ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గరి నుండి 2016 సంవత్సరం లోని జులై నెల అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించిందని అమెరికా ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు నమోదు చేయడం 137 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని, ఇన్నేళ్లలో ఈ యేటి జులైలో ప్రపంచ వ్యాపితంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వారు తెలిపారు.
యే సంవత్సరం తీసుకున్నా, జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు కావడం రివాజు అని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం. ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం జూన్, జులై, ఆగస్టు నెలల్లో వస్తుంది. దక్షిణార్ధ గోళంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వేసవి కాలం వస్తుందని శాస్త్రవేత్తల లెక్క.
అయితే ఇండియాలో ఈ లెక్క తప్పుతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వేసవి కాలం ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలను వేసవి కాలంగా పరిగణిస్తారు. వాయవ్య భారతంలో మాత్రం ఏప్రిల్ నుండి జులై వరకూ వేసవి కాలమే. పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అధిక వేడిమి నెల అయితే, ఉత్తర భారతంలో మే అధిక వేడి ఉంటుంది.
[రోహిణి కార్తె అత్యంత వేడి దినాలుగా మనవాళ్లు చెబుతారు. మే 25 నుండి జూన్ 8 వరకు ఉండే దినాలను రోహిణి కార్తెగా మన వాళ్ళు పిలుస్తారు. “రోహిణి ఎండకు రోళ్ళు పగుల్తాయి”; “రోహిణిలో విత్తనం రోళ్ళు నిండని పంట” మొ.న సామెతలు మన వాళ్ళు నమోదు చేసిన రికార్డులుగా భావించవచ్చు.]
అమెరికా వాతావరణ సంస్ధ -నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఏఏ)- నిర్వహించిన పరిశీలనలో జులై నెల సంగతి వెల్లడి అయింది. 1880 నుండి నమోదు చేసిన రికార్డులను మదింపు వేసిన అనంతరం 2016 జులై నెల అత్యంత వేడి నమోదు చేసిన నెలగా తెలిసిందని వారు చెప్పారు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఇదే అంచనాకు రావడం గమనార్హం.
గత నెల వరకూ చూస్తే 2015 జులై నెల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించిందని, 2016 జులై నెల ఆ రికార్డును తుడిచి వేసిందని ఎన్‌ఓఏఏ శాస్త్రవేత్తలు తెలిపారు. “20వ శతాబ్దం వ్యాపితంగా నమోదైన ఉష్ణోగ్రతల సగటు కంటే జులై 2016 నెలలో 1.57 F0 అధిక ఉష్ణోగ్రత రికార్డు అయిందని వారు తెలిపారు. ఇది 0.87 C0 సెల్సియస్ డిగ్రీలకు సమానం.
గత యేడాది (2015) జులై నెలలో 20వ శతాబ్దం సగటు కంటే 0.11 సెల్సియస్ డిగ్రీలు అధికంగా నమోదయింది. ఈ తేడాలను బట్టి ఈ యేడాది జులై నెల వేడిమి తీవ్రతను అంచనా వేయవచ్చు.
అమెరికా శాస్త్రవేత్తలు ఈ రికార్డు వేడిమికి రెండు కారణాలు చెప్పారు. ఒకటి: వాతావరణం వేడెక్కడం; రెండు: ఎల్ నినో. వాతావరణం వేడెక్కడానికి కూడా వాళ్ళే కారణాలు చెప్పారు. శిలీంద్రాల వనరులను మండించడం వల్ల వాతావరణం వేడెక్కుతోందని వారు తేల్చేశారు. బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం మొ.న ఇంధనాల వాడకం వల్ల వాతావరణం భరించరానిదిగా మారిపోతోందని వారి సూచన.
ఎన్‌ఓఏఏ శాస్త్రవేత్తల ప్రకారం: జులై నెలతో ఎల్-నినో ప్రభావం ముగిసిపోయింది. ఈసారి ఎల్-నినో వరుసగా 15 నెలల పాటు -మే 2015 నుండి జులై 2016 వరకూ- ఏకధాటిగా కొనసాగింది. ఇదీ ఒక రికార్డే. మే 2015 నుండి జులై 2016 వరకూ ఏ నెలకా నెల ఉషోగ్రతలు అంతకంతకూ ఎక్కువగా నమోదు అవుతూ వచ్చాయి. 137 సం.ల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
ప్రపంచ వ్యాపితంగా ఇదే ధోరణిలో వేడిమి నమోదయిందిట. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల్లో, దక్షిణాసియా (మనమే), న్యూజిలాండ్, స్పెయిన్, హాంగ్ కాంగ్ లలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇక గల్ఫ్ ప్రాంతంలో (వాయవ్య భారతానికి ఇది సమీపం) అయితే చెప్పనవసరం లేదు. కువైట్ లో ఈ జులైలో పలుచోట్ల 113 F (45 C) డిగ్రీలకు పైనే వేడి నమోదయింది.
“జులై 2016 నెలలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది కువైట్ లోని మిత్రిబా. జులై 22 తేదీన అక్కడ 126.5 F (52.5 C) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బహ్రైన్ లో ఈ జులైలో సగటున 96.8 F ఉష్ణోగ్రత నమోదయింది. 1902 నుండి ఇప్పటి వరకూ ఇదే అత్యధికం” అని ఎన్‌ఓఏఏ శాస్త్రవేత్తల నివేదిక తెలిపింది.
భూగోళంలో ఒక చోట ఎల్-నినో వాతావరణం నెలకొని ఉండగానే మరో చోట లా-నినా (ఎల్-నినో కు వ్యతిరేకం) పరిస్ధితులు నెలకొంటాయి. ఈ యేడు జులై లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ నమోదయిన ప్రాంతాలు: వాయవ్య అమెరికా, తూర్పు కెనడా, దక్షిణ దక్షిణమెరికా, నైరుతి ఆస్ట్రేలియా, ఉత్తర మధ్య రష్యా, కజక్ స్ధాన్, ఇండియా(?).
ఎల్-నినో కాలం ముగిసిన తర్వాతనే అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు బద్దలు అయిందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయిన జులై 2016లో ఎల్-నినో గానీ, లా-నినా గానీ ఉనికిలో లేవని వారు చెప్పారు. ఎల్-నినో ముగిసినా ఎండలు మండుతూనే ఉంటాయని చెప్పారు.
అనగా ఒక పక్క అధిక ఉష్ణోగ్రతలకు ఎల్-నినో కారణం అని చెబుతూనే, మరో పక్క ఆ కారణాన్ని పూర్వపక్షం చేస్తున్నారు. వెరసి శిలీంద్ర ఇంధనాల వాడకమే ఈ పరిస్ధితికి కారణం అని అంతిమంగా తేల్చేస్తున్నారు. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం.
అత్యధిక ఉష్ణోగ్రతలకు ఎల్-నినో కారణం అని మొదలు పెట్టి, శిలీంద్ర ఇంధనాల వాడకం కారణాన్ని జత చేర్చి, చివరికి వచ్చేసరికి ఎల్-నినో కారణాన్ని ఇతర మాటల్లో తప్పించేశారు. ‘శిలీంద్ర ఇంధనాల వాడకాన్ని’ ఏకైక కారణంగా నిలిపారు. ఎందుకిలా?
శిలీంద్ర ఇంధనాల లోనే అసలు కిటుకు దాగి ఉన్నది. ప్రపంచ వ్యాపితంగా బొగ్గు, సహజవాయువు ఇంధనాల వాడకాన్ని తగ్గించేయడం పశ్చిమ దేశాల వాణిజ్య ప్రయోజనాలను నెరవేర్చుతుంది. సాంప్రదాయ ఇంధనం అయిన ధర్మల్ విద్యుత్ పరిశ్రమల పరిజ్ఞానాన్ని మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చేసుకున్నాయి. కనుక ధర్మల్ టెక్నాలజీ అమ్మకం జరగదు.
కానీ రెన్యుబుల్ ఎనర్జీ వనరులైన సూర్య రశ్మి (సోలార్), పవన విద్యుత్ (గాలి) ఉత్పత్తుల రంగంలో ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలు టెక్నాలజీ అభివృద్ధి కాలేదు. మరోవైపు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర పశ్చిమ దేశాలు సోలాన్, విండ్ టెక్నాలజీలో అత్యున్నత స్ధాయి అభివృద్ధి సాధించాయి. జర్మనీలో 50% విద్యుత్ అవసరాలు సోలార్ విద్యుత్ తీర్చుతోంది. ఫ్రాన్స్ లో గణనీయ మొత్తం అణు విద్యుత్ తీర్చుతోంది. ఇప్పుడు వారికి సోలార్, విండ్, న్యూక్లియర్ విద్యుత్ టెక్నాలజీకి కొనుగోలుదారులు కావాలి.
కానీ మూడో ప్రపంచ దేశాలేమో బొగ్గు, గ్యాస్ లతో విద్యుత్ కంపెనీలు నిర్మించుకుని ఎంచక్కా విద్యుత్ సౌకర్యం పొందుతున్నాయి. ఈ దేశాలు బొగ్గు వాడుకుంటే (బొగ్గు నిల్వలు వారి వద్ద ఎన్ని ఉన్నా సరే) పశ్చిమ దేశాల టెక్నాలజీని ఎవరు కొంటారు? (టెక్నాలజీ అంటే ఇక్కడ పరిజ్ఞానం కాదు, పరికరాలు మాత్రమే. ఎందుకంటే టెక్నాలజీ ఇచ్చేస్తే పరికరాలు కొనేవాళ్ళు ఉండరు.)
కాబట్టి ముందు బొగ్గు పనికిరానిదిగా తేల్చేయ్యాలి. బొగ్గు, పెట్రోలియం వల్ల మహా ప్రమాదం ముంచుకొస్తోందని జనం నమ్మాలి. జనమే పూనుకుని బొగ్గు కేంద్రాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలి. సోలార్, పవన్ విద్యుత్ తెండి అని ఆందోళనలు చెయ్యాలి. అప్పుడిక పశ్చిమ టెక్నాలజీ అమ్ముకోవడం తేలిక అవుతుంది.
ఐరోపా పారిశ్రామిక విప్లవ కాలం నుండి ఇప్పటి వరకు బొగ్గు మండించి భారీ పరిశ్రమలు నడిపింది పశ్చిమ దేశాలే. పరిశ్రమలతో పాటు భారీ ఎత్తున ఆటో మోటివ్ పరిశ్రమ నెలకొల్పి లాభాలు సంపాదించింది వాళ్ళే. ఆటో మోటివ్ వాహనాలలో పెట్రోలియం ఇంధనాలను మండించి వాతావరణం కలుషితం కావడానికి కారకులు వాళ్ళే.
మూడో ప్రపంచ దేశాలు ఇన్నాళ్లూ ఈ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ మధ్య కాలంలో కొద్దో గొప్పో శక్తులు కూడదీసుకుని తమ సొంత సాంప్రదాయ ఇంధన వనరులను వినియోగిస్తూ కుంటి నడకతో నైనా అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాయి. కానీ పశ్చిమ దేశాలు సాగించిన ‘వాతావరణ కాలుష్యం’ వల్ల మూడో ప్రపంచ దేశాలు తమ అభివృద్ధినే మూల్యంగా చెల్లించుకోవాలని డిమాండ్ చేయడం, ప్రచారం చేయడం ఎంత అన్యాయం?
ఎవరిది తప్పైనా వాతావరణ కాలుష్యం పెరగకుండా ఇప్పుడన్నా జాగ్రత్త వహించాలి కదా? తప్పొప్పులు ఎంచుతూ కూర్చుంటే ఈ లోపు భూమి వేడెక్కిపోతుంది కదా? ఆ తర్వాత అసలుకే మోసం కదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి.
కాలుష్య నివారణే లక్ష్యం అయితే పశ్చిమ దేశాలు అణు విద్యుత్ ని కూడా వ్యతిరేకించాలి. దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. అణు విద్యుత్ కలిగించే కాలుష్యం మరే ఇతర ఇంధనమూ కలిగించదని చెర్నోబిల్, ఫుకుషిమా అణు ప్రమాదాలు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. అణు విద్యుత్ ప్రమాదాల గురించి ప్రచారం చెయ్యడానికి బదులు అదే అత్యంత శుభ్రమైన ఇంధన వనరు అని పశ్చిమ దేశాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? తమ అణు రియాక్టర్లు అమ్ముకోవటానికి ఎందుకు పోటీ పడుతున్నాయి? ఇండియా లాంటి దేశాల పైన అణు రియాక్టర్లను బలవంతంగా ఎందుకు రుద్దుతున్నాయి?
శిలీంద్ర/శిలాజ ఇంధనాల వల్లనే వాతావరణం కాలుష్యం అవుతోందన్న వాదన అంత ‘పులుగడిగిన ముత్యం’ కాదు. ఆ వాదనను వ్యతిరేకించే శాస్త్రవేత్తలూ ఉన్నారు. వాతావరణాన్ని తనకు తానే తిరిగి సమతూకం (rebalance) చేసుకునే శక్తి, ఏర్పాటు భూగ్రహానికి ఉన్నదని వారు మొదటి నుండీ చెబుతున్నారు. పశ్చిమ దేశాల వాణిజ్య ప్రయోజనాల కోసమే కర్బన ఉద్గారాల ప్రచారం ఉధృతంగా చేస్తున్నారనీ, అదే నిజమైతే కార్బన్ ఎమిషన్ ఒప్పందాలను బలహీనపరచడం, క్యోటో ప్రోటో కాల్ ను తిరస్కరించడం లాంటి చర్యలకు అమెరికా, ఐరోపా దేశాలు ఎందుకు పాల్పడుతున్నాయనీ వారు ప్రశ్నిస్తున్నారు.
మొన్నటి వరకు ఓజోన్ పొరకు రంధ్రం పడిందని హాహాకారాలు చేసిన పశ్చిమ దేశాలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రంధ్రం చాలా వరకు పూడుకుపోయింది. అనగా భూ వాతావరణం తనకు తానే అంతర్గత చర్యల ద్వారా ఓజోన్ రంధ్రాన్ని పూడ్చుకుంది. దీనిని ఒక ఉదాహరణగా ఈ శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు.
ఈ శాస్త్రవేత్తలు చెబుతున్న మరో ముఖ్య అంశం “జియో ఇంజనీరింగ్.” ‘భూవాతావరణంలో తమకు కావలసిన మార్చులు వచ్చే విధంగా చేసే పరిజ్ఞానాన్ని కూడా పశ్చిమ దేశాలు అభివృద్ధి చేశాయి. ఈ పరిజ్ఞానంతో వాళ్ళు రహస్యంగా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. మేఘాల ఏర్పాటు, ప్రయాణం, అల్ప పీడనం లాంటి కొన్ని వాతావరణ పరిణామాలను -పూర్తిగా కాకపోయినా- ఈ ప్రయోగాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రయోగాల వల్ల కలుగుతున్న ప్రతికూల పరిణామాలకు అసలు కారణం (ప్రయోగాలు) వెల్లడి కాకుండా ఉండటానికి కూడా పర్యావరణ కాలుష్యం వాదనను ఉధృతంగా ముందుకు తెస్తున్నారు’ అని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, వారి వాదనకు అర్ధం విచ్చలవిడిగా శిలీంద్ర ఇంధనాలను వాడుకోవచ్చని కాదు. సహజ వనరులు అపరిమితం ఏమీ కాదు. అవి పరిమితమైనవే. కాబట్టి వాటిని పొదుపుగా, తిరిగి పూడ్చుకునే విధంగా వాడుకోవాలి. బొగ్గు తవ్వితే ఆ ఖాళీ గనులను పూడ్చాలి. కాలుష్యం వెలువడని రీతిలో పెట్రోలియం ఇంధనాన్ని మార్చుకోగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పవన, సోలార్ విద్యుత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉదారంగా ప్రపంచ దేశాలకు పంచి పెట్టాలి. భూమి వాతావరణం గురించి అంత బెంగ ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తారు.
ఇవి తప్ప అన్నీ చేస్తున్న పశ్చిమ దేశాలను, వారి ప్రచారాన్ని వెనువెంటనే నమ్మడం మాని కాస్త లోతుగా విషయాలను పరిశీలించినట్లయితే అసలు నిజాలు బోధపడకపోవు. అయితే వాస్తవాలకూ, ప్రజలకూ మధ్య పశ్చిమ కార్పొరేట్ మీడియా సైంధవ పాత్ర పోషిస్తోంది. సైంధవ పాత్రను అర్ధం చేసుకోవడానికి కూడా మీడియా పైనే ఆధారపడవలసి రావటం ఒక దౌర్భాగ్యం. ఇలాంటి చోట్లనే సోషల్ మీడియా అక్కరకు వస్తుంది.
చిన్నప్పటి నుండి ఈనాడు, మిగతా వార్తా పత్రికలూ చదువుతున్నాను. అప్పుడు కేవలం ఋతుపవనాలుండేవి. వాయుగుండమూ,అల్ప పీడనమూ, అది బలపడితే తుఫానూ ఉండేవి.నిజంగానూ, వార్తాపారిభాషిక పదాల్లోనూ.
ఇప్పుడు అందరం మరింత ఆధునికంగా అయేకొద్దీ,
కొత్తగా ఉపరితల ఆవర్తనం వచ్చి చేరింది.అల్ప పీడన ద్రోణి వచ్చి చేరింది. క్యుములోనింబస్ మేఘాలొస్తాయి సడన్‍గా. ఎలక్షన్లలో వరాల వానలాగ పిడుగుల వాన బోనస్.
అదిగో వచ్చేస్తోందనే టీవీ పెట్టెలో తుఫాన్లెక్కువ. బయట గాలీవాన కన్నా.
సకాలంలో సరైన వర్షాలేవీ?
పగలు మండు వేసవిని తలపించి హఠాత్తుగా కుంభవృష్టి కురవడం, రాత్రి చలి వేయడం, ఒకే రోజు మూడు కాలాల శాంపిల్స్ చూపించడం సహజమైపోయింది.
కోస్తాఅంతా రోజూ కుతకుత. ఏమిటీ వెత?
లానినో ఎల్‍నినో సహజ ప్రకృతికి లాయల్‍గా ఉండుటలేదు.
సాంకేతికత పెరిగే కొద్దీ సీజన్లు చక్కగా ఉంటే బాగుండును.
.
‘భూమి వాతావరణం గురించి అంత బెంగ ఉన్నవాళ్ళు ఇవన్నీ… … … చేస్తారు’.- నిజమేగా!,
అయితే … … … “ఇంధనాల వ్యవహారమంతా మా ‘వ్యాపారస్తుల’ చేతిలో ఉందీ, వారేమో ఆ టెక్నాలజీ మిగిలిన దేశాలకివ్వరూ, వారిని బలవంతం చెయ్యలేక, ప్రపంచం మీద కన్సర్న్ తో మా శాస్త్రవేత్తలు ఇలా హెచ్చరిస్తున్నారూ,” అంటాయేమో పాశ్చాత్య ప్రభుత్వాలు …