
Terrorist attack suspect -Panov
[ద హిందూ ఎడిటోరియల్ -13/08/2016- “The crisis over Crimea” కు యధాతధ అనువాదం]
*********
ఉక్రెయిన్ మద్దతుతో క్రిమియాలో ఉగ్రవాద దాడులు చేయడానికి సిద్ధబడిన విధ్వంసకారుల ప్రయత్నాలను వమ్ము చేశామంటూ రష్యా చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్యా ప్రధాన చర్చాంశంగా తెర మీదికి వచ్చింది. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యాలో కలిపినప్పటినుండీ క్రిమియా ద్వీపకల్పంలో మాస్కో భారీ మొత్తంలో సైన్యాన్ని మోహరించింది. “ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి” వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ గట్టి హెచ్చరిక జారీ చేయగా, కీవ్ (ఉక్రెయిన్ రాజధాని) తన సైన్యాన్ని పోరాట అప్రమత్తతలోనికి తెచ్చాడు. తాజా అలజడికి వాస్తవంగా ఎవరు కారకులు అన్నది స్పష్టం కాలేదు. రెండూ వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా కలహ పరిస్ధితిని రెచ్చగొట్టడానికి క్రిమియాలో దాడుల గురించి పుటిన్ గట్టిగా మాట్లాడుతున్నాడు అని. ఈ వ్యవహారం పశ్చిమ దేశాల మద్దతు కలిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో ను “ఉగ్రవాదులకు” మద్దతుదారుగా ఎత్తిచూపడానికి అవకాశం ఇస్తుంది. రెండవది, రష్యా అధికారిక వాదన; దాని ప్రకారం మిలిటెంట్లు, ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలు నిజంగానే విధ్వంసక చర్యలు చేపట్టే ప్రయత్నాలలో ఉన్నారు; ఇరువైపుల నుండి జరిగిన కాల్పుల్లో ఇద్దరు రష్యా సైనికులు మరణించారు. ఇప్పటికైతే, క్రిమియా, ఉక్రెయిన్ సరిహద్దులో కాల్పుల యుద్ధం జరిగిందన్నది నిజమేనని స్వతంత్ర వార్తా నివేదికలు ధృవపరిచాయి. గత నవంబరులో రష్యా-వ్యతిరేక విధ్వంసకారులు విద్యుత్ పైలాన్ లను పేల్చివేశారు. ఫలితంగా క్రిమియా చీకటిలో మునిగిపోయింది. అటువంటి మిలిటెంట్ గ్రూపులకు ఉక్రెయిన్ ప్రభుత్వం నుండి నేరుగా మద్దతు ఉన్నదా అన్నది వాస్తవ ప్రశ్న. ఉన్నట్లయితే, ఉక్రెయిన్ భారీ తప్పిదానికి పాల్పడుతుండవచ్చు. రష్యా నుండి క్రిమియాను బల ప్రయోగంతో పునఃస్వాధీనం చేసుకోవడం అన్నది ఆచరణ సాధ్యం కాదు. హింసాత్మక పద్ధతుల ద్వారా మహా అయితే అది క్రిమియాను అస్ధిరపరచడం వరకు చేయగలదు. కానీ, విదేశీ శక్తుల వల్ల క్రిమియాలో హింస చెలరేగితే తూర్పు ఉక్రెయిన్ లో పరోక్ష యుద్ధాలను (ప్రాక్సీ వార్స్) తీవ్రం చేయడానికీ తద్వారా దేశం (ఉక్రెయిన్) మరింత అస్ధిరతలోనికి జారిపోయేలా చేయడానికి రష్యాను పురిగొల్పుతుంది కనుక అది కూడా ఉక్రెయిన్ ప్రయోజనాలను నెరవేర్చదు.
విశాల భౌగోళిక రాజకీయ ఆటలో పశ్చిమ దేశాల ప్రతినిధి (ఫ్రంట్) గా ఉక్రెయిన్ ను రష్యా పరిగణిస్తుంది. ఉక్రెయిన్ విషయంలో తనకూ పశ్చిమ రాజ్యాలకూ మధ్య ఒప్పందం కుదరనిదే ప్రధానంగా రాజీకి రావడానికి రష్యా సుముఖంగా ఉండే అవకాశం లేదు. గొప్ప ఆధిపత్య ఆటలో ఇరుక్కుపోయిన చిన్న పాత్రధారి ఉక్రెయిన్. దీర్ఘకాలికంగా ఉక్రెయిన్ ఒక స్ధిరమైన, శాంతియుత దేశంగా మనగలగడానికి రష్యాతో సంబంధాలు కీలకమైనవి గనుక జాగ్రత్తగా ఆచి తూచి తన ఎంపికలను నిర్ధారించుకోవాలి. క్రిమియా స్వాధీనం విషయంలో మాస్కో పట్ల, ఆంక్షలతో సహా, యుద్ధానికి సై అన్నట్లుగా వ్యవహరించడం వల్ల సంక్షోభం మరింత ముదరడానికే దోహద పడ్డామని పశ్చిమ దేశాలు గ్రహించాలి. ఉద్రిక్తతలు తగ్గించడానికి వీలుగా అవి తమ విధానాలను పునరాలోచించుకుని మాస్కోతో అర్ధవంతమైనన చర్చలకు దిగాలి. సిరియా పౌర యుద్ధం, ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేక యుద్ధం లతో సహా అనేక ఇతర ప్రపంచ సవాళ్లను అధిగమించడానికి కూడా రష్యాతో నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం కీలకం. రష్యా తనకు సంబంధించినంతవరకూ తన ప్రాధాన్యాలను సవరించుకోవాలి. తన ఆర్ధిక వ్యవస్ధ ఇప్పటికే బలహీనపడుతుండగా, తన పౌరుగునే ఉన్న చిన్న దేశాన్ని అస్ధిరపరచడం వల్ల రష్యాకు ఒనగూరుతున్న ప్రయోజనం ఏమిటి? తమ పరస్పర ప్రయోజనాల రీత్యా అంగీకారాలకు (రాజీలకు) వచ్చేందుకు పాత్రధారులు అందరికీ తగినంత చోటు ఉన్నది.
*********
మాసిపూసి మారేడు కాయ చేయడం అంటే ఇదే గావాల్ను. ఉక్రెయిన్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆ దేశాన్ని అస్ధిరపరిచిందే ఓం ప్రధమం పశ్చిమ దేశాలు; ముఖ్యంగా అమెరికా. ఈయూతో ‘అసోసియేట్ అగ్రిమెంట్’ కుదర్చుకోవడాన్ని యనుకోవిచ్ వాయిదా వేశాడన్న ఒకే ఒక్క కారణంతో ఉక్రెయిన్ లో నాజీ గ్రూపులను, ఉగ్రవాద గ్రూపులను కూడగట్టి విధ్వంసాలకు అమెరికా పురిగోల్పింది. అమెరికా ఉప విదేశీ మంత్రి విక్టోరియా నూలంద్, యుద్ధోన్మాద సెనేటర్ మెక్ కెయిన్ మొ.న అమెరికా ప్రభుత్వ అధికారులు స్వయంగా ఉక్రెయిన్ వచ్చి విధ్వంసకారులకు ప్రోత్సాహకరంగా ప్రసంగాలు దంచి వెళ్లారు. ఆనాటి (2014) హింసాత్మక అల్లర్లతో యనుకోవిచ్ దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. యనుకోవిచ్ ను వెళ్ళగొట్టి, అవసరమైతే చంపేసి, ప్రభుత్వంలో తమ కీలుబొమ్మలను ప్రతిష్టించాలని అమెరికా ముందే పధక రచన చేసిందన్న విషయం అనేక సాక్షాల ద్వారా -విక్టోరియా నూలంద్ ఆడియో టేపులతో సహా- రుజువయింది. ఇదంతా జరిగింది కేవలం ఈయూతో అసోసియేట్ ఒప్పందాన్ని యనుకోవిచ్ వాయిదా వేసినందుకే. ఒప్పందాన్ని వాయిదా వేయడం అంటే రష్యాతో ఒప్పందానికి సిద్ధం అవుతున్నాడని అనుమానించి ఆ దురాగతానికి అమెరికా పాల్పడింది. ఈయూ, ఉదాసీనంగానే అయినా, అందుకు మద్దతు ఇచ్చింది.
తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలు రష్యా సరిహద్దులో ఉండేవి. ఇక్కడ రష్యా భాషీయులు అత్యధికం. రష్యా సహాయంతోనే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అక్కడి యనుకోవిచ్ కు మద్దతుదారులు. వాళ్ళు యనుకోవిచ్ ను కూలదోయడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా మద్దతుతో ఏర్పడిన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. రష్యా వారించినా వినకుండా తామంతట తాము రిఫరెండం జరుపుకున్నారు. 98 శాతం మంది క్రిమియా వలె తమనూ రష్యాలో విలీనం చేసుకోవాలని కోరారు. అందుకు రష్యా నిరాకరించింది. దానికి బదులు ఉక్రెయిన్ లోనే ఉంటూ ఫెడరల్ వ్యవస్ధ ను కోరమని సలహా ఇచ్చింది. ఈ లోపు ఉక్రెయిన్ సైన్యాలు, అమెరికా-ఈయూల ప్రోద్బలంతోనే అని వేరే చెప్పనవసరం లేదు- తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలపై దండెత్తి వచ్చాయి. దానితో దోనెట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాల ప్రజలు సాయుధంగా ప్రతిఘటన ఇచ్చారు. “తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాల ప్రజలతో చర్చించి వారికి స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలుగా ప్రకటించి శాంతి చేసుకోవాలి” అని ఇప్పటికీ రష్యా చెబుతోంది.
ఇవీ వాస్తవాలు. వాస్తవాలను పక్కన బెట్టి తూర్పు ఉక్రెయిన్ ను అస్ధిరపరచడానికి రష్యా ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పడం సత్య దూరం. నిజానికి తూర్పు ఉక్రెయిన్ అస్ధిరత తనకే నష్టం అని రష్యా భావిస్తోంది. అదే పనిగా అమెరికా, ఐరోపా యుద్ధ ప్రయత్నాలతో వేగడం నష్టకరం అని రష్యా, అధ్యక్షుడు పుటిన్, ఉక్రెయిన్ తో వైరానికి తన అయిష్టతను అనేకసార్లు వ్యక్తంచేశాడు. కాగా “తూర్పు ఉక్రెయిన్ అస్ధిరత వల్ల మీకు ఏమిటి ప్రయోజనం” అని రష్యాకు ప్రశ్న సంధించడం అసంబద్ధం. బొత్తిగా అతకని వ్యవహారం. ప్రపంచ దేశాల్లో ఎక్కడబడితే అక్కడ, తన ఆధిపత్యానికి ఎక్కడ సవాలు ఎదురైతే అక్కడ టెర్రరిస్టులను ప్రవేశపెట్టి దేశాలను, రాజ్యాలను, ప్రజలను, వారి దైనందిన జీవితాలను అస్ధిరతలోకి నెడుతున్న ప్రధాన శక్తి అమెరికాయే గనుక ఏమైనా హితబోధ చేయాలంటే మొదట అమెరికాకి చేయాలి. క్రిమియాలో టెర్రరిస్టు దాడులకు పశ్చిమ దేశాల కుట్ర ఉన్నదని చెప్పడానికి ఎలాంటి సందిగ్ధత అవసరం లేదు. ఉక్రెయిన్ ని తమ ఏలుబడి లోనికి తెచ్చుకుని రష్యా సరిహద్దుల వరకు తన ప్రాబల్యాన్ని విస్తరించుకుని ఆ దేశాన్ని చుట్టుముట్టే లక్ష్యంతో ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసిన అమెరికాని వదిలిపెట్టి బాధిత దేశాన్ని తప్పు పట్టడం, ఏదో విధంగా బాధితులకే బాధ్యతను అంటగట్టడం దుర్మార్గం.