరుగుబాటుకు కుట్ర చేసిన ఫెతుల్లా గులెన్ ను టర్కీకి ‘అప్పగించే’ పనిని త్వరితం చేయాలని టర్కీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అమెరికాలో శరణు పొందుతున్న గులెన్ అప్పగింతకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయాలని, టర్కీ-అమెరికాలు చేసుకున్న ‘నేరస్ధుల అప్పగింత’ ఒప్పందాన్ని అమెరికా గౌరవించాలని టర్కీ ప్రధాని బినాలి యెల్దిరిమ్ ఈ రోజు (శనివారం, ఆగస్టు 20) డిమాండ్ చేశాడు.

టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో విదేశీ మీడియా విలేఖరులతో మాట్లాడుతూ టర్కీ ప్రధాని ఈ డిమాండ్ చేశాడు. మరి కొద్ది రోజుల్లో అమెరికా అధికారులు టర్కీ సందర్శించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో-బిడెన్ కూడా మంతనాలు జరిపేందుకు టర్కీ రానున్నాడు. వారి రాకకు మునుపే టర్కీ ప్రధాని ఈ తరహా డిమాండ్ చేయడం బట్టి, తమ పట్టు విడిచేది లేదన్న గట్టి సందేశాన్ని టర్కీ పంపదలిచినట్లు కనిపిస్తోంది.

“అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నాం. ఈ వ్యక్తి కుట్రకు నాయకుడు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నట్లు? ఈ ఉగ్రవాద సంస్ధ దాని నాయకుడు భాగస్వామ్యం వహించిన సంఘటనలకు సంబంధించి అన్ని రకాల సమాచారమూ అమెరికా వద్ద ఉన్నది. మేము కోరేది ఏమిటంటే ఆయన్ను తాత్కాలికంగా నిర్బంధం లోకి తీసుకోండి. ఆ తర్వాత వెనక్కి -టర్కీకి- పంపించెయ్యండి” అని విదేశీ విలేఖరులతో మాట్లాడుతూ యెల్దిరిన్ అన్నాడు.

అమెరికా అధికారులు, ఉపాధ్యక్షుడు టర్కీ రావడానికి కారణం గులెన్ విషయాన్ని చర్చించడమే అని పత్రికలు వెల్లడి చేశాయి. గులెన్ అప్పగింతకు అవసరమైన పత్రాలను, ఫైళ్లను, సాక్షాలను కుట్రకు ముందూ, తర్వాతా కూడా పంపామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ప్రధాని యెల్దిరిమ్ లు ఇప్పటికే అనేకసార్లు తెలిపారు.

“కుట్రకు ముందు గులెన్ కార్యకలాపాలపై 84 ఫైళ్ళు అమెరికాకు ఇచ్చాము. కుట్ర తర్వాత 4 ఫైళ్ళు పంపించాము” అని ఈ రోజు కూడా యెల్దిరిమ్ తెలిపాడు. సాక్షాలు పంపినా గులెన్ ను అప్పగించడానికి “ఇంకా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు?” అని అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఇరువురూ ఘాటుగా ప్రశ్నించారు.

“టర్కీ పంపిన పత్రాలను పరిశీలిస్తున్నాం” అంటూ బింకంగా ప్రకటించిన అమెరికా, అంతర్గతంగా టర్కీ ప్రకటనలతో ఆందోళన చెందుతోంది. సైనిక కుట్ర విఫలమైన అనంతరం టర్కీ నిర్ణయాత్మకంగా రష్యా వైపు అడుగులు వేయడం ఆ ఆందోళనకు కారణం. టర్కీ ప్రధాని, అధ్యక్షులు పైకి అలా ‘డిమాండింగ్’ స్వరంతో మాట్లాడుతున్నప్పటికీ వారు ప్రైవేటుగా “అమెరికాతో సంబంధాలకు ఎటువంటి ఢోకా లేదు” అని చెబుతున్నట్లుగా అమెరికా వార్తా సంస్ధలు చెబుతున్నాయి.

అయితే ఇన్సిర్లిక్ లోని అమెరికా సైనిక స్ధావరాన్ని ఇప్పటికీ టర్కీ పోలీసు బలగాలు చుట్టుముట్టి ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం అదనపు బలగాలు పంపించారు కూడా. దానితో పాటు స్ధావరానికి విద్యుత్ సరఫరాను ఇంకా పునరుద్ధరించలేదు. ఈ అంశాలు అమెరికా పత్రికల వార్తల విశ్వసనీయతను అనుమానంలో పడవేస్తున్నది. అవసరం అయితే అత్యంత ఘోరమైన కట్టుకధలను కూడా అతి మామూలుగా ప్రచురించటంలో అందె వేసినందున పశ్చిమ పత్రికలు చెబుతున్నది అవాస్తవం కావటానికే ఎక్కువ అవకాశం ఉన్నది.

బినాలి యెల్దిరిమ్ కు ముందు అహ్మద్ దవుతోగ్లు టర్కీ ప్రధానిగా పని చేశారు. దవుతోగ్లుకు ముందు ఎర్దోగన్ ప్రధానిగా పని చేయగా దవుతోగ్లు ఆయనకు నమ్మకమైన లెఫ్టినెంట్ గా ఉండేవారు. అప్పటికీ ప్రభుత్వ అధికారాలు ప్రధాన మంత్రి చేతుల్లో ఉండేవి. అయితే టర్కీ రాజ్యాంగం రెండుసార్లకు మించి ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించదు. దానితో ఎర్డోగన్ అధ్యక్ష పదవి చేపట్టి దవుతోగ్లుకు ప్రధాన మంత్రి పదవి అప్పగించారు.

అప్పటి నుండి ఎర్డోగన్ టర్కీ రాజ్యాంగాన్ని భారీ ఎత్తున సవరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రధాన మంత్రి కేంద్రక ప్రజాస్వామ్య వ్యవస్ధను అధ్యక్ష ప్రజాస్వామ్యంగా మార్చే పని మొదలు పెట్టాడు. ఇది దవుతోగ్లుకు రుచించలేదు. తన అధికారాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఎర్దోగన్ తీవ్రంగా వ్యతిరేకించే కుర్డులతో చర్చలు ప్రారంభించాడు. దానితో ప్రధాన మంత్రి అధికారాలు నానాటికీ కత్తిరిస్తూ, దవుతోగ్లు రాజీనామా చేయక తప్పని పరిస్ధితి కల్పించాడు ఎర్దోగన్. ఆ విధంగా అధికార పోటీ తప్పించిన ఎర్దోగన్ అధ్యక్ష ప్రజాస్వామ్యంగా మార్చే పనిని వేగవంతం చేశాడు. ఈ క్రమంలో సైనిక కుట్ర చోటు చేసుకుంది. “సైనిక కుట్ర దేవుడు ఇచ్చిన వరం” అని ఎర్డోగన్ చేసిన ప్రకటనకు నేపధ్యం ఇదే కావచ్చు.

దవుతోగ్లు రాజకీయాలకు ఉన్న మరో పార్శ్వం సిరియాలోని ఇసిస్ టెర్రరిస్టులకు సంపూర్ణ మద్దతు ఇవ్వటం. ఇసిస్ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన కృషి చేసింది దవుతోగ్లుయే అని ఒక సమాచారం. సిరియాలో ఇసిస్ టెర్రరిస్టులు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా విధానం ఇక లాభకరం కాదని ఎర్డోగన్ భావించి రష్యాకు దగ్గర అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టాడని, అందుకే ఆయనను కూలదోసేందుకు అమెరికా, గులేన్ అనుచర వర్గం ద్వారా సైనిక కుట్ర జరిపించిందని ఇటీవలి వార్తలు తెలియజేస్తున్నాయి.

Strategically placed Turkey

Strategically placed Turkey

అయితే సైనిక కుట్ర ఘోరంగా విఫలం కావటంతో అమెరికా తత్తరపాటుకు గురయింది. కుట్ర ఆరంభ సమయంలో కొన్ని అమెరికా పత్రికలు, ఛానెళ్లు కుట్ర పూర్తయినట్లే భావిస్తూ ఆ మేరకు వార్తలు ప్రసారం చేశాయి. ఎర్దోగన్ జర్మనీలో ఆశ్రయం కోరినట్లు, అందుకు జర్మనీ అంగీకరించినట్లు కూడా వార్తలు ప్రసారం చేశాయి. కానీ కుట్రను ఎదుర్కోవాలని, వీధుల్లోకి వచ్చి కుట్రదారులను నిర్మూలించాలని పిలుపు ఇస్తూ ఎర్దోగన్ టి.విలో ప్రత్యక్షం కావటంతో కుట్ర వైఫల్యాన్ని గుర్తించిన అమెరికా అధికారులు స్వరం మార్చారని ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే మద్దతు’ అని మాట మార్చారని వార్తలు చెబుతున్నాయి.

నాటో సభ్య దేశమైన టర్కీని మిత్రదేశంగా కోల్పోయేందుకు అమెరికా సిద్ధంగా లేదు. ఐరోపా, ఆసియాల మధ్య, మధ్య ప్రాచ్యంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న టర్కీని కోల్పోతే భౌగోళిక రాజకీయాల ఆధిపత్య క్రీడలో అమెరికా బాగా నష్టపోతుంది. అలాగని తమ అసెట్ అయిన గులెన్ ను టర్కీకి అప్పగిచ్చేంత పిచ్చిపనికి పాల్పడదు. అలా చేస్తే ఇతర దేశాల్లో అమెరికా తరపున కుట్రలకు పాల్పడేందుకు దళారీలు ముందుకు రారు. గులెన్ కు పట్టిన గతే తమకూ పట్టవచ్చని వెనకంజ వేస్తారు.

ఈ నేపధ్యంలో అమెరికా టర్కీతో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాతో టర్కీ స్నేహం ముదిరిపోక ముందే సంబంధాలు మెరుగుపరుచుకునే లక్ష్యంతో, ‘సంప్రదింపులకు అధికారులను పంపుతున్న’ట్లు హుటా హుటిన సమాచారం ఇచ్చింది. న్యాయ శాఖ, విదేశాంగ అధికారులను టర్కీకి పంపుతోంది. చర్చలు జరిపేందుకు ఉపాధ్యక్షుడు జో బిడెన్ ను కూడా పంపుతోంది.

వాస్తవానికి ఇక్కడ అవసరం టర్కీదే. కాబట్టి టర్కీయే పత్రాలు, సాక్షాలు పట్టుకుని అమెరికా చుట్టూ తిరగాలి. అందుకు విరుద్ధంగా అమెరికాయే అధికారులను, ఉపాధ్యక్షుడిని పంపటం బట్టి ఎర్డోగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు అమెరికా పడుతున్న తాపత్రయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకే టర్కీ ప్రధాని, అధ్యక్షుడు ఇద్దరూ అమెరికాను దాదాపు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ప్రకటనలు చేయగలుగుతున్నారు. ఇటువంటి పరిస్ధితిలో అమెరికా ఉండడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. కూలిపోతున్న అమెరికా ప్రభకు ఇది ఒక తార్కాణం. కాగా అమెరికా ఎత్తులకు లొంగినట్లయితే భవిష్యత్తులో ఎర్దోగన్ ను కోలుకోకుండా దెబ్బకొట్టకుండా ఊరుకోదు. ఈ విషయాన్ని గుర్తెరిగి మసలుకోవడమే ఎర్దోగన్ కు శ్రేయస్కరం.

One thought on “గులెన్ ని త్వరగా పంపండి! -అమెరికాతో టర్కీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s